top of page

సారీ ఠాకూర్‌జీ... మేము రాం!

Writer: NVS PRASADNVS PRASAD
  • నిరసన కార్యక్రమానికి నిరసన సెగ

  • షర్మిల నిర్ణయాలపై జిల్లా కాంగ్రెస్‌ నేతల అలక

  • కాంగ్రెస్‌ పెద్దలు పట్టించుకోపోవడమే కారణం



(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాకూర్‌, సిడబ్ల్యుసి సభ్యుడు గిడుగు రుద్రరాజు, రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌ వలీ స్వయంగా ఉత్తరాంధ్రకు వస్తున్నా స్థానిక కాంగ్రెస్‌ నాయకులు ఈ కార్యక్రమాన్ని బాయ్‌కాట్‌ చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యవహార శైలికి నిరసనగా తమకు నాయకులు కావాలి గాని, సెలబ్రిటీలు వద్దనే సంకేతాన్ని కాంగ్రెస్‌ అధిష్టానానికి పంపడానికి సిద్ధమవుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టడానికి కాంగ్రెస్‌ పెద్దలు ఉమ్మడి ఉత్తరాంధ్రలో గురు, శుక్రవారాల్లో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద గురువారం నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, దీనికి జిల్లాలో కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిలందరూ హాజరుకావాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి ఎవరూ సిద్ధంగా లేనట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. జిల్లా కాంగ్రెస్‌లో గత ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు ఉంటుండగానే షర్మిల సమాంతర వ్యవస్థగా నియోజకవర్గ కోఆర్డినేటర్లను నియమించారు. దీంతో సిట్టింగ్‌ ఇన్‌ఛార్జిలంతా అప్పట్లోనే అసంతృప్తి వెలిబుచ్చారు. అంతేకాకుండా డీసీసీ అధ్యక్షుడిగా అంబటి కృష్ణను నియమించినప్పుడు జిల్లాలో ఎవరి అభిప్రాయాలను కూడా షర్మిల పరిగణనలోకి తీసుకోలేదన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఆ తర్వాత ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌ కేంద్రంగా అనేక రాజకీయాలు నడిచాయి. చివరకు ఒకే పార్టీలో ఉన్న నాయకులు ఒకరి మీద ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకునేవరకు పరిస్థితి దిగజారిపోయింది. వీటిని సరిచేయాలని ఎన్నిసార్లు పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఎన్నికల అనంతరం జిల్లాలో నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాకూర్‌ దృష్టిలో పెట్టాలని ఢల్లీి వెళ్లిన కాంగ్రెస్‌ నేతలకు కనీసం ఆయన అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. చివరకు కేంద్రమంత్రిగా పని చేసి ప్రస్తుతం కాంగ్రెస్‌లో టెక్కలి ఇన్‌ఛార్జిగా ఉన్న డాక్టర్‌ కిల్లి కృపారాణి ఠాకూర్‌కు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా కనీసం లిఫ్ట్‌ చేయలేదన్న ప్రచారం కూడా ఉంది. ఇటువంటి వాతావరణంలో ఉత్తరాంధ్రలో నిరసన కార్యక్రమం చేపట్టడానికి వస్తున్న కాంగ్రెస్‌ పెద్దల బృందానికి అసమ్మతి సెగ ఎలా ఉంటుందో చూపించాలని ఇక్కడి ఇన్‌ఛార్జిలు భావిస్తున్నారు. పాతపట్నం నుంచి కొప్పురోతు వెంకటరావు, టెక్కలి నుంచి డాక్టర్‌ కిల్లి కృపారాణి, ఆమదాలవలస నుంచి సనపల అన్నాజీరావు, నరసన్నపేట నుంచి మంత్రి నర్సింహారావు, ఎచ్చెర్ల నుంచి కరిమజ్జి మల్లేశ్వరరావు, పార్లమెంట్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి పేడాడ పరమేశ్వరరావు, కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు కోత మధుసూదనరావు, దళిత విభాగం అధ్యక్షుడు చింతాడ దిలీప్‌ లాంటి కాంగ్రెస్‌లో పదవులున్న నేతలెవరూ మాణిక్యం ఠాకూర్‌ కార్యక్రమానికి వెళ్లడంలేదని తెలిసింది. ఇచ్ఛాపురం ఇన్‌ఛార్జి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. గడిచిన ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల ఖర్చుల కోసం ఎక్కడా రూపాయి ఇవ్వలేదని, కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు గతంలో కంటే పెరిగిందని చెప్పుకోడానికైనా పోల్‌మేనేజ్‌మెంట్‌ చేయడానికి సొమ్ములు లేకపోవడంతో బలహీనంగా ఉందన్న సంకేతం వెళ్లడానికి కారణం షర్మిలేనని వీరు భావిస్తున్నారు. ప్రస్తుతం షర్మిల వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నది శ్రీకాకుళం కాంగ్రెస్‌ నేతలు మాత్రమే కాదని తెలుస్తుంది. విజయనగరం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కె.రమేష్‌, విశాఖపట్నం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వజ్రపతి శ్రీను, అనకాపల్లి డీసీసీ అధ్యక్షుడు బొడ్డు శ్రీనులు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల హాజరవుతున్నారు. కానీ విజయనగరం, శ్రీకాకుళం సమావేశాలకు ఆమె రావడంలేదని తెలిసింది. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం అసమ్మతి సెగ ఎక్కువగా ఉందన్న విషయం ఆమెకు తెలుసు. పీసీసీ అధ్యక్షురాలిని మార్చాలని మొదట డిమాండ్‌ చేసింది జిల్లా కాంగ్రెస్‌ నేతలే. ఎన్నికలు జరిగిన ఆరు నెలల తర్వాత ఆమె వ్యవహార శైలిపై మిగిలినవారికి అసంతృప్తి పెరిగింది కానీ డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక దగ్గర్నుంచి షర్మిలపై ఏఐసీసీకి ఇక్కడి నుంచి ఫిర్యాదులు వెళ్తునే ఉన్నాయి. తమ వినతులు వినడానికి కూడా సమయం కేటాయించని మాణిక్యం ఠాకూర్‌ ఇప్పుడు జిల్లాకు వస్తే ఎందుకు వెళ్లాలనే భావనలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా నిరసన కార్యక్రమాన్ని వేరేగా చేపట్టి ఇందిర విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించనున్న కాంగ్రెస్‌ నాయకుల సమావేశానికి మాత్రం గైర్హాజరు కావాలని వీరు భావిస్తున్నారు.

コメント


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page