top of page

సామాన్యుడే.. ప్రత్యక్ష నారాయణుడు

Writer: NVS PRASADNVS PRASAD
  • పరుగులు పెట్టిన రూ.100, ఉచిత దర్శనాలు

  • ఎమ్మెల్సీ కోడ్‌తో తగ్గిన వీఐపీల తాకిడి

  • అవగాహన కల్పించడంలో తడబాటు

  • మొహమాటాలకు పోని ప్రజాప్రతినిధులు

  • పాస్‌లు అందలేదని డోనర్లు అసంతృప్తి

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లా అధికారులు, పాలకులు ముందునుంచి ప్రకటించినట్టే అరసవల్లి రథసప్తమి ప్రధాన వేడుకకు సామాన్య భక్తుడికే అగ్రతాంబూలం లభించింది. ప్రతీ ఏడాది వీఐపీలు, వీవీఐపీలు, డోనర్ల పేరుతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి రావడం, దీంతో సామాన్య భక్తులు దర్శించుకోలేక గగ్గోలుపెట్టడంతో ఈసారి వారికే పెద్దపీట వేశారు. సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించడానికి కొన్ని సమయాల్లో వీఐపీల దర్శనానికి కూడా బ్రేక్‌ ఇవ్వడం ఇందుకు నిదర్శనం. ఇప్పటి వరకు జరిగిన రథసప్తమి వేడుకలతో పోల్చుకుంటే ఈ ఏడాది ఎక్కడికక్కడ భక్తులు గంటల తరబడి క్యూలైన్‌లో వేచివుండే పరిస్థితి తప్పింది. అయితే దీనిపై సరిగా పబ్లిసిటీ చేయకపోవడం, టిక్కెట్లు ఎక్కడిస్తున్నారో స్పాట్‌లో అనౌన్స్‌మెంట్‌ లేకపోవడం వంటి చర్యల వల్ల అరసవల్లి ముఖద్వారం వరకు వెళ్లిపోయిన భక్తులు అక్కడి నుంచి ఎంట్రన్స్‌ లేదని తెలుసుకొని మళ్లీ తోట జంక్షన్‌ వద్దకు వచ్చి టిక్కెట్లు తీసుకొని సంబంధిత క్యూలైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. రథసప్తమి రోజున దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏయే ఏర్పాట్లు ఎక్కడెక్కడ చేస్తున్నాం అనే అంశాల మీద పోలీసులకు, అక్కడ డ్యూటీలో ఉన్న మిగిలిన ఉద్యోగులకు, వాలంటీర్లకు వారం రోజుల ముందునుంచీ ఒక మాక్‌ డ్రిల్‌ నిర్వహించివుంటే ఈ సమస్య తలెత్తేదికాదు. అలాగే సామాన్య భక్తులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు అక్కడ ఎవరూ లేకపోవడంతో పోలీసులనే ఆశ్రయించాల్సివచ్చింది. రోడ్డు మీద జనాలు గుమికూడకుండా చూడటం, క్యూలైన్‌లో తొక్కిసలాట లేకుండా వ్యవహరించడంలో బిజీగా ఉన్న పోలీసులకు ఏ లైన్‌ ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలీలేదు. రథసప్తమిని రాష్ట్రపండుగగా ప్రకటించడం వల్ల ఈ ఏడాది పెద్ద ఎత్తున భక్తులు వచ్చినా ఎక్కడా తొక్కిసలాట జరగలేదు. కాకపోతే రూ.500, రూ.300 టిక్కెట్లు తీసుకుంటే వేగంగా దర్శనమైపోతుందని భావించిన భక్తులు ఉచిత దర్శనానికి వచ్చినవారికంటే ఎక్కువసేపు లైన్‌లో వేచివుండాల్సిన పరిస్థితి వచ్చింది. స్థానిక 80 అడుగుల రోడ్డులో వాహనాలు పార్క్‌ చేసిన తర్వాత మళ్లీ మెయిన్‌రోడ్డుకు రాకుండా అరసవల్లి తోట మీదుగా క్యూలైన్లకు చేరుకునే ఏర్పాట్లు చేసినా ఇంతవరకు అటువంటి దారివుందని భక్తులకు తెలియకపోవడం, ఏ వాలంటీరూ ఆ దిశగా భక్తులను మళ్లించకపోవడం వల్ల పసగాడ నారాయణ మిల్లు జంక్షన్‌ నుంచి నడవాల్సిన పరిస్థితి కనిపించింది. వాస్తవానికి మంగళవారం ఉదయం 9 గంటల తర్వాత భక్తుల రద్దీ పెరిగినా ఎక్కడా కిటకిటలాడిన క్యూలైన్లు కనిపించలేదు. కారణం.. ఉచిత, రూ.100 దర్శనానికి ఒక మార్గం, రూ.300, రూ.500, డోనార్‌, శీఘ్రదర్శనం పాస్‌లకు మరోవైపు మార్గాన్ని సూచించడం వల్ల అరసవల్లికి నాలుగు వైపుల నుంచి క్యూలైన్లు నడవడంతో దర్శనం త్వరగానే ముగిసింది. కాకపోతే గార, ఒప్పంగి మీదుగా వచ్చేవారు రూ.500 నుంచి రూ.100 వరకు టిక్కెట్‌ తీసుకోవాలంటే అమ్మవారి కోవెల దగ్గర ఒక టిక్కెట్‌ కౌంటర్‌ పెట్టివుంటే మరింత ప్రయోజనకారిగా ఉండేది. అలా కాకుండా వారంతా జియో పెట్రోల్‌బంక్‌ వద్ద టర్న్‌ తీసుకొని కోనేరు పక్క నుంచి మళ్లీ అరసవల్లి తోట వైపు వచ్చి టిక్కెట్‌ తీసుకోవడం దూరాభారంగా కనిపించింది.

పెదవి విరిచిన డోనర్లు

అరసవల్లి ఆలయ అభివృద్ధి కోసం విరాళాలిచ్చిన డోనర్లకు ముందుగానే పాస్‌లు ఇచ్చే అంశంలోనే ఈసారి పెద్ద ఎత్తున కోతలు విధించారు. దీనికి అనేక కారణాలున్నాయి. ప్రతీ ఏడాది డోనర్‌ పాస్‌ పట్టుకొని వస్తున్నవారి సంఖ్యకు, కార్యాలయం రిజిస్టర్‌లో ఉన్న డోనర్ల జాబితాకు సంబంధం లేకపోవడంతో సామాన్యుల కంటే డోనర్ల తోపులాటే ఎక్కువ ఉండేది. ఈసారి డోనర్‌ పాస్‌లు తగ్గించినా తమకు సరైన ప్రోటోకాల్‌ లభించలేదని, తమను కూడా క్యూలైన్‌లో నిల్చోబెట్టి ఆలయ ముఖద్వారం వద్దకు వెళ్లేసరికి సామాన్య భక్తులతో కలిపేయడం వల్ల సరిగ్గా దర్శనాలు కాలేదని పెదవి విరిచినవారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే ఉచితంగా దర్శనం చేసుకునేవారి కంటే టిక్కెట్‌ తీసుకున్నవారు ఎక్కువసేపు ఎండలో నిలబడాల్సిరావడంతో విసుక్కున్నారు. అయితే ఎక్కడా క్యూలైన్లు నిలిచిపోవడమనే ప్రసక్తి లేకపోవడంతో ఎటువంటి టిక్కెట్‌కైనా గంటలో దర్శనమయ్యే ఏర్పాట్లకు మాత్రం హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.

ముందుగా అభిషేకించాల్సింది వీరికే

ఏడాదికోసారి మాత్రమే జరిగే ఉత్సవానికి ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ఎక్కడో ఓ చోట అసంతృప్తో, అపశృతో కనిపించకమానదు. కేవలం కిందిస్థాయి సిబ్బందితో మాట్లాడి మానిటర్‌ చేస్తే సరిపోయేచోట స్వయంగా జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే, కేంద్రమంత్రిలు సామాన్యుల్లో కలిసిపోయి అసామాన్యంగా పనిచేశారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌కు బహుశా ఆ పేరు పెట్టడం చూస్తేనే వారి తల్లిదండ్రులు సూర్యనారాయణ స్వామి భక్తులను అర్థమవుతుంది. దినకర్‌ అని పేరు పెట్టుకున్నందుకో, లేదా తన హయాంలో రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయో తెలీదు కానీ స్వయంగా కలెక్టరే ప్రధాన ద్వారం వద్ద నిలబడిపోయి క్యూను క్రమబద్ధీకరించారు. భక్తులను పలకరించి ఏర్పాట్లపై ఆరాతీశారు. సోమవారం అర్థరాత్రి వరకు ఆలయ ప్రాంగణంలో పోలీసు బందోబస్తును స్వయంగా పరిశీలించిన ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ఉదయం తన తల్లిదండ్రులను తీసుకువచ్చి దర్శనం చేయించిన అనంతరం సంప్రదాయ వస్త్రాలను మార్చేసి యూనిఫాం తొడిగి రంగంలోకి దిగిపోయారు. భక్తుల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని రథసప్తమికి ముందురోజే వార్నింగ్‌ ఇచ్చిన ఎస్పీ అరసవల్లి ముఖద్వారం దగ్గర ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌లో నిలబడే మొత్తం పర్యవేక్షించారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్న తర్వాత సామాన్య భక్తులకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని స్వయంగా వీఐపీలను కన్విన్స్‌ చేశారు. రూ.500 టిక్కెట్‌ కొనుగోలు చేసి తాము వచ్చామని, ఇక్కడ అందరితో పాటుగా తమను విడిచిపెట్టడం సరికాదని ప్రశ్నించినవారికి ఓపిగ్గా సమాధానం చెప్పారు. ఎమ్మెల్యే శంకర్‌ ప్రతీ క్యూలైన్‌కు కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగారు. ఒప్పంగి వైపు నుంచి వచ్చే క్యూలైన్‌లో చాలా దూరం వరకు భక్తులు నిలిచిపోయారని ఓ సందర్భంలో వచ్చిన సమాచారం మేరకు ఆలయంలో మిగిలినవారి దర్శనాలకు బ్రేకిచ్చి ముందుగా ఆ లైను సగం మేర తరిగేటట్టు వ్యవహరించారు. సోమవారం అర్థరాత్రి ఒంటిగంట నుంచి జరిగిన క్షీరాభిషేకానికి రాని డోనర్లు, ఆ తర్వాత నెమ్మదిగా రావడంతో వీరిని పట్టించుకునే నాధుడు లేకపోయాడు. అరసవల్లిలో ఉంటున్నవారికి డివిజన్‌కు నాలుగు పాస్‌ల చొప్పున శీఘ్రదర్శనం పేరుతో సోమవారం రాత్రి పంపిణీ చేశారు. వీరంతా ఒకేసారి దర్శనానికి రావడంతో ఒక సందర్భంలో కిక్కిరిసినట్టు కనిపించినా, ఆ తర్వాత అన్నింటినీ అధికారులు క్రమబద్ధీకరించుకుంటూ వచ్చారు.

ఈ ఏడాది రథసప్తమికి ఆదిత్యుని దర్శనానికి వచ్చే భక్తులు, డోనర్ల కోసం పాస్‌లు ముద్రించే బాధ్యతను యుగంధర్‌కు ఆయల ఈవో అప్పగించారు. అధికారుల ఆదేశాలతో పాస్‌లు ముద్రించిన యుగంధర్‌ కొన్నింటిని మాత్రమే ఆలయ అధికారులకు అప్పగించాడని తెలిసింది. ఆలయ సిబ్బందిని యుగంధర్‌ ఇంటికి ఈవో పంపించి పాస్‌లు తెప్పించారని సమాచారం. ముద్రించిన పాస్‌ల్లో కొన్నింటిని యుగంధర్‌ అంటిపెట్టుకొని పత్తా లేకుండా పోయాడు. వీటి కోసం యుగంధర్‌ను ఈవో సంప్రదించినా అందుబాటులో లేరని తెలిసింది. నాలుగు రోజులుగా ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌చేసి విధులకు హాజరు కాలేదని ఆలయ సిబ్బంది చెబుతున్నారు.

డోనర్‌ పాస్‌లతో పోలీసుల కుటుంబ సభ్యులు, వారి బంధువులు దర్శనాలకు వెళ్లినట్టు విమర్శలు ఉన్నాయి. మీడియాలో కొందరికి పోలీసుల ద్వారా డోనర్‌ పాస్‌లు అందినట్టు ఆరోపణలున్నాయి. వీఐపీలు లిస్టులో కూటమి కార్యకర్తలను చేర్చి దర్శనాలకు అనుమతి ఇవ్వడం వల్ల డోనర్‌, క్షీరాభిషేకం పాస్‌లతో వచ్చిన వారికి అర్థరాత్రి 1.30 తర్వాత దర్శనాలకు అనుమతిచ్చారు. దీంతో ఈ క్యూలైన్‌లో పాస్‌లు పట్టుకొని నిలబడినవారు పోలీసులతో వాదనకు దిగారు.

 
 
 

Opmerkingen


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page