top of page

సాయిబాబా ఇక లేరు

Writer: DUPPALA RAVIKUMARDUPPALA RAVIKUMAR
  • పదేళ్ల అక్రమ నిర్బంధం నుంచి మార్చిలో విడుదల

  • ఉగ్రవాద కేసు నుంచి నిర్దోషిగా విడుదలైనా, పూర్తిగా చెడిపోయిన ఆరోగ్యం

  • ఐదేళ్ల ప్రాయంలోనే అంగవైకల్యం, కుర్చీకే పరిమితమైన సాయి

(దుప్పల రవికుమార్‌)

విద్యావేత్త జిఎన్‌ సాయిబాబా(58) హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్‌ 12 శనివారం నాడు గుండెపోటుతో మృతి చెందారు. ఢల్లీి విశ్వవిద్యాలయంలో ఇంతకు మునుపు ఆంగ్ల ఆచార్యులుగా పనిచేసిన సాయిబాబాను ఉగ్రవాద కేసులో పదేళ్ల అక్రమ నిర్బంధం తర్వాత నిర్దోషిగా హైకోర్టు విడుదల చేసింది. పదేళ్లు జైలులోనే మగ్గడం వల్ల ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. గాల్‌బ్లాడర్‌ (పిత్తాశయం)ను తొలగించే శస్త్రచికిత్స పూర్తయ్యాక వచ్చిన ఇన్‌ఫెక్షన్‌ చాలా ఇబ్బంది పెట్టిందని ఆయన సహచరి వసంత తెలిపారు. వారికి ఒక కుమార్తె ఉన్నారు. పేరు మంజీర. సాయిబాబా ఢల్లీి విశ్వవిద్యాలయంలో రాంలాల్‌ ఆనంద్‌ కళాశాలలో 2003 నుంచి ఆంగ్ల ఆచార్యులుగా ఉంటున్నారు. బాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశాక, 2014లో ఢల్లీి విశ్వవిద్యాలయం అతనిని విధుల నుంచి తొలగించింది.

హక్కుల కోసం పోరాడడమే ఆయన చేసిన నేరం

ఢల్లీి హైకోర్టు ఇచ్చిన తీర్పులో వారిని దోషులుగా తేల్చిన ప్రభుత్వ విచారణ పద్ధతిని, ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా విమర్శించింది. ఈ తీర్పుపై భారత దేశ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సాయిబాబాను మరింత కఠినంగా శిక్షించాలని కోరింది. కాని, సుప్రీంకోర్టు ఢల్లీి హైకోర్టు వెలువరించిన తీర్పు సరైందని చెప్తూ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేసింది. చక్రాల కుర్చీకి పరిమితమైన సాయిబాబా 90 శాతానికి పైగా వికలాంగుడని ప్రభుత్వానికి తెలుసు. కాని, ఆయన ఈ దేశానికి తీవ్రమైన ప్రమాదకారి కాగలడని భావించింది. పదేళ్లకు పైగా తీవ్ర నిర్బంధంలో ఉంచింది. ఎందుకంటే తనను నిర్బంధించింది సాధారణ జైలులో కాదు.. ఒంటరి చీకటి అండాసెల్‌లో. గొప్ప గుండెధైర్యంతో బతికిన సాయిబాబా ప్రభుత్వానికి పెనుసవాల్‌గా నిలిచారు. ఈ సుదీర్ఘ అక్రమ నిర్బంధ సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అప్పుడప్పుడూ వసంత మీడియాకు చెప్పిన సంగతులే ఆయన గురించి మనకు తెలిసిన సమాచారం. జైలు అధికారులు ఆయనకు వైద్య సహాయం చేయడానికి నిరాకరించారు. ఆఖరికి ఆయన తల్లి మరణించినపుడు అంత్యక్రియలకు హాజరు కావడానికి కూడా అనుమతి లభించలేదు. ఆయన జైలులోనే చనిపోతాడని అందరూ భయపడ్డారు. విడుదలై, తన కుటుంబంతో గడుపుతున్న ఏడు నెలలకే ఆయన మరణ వార్త వినడం ఆయన అభిమానులను కలచివేసింది.

జైలు నుంచి విడుదల అయిన తర్వాత వివిధ పత్రికలు, ఛానెళ్లు ఆయనను ఇంటర్వ్యూ చేశాయి. అందులో ఆయన తాను జైలు నుంచి బయటకు రావడం యాదృచ్ఛికం అన్నారు. జైలు అధికారులు తనకు వైద్య పరీక్షలు నిరాకరించిన విధానం, తన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడం గురించి చెప్పారు. తాను అరెస్టయ్యే సమయానికి పోలీయో వల్ల చక్రాల కుర్చీకే పరిమితమైనప్పటికీ ఇతరత్రా ఆరోగ్య సమస్యలు లేవని చెప్పారు. ఈ పదేళ్ల జైలు జీవితం ఆయన ముఖ్య అవయవాలను దారుణంగా దెబ్బతీసింది. తన శారీరక, మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన ఇంటర్వ్యూలలో వాపోయారు. ఆయన పేగుల్లో వచ్చిన ఇన్ఫెక్షన్‌కు జైలులోనే చికిత్స అవసరమైంది. ప్రభుత్వం, న్యాయవ్యవస్థ నిర్లక్ష్య వైఖరి వల్ల అతని ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం వాటిల్లింది. అదే కేసులో అతనితో పాటు అరెస్టయిన పాండు నరోటె అనే యువకుడు ఆగష్టు 2022లో స్వైన్‌ఫ్లూతో జైలులోనే మరణించాడు. ఆయన అంగవైకల్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, కేవలం ప్రభుత్వంపై అసమ్మతి ప్రకటిస్తున్నారన్న అక్కసుతో, మావోయిస్టు భావజాలాన్ని అంగీకరించారన్న కారణంతో ఏళ్ల తరబడి నిర్బంధించిన సాయిబాబా చేసిన అసలు నేరం మానవ హక్కుల గురించి నిరంతరం పోరాడడమే.

కోర్టు నుంచి కోర్టుకు అభిప్రాయాలు మారాయి

మే 9, 2014: సాయిబాబాను మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి పోలీసులు అరెస్టు చేసి, నాగపూర్‌ జైలులో నిర్బంధించారు. అప్పటికి ఆరు నెలల కిందట ఎన్‌ఐఏ అధికారులు యూనివర్శిటీ క్యాంపస్‌లో ఉన్న ఆయన ఇంటిని సోదా చేసారు. జెఎన్‌యు విద్యార్థి హేం మిశ్రా, ఉత్తరాఖండ్‌ జర్నలిస్టు ప్రశాంత్‌ రహీలను నిషేధిత మావోయిస్టులకు చెందిన సంస్థ రివల్యూషనరీ డెమక్రటిక్‌ ఫ్రంట్‌ సభ్యులతో ఒక సమావేశానికి సహకరించాడని ఆయనపై పోలీసులు యుఏపిఏ కేసు పెట్టారు.

జూన్‌ 2015: క్షీణిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని బొంబాయి హైకోర్టు సాయిబాబాకు బెయిల్‌ మంజూరు చేసింది.

డిసెంబర్‌ 2015: సాయిబాబాను తిరిగి నిర్బంధంలోకి తీసుకున్నారు.

ఏప్రిల్‌ 2016: సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేయడమే కాకుండా, అతడిని జైలులోనే నిర్బంధించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని తప్పుపట్టింది.

మార్చి 2017: ట్రయల్‌ కోర్టు సాయిబాబాతో పాటు హేమ మిశ్రా, ప్రశాంత రాహి, మహేష్‌ టిర్కి, పాండు నరోటేలపై యుఏపిఏ కేసులో నిర్బంధించి, యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. విజయ్‌ టిర్కికి మాత్రం పదేళ్ల జైలు శిక్ష విధించింది.

అక్టోబర్‌ 14, 2022: బొంబాయి హైకోర్టులో నాగపూర్‌ బెంచ్‌కు ఆయన చేసుకున్న నివేదన మేరకు యుఏపిఏ సెక్షన్‌ నమోదు చేయదగ్గ విషయం ఈ కేసులో లేదని, ఆయనతో పాటు ఇతరులను కేసు నుంచి విడుదల చేసింది.

అక్టోబర్‌ 15, 2022: బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును అపెక్స్‌ కోర్టు రద్దు చేసింది. పైగా కేసు తీవ్రతను కోర్టు అర్థం చేసుకోలేక పోతోందని ఆవేదన చెందింది.

ఏప్రిల్‌ 19, 2023: నిర్దోషులుగా వారిని విడుదల చేయమని బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెడుతూ, తీర్పును పునః సమీక్షించమని మరొక బెంచ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

మార్చి 5, 2024: ఏడాది లోగానే కేసును అధ్యయనం చేసిన బొంబాయి హైకోర్టు సాయిబాబాతో పాటు ఇతరులను నిర్దోషులుగా ప్రకటించింది.

మార్చి 7, 2024: సాయిబాబాను జైలు నుంచి విడుదల చేశారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page