పాత ఆర్‌ఎం రాజు వెనుక మరో నలుగురు
బీఎం శ్రీకర్‌పై ఛార్జిషీటు
ఎన్‌హెచ్‌ఆర్‌సీకి స్వప్నప్రియ తల్లి ఫిర్యాదు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
బ్యాంకు పరువు పోతుందని జరిగిన కుంభకోణాలేవీ బయటకు చెప్పకుండా దాస్తున్నారు సరే.. ఎవరైనా అడిగితే తమ బ్యాంకులో అటువంటివేవీ జరగలేదని చెబుతున్నారు సరే.. భవిష్యత్తులో దీనికి బాధ్యులైనవారిపైన క్రిమినల్ కేసులు పెట్టి రికవరీ చేయకపోతే తమ పేరుతో బ్యాంకు సిబ్బందే తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించమంటూ నోటీసులు వచ్చి కోర్టు వరకు ఈ వ్యవహారం వెళితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని ఎస్‌బీఐ బజారు బ్రాంచిలో ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఖాతాదారుల పేర్లతో రుణాలు మంజూరుచేసి ఆ సొమ్ములను బ్యాంకు సిబ్బంది కొందరు సొంతానికి వాడుకోవడంపై ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి పేరున రుణాలు ఇచ్చారు, అవి ఎవరి ఖాతాలోకి వెళ్లాయి అనే అంశాలపై ఇంతవరకు బ్యాంకు అధికారులు ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం మనం బరంపురం అనే రీతిలో బ్యాంకు అధికారులు, స్కామ్ సూత్రధారులు ఎస్‌బీఐ బ్రాండ్ ఇమేజ్ కోసం ఒక్కటైపోయి భవిష్యత్తులో తమ పేరుతో ఉన్న రుణాలు తీర్చమంటే ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్‌ను శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం, అక్కడ్నుంచి హైదరాబాద్, ఆపైన ముంబయి పట్టుకెళ్లి కేసును పక్కదారి పట్టించడం తప్ప ఇంతవరకు బాధ్యులపై చర్యలు లేకపోవడాన్ని తప్పుపడుతున్నారు. బ్యాంకులో కుంభకోణం జరగలేదని చెప్పదలిస్తే పత్రికలో వచ్చిన కథనాలు తప్పని చెప్పాలని, లేదూ అంటే బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ఖాతాదారులు కోరుతున్నారు. బజారు బ్రాంచిలో ఎవరి పేరుతో కోట్లాది రూపాయల నకిలీ రుణాలు మంజూరైపోయాయో తెలియక ఖాతాదారులు బితుకుబితుకుమంటున్నారు. నెల రోజుల నుంచి బజారు బ్రాంచి మేనేజర్ శ్రీకర్ కనిపించకుండాపోయినా రెండు రోజుల క్రితం వరకు కొత్త బ్రాంచి మేనేజర్‌ను నియమించకపోవడం, పాత బ్రాంచి మేనేజర్ శ్రీకర్ ఏమయ్యాడో చెప్పకపోవడం వంటి గోప్యతా అంశాలు బయటపడిన తర్వాత ఉన్నతాధికారులే ఎవరినో రక్షించే ప్రయత్నంలో ఉన్నారన్న భావన ఖాతాదారుల్లో ఉంది. మరోవైపు నరసన్నపేట ఎస్‌బీఐ బజారు బ్రాంచిలో నకిలీ రుణాల కుంభకోణం జరిగిందని, నెల రోజులుగా బ్రాంచి మేనేజర్ కనపడకుండాపోయారంటూ కొత్త ఆర్‌ఎంను విలేకర్లు ప్రశ్నిస్తే తనకేమీ తెలియదని, తాను కూడా బదిలీపై వెళ్లిపోతున్నందున దయచేసి ఇందులోకి లాగొద్దంటూ దాటవేస్తున్నారట. నరసన్నపేట బ్రాంచిలో నకిలీ రుణాల కుంభకోణంలో కనిపించకుండాపోయిన బ్రాంచి మేనేజర్ రూ.65 లక్షల వరకు బ్యాంకుకు కట్టడంతో ఆ రోజుతోనే ఆయన ఉద్యోగం ఊడగొట్టుకున్నారు. కేవలం అప్పటి ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజు ఈమేరకు సొమ్ములు చెల్లిస్తే ఎటువంటి కేసు లేకుండా చేస్తానని నమ్మబలికి శ్రీకర్‌తో డబ్బులు కట్టించి కమిట్ చేయించారు. వాస్తవానికి ఆర్‌ఎంకు తెలియకుండా నకిలీ రుణాలు మంజూరు చేసే అవకాశం ఏ కోశానా లేదు. ఇప్పుడు శ్రీకర్‌తో పాటు ఇక్కడ హౌసింగ్ లోన్ కౌన్సిలర్‌గా వ్యవహరిస్తూ రికవరీ ఏజెంట్‌గా థర్డ్ పార్టీ ఉద్యోగిగా పని చేస్తున్న ఒక వ్యక్తితో పాటు ఫీల్డ్ ఆఫీసర్ చింతాడ శ్రీనుతో పాటు మరొకరి పాత్ర ఉంది. అయితే ఇంతవరకు ఎన్నికోట్ల నకిలీ రుణాలు బయటకు వెళ్లాయి, ఎవరి ఖాతాలోకి వెళ్లాయి, ఎవరి పేరుతో వెళ్లాయి అనే విషయాన్ని బ్యాంకు అధికారులు బయటపెట్టడంలేదు.
గార బ్రాంచిలోనూ ఇదే జరిగింది..
గార ఎస్‌బీఐ బ్రాంచిలో తాకట్టు బంగారం మాయమైనప్పుడు కూడా పైఅధికారులకు తెలియకుండా, కేసు బయటకు రాకుండా ఉండాలంటే కనపడకుండాపోయిన బంగారం సంచులను తనకు తెచ్చి ఇచ్చేయాలని అప్పటి ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజు చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు తీరిగ్గా విచారిస్తే గార బ్రాంచిలో బంగారం మాయం కావడానికి మూడున్నరేళ్ల ముందు నుంచి సీసీ కెమెరాలు పని చేయడం లేదని తెలుస్తుంది. ఈ ఫుటేజీ కోసం ప్రశ్నించగా, లేదని సమాధానం వస్తోంది. కేవలం ప్రైవేటు బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న బంగారాన్ని తెచ్చి పెట్టినప్పుడు మాత్రమే సీసీ ఫుటేజీని చూపించారు. కానీ ఈ బంగారం ఎప్పట్నుంచి మాయమవుతుందో తెలుసుకునేందుకు డేటా అందుబాటులో లేదని భోగట్టా. అయితే స్వప్నప్రియను బ్యాంకు అధికారులే చంపేశారని జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఆమె తల్లి ఫిర్యాదు చేశారు. కేవలం నిందను తన కుమార్తె మీద మోపి చనిపోడానికి కారణమయ్యారంటూ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఓ లేఖ రాశారు. ఇప్పుడు దీనికి ఎస్‌బీఐ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది. గార బ్రాంచిలో బంగారం మాయమైనా అన్నీ ఉన్నట్లు ఆడిట్ రిపోర్టు ఇచ్చినట్లే నరసన్నపేట బజారు బ్రాంచిలో నకిలీ రుణాల పేరిట బ్యాంకు సొమ్ము బయటకు వెళ్లిపోయినా అంతా బాగుందని ఆడిట్ రిపోర్టు చేసింది. అంటే.. ఈ రెండిరటి వెనుక ఒకే శక్తి నడిపిందని అర్థమవుతుంది. బ్రాంచిల్లో ఆడిట్ జరిగినప్పుడు స్వయంగా ఆర్‌ఎం అన్నింటినీ చూసుకొని నో అబ్జక్షన్ తెచ్చుకున్నారు. ఇప్పుడు కుంభకోణాలు వెలుగుచూసేసరికి బ్రాంచి మేనేజర్లను బలి చేసేస్తున్నారు.
Comments