top of page

సాయిరెడ్డితో ఆగేలా లేదు!

Writer: NVS PRASADNVS PRASAD
  • కాకినాడ పోర్టు వాటాలపై భయం

  • జగన్‌ నుంచి దక్కని భరోసా

  • భవిష్యత్తులో మరింతమంది రాజీనామా!

  • ధర్మాన ఊగిసలాటపై ఊహాగానాలు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

పార్టీ నుంచి నాయకులు వెళ్లినంత మాత్రాన జగన్మోహన్‌రెడ్డికి కొత్తగా వచ్చిన నష్టం లేదు. ప్రతీ ఎన్నికలకు కొత్త అభ్యర్థుల వైపు చూసే జగన్మోహన్‌రెడ్డికి విజయసాయిరెడ్డి రాజీనామా ప్లస్సే గాని, మైనస్‌ కాదు. నలుగురు రాజ్యసభ సభ్యులు పోతే జగన్‌ పార్టీ కొట్టుకొనిపోదు. 11 సీట్లు వచ్చినప్పటికీ 40 శాతం ఓటుబ్యాంకు జగన్‌ సొంతం అంటూ ఆయన అభిమానులు శుక్రవారం సాయంత్రం విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నానని ప్రకటించిన దగ్గర్నుంచి చేస్తున్న చేస్తున్న ప్రచారం. వాస్తవానికి విజయసాయిరెడ్డి అనే నాయకుడు పార్టీని వీడటం, రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం వైకాపా రాజకీయ నాణానికి ఒక పార్శ్వం మాత్రమే. ఏ విజయసాయిరెడ్డి కోసమైతే ఉత్తరాంధ్రలో అనేకమంది సీనియర్లను కాదని, కనీసం ఎమ్మెల్యేను కూడా పట్టించుకోకుండా పాలించిన జగన్మోహన్‌రెడ్డికి ఇప్పుడు విజయసాయిరెడ్డి వెళ్లిపోవడం వల్ల కొత్తగా వచ్చిన నష్టం ఉండకపోవచ్చుగానీ, పార్టీలో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు మాత్రం జగన్‌ ఇవ్వని భరోసాకు ప్రత్యక్ష సాక్ష్యంగా సాయిరెడ్డి రాజీనామా కనిపించక మానదు. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పుడు జగన్‌ వెనకడుగు వేయలేదని, ఇప్పుడు విజయసాయిరెడ్డి వెళ్లిపోవడం వల్ల తొణకడు, బెనకడు అని చెబుతున్నారు. 2014 నుంచి 19 వరకు 23 మంది ఎమ్మెల్యేలు గాని, ఎస్పీవై రెడ్డి లాంటి ఎంపీ గెలిచిన మరుసటిరోజే పార్టీ ఫిరాయించినా, అప్పటికీ జగన్‌కు జరిగిన డ్యామేజీ లేదు. ఎందుకంటే.. జగన్‌ అప్పుడు అధికారం కోసం కొట్లాడుతున్న సమయం. కానీ ఇప్పుడు ఐదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత సీనియర్‌ నాయకులు పార్టీని వీడటం మాత్రం కచ్చితంగా ప్రభావితం చూపుతుంది. విజయసాయిరెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి మధ్య గ్యాప్‌ ఉందని, అలాగే పెద్దిరెడ్డితో సత్సంబంధాలు లేవని, జగన్‌ బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డితో పొసగదని, ఉత్తరాంధ్రలో బొత్స సత్తిబాబుతో విభేదాలున్నాయని అందరికీ తెలుసు. కానీ జగన్‌ ఆస్తుల కేసుల్లో ఎ`2గా ఉంటూ జైలుకు వెళ్లినా వెరవకుండా ఇన్నాళ్లూ ఆయనతోనే ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం వల్ల ఆయనకే దిక్కులేదు, మనమెంత అన్న సంకేతాలు పార్టీకి వెళ్తాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వ పనితీరుపై నిరసనలకు పిలుపునిస్తే, వైకాపా కేడర్‌ అంతంత మాత్రంగానే స్పందిస్తుంది. కారణం.. ప్రస్తుత ప్రభుత్వం తమ మీద కేసులు పెడితే తమ తరఫున పోరాడటానికి జగన్మోహన్‌రెడ్డి రోడ్డెక్కుతారన్న సూచనలు కనుచూపు మేరలో కనిపించడంలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత సరైన సమీక్ష లేకుండా, ఓటమికి గల కారణాలను పోస్టుమార్టం చేయకుండా కొద్ది రోజులు ఈవీఎంల మీదకు నెట్టేసిన జగన్మోహన్‌రెడ్డి ఆ తర్వాత జిల్లాల వారీగా తిరుగుతానని ప్రకటించి ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. వైకాపా కార్యకర్తలను ఓదార్చడానికి జగన్‌ వస్తారని చెబుతున్న ప్రతీసారి ఆయన బెంగళూరుకో, లండన్‌కో పయనమవుతున్నారు. జగన్మోహన్‌రెడ్డి తరఫున విజయసాయిరెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా పెద్ద ఎత్తునే కొట్లాడారు. గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు, లోకేష్‌, పవన్‌కల్యాణ్‌లను గట్టిగానే టార్గెట్‌ చేశారు. ఈ విధంగా ఒకేసారి కూటమిలో ఉన్న మూడు పార్టీల నేతలకు ఆయన శత్రువుగా మారారు. జగన్‌ దగ్గరి బంధువు బాలినేని శ్రీనివాస్‌ పార్టీ వీడినప్పుడు చాలా లైట్‌గా తీసుకున్నారు. అలాగే ఎన్నికలకు ముందు కోటమరెడ్డి శ్రీధర్‌రెడ్డి లాంటివారు పార్టీ మారినా పట్టించుకోలేదు. రాబోయే ఎన్నికలకు జగన్మోహన్‌రెడ్డి కొత్త అభ్యర్థులను తయారుచేయొచ్చు. కానీ ఆ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు పని చేయాలంటే ఇప్పట్నుంచే వైకాపా రోడ్డెక్కాలి. జగన్‌ కోసం జైలుకెళ్లిన, వైఎస్‌ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డికే భరోసా కల్పించనప్పుడు తమలాంటి వారి పరిస్థితి ఏమిటన్న భావన జిల్లాస్థాయి నాయకుల్లో కలిగితే తప్పేమీ లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముఖంగా కార్యకర్తలు ప్రభుత్వంతో కొట్లాడాలని పిలుపునివ్వడం తప్ప పార్టీ తరఫున ఎటువంటి అండదండలు అందిస్తారో గడిచిన ఎనిమిది నెలలుగా చెప్పడంలేదు. జగన్మోహన్‌రెడ్డికి గడిచిన ఎన్నికల్లో 40 శాతం ఓటుబ్యాంకు ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావచ్చన్న ఆశాభావంతో చాలామంది ఉన్నారు. అటువంటి వారికి విజయసాయిరెడ్డి రాజీనామా పిరికి మందునే అందిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. కాకినాడ పోర్టులో వాటాలను వెంకట్రావు అనే వ్యక్తి నుంచి అరబిందో గ్రూపునకు చెందిన వ్యక్తులు బలవంతంగా రాయించుకున్నారంటూ వచ్చిన కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. అదే సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా ఈ కేసును టేకప్‌ చేసింది. దీంతో మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని భావించిన విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్లు ఇప్పటివరకైతే భావించాలి. ఎందుకంటే.. అరబిందో గ్రూప్‌ చైర్మన్‌ అయోధ్య రామిరెడ్డి కుమారుడు శరత్‌చంద్రారెడ్డికే కాకినాడ పోర్టు వాటాలు కారుచౌకగా అమ్మాల్సి వచ్చిందని వెంకట్రావు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ శరత్‌చంద్రారెడ్డి స్వయాన విజయసాయిరెడ్డికి అల్లుడు. ఇప్పుడు ప్రభుత్వం సీఐడీ విచారణ చేపట్టిన తర్వాత వాటాలను వెనక్కు ఇచ్చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అంటే ఇక్కడ వెంకట్రావు హ్యాపీ. కానీ బలవంతంగా రాయించుకున్నారన్న కోణంలో శరత్‌ చంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తే ముందుగా ఎఫెక్ట్‌ అయ్యేది విజయసాయిరెడ్డే. ఎందుకంటే ఇప్పటికే ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో శరత్‌ చంద్రారెడ్డి అరెస్టయ్యారు. ఆ తర్వాత అప్రూవర్‌గా మారి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ సమయంలో కూడా శరత్‌ చంద్రారెడ్డిని అప్రూవర్‌గా మార్చమని, తద్వారా అప్పటి ఢల్లీి సీఎం కేజ్రీవాల్‌ను లిక్కర్‌ స్కామ్‌లో అరెస్ట్‌ చేయాలని జగన్‌ ద్వారా కేంద్ర పెద్దలు ప్రయత్నించినా అది కుదరకపోవడంతో వేరే మార్గంలో శరత్‌ చంద్రారెడ్డితో కేంద్రం కాంటాక్ట్‌లోకి వెళ్లిందని భోగట్టా. జగన్మోహన్‌రెడ్డికి ఎన్ని ఫేవర్లు చేసినా ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో తన పార్టీలో ఉన్న విజయసాయిరెడ్డి అల్లుడను అప్రూవర్‌గా తేలేకపోయారని బీజేపీ ఎప్పట్నుంచో ఫీలవుతోంది. ఇప్పుడు కాకినాడ పోర్టు వ్యవహారంలో ఇటువంటి సమస్య ఉత్పన్నం కావడంతో విజయసాయిరెడ్డి వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. ఇటీవల మాజీమంత్రి పేర్ని నానికి చెందిన గొడౌన్‌లో ఉండాల్సిన బియ్యం నిల్వలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం కేసు నమోదు నమోదు చేసింది. ఏమేరకు తక్కువ బస్తాలు గుర్తించారో, ఆమేరకు పేర్ని నాని ప్రభుత్వానికి సొమ్ములు చెల్లించేశారు. అదే సమయంలో తన భార్య జయసుధను అరెస్ట్‌ చేయడానికి టీడీపీ నాయకులు గట్టిగా ప్రయత్నించినా చంద్రబాబు ఒప్పుకోలేదని ఓ పాజిటివ్‌ స్టేట్‌మెంట్‌ పేర్ని నాని నుంచి వచ్చింది. అప్పటి వరకు పీడీఎస్‌ రైస్‌, కాకినాడ పోర్టు నుంచి ఎగుమలులు, ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడిన పేర్ని నాని ఆ తర్వాత నుంచి సైలెంట్‌ అయిపోయారు. ఇప్పుడు విజయసాయిరెడ్డిది కూడా అదే పరిస్థితి.

గడిచిన ఎన్నికలకు ముందు వరకు ఉత్తరాంధ్ర రీజనల్‌ ఇన్‌ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇక్కడి నేతలను డమ్మీలను చేసి ఆడిరచారు. ఇక్కడ కాకలు తిరిగిన నాయకులు సైతం వైజాగ్‌ సర్క్యూట్‌ హౌస్‌ ముందో, భీమిలీలో ఆయన గెస్ట్‌హౌస్‌ ముందో చేతులు కట్టుకొని నిలబడేవారు. ఉత్తరాంధ్రలో మంత్రులు ఉన్నా, అప్పటికి ఇబ్బడిముబ్బడిగా ఎమ్మెల్యేలున్నా ఎవరి మాటా చెల్లుబాటు కాకుండా విజయసాయిరెడ్డి ఔనన్నవాడు మంత్రి, కాదన్నవాడు కంత్రీ అన్నట్టు రాచరికం చేస్తూపోయారు. ఆయన అండదండలు చూసుకొని ఉత్తరాంధ్రలో అనేకమంది అనామకులు వైకాపా అధికారంలో ఉన్నన్నాళ్లూ చక్రం తిప్పారు. పక్కనే ఉన్న బొత్స సత్తిబాబును తొక్కేయడానికి శతవిధాల ప్రయత్నించారు. అందుకోసమే జిల్లాలో ధర్మాన ప్రసాదరావును ఎంకరేజ్‌ చేశారు తప్ప వాస్తవానికి ఆయన లెగసీని చూసికాదు. జిల్లాలో ధర్మాన మంత్రిగా ఉన్నా విశాఖలో ఉన్న విజయసాయిరెడ్డి చెబితేనే పనులు జరిగేవి. మొన్నటికి మొన్న ధర్మాన స్తబ్ధత వీడటం కోసం విజయసాయిరెడ్డే జగన్‌ తరఫున మంతనాలకు వచ్చి ఇప్పుడు అదే సాయిరెడ్డి పార్టీని వీడటంతో ధర్మాన కూడా పార్టీని వీడుతారా? అన్న ప్రశ్న శుక్రవారం రాత్రి నుంచి జిల్లాలో తలెత్తుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ధర్మాన ప్రసాదరావే ఓ గ్రూపునాయకుడు. ఆయన ఇంకో గ్రూపులో విజయసాయిరెడ్డి లాంటి వారి కింద ఉండరన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు విజయసాయిరెడ్డే పవన్‌తో వ్యక్తిగత సంబంధాలున్నాయి.. చంద్రబాబు కుటుంబాన్ని ఏరోజూ విమర్శించలేదు.. కేవలం రాజకీయంగా విభేదించాను మాత్రమే.. అమిత్‌షాకు, మోడీకి ధన్యవాదాలు.. అంటూ ట్వీట్‌ చేశారంటే భయం ఏ రేంజ్‌లో ఉందో, భరోసా ఎంత దూరంలో ఉందో అర్థమవుతుంది. జగన్మోహన్‌రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర్నుంచి ఆయనకు కళ్లు, ముక్కు, చెవులుగా వ్యవహరించిన విజయసాయిరెడ్డే తనకు రక్షణ లేదని భావించిన తర్వాత ధర్మాన ప్రసాదరావు లాంటి వారు స్తబ్ధుగా ఉండటం మినహా చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో ఎవరు ఏం చేశారనేది ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత బయటపడుతున్నాయి.

ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ఇప్పటికే వెళ్లిపోయారు. ఇది నాలుగో వికెట్‌. మరో వికెట్‌ అయోధ్య రామిరెడ్డి రూపంలో పడబోతుందని తెలుస్తుంది. కానీ ఆయన ఖండిస్తున్నారు. అది వేరే విషయం. 11 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల్లో చివరకు ఎందరు మిగుల్తారనేది ప్రశ్నే. ప్రలోభాలా? బెదిరింపులా? వైకాపాను మరింత తొక్కి బీజేపీ చొచ్చుకురావడానికి ప్రయత్నమా? అనేది ఇప్పుడు చర్చ కాదు. ఎందుకంటే జగన్మోహన్‌రెడ్డి ముందువరుసలో నిలబడివుంటే ఇటువంటివి జరిగే అవకాశం లేదు. అయితే జగన్‌కు దూరమైనవారిలో సాయిరెడ్డి మొదటివాడు కాదు, చివరివాడూ కాదు. వైఎస్‌కు బాగా సన్నిహితంగా ఉన్న చాలామంది సీనియర్‌ నాయకులు ఆ తర్వాత జగన్‌ వెంట లేరు. జగన్‌ సొంత పార్టీ పెట్టుకున్నాక సన్నిహితంగా ఉన్నవారు కూడా ఇప్పుడు చాలామంది లేరు. అంతెందుకు.. తల్లీ, చెల్లీ కూడా జగన్‌కు దూరంగానే ఉన్నారు. ఏది ఏమైనా జగన్‌కు ఇది పరీక్షా సమయమే? కాంగ్రెస్‌ను ఎదిరించినంత ఈజీ కాదు బీజేపీని ఎదిరించడం. రాజకీయాల్లో ఏదీ అనుకోకుండానో, యాధృచ్చికంగానో చచ్చినా జరగదు. ఒకవేళ అలా జరిగితే, జరిగిందని అనిపిస్తే అలా ప్లాన్‌ చేయబడిరదన్న మాట.. అంటాడు అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి. రూజ్‌వెల్డ్‌. ఇక్కడ జరిగిందీ అదే.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page