సిరిమానుకు అండగాస్వయం సేవకుడిగా!
- Prasad Satyam
- Jun 11
- 2 min read
అమ్మవారి జాతరలో ఎమ్మెల్యే గొండు విశేష సేవలు
అన్నింటా తానే ముందుండి నడిపించిన వైనం
ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సజావుగా సిరిమాను యాత్ర
విద్యుత్తు, పోలీసు యంత్రాంగం పనితీరు ప్రశంసనీయం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
మంగళవారం మధ్యాహ్నం.. సమయం 3.30 గంటలు..
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాతశ్రీకాకుళం అమ్మవారి పండుగల ఊరేగింపు సందర్భంగా ఘటం మోసి, స్థానికులకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వేరే కార్యక్రమానికి వెళ్లిపోయారు.
అంతవరకు అతని పక్కనే ఉన్న స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అక్కడి నుంచి తన పని మొదలుపెట్టారు. తనే ఒక ఎలక్ట్రీషియన్ అయ్యారు.. తనే ఒక రోప్ పార్టీ కానిస్టేబుల్ అయ్యారు.. తనే కొత్తపేటలో ఒక టీడీపీ కార్యకర్త ఇంటికి అతిథిగా వెళ్లారు.
హోదాను, స్థాయిని పక్కన పెట్టి ప్రజలతో మమేకమైతే ఫలితం ఎలా ఉంటుందో పదేళ్ల తర్వాత జరిగిన పాతశ్రీకాకుళం అమ్మవారి పండగలు నిరూపించాయి. ఇలా చేస్తే మరోసారి ఎమ్మెల్యే అయిపోతారా? అంటే.. దానిపై చర్చించే సందర్భం కాదిది. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేత ఓటు బ్యాంకు రాజకీయం మాత్రమే చేయొచ్చు. అలా అయితే కచ్చితంగా గెలుస్తారు. కానీ సామాన్యుడిలా సమూహంలో కలిసిపోయి అందరిలో తానూ ఒకడిని అన్నట్లు వ్యవహరించడంపైనే ఈ కథనం.
విద్యుత్ లైన్ల మార్పు
అమ్మవారి పండుగలు పెద్ద ఎత్తున జరుపుతామని నిర్వాహకులు ప్రకటించిన వెంటనే లోకల్ ఎమ్మెల్యేగా గొండు శంకర్ అప్రమత్తమయ్యారు. ఉత్సవాల్లో భాగంగా 32 అడుగుల పొడువు ఉండే సిరిమానులను పాతశ్రీకాకుళంలోని ఇరుకు రోడ్లలో ఊరేగిస్తే ఇబ్బందు ఎదురవుతాయని గ్రహించిన ఎమ్మెల్యే మొదటిగా విద్యుత్ శాఖపై దృష్టి సారించారు. విద్యుత్ స్తంభాల ఏర్పాటు, కొన్నింటి ఎత్తు పెంపు, కొన్నిచోట్ల స్థలం మార్పు వంటి సూచనలు చేశారు. ప్రస్తుతం వీధుల్లో ఉన్న కరెంటు స్తంభాల కంటే పొడవైన స్తంభాలు వేసి, పైన క్లాంప్ బిగించి విద్యుత్ సర్వీస్ లైన్లను మార్పించారు. ఈ చర్యల వల్ల ఎక్కడా విద్యుత్ వైర్లు తెగిపోయే సమస్య ఉత్పన్నం కాలేదు. అయితే ఆ పైనుంచి హెచ్‌టీ లైన్స్ వెళ్లడం వల్ల సహజంగానే ముందు జాగ్రత్తగా ఈపీడీసీఎల్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయితే సిరిమాను వెళ్లిపోయిన ప్రాంతాలకు వెంట వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి ఎమ్మెల్యే శంకర్ చొరవ తీసుకున్నారు. విద్యుత్ శాఖ డీఈ, ఏఈ, లైన్‌మెన్‌లను తనే వెంటబెట్టుకుని తిరుగుతూ లైన్ ఆన్ చేయించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద హరిజన వీధిలో ఊరేగింపు జరిగినప్పుడు విద్యుత్ వైర్ల సమస్య తలెత్తకపోయినా కేబుల్ టీవీ, ఇంటర్నెట్ వైర్లు అడ్డు తగిలాయి. వీటిని తొలగించాలని విద్యుత్ సర్వీస్ వైర్లు మార్చినప్పుడే స్థానిక కేబుల్ ఆపరేటర్లకు అధికారులు, నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. కానీ చాలా ప్రాంతాల్లో వారు స్పందించలేదు. దీంతో ఇరుకుగా ఉండే హరిజన వీధిలో ప్రాంతంలో ఊరేగింపు సాగడం కష్టమైంది. ఆలస్యం కూడా అక్కడే అయింది. దీంతో కేబుల్ వైర్లను కట్ చేసి పడేశారు. అడ్డొచ్చిన ప్రతిచోటా కేబుళ్లను విద్యుత్ సిబ్బందే కట్ చేసి పక్కన పడేశారు.
ట్రాఫిక్ నియంత్రణలో సక్సెస్

పదేళ్ల క్రితం.. అంటే 2015లో జరిగిన ఉత్సవాల్లో సిరిమాను ఒకవైపు వెళ్లడానికే రాత్రి 11 గంటలు అయ్యింది. తిరిగి వెనక్కు వెళ్లే సమయం రాత్రి ఒంటిగంట. కానీ ఈసారి 10.30 గంటలకే మొత్తం ఉత్సవం ముగిసిపోయింది. దీనికి ప్రధాన కారణం పోలీసుల ముందుజాగ్రత్త చర్యలే. మధ్యలో ఎక్కడా ఊరేగింపు నిలిచిపోకుండా రోప్‌పార్టీని పెట్టి ముందుకు నడిపించారు. దూరప్రాంతాల నుంచి వచ్చినవారిని పొట్టిశ్రీరాములు జంక్షన్ నుంచే అడ్డుకుని వెనక్కి పంపడం ఇబ్బంది కలిగించినా.. ఈ నిర్ణయం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సిరిమాను ఊరేగింపు సజావుగా, త్వరగా ముగిసింది. పాతబస్టాండు, మేదరవీధి, మొండేటివీధి, మంగువారితోట, కంపోస్టు కాలనీ లాంటి ప్రాంతాల మీదుగా పాతశ్రీకాకుళం చేరుకోవాల్సి ఉండటంతో చాలామంది కార్లను ఇళ్లలోనే వదిలేసి ద్విచక్ర వాహనాలపై దూరప్రాంతాల నుంచి వచ్చారు. దీనివల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగలేదు. డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ట్రాఫిక్ సిబ్బంది, శాంతి భద్రతలు చూసే పోలీసులు ప్రతి జంక్షన్‌లోనూ మోహరించడం వల్ల అడ్డదారుల్లో వచ్చే ప్రయత్నం ఎవరూ చేయలేకపోయారు. దీంతో సిరిమాను ఎంత తొందరగా వచ్చిందో, అంత తొందరగా వెళ్లిపోయింది.
ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షం
ఒకటి రెండుచోట్ల ఇబ్బందులు తలెత్తితే, ఆ పరిసరాల్లోనే ఉన్న ఎమ్మెల్యే గొండు శంకర్ వెంటనే అక్కడకు చేరుకొని క్లియర్ చేయడం కనిపించింది. ఉత్సవాలకు కొద్ది రోజుల ముందే కుందనంపేట వంటి సందుల్లో రోడ్డుకు, కాలువకు మధ్యనున్న ప్రాంతాన్ని కూడా సిమెంట్‌తో కప్పి రోడ్డు వెడల్పయ్యేలా చేశారు. అన్నిటికీ మించి మంగళవారం సిరిమానోత్సవం, తర్వాత బుధవారం చాలామంది భోజనాలు పెట్టుకోవడం వల్ల పెద్ద సమస్యలేవీ తలెత్తలేదు. ఎక్కడా సర్వీస్ వైర్లను కర్రలతో పైకెత్తి ఊరేగింపును కొనసాగించడం, ఈలోగా సర్వీస్ వైర్లు తెగిపోవడం వంటివి చోటుచేసుకోపోవడం వల్ల సిరిమాను చకచకా కదిలిపోయింది. ఉత్సవం పూర్తయ్యే వరకు ఉన్న ఎమ్మెల్యే ఆ తర్వాత విద్యుత్ సిబ్బందితో వీధిలోనే సమావేశమై పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో ఇంటింటికీ వెళ్లి పండగ ఏర్పాట్ల మీద అసంతృప్తి ఉంటే చెప్పాలని, తప్పులుంటే దిద్దుకుంటామని కోరారు. వచ్చే ఏడాది అరసవల్లిలో కూడా పండగలు జరుగుతున్నందున పాతశ్రీకాకుళంలో లోపాలు చెబితే, అరసవల్లికి సరిదిద్దుకుంటామని ప్రజలను ఎమ్మెల్యే కోరడం కొసమెరుపు.










Comments