సొమ్ము కొట్టు.. స్లిప్పు పట్టు?
- BAGADI NARAYANARAO
- Apr 2
- 1 min read
డిగ్రీ, పీజీ దూరవిద్య పరీక్షల్లో చూచిరాతలు
పాతపట్నం కేంద్రంపై ఆరోపణలు
(సత్యంన్యూస్, పాతపట్నం)

విద్యావ్యవస్థ నానాటికీ దిగజారుతుందని చెప్పడానికి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వెంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన డిగ్రీ, పీజీ దూరవిద్య పరీక్షలు జరుగుతున్న తీరే దీనికి నిదర్శనం. సొమ్ము కొడితే చాలు.. స్లిప్పులు పెట్టుకుని పరీక్షలు రాసేందుకు అధ్యాపకులు, కాలేజీ సిబ్బందే ప్రోత్సహిస్తున్నారని విద్యార్ధులే ఆరోపణలు గుప్పిస్తున్నారు. బుధవారం జరిగిన బీఏ మూడో సంవత్సరం పరీక్షకు హజరైన విద్యార్ధులకు చూసి రాసుకునే అవకాశం ఇచ్చేందుకు డిగ్రీ కాలేజీ సిబ్బంది రూ.5 వేలు డిమాండ్ చేసినట్టు కొందరు విద్యార్ధులు ‘సత్యం’కు ఫోన్‌చేసి మరీ సమాచారం ఇచ్చారు. టెక్కలి, పాతపట్నం పరిధిలో వెంకటేశ్వర యూనివర్సిటీ దూరవిద్య పరీక్షలకు హాజరైన విద్యార్ధులందరి నుంచి రూ.5వేలు చొప్పున వసూలుచేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెక్కలిలో విశ్వజ్యోతి, పాతపట్నంలోని కిరణ్మయి కాలేజీల ద్వారా దూరవిద్య పరీక్షలకు హాజరైన విద్యార్ధులందరి నుంచి డిగ్రీ కాలేజీ సిబ్బంది డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. వార్షిక పరీక్షలన్నింటికీ సహాయం చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్టు విద్యార్ధులు, తల్లిదండ్రులు ‘సత్యం’ వద్ద వాపోయారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి వసూళ్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చదువును కొనుక్కునే సంస్కృతిని విడనాడి చదువుకునే విధానానికి అవకాశం కల్పించి విద్యార్ధుల్లో నైపుణ్యం పెరిగేందుకు కృషి చేయాలని ఉన్నత విద్యాశాఖ అధికారులకు విన్నవించారు.
Comentários