top of page

సాయం చేయండి

  • Writer: ADMIN
    ADMIN
  • Dec 5, 2024
  • 4 min read
  • ఇజ్రాయేల్‌ను కోరిన సిరియా అధ్యక్షుడు

  • హంగరీ ద్వారా నెతన్యాహుకు సందేశం


సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ ఇజ్రాయేల్‌ ప్రధాని నెతన్యాహు సహాయం కోరాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. డిసెంబరు 2 సాయంత్రం అల్‌ అసద్‌ నెతన్యాహు సహాయం ఆర్ధించినట్లుగా తెలుస్తుంది. సౌదీఅరేబియా న్యూస్‌ పేపర్‌ ఎలాఫ్‌ ఈ విషయాన్ని తెలియచేసినట్లు ఇజ్రాయెల్‌ వార్త సంస్థ పేర్కొంది. అయితే నేరుగా అల్‌ అసద్‌ నెతన్యాహుతో మాట్లాడలేదు. సిరియాతో సత్సంబంధాలు ఉన్న ఒక యూరోపు దేశం (హంగరీ) ద్వారా సందేశం పంపినట్లుగా ఎలాఫ్‌ పేర్కొంది.

సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ ఇజ్రాయేల్‌ ప్రధాని నెతన్యాహుకి చేసిన ప్రతిపాదనలు

1. సిరియన్‌ ప్రభుత్వ తిరుగుబాటు దళాలని ఇజ్రాయేల్‌ కనుక అణిచివేయడానికి ఒప్పుకుంటే సిరియాలో ఆశ్రయం పొందుతున్న హెజ్బొల్లా, హమాస్‌లని సిరియా నుంచి బహిష్కరించడమే కాక భవిష్యత్‌లో ఇజ్రాయేల్‌ వ్యతిరేక శక్తులకి సహాయసహకారాలు ఇవ్వను.

2. ఇజ్రాయేల్‌ అంగీకరిస్తే సిరియాలో కూంబింగ్‌ ఆపరేషన్స్‌ నిర్వహించుకోవడానికి నేను సహకరిస్తాను.

3. ప్రస్తుతం ఇరాన్‌ పంపించడానికి సిద్ధంగా ఇరాన్‌ రివోల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) సైనికులకి సిరియాలో అనుమతి ఇవ్వను.

4. ఇరాన్‌తో సంబంధాలను తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.

వెల్‌..! అల్‌ అసద్‌ ఇంతలా ఇజ్రాయేల్‌ అడగకుండానే తానే ఇజ్రాయేల్‌కి ఏమీ కావాలో అన్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అంటే బలమైన కారణం ఉంది. అలెప్పో నగరం పూర్తిగా రెబెల్స్‌ చేతిలోకి వెళ్లిపోవడమే కాక అలెప్పో నగరం చుట్టూ ఉన్న చిన్న పట్టణాలు, గ్రామాలు కూడా ఎలాంటి ప్రతిఘటన లేకుండానే రెబెల్స్‌ స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. నిన్న రెబెల్స్‌ ప్రకటించిన దాని ప్రకారం కొద్ది రోజుల్లోనే సిరియా రాజధాని డమాస్కస్‌ని స్వాధీనం చేసుకుంటామని అన్నది నిజం అవవచ్చు. లేకపోతే బషర్‌ అల్‌ అసద్‌ ఇజ్రాయల్‌ని ఎందుకు వేడుకుంటాడు? మరి పుతిన్‌ ఏమీ చేయలేడా? పుతిన్‌ ఏమీ చేయలేడు. ఉత్తరకొరియా నుంచి 30వేల మంది సైనికులని తెచ్చుకున్నాడంటేనే అర్ధం చేసుకోవచ్చు పుతిన్‌ ఎంత దీనావస్థలో ఉన్నాడో. రష్యన్‌ ఆర్మీలో మిగిలింది రిజర్వ్‌ దళాలు, స్పెషల్‌ ఆపరేషన్‌ దళాలు మాత్రమే.

ఇప్పటి వరకూ 3.60 లక్షల మంది రష్యన్‌ సైనికులు మరణించారు. ఇది తటస్థ మీడియా నివేదిక. వెస్ట్రన్‌ మీడియా లెక్క ప్రకారం 5 లక్షలకి పైగానే చనిపోయారు. రష్యన్‌ యువకులు దేశం వదిలి వెళ్లిపోయి దొరికిన పని చేసుకుంటూ బతుకుతున్నారు విదేశాలలో. రిజర్వ్‌ దళాలు, స్పెషల్‌ ఆపరేషన్‌ దళాలు మాస్కో రక్షణ కోసం వాడతారు, తప్పితే ఉక్రెయిన్‌లో ఫార్వార్డ్‌ దళాలతో చేరరు అంటే ఇది చివరి అంచె భద్రత. పుతిన్‌ సలహా ఇచ్చి ఉండవచ్చు అల్‌ అసద్‌కి. రెండు రోజుల క్రితం పుతిన్‌ తన బాంబర్‌ అయిన ఐఎల్‌ 60ని సిరియాకి పంపించి రెబెల్స్‌ మీద దాడి చేయించగా, 300 మంది రెబెల్స్‌ మరణించారు. అయితే ఎయిర్‌ స్ట్రైక్స్‌ చేస్తే సరిపోదు. గ్రౌండ్‌ ఫోర్స్‌కి సపోర్ట్‌గా ఉంటుంది తప్పితే పూర్తిగా ఎయిర్‌ స్ట్రైక్స్‌తో పని కాదు. అందుకే ఆర్మీ అనేది భూభాగం రక్షణలో ఇప్పటికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ సిరియన్‌ ఆర్మీ చాలా వీక్‌. రష్యన్‌ సైనికులు ఉన్నా రెబెల్స్‌ సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువ అందుకే రష్యన్‌, సిరియన్‌ సైనికులు వెనక్కి పారిపోతున్నారు ఎలాంటి పోరాటం చేయకుండానే. వేరే దారి లేక పుతిన్‌ సలహా ఇచ్చి ఉంటాడు నెతన్యాహుని సహాయం కోరమని!

నెతన్యాహు పరిస్థితి ఏమిటి?

అసలు సిరియాలో రెబెల్స్‌ దాడి ప్రారంభించగానే నెతన్యాహుకి ఏమీ అర్ధం కాలేదు. కనీసం ఇంటెలిజెన్స్‌ ఇన్‌పుట్‌ కూడా లేదు. కానీ కొన్ని మిడిల్‌ ఈస్ట్‌ మీడియా మాత్రం రెబెల్స్‌ చేతిలోకి సిరియా వెళ్లబోతున్నది అనే వార్త మాత్రం నెతన్యాహుని కలవరపెడుతున్నట్లుగా పేర్కొన్నాయి. బహుశా నేతన్యాహు బాంక్‌ అకౌంట్స్‌ నుంచి హమాస్‌ నాయకుల అకౌంట్లలోకి డబ్బు మళ్లడం అనే వార్తకి మళ్లీ ప్రచారం లభించవచ్చు అనే భయం కావొచ్చు. మరో షాకింగ్‌ న్యూస్‌ ఏమిటంటే 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయేల్‌ మీద హమాస్‌ దాడి చేయబోతున్నది అనే విషయం అటు జో బైడెన్‌కి, ఇటు నెతన్యాహుకి ముందే తెలుసు. ఇజ్రాయేల్‌లోని మేధావులు 2023 అక్టోబర్‌ 7 దాడి మీద న్యాయ విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి మెజారిటీ ప్రజల ఆమోదం ఉంది.

ప్రస్తుతం హమాస్‌, హెబొల్లాల మీద యుద్ధం జరుగుతున్నందున ఇజ్రాయేల్‌ ప్రజలు మౌనంగా ఉన్నారు. ఇవాళ కాకపొతే రేపటి రోజున అయినా విచారణ జరుగుతుంది నెతన్యాహుకి కనీసం ఏడేళ్ల జైలుశిక్ష తప్పదు. ఈ విషయం పుతిన్‌కి తెలుసు కాబట్టి అల్‌ అసద్‌ని సహాయం అడగమని సలహా ఇచ్చాడు. డీప్‌ స్టేట్‌ అనుమతి కావాలి. ఎస్‌.. అమెరికన్‌ మిలిటరీ కంప్లెక్స్‌ అనుమతి ఇస్తేనే నెతన్యాహు సహాయం చేయగలడు. రెబెల్స్‌ని నెతన్యాహు ఆపగలడు. కానీ దానివల్ల ఎవరికి లాభం? సిరియా వల్ల ఇజ్రాయేల్‌కి ఇబ్బంది లేకపోతే ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది. మరి ప్రశాంతంగా ఉంటే ఆయుధాలు ఎవరు కొంటారు?

ఒక చిన్న ఉదాహరణ : ఆరు నెలల క్రితం హమాస్‌ ఉగ్రవాదులు ఉన్న ఇళ్లని కూల్చడం కోసం అని హెవీడ్యూటీ బుల్‌డోజర్స్‌ ఒక టన్ను సామర్ధ్యం గలవి 134 అమెరికాలోని కేటర్పిల్లర్‌ సంస్థకి ఆర్డర్‌ ఇచ్చింది. ఇవి అమెరికా ఇచ్చే ఆర్ధిక సహాయం కింద కాకుండా తన సొంత డబ్బులతో ఆర్డర్‌ ఇచ్చింది ఇజ్రాయేల్‌! కానీ జో బైడెన్‌ అధికారులు ఇజ్రాయేల్‌ ఆర్డర్‌ని ఆపేశారు. కారణం ఏమిటో తెలుసా? ఇజ్రాయేల్‌కి హెవీ డ్యూటీ బుల్‌డోజర్స్‌ ఇస్తున్నందుకు ప్రజలు అమెరికాలోని రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారని. అందుకని బుల్‌డోజర్స్‌ ఆర్డర్‌ కాన్సిల్‌ చేస్తున్నాము ప్రత్యామ్నాయంగా హెలికాప్టర్‌, ఫైటర్‌ జెట్లతో ప్రయోగించే ఎయిర్‌ టు గ్రౌండ్‌ మిసైల్స్‌ పంపిస్తున్నామని, అవి పంపించారు. అవి కూడా మిలిటరీ సహాయం కింద పంపించారు. అంటే అమెరికా ప్రభుత్వం మిసైల్‌ తయారీ దారులకి డబ్బు చెల్లిస్తుంది. 134 హెవీ బుల్‌డోజర్స్‌కి అయ్యే ఖర్చు 1 మిలియన్‌ డాలర్లు. అదే ఎయిర్‌ టు గ్రౌండ్‌ మీసైల్స్‌కి 600 మిలియన్‌ డాలర్లు ఖర్చవుతుంది.

శాంతికి తావు ఉంటుందా?

మహా అయితే బషర్‌ అల్‌ అసద్‌ రష్యా లేదా హంగరి దేశానికి వెళ్లిపోతాడు. షియా వర్గానికి చెందిన సిరియన్‌ సైనికులు, హెబొల్లా ఉగ్రవాదులు కలిసి సున్నీ వర్గం రెబెల్స్‌ మీద పోరాడుతూ ఉంటారు. సీఐఏ రంగంలో దిగి తాము చెప్పిన వ్యక్తిని అధ్యక్షుడుగా అంగీకరించే షియా లేదా సున్నీ వర్గానికి సైనిక, ఆయుధ సహాయం చేస్తామని బేరం పెడుతుంది. సున్నీ వర్గానికి చెందిన వ్యక్తి సిరియా అధ్యక్షుడు అయితే సౌదీ అరేబియా కూడా సహాయం చేస్తుంది. అంతిమంగా సిరియాని రష్యా, ఇరాన్‌ల గుప్పిటలో నుంచి తప్పించడమే అమెరికా లక్ష్యం. అలా అయినా శాంతి పరిఢవిల్లుతుంది అనే ఆశ పెట్టుకోవడం భ్రమ. కుర్థులు సిరియా, టర్కీలలోని ప్రాంతాలని కలిపి ప్రత్యేక కుర్థిస్తాన్‌ కావాలని పోరాడుతున్నారు. కుర్థులు ఒక పక్క టర్కీ సైన్యం మీద మరోపక్క రెబెల్స్‌తో పోరాడుతున్నారు. నెతన్యాహు ఇటీవల ఒక ప్రకటన చేస్తూ కుర్థులు మాకు ఆత్మీయులు కాబట్టి కుర్థులతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాను అన్నాడు.. కానీ సిరియా పేరు ఎత్తలేదు. సో.. జనవరి 20 లోపు ఏదైనా జరగవచ్చు. ప్లాన్‌ బాగుంది కదా?

ఒక పక్క హమాస్‌ దగ్గర బందీలు బ్రతికి ఉన్నారో లేదో తెలియదు. మరోపక్క హెజ్బొల్లా సగానికి సగం తగ్గిపోయింది. మిగిలిన హెజ్బొల్లా ఫైటర్స్‌ దగ్గర తగినన్ని ఆయుధాలు లేవు. ఇప్పుడు హెజ్బొల్లా ఎవరితో పోరాడుతుంది? ఇజ్రాయేల్‌తోనా? లేక సిరియా నేషనల్‌ ఆర్మీతో కలిసి రెబెల్స్‌ మీద పోరాడుతుందా? ఒకవేళ డీప్‌ స్టేట్‌ ఆమోదంతో ఇజ్రాయేల్‌ సిరియాకి మద్దతుగా రెబెల్స్‌ మీద దాడులు చేయాల్సి వస్తే హెజ్బొల్లా ఇజ్రాయేల్‌తో కలిసి పనిచేస్తుందా? అసలు మన సంగతి మనం చూసుకోకుండా సిరియాలో మన సైన్యం ఎందుకు పోరాడాలని ఇజ్రాయల్‌ ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేయకుండా ఉంటారా? ఇరాన్‌ నుంచి ఐఆర్‌జీసీ సైనికులు సిరియా రారు, ఒకవేళ ఇజ్రాయేల్‌ ఒప్పుకుంటే. సలహా ఇచ్చినందుకు రష్యా ఇరాన్‌ల మధ్య దూరం పెరుగుతుందా? ఒక్క చర్యతో చాలా ప్రశ్నలు పుట్టుకొచ్చాయి కదా? ఇజ్రాయేల్‌ దగ్గర ఆయుధాలు అయిపోయాయి కాబట్టి హెబొల్లాతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నది. అమెరికా నుంచి తిరిగి సప్లైస్‌ వస్తేనే కానీ ఇజ్రాయేల్‌ పూర్తిస్థాయిలో యుద్ధం చేయలేదు. అఫ్కోర్స్‌.. అమెరికా తన సైన్యంని సిరియాలో దించుతుంది వేరే దారి లేకపోతే. ఈ అప్షన్‌ని రిజర్వ్‌లో పెట్టారు. ఇక టర్కీ కూడా నాలుగేళ్ల క్రితం నాటో దళాలతో కలిసి పోరాడిరది. టర్కీ నాటో మెంబర్‌ కానీ యూరోపియన్‌ యూనియన్‌ మెంబర్‌ కాదు! టర్కీకి బద్ధ శత్రువులు కుర్థులు. నెతన్యాహునేమో కుర్థులు మాకు ఆత్మీయ మిత్రులు అంటున్నాడు. అంతా గజిబిజిగా ఉంది..!

- పొట్లూరి పార్థసారధి

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page