అదానీ ముడుపుల మీద జగన్ మాట్లాడకపోతే ఒక అర్థం ఉంది. కానీ, బంపర్ ఆఫర్ లాంటి అవ కాశాన్ని చంద్రబాబు ఎందుకు వదులుకుంటున్నారు? ధర్మాగ్రహంలో రాజీ లేదనే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నట్టు? సౌరవిద్యుత్తు చుట్టూ ఎన్ని చీకట్లు! జగన్ హయాంలో చాయ్, సమోసాల కోసం పెట్టిన ఖర్చు మీదే నానా యాగీ చేస్తున్న తెలుగుదేశం నేతలు, అదానీ - జగన్ వివాదంలో ఎందుకింత సైలెన్స్ పాటిస్తున్నారనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో మొక్కుబడిగా అది కూడా అదానీ ప్రస్తావన లేకుండా చంద్రబాబు చేసిన ప్రకటన తప్ప తెలుగుదేశం నేతల నుంచి పెద్ద సౌండ్ వినిపించడం లేదు. నాయకులు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో మీడియా నిర్దేశించేది కాకపోయినప్పటికీ ఈ అంశంలో తెలుగుదేశం పాటిస్తున్న మౌనం చర్చనీయాంశమవుతోంది. దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ అమెరికాలో కేసు నమోదైంది. అమెరికాలో పెట్టుబడిదారుల నుంచి సేకరించిన డబ్బును భారత్‌లోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చేందుకు వినియోగించారనేది ప్రధాన ఆరోపణ. ఆ లంచాల్లో 80 శాతానికి పైగా అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తికి ఇచ్చినట్టు కూడా అందులో పేర్కొన్నారని ప్రచారం జరిగింది. నిర్దిష్టంగా చెప్పుకుంటే సోలార్ విద్యుత్ ఒప్పందాల కాంట్రాక్టులను దక్కించుకునేందుకు దేశంలోని ఐదు రాష్ట్ర ప్రభుత్వాలకు 2,029 కోట్ల రూపా యలు లంచాలు ఇవ్వగా, ఆంధ్రప్రదేశ్‌లోని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తికి ఒక్కరికే 1,750 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు అమెరికా ప్రాసిక్యూటర్ ఈ కేసుపత్రాల్లో పేర్కొన్నారని కథనాలు వచ్చాయి. ఊరికూరికే చిన్న చిన్న విషయాలకే అగ్గి బుగ్గి అన్నట్టుండే ఆంధ్ర రాజకీయాల్లో ఎంత వివాదం రేగాలి? ఎంత చర్చ రచ్చ ఉంటుందనుకోవాలి? కానీ ఎటు చూసినా సైలెన్సే! తప్పదన్నట్టు అసెంబ్లీలో ముక్తసరిగా మాట్లాడి ముగించిన చంద్రబాబు రెస్పాన్స్ తప్ప, రాష్ట్ర అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేని కాంగ్రెస్ స్పందన తప్ప ముఖ్యమైన పార్టీల నుంచి అంతులేని సైలెన్స్. అదానీ ఎపిసోడ్, అందులోనూ ఆంధ్రతో ఉన్న బంధం గురించి జాతీయ స్థాయి మీడియాలో చర్చ అవుతున్న తరుణాన అసెంబ్లీలో చంద్రబాబు క్లుప్తంగా స్పందిం చారు. అయితే జగన్ మీద ఎప్పుడూ జనరిక్‌గా మాట్లాడే ఆరోపణలకే పెద్దపీట వేసి అదానీ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు. వాస్తవానికి అమెరికా అభియోగాలు ప్రధానంగా అదానీ, ఆయన అసోసియేట్ల మీదే. అమెరికాలో పెట్టుబడులు సేకరించి వాటిని విదేశాల్లో లంచాల కింద వాడారు కాబట్టి ఆ మేరకు తమ పరిధి ఉంటుందంటూ వారిపై పెట్టిన కేసు. మిగిలిన లంచాల వ్యవహారం నిజమైతే ప్రధానంగా తేల్చుకోవాల్సింది ఇక్కడే. ఆ తీగ ఆధారంగా ఇక్కడ జరిగిందంటున్న అవకతవకల మీద, పాత్రధారుల మీద, ఇక్కడ విచారణ జరగాల్సి ఉంటుంది. అలాంటి కేసులో ప్రధానమైన అదానీ పేరును, వారి పాత్రను వదిలేసి చంద్రబాబు కేవలం జగన్ మీద జనరల్‌గా చేసే ఆరోపణల్లాగానే మాట్లాడడం ఆసక్తికరమైన అంశం. గత శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు ఈ విషయంపై చంద్రబాబు మాట్లాడారు. అయితే ఎక్కడా అదానీ పేరు ప్రస్తావించలేదు. కేవలం వైఎస్ జగన్‌పై విమర్శలకే పరిమితమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీకి గౌతమ్ అదానీ అత్యంత దగ్గరి వ్యక్తి. ఇక ఎన్‌డీఏలోనూ చంద్రబాబు ఉన్నారు. నరేంద్ర మోదీతో ఆయన రాజకీయ సావాసం చేస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోనూ టీడీపీ, బీజేపీలు భాగస్వాములు. ఇప్పుడు అదానీ మీద ఆరోపణలు చేస్తే నరేంద్ర మోదీ మీద మాట్లాడినట్లే అనుకోవచ్చు. అందువల్ల చంద్రబాబు నాయుడు అదానీ ఇష్యూ గురించి మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడటం లేదని మనం భావించాలి. ఇంకో కోణంలో ఇప్పుడు చంద్రబాబు పారిశ్రామిక రంగంపై దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలాచోట్ల అదానీ గ్రూప్ పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నుంచి ఈ విషయంపై తీవ్రంగా స్పందన ఆశించలేం. మొత్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిశ్రమల ప్రయో జనాలను కాపాడటానికి, అటు ప్రధాని నరేంద్ర మోదీకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి చంద్రబాబు నాయుడు నామమాత్రంగా స్పందించారని అనుకోవచ్చు. వాస్తవంగా చూస్తే చంద్రబాబు సీరియస్‌గానే స్పందించాలి. ఎందుకంటే ఆ ఆరోపణ చిన్నది కాదు. గత ప్రభుత్వంలోని కీలక అధికారి తీసుకున్నారన్నది నిజమే అయితే అది ప్రజల సొమ్ము.. ఈ విషయమై చంద్రబాబు కేసు కూడా పెట్టొచ్చు. కానీ అదానీకి దెబ్బ తగిలితే భారత ఆర్థిక వ్యవస్థకు దెబ్బ తగిలినట్లుగా భావిస్తున్న బీజేపీతో బాబు కలిసి ఉండటం వల్ల బాబు ‘కట్టె విరగకుండా.. పాము చావకుండా’ అన్న సామెత చందాన మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు వకాల్తా పుచ్చుకునే మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయి. కానీ చంద్రబాబు గట్టిగా మాట్లాడలేని స్థితి లో ఉన్నారు. ఎందుకంటే జగన్ గురించి మాట్లాడితే అదానీ గురించి మాట్లాడినట్టే.. అంటే అది ఫైనల్‌గా నరేంద్ర మోదీ గురించి మాట్లాడినట్టే. ఇది బాబుకు ఇరకాటమే.
top of page
bottom of page
Comments