మైనరమ్మాయిని వేధించాడని కేసు
అదే అమ్మాయికి బాధితుడితో ముందే నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తం
ఎస్పీ చెప్పినా కౌంటర్ కేసు నమోదుచేయని టూటౌన్
బాధితుడే నిందితుడైన కథ

ఎద్దు ఈనిందంటే.. దూడను గాటకు కట్టేయమన్న సామెత మనకు తెలుసు. మన పోలీసుల తీరు అలాగే ఉంది. వారు తలచుకుంటే గుడ్డివాడితో సాక్ష్యం చెప్పించగలరు.. కుంటివాడిని పరిగెత్తించగలరు. సొమ్ము పడితే ఎలాంటి సెక్షన్లయినా పెట్టి ఎవరినైనా లోపల వేసేయగలరు. న్యాయవాదులే పోలీస్‌స్టేషన్లలో సెటిల్మెంట్లు చేస్తుండటం వల్ల ఏ కేసు కడితే ఎంత సొమ్ము వస్తుంది.. ఎవర్ని ఇరికిస్తే ఎంత పిండుకోవచ్చు అన్నది స్వయంగా తెలుసుకున్న పోలీసులు నిజానిజాలు నిర్ధారించుకోకుండానే అమాయకులపై కేసులు కట్టి ‘నీకు ఇంత.. నాకు ఇంత’.. అనే రీతిలో పంచుకుంటున్నారు. నగరంలోని గుజరాతిపేటకు చెందిన యువకుడిపై ఇటీవల పెట్టిన పోక్సో కేసు ఉదంతాన్నే తీసుకుంటే పోలీసులు సెక్షన్ల పేరు చెప్పి ఏమేరకు జనాలను వేధిస్తున్నారో అర్థమవుతుంది. వివరాల్లోకి వెళితే..
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నగరంలోని గుజరాతిపేట పొందరవీధిలో నివాసముంటున్న దర్భముళ్ల వెంకటరమణ పౌరోహిత్యం చేస్తుంటారు. ఈయన చిన్నకుమారుడు దర్భముళ్ల సునీల్‌కుమార్(25)పై టూటౌన్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి 9న పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దానికి ఆధారమేంటయ్యా అంటే.. మైనర్ అయిన తన కుమార్తెను దర్భముళ్ల సునీల్‌కుమార్ వెంటపడి వేధిస్తున్నాడని.. స్కూలుకు వెళ్లేటప్పుడు దారిలో మాట్లాడటం, ఇబ్బందిపెట్టడం చేస్తున్నాడని ఇదే గుజరాతిపేటకు చెందిన బ్రహ్మంగారి కోవెల పూజారి భార్య రజనీ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు పోక్సో సెక్షన్లు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కట్టేశారు. ఒక బాలికను ఏడిపిస్తే, ఈవ్‌టీజింగ్ చేస్తే పోక్సో కేసు కట్టక ఏం చేస్తారన్న ప్రశ్న తలెత్తడం సర్వసాధారణం. నిజమే.. బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఇటువంటి వారిని ఉపేక్షించకూడదు. కానీ నాణేనికి మరో కోణం కూడా ఉంటుందన్న విషయం పోలీసులకు తెలియనిది కాదు. సాధారణంగా పత్రికల్లోనో, టీవీల్లోనో ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు మనలో ఎక్కడ లేని పెద్ద మనసు బయటకు తన్నుకొచ్చి ఇటువంటి వారిని వదలకూడదని వీరావేశం ప్రదర్శిస్తుంది. కానీ ఇటువంటి చట్టాలను అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ సొమ్ములు దండుకుంటున్న ఉదంతాలు కూడా చాలా ఉన్నాయన్న విషయం పోలీసులకు తెలుసు. పరువుప్రతిష్టలకు భయపడి గుట్టుగా సొమ్ము సమర్పించేసిన సందర్భాలూ పోలీసులకు తెలుసు. అయినా ఈ కోణం వైపు కూడా పరిశీలించకుండానే తమకు ఎక్కడైతే పెద్ద ఎత్తున బేరం కుదిరిందో అటువైపే మొగ్గు చూపిన పోలీసులు ఇప్పుడు సమాధానం చెప్పలేని ప్రశ్నలతో ఇరుకాటంలో పడుతున్నారు.
స్వయంగా ఇంట్లోనే నిశ్చితార్థం
ఫిర్యాదుదారు రజనీ దంపతులే తమ కుమార్తెకు గత ఏడాది మే 24న దర్భముళ్ల సునీల్‌కుమార్‌తో స్వయంగా తమ ఇంట్లోనే నిశ్చితార్ధం జరిపించారు. అదే రోజు ఈ పెళ్లి సంబంధం కుదిర్చిన పెద్దమనుషులు ముహూర్తాలు కట్టడంలో స్పెషలిస్టులు కావడం వల్ల 2023 సెప్టెంబర్ 6న పెళ్లి చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. దీంతో కాబోయే అత్తవారింటికి స్వయంగా అత్తవారి ఆహ్వానంతోనే కాబోయే అల్లుడు సునీల్‌కుమార్ ఎన్నోసార్లు వెళ్లాడు. ఈ క్రమంలో అత్తగారు ప్రేమ ఒలకబోస్తే.. అల్లుడుగారు డబ్బులు పారబోశారన్న టాక్ కూడా ఉంది. సీన్ కట్ చేస్తే.. కొన్నాళ్ల తర్వాత అమ్మాయి తల్లి పొందరవీధిలో ఉంటున్న సునీల్‌కుమార్ తండ్రి వద్దకు వచ్చి మైనర్ అయిన కుమార్తెను పెళ్లి చేస్తున్నారంటూ అంగన్వాడీ ఒకరు ఫిర్యాదు చేశారని.. ఆమేరకు సచివాలయం నుంచి ఫోన్ వచ్చిందని, ఈ పెళ్లి జరిగితే పోలీసు కేసు అవుతుందని చెప్పడంతో కథ మరో మలుపు తిరిగింది.
మైనారిటీ తీరకుండానే పెళ్లికి ఒత్తిడి
అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు పౌరోహిత్యం చేసే సునీల్‌కుమార్ తండ్రి వెంకటరమణ నిశ్చితార్థానికి ముందు అమ్మాయి మైనరా, మేజరా అన్నది నిర్ధారించులేదు. కనీసం జాతకం కూడా లేకపోయినా మధ్యవర్తిగా ఉన్న పెంట రాజశేఖర్‌శర్మ దంపతులు నక్షత్రం ఇవ్వడంతో జాతకాలు సరిపోయాయని చెప్పి పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. నిశ్చితార్థానికి అమ్మాయిని చీరతో కూర్చోబెట్టడం వల్ల మేజర్‌గా భావించామని, పెళ్లీడు రావడం వల్ల చదువు మానిపించేశామని చెప్పడంతో నమ్మి ఈ పెళ్లికి అంగీకరించామని దర్భముళ్ల వెంకటరమణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిశ్చితార్థం ఎలాగూ జరిగినందున పెళ్లికి తొందరపడకుండా అమ్మాయికి 18 ఏళ్లు నిండేవరకు వేచి ఉంటామని సునీల్‌కుమార్ తల్లిదండ్రులు చెప్పగా అంతవరకు వేచి ఉండే ఉద్దేశం తమకు లేదని, ఎక్కడికైనా తీసుకువెళ్లి దొంగచాటుగా పెళ్లిచేసేద్దామని పెళ్లికుమార్తె తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారని, దానికి తాము అంగీకరించకపోవడంతో తమ ఇంటిని హామీగా రాసివ్వమని అడిగారని వెంకటరమణ పోలీసులకు ఇచ్చిన కౌంటర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత బ్రాహ్మణవీధిలో పెద్దలందరూ కూర్చుని నిశ్చితార్థం రద్దుచేసినట్లు, ఇకపై ఒకరి విషయాల్లో ఒకరు జోక్యం చేసుకోరాదని పెద్దల సమక్షంలో తీర్మానించారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.
వారిది పోక్సో.. వీరిది మాత్రం సివిల్ అట!
ఈ సంబంధానికి మధ్యవర్తులుగా వ్యవహరించిన పెంట రాజశేఖరశర్మ దంపతులు తమ ఇంటికి వచ్చి వివాహం రద్దయినందున నష్టపరిహారం ఇవ్వాలని కోరారని వెంకటరమణ ఆరోపించారు. అయితే అమ్మాయికి పద్దెనిమిదేళ్లు వచ్చేవరకు తాము వేచి ఉంటామని చెప్పినా మైనర్‌గానే పెళ్లి చేయాలని తమపై ఒత్తిడి తేవడం తమ తప్పు కాదు కదా అంటూ డబ్బులు ఇవ్వడానికి ఆయన నిరాకరించడంతో గత ఏడాది ముగిసిన కథకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కొనసాగింపు మొదలై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. రూ.20 లక్షలు ఇవ్వాలని, లేదంటే కుటుంబం మొత్తాన్ని ఆత్మహత్య చేసుకునేలా చేస్తామని బెదిరించినా తాను బెదరకపోవడంతో.. తన కుమారుడిపై పోక్సో కేసు పెట్టించారని వెంకటరమణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదును టూటౌన్ పోలీసులు తీసుకోలేదు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు, పెళ్లి కోసం పెంట రాజశేఖరశర్మ స్వహస్తాలతో రాసిన ముహూర్తపు కాగితం వంటి వాటిని ఆధారాలుగా ఇచ్చినా వారు కనీసం పట్టించుకోలేదు. దీంతో ఎస్పీ మహేశ్వర్‌రెడ్డిని బాధితులు ఆశ్రయించి జరిగినదంతా పూసగుచ్చడంతో కౌంటర్ కేసు నమోదు చేయాలని టూటౌన్ పోలీసులను ఎస్పీ ఆదేశించారు. కానీ వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు సివిల్ మేటర్ కిందకు వస్తుంది కాబట్టి కేసు నమోదు చేయలేమంటూ టూటౌన్ పోలీసులు ఫిర్యాదును వెనక్కు పంపారు. ఇక్కడే పోలీసులు బేరం కుదిరిన వారి కోసం గట్టిగా పని చేస్తున్నారని అర్థమవుతుంది.
సమాధానం లేని ప్రశ్నలు
మైనర్ కుమార్తె వెంటపడుతున్నాడని టూటౌన్‌కు ఫిర్యాదు చేసిన రజనీ అదే మైనర్ కుమార్తెకు తన ఇంటిలోనే నిశ్చితార్థం ఎందుకు చేశారు?
మైనరన్న విషయం బయటి వ్యక్తులకు తెలియకపోయినా తల్లిదండ్రులకు తెలియకుండా ఉంటుందా? మరెందుకు పెళ్లికోసం తొందరపడ్డారు?
నిశ్చితార్థం రోజే పందిరాటకు, పెళ్లికి ముహూర్తాలు పెట్టించిన రజనీ దంపతులే.. తమ ఫిర్యాదులో కుమార్తెకు 18 ఏళ్లు వచ్చాక పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు ఎందుకు పేర్కొన్నారు?
పెళ్లికుమార్తె మైనరని సచివాలయానికి ఫిర్యాదు చేసింది ఎవరు? నిశ్చితార్థంలో అన్నీ దగ్గరుండి చూసుకున్న అంగన్వాడీ కార్యకర్త ఎవరు? ఆమె ఫోన్ నుంచే సునీల్‌కుమార్‌కు ఎందుకు ఎక్కువ కాల్స్ వెళ్లాయి.
పెద్దమనుషుల సమక్షంలో నిశ్చితార్థం ఖర్చులు ఇచ్చేస్తే చాలన్న పెళ్లికుమార్తె తల్లిదండ్రులు లాయర్ ఎంటర్ అయ్యాక ఆ మొత్తాన్ని పెంచేయడం, పోక్సో కేసు నమోదు చేయించడం వెనుక హస్తం ఎవరిది?
నిశ్చితార్థం రద్దయిన తర్వాత సునీల్‌కుమార్ ఎక్కడున్నాడు? సెల్ ఫోన్ లోకేషన్ టవర్ ఏం చెబుతోంది?
సునీల్‌కుమార్ మీద ఇచ్చిన ఫిర్యాదులో ఏయే తేదీల్లో వెంటపడ్డాడో, వేధించాడో ఎందుకు పేర్కోలేదు?
దీనికి సంబంధించిన ఆధారాలు లేవని కేసు కట్టడానికి టూటౌన్ సీఐ నిరాకరించినా, ఎట్టి పరిస్థితుల్లోనూ పోక్సో కేసు కట్టాలని ఒత్తిడి తెచ్చిన లాయరు ఎవరు?
టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు, ఈ సెటిల్మెంట్ లాయర్‌కు ఉన్న లింకేంటి? అమ్మాయి కుటుంబానికి ఏమి ఆశ చూపి కేసు పెట్టించారు?
గతంలో ఈ లాయర్ పోలీసులను పట్టుకొని ఎన్ని సెటిల్మెంట్లు చేశారు?
ఇవన్నీ క్రిమినల్ చర్యలు కావా?
మైనారిటీ తీరని బాలికకు వివాహం చేయాలని నిశ్చయించడం కొత్త భారతీయ చట్టాల ప్రకారం క్రిమినల్ నేరం. దీనికి మధ్యవర్తులుగా వ్యవహరించినవారు కూడా నేరస్తులే. ఈ సంబంధం చేసిన, స్వయంగా ముహుర్తాలను స్వహస్తాలతో రాసిన వ్యక్తి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడం గమనార్హం. అలాగే సొమ్ములిస్తే కేసు విత్‌డ్రా చేసుకుంటామని, లేదంటే నేరంలో ఇరికిస్తామని బెదిరించడం కూడా క్రిమినల్ నేరమే. అయినా కూడా సునీల్‌కుమార్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు సివిల్ మేటర్‌గా పరిగణించి వెనక్కు పంపడంలో ఆంతర్యమేమిటి?
留言