top of page

సీమ ఎన్నికలపై కన్నడ పవనాలు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 11, 2024
  • 3 min read
  • దాదాపు 15 నియోజకవర్గాల్లో కన్నడ ప్రముఖుల ప్రభావం

  • వైకాపా హిందూపురం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అక్కడివారే

  • టీడీపీకి వెళ్లిన మంత్రి గుమ్మనూరుకు గుంతకల్‌ టికెట్‌ వెనుక ఆ లాబీ

  • ఆన్‌లైన్‌ ప్రచారాలతో పాటు నిధుల సమీకరణలోనూ నిమగ్నం

  • చాలామంది ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా ప్రచారం

(ఎన్నికల రచ్చబండ ` 
- డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

మన రాష్ట్రానికి సాధారణంగా నైరుతి రుతుపవనాల వల్ల అధిక వర్షాలు కురుస్తుంటాయి. ఇవి కేరళ నుంచి తమిళనాడు మీదుగా ప్రయాణించి జూన్‌ మొదటివారంలో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయి. కానీ ఈసారి వర్షాకాలానికి ముందు రాష్ట్రాన్ని పలకరించిన ప్రస్తుత ఎన్నికల కాలంలో ఇక్కడి ప్రధాన పార్టీలకు ఓట్ల వర్షం కురిపించేందుకు కన్నడ పవనాలు సిద్ధమవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు కేరళ నుంచి వస్తుంటే.. కన్నడ పవనాలు కర్ణాటకలోని బెంగళూరు, బళ్లారి, రాయచూరు తదితర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి చేరుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల ఎన్నికల రాజకీయాలపై కన్నడ ప్రభావం ఈసారి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సీమ జిల్లాలో ఎక్కువగా కర్ణాటకతో సరిహద్దులు కలిగి ఉండటం, ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల ప్రజల మధ్య మొదటినుంచీ వ్యాపార, కుటుంబ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇక బెంగళూరులో ఐటీ అభివృద్ధి చెందిన తర్వాత రాయలసీమ ప్రాంతం నుంచి వేలాదిమంది యువత అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. ఇక రియల్‌ ఎస్టేట్‌, ఇతర వ్యాపారాల పరంగానూ లక్షలాది సీమ ప్రజలు కర్ణాటక ప్రాంతాలతో నిత్యసంబంధాలు కొనసాగిస్తున్నారు. అవే ఈసారి రాజకీయాలపైనా ప్రభావం చూపిస్తున్నాయి. అధికార వైకాపా హిందూపురం ఎంపీ అభ్యర్థిని కర్టాటక నుంచే దిగుమతి చేసుకోవడం పెరిగిన కన్నడ ప్రభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. వాస్తవానికి గతం నుంచీ ఈ సంస్తృతి ఉంది. చిత్తూరు జిల్లాలో గతంలో తెలుగుదేశంలో కీలకపాత్ర పోషించి, ప్రజాప్రతినిధులుగానూ పని చేసిన డీకే ఆదికేశవులు నాయుడు వ్యాపారాలన్నీ కర్ణాటకలోనే ఉన్నాయి. ఆయన సతీమణి సత్యప్రభ కూడా మన రాష్ట్రంలో ఎమ్మెల్యేగా చేశారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో రాయలసీమలో కన్నడ ప్రభావం మరింత అధికంగా కనిపిస్తోంది. వైకాపా, టీడీపీలకు మద్దతుగా అక్కడి ప్రముఖులు పని చేయడంతో పాటు అక్కడి నుంచే ఆన్‌లైన్‌ వేదికగా ప్రచారాలు చేస్తున్నారు. కర్ణాటకలో స్థిరపడిన చాలామంది సీమ జిల్లాలకు వచ్చి ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు.

హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బళ్లారి మహిళ

కర్ణాటక సరిహద్దులో ఉన్న సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు స్థానానికి ఎంపీ అభ్యర్థిగా కర్ణాటకలోని బళ్లారికి చెందిన జోలదరాశి శాంతను అధికార వైకాపా బరిలోకి దించడం సీమ రాజకీయాల్లో కన్నడ ప్రభావానికి పరాకాష్టగా చెప్పవచ్చు. పైగా ఆమె కుటుంబం అక్కడ బీజేపీలో ఉంది. ఆ పార్టీ నుంచి 2008లో బళ్లారి ఎంపీగా కూడా గెలిచారు. బళ్లారి మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్థనరెడ్డికి కుడిభుజంగా ఉన్న కర్ణాటక మాజీమంత్రి శ్రీరాములు ఈమెకు సొంత అన్నయ్య. బళ్లారిలోనే పుట్టి పెరిగిన శాంతకు ఉమ్మడి అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే వారంతా బళ్లారిలోనే స్థిరనివాసం ఉంటున్నారు. అనూహ్యంగా ప్రస్తుత ఎన్నికల్లో ఆమె వైఎస్‌ జగన్‌ హిందూపురం బరిలో నిలిపారు. హిందూపురం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి టీఎన్‌ దీపిక కూడా బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేసి వచ్చినవారే. వీరు మాత్రమే కాకుండా రాయలసీమలోనే అనేక సరిహద్దు నియోజకవర్గాల్లో వైకాపా, టీడీపీ అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారిలో పలువురికి కర్ణాటకతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్నాయి. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం, మడకశిర, కదిరి, అనంతపురం, రాయదుర్గం, గుంతకల్‌, ఉమ్మడి కడప జిల్లాలోని పుంగనూరు, రాయచోటి, రాజంపేట, కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, మదనపల్లి, వాయల్పాడు, పలమనేరు తదితర నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు కర్ణాటకలోని బెంగళూరు, రాయచూరు, బళ్లారి, చిక్‌మగళూరు, సింధనూరు తదితర ప్రాంతాలతో వ్యాపార, కుటుంబ సంబంధాలు ఉన్నాయి. వారి మద్దతుదారులు కూడా ఆ ప్రాంతాలకు చెందినవారే కావడం విశేషం.

పోటాపోటీగా డిజిటల్‌ ప్రచారం

ఈ నేపథ్యంలో వైకాపా, టీడీపీలకు అనుబంధంగా బెంగళూరు ఐటీ, బిల్డర్స్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార రంగంలో స్థిరపడిన వర్గాలు, ఉద్యోగులు రాయలసీమ జిల్లాల్లో ఎన్నికలపై దృష్టి సారించారు. ప్రధానంగా వైకాపా ఐటీ విభాగం, బెంగళూరు టీడీపీ ఫోరం పేరుతో అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారిలో చాలామంది ఇప్పటికే సీమలోని పలు నియోజకవర్గాలకు తరలివచ్చి ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొంటుండగా, మిగిలినవారు అక్కడి నుంచే ఆన్‌లైన్‌ వేదికగా డిజిటల్‌ ప్రచారం, విరాళాల సేకరణకు నడుంకట్టాయి. వైకాపా బెంగళూరు ఐటీ విభాగం ఇన్‌ఛార్జి పోశంరెడ్డి సునీల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐటీ ఉద్యోగులతోపాటు ఇతర రంగాలవారిని సమీకరిస్తున్నారు. గత ఐదేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సాధించిన ప్రగతి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సోషల్‌ మీడియా ద్వారా వీరంతా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బెంగళూరు టీడీపీ ఫోరం కూడా ఇదే తరహాలో పని చేస్తోంది. టీడీపీ హామీలు, వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను వివరించేలా ఈ విభాగం మీమ్స్‌, వీడియోలు సృష్టించి వదులుతోంది.

ప్రముఖులతో అభ్యర్థుల భేటీలు

కాగా ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా కర్ణాటకలోని తమ పరిచయాలను వినియోగించుకుని అక్కడి నుంచి వివిధ రూపాల్లో మద్దతు కూడగట్టేందుకు యథాశక్తి ప్రయత్నిస్తున్నారు. బెంగళూరులో తాపీమేస్త్రీగా జీవితం ప్రారంభించి ప్రముఖ బిల్డర్‌గా ఎదిగిన పలమనేరు వైకాపా సిటింగ్‌ ఎమ్మెల్యే , ప్రస్తుత అభ్యర్థి వెంకట్‌ గౌడ బెంగళూరులో తనకున్న విస్తృత పరిచయాలను ఎన్నికల్లో ఉపయోగించుకునేలా పావులు కదుపుతున్నారు. చిత్తూరు జిల్లా నుంచి వెళ్లి ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువకులతో పాటు భవన నిర్మాణ రంగంలో ఉన్న ప్రముఖులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో ఇటీవలే బెంగళూరులో సమావేశం నిర్వహించి వారి మద్దతు కోరారు. అదే రీతిలో పీలేరు, మదనపల్లి, అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, హిందూపురం, మడకశిర, అనంతపురం, కదిరి నియోజకవర్గాల అభ్యర్థులు కూడా కర్ణాటక పరిచయాలను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

స్వయంగా చంద్రబాబు భేటీ

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నెల క్రితం స్వయంగా బెంగళూరు వెళ్లి అక్కడ ఐటీ విభాగంతో సమావేశం నిర్వహించారు. ఆయనతోపాటు పలమనేరు, అనంతపురం. రాయదుర్గం కళ్యాణదుర్గం, గుంతకల్‌, కదిరి, హిందూపురం నియోజకవర్గాల టీడీపీ నేతలు అమర్నాథ్‌ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ తదితరులు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఇక చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని బెంగళూరులో రెండు రోజుల క్రితం ‘చంద్రగిరి బెంగళూరియన్స్‌ సమ్మిట్‌’ పేరుతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు మద్దతుగా మద్దతుగా కర్ణాటక నుంచి వచ్చిన శ్రేణులు ఇప్పటికే విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అనంతపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌, హిందూపురం అభ్యర్థి నందమూరి బాలకృష్ణ, రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులుకు మద్దతుగా బెంగళూరు టీడీపీ ఫోరం ప్రతినిధులు కార్యాచరణలోకి దిగారు. నిధులు కూడా వీరే సమీకరించుకుని ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. ఇక టీడీపీలో చేరిన వైకాపా మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు టికెట్‌ ఇవ్వడం వెనుక కర్ణాటక నేతల ప్రమేయం ఉందంటున్నారు. జయరాం సోదరుడు కర్ణాటకలో మంత్రి. ఆయనతో పాటు మరో నాయకుడి రాయబారం వల్లే కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన గుమ్మనూరుకు గుంతకల్‌ టికెట్‌ దక్కిందని ప్రచారం జరుగుతోంది.

コメント


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page