top of page

సెలవుల్లో సోదాలు.. సంబంధం లేనివారికి వార్నింగ్‌లు

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • కొందరు నిర్వాహకులపై బైండోవర్‌

  • ఒడిశా పోలీస్‌ను అప్రమత్తం చేసిన ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి

  • గుసానిలో స్పాట్‌ పెట్టేందుకు సన్నాహాలు

  • పూరీ వైపు పయనించనున్న పేకతుపాను



(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

గారబందలో పేకాట శిబిరాలను నెలల తరబడి నిర్వహించినన్ని రోజులు విడిచిపెట్టి సంక్రాంతికి తాత్కాలికంగా సెలవు ప్రకటించిన తర్వాత మెళియాపుట్టి పోలీసులు హడావుడి చేయడంపై సర్వతా విమర్శలు వినిపిస్తున్నాయి. పాతపట్నం, మెళియాపుట్టి మీదుగా ఒడిశాలోని గారబందకు కార్లలో పేకాటరాయుళ్లు వెళ్లడానికి రాచబాట వేసిన పోలీసులు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రత్యక్షం కావడం పట్ల తీవ్ర చర్చ సాగుతోంది. గారబంద వెళ్లిన మెళియాపుట్టి పోలీసులు ఒడిశా పోలీసులను సంప్రదించి పేకాట శిబిరాల నిర్వహణపై చర్చించినట్టు తెలిసింది. పేకాట నిర్వాహకులతో సత్సంబంధాలు కలిగిన కొందరు పోలీసులు జిల్లా పోలీస్‌ బాస్‌ హెచ్చరించినా చూసీచూడనట్టు విడిచిపెట్టేశారు. జిల్లా నుంచి వెళ్లి ఒడిశాలో పేకాట నిర్వహించడం, పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తుండడంతో రాష్ట్రస్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో మెళియాపుట్టి పోలీసులు సంక్రాంతి తర్వాత రోజు గారబందలో హడావుడి చేశారని తెలిసింది. అప్పటికే మూడు రోజుల ముందు నుంచీ సంక్రాంతి కారణంగా పేకాట శిబిరాన్ని నిర్వాహకులు నిలిపేశారు. ఎవరూ లేని సమయంలో మెళియాపుట్టి పోలీసులు వెళ్లి ఖాళీ చేతులతో వెనక్కి వచ్చారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఒడిశాలో పేకాట శిబిరాన్ని నిర్వహించడంలో కీలక భూమిక పోషిస్తున్న బెండి తులసి, గోపీలను సంక్రాంతి ముందురోజు పోలీసులు కబురుపెట్టారని తెలిసింది. తులసిని ఆమదాలవలస పోలీసులు, గోపిని మెళియాపుట్టి పోలీసులు పిలిపించి ఇద్దరిని బైండోవర్‌ చేశారు. బెండి తులసిని వరుసుగా రెండు రోజులు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారట. పేకాట శిబిరం నిర్వహించడంలో వీరితో పాటు ఉన్న పార్ట్‌నర్స్‌ను పోలీసులు విడిచిపెట్టేశారని చెప్పుకుంటున్నారు.

 పేకాట శిబిరం నిర్వహణపై పోలీసులు దృష్టి

తులసి, గోపీలను బైండోవర్‌ చేసిన తర్వాత గారబందలో పేకాట శిబిరం నిర్వహణపై పోలీసులు దృష్టి పెట్టారు. ఒడిశాలో పేకాటను దర్జాగా నిర్వహించడానికి అక్కడ జిల్లా పోలీసు ఉన్నతాధికారి మంత్లీలు తీసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. ఆయన జిల్లా అధికారిగా కొనసాగినన్నాళ్లు పేకాట నిర్వహించడానికి ఎటువంటి ఆటంకం ఉండదని తులసి, గోపీ అండ్‌ బ్యాచ్‌ ధీమాగా ఉన్నారు. రాష్ట్రస్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు జిల్లా సరిహద్దు ఒడిశా గ్రామాల్లో పేకాట శిబిరాల నిర్వహణపై దృష్టి సారించి అక్కడ పోలీసు బాస్‌లతో సంప్రదించినట్టు తెలిసింది. తులసి, గోపీలపై పోలీసులు బైండోవర్‌ చేసిన తర్వాత గారబందలో పేకాట శిబిరాల నిర్వహణకు పర్లాకిమిడికి చెందిన కిరణ్‌ ద్వారా నాలుగు రోజులుగా సంప్రదింపులు చేస్తున్నట్లు వినికిడి. స్థానిక ఒడిశా పోలీసుల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంలోనే విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో పేకాట శిబిరాలను నిర్వహించడానికి అనుకూలమైన ప్రాంతాల కోసం వెతుకుతున్నారని తెలిసింది. మరోవైపు తులసి, గోపీలు తమకు పరిచయమున్న పోలీసులతో సంప్రదించినా వారు అంగీకరించకపోవడంతో జిల్లా సరిహద్దుల నుంచి పూరీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. గతంలో పేకాట శిబిరాలు నిర్వహించిన అనుభవంతో ఒడిశా ఛత్రపూర్‌ వద్ద ఉన్న బలుగాంకు మకాం మార్చాలని ఆలోచన చేస్తున్నట్టు భోగట్టా. గోపి ఒక అడుగు ముందుకు వేసి జిల్లా సరిహద్దులో ఉన్న ఒడిశా గ్రామం గుసానిలో పేకాట శిబిరం ఏర్పాటుకు రెండు రోజులుగా అక్కడ నిర్వాహకులతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. గుసానిలో పరిమిత సంఖ్యలో కేవలం సమ (పేకాట) మాత్రమే నిర్వహిస్తుంటారు. పలాస నుంచి వెళ్లి ఇక్కడ పేకాట ఆడుతుంటారు. దీన్ని పేకాట (సూట్‌) శిబిరంగా మార్చడానికి స్థానికులకు గోపి డబ్బులు ఆశ చూపించినట్టు తెలిసింది. అయితే ఒడిశాలో పేకాట శిబిరాలను నిర్వహిస్తున్న తులసి, గోపీలతో విశాఖపట్నంకు చెందిన కొందరు వాటాదారులుగా ఉన్నారని తెలిసింది.

ఫకీర్‌ సైడ్‌ వ్యాపారం క్రికెట్‌ బెట్టింగ్‌

నరసన్నపేటలో పేకాటలో సర్వం కోల్పోయినవారు ఉన్నారు, కోట్లు కూడబెట్టినవారూ ఉన్నారు. ఒడిశా పేకాట శిబిరం నిర్వాహకులు తులసి, గోపీతో కలిసి నిర్వహిస్తున్న వారిని కాకుండా ఆట వదిలేసిన వారికి కబురుపెట్టి పోలీసులు వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలిసింది. పేకాటే ప్రవృత్తిగా కోట్లు కూడబెట్టినవారిని విడిచిపెట్టి పేకాట నిర్వాహకులతో సంబంధం లేనివారిపై బైండోవర్‌ చేస్తామని కొందరిని నరసన్నపేట పోలీసులు బెదిరించినట్టు తెలిసింది. పేకాట నిర్వాహకులతో సంబంధం ఉన్న ఫకీర్‌కు సైడ్‌ వ్యాపారం క్రికెట్‌ బెట్టింగ్‌. గతంలో నేరుగా బెట్టింగ్‌ నడిపిన ఫకీర్‌ ప్రస్తుతం కమీషన్‌ బేసిస్‌పై నడుపుతున్నాడు. బెట్టింగ్‌లో గెలిస్తే ఒకలా, ఓడితే మరోలా వ్యవహరిస్తాడని ప్రచారం ఉంది. ఓడితే బెట్టింగ్‌ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం వల్ల బెట్టింగ్‌ మార్కెట్‌లో నమ్మకం కోల్పోయాడని ప్రచారం సాగుతుంది. దీంతో పాటు బెట్టింగ్‌లో ఫకీర్‌ వ్యవహారంపై పత్రికల్లో కథనాలు రావడంతో నేరుగా బెట్టింగ్‌ నిర్వహించకుండా కమీషన్‌ తీసుకొని లైన్‌ ఇస్తున్నట్టు నరసన్నపేటలో చర్చ సాగుతుంది. బెట్టింగ్‌ కాల్స్‌ను విశాఖలోని బెట్టింగ్‌ ముఠాకు డైవర్ట్‌ చేసి వారి నుంచి కమీషన్‌ తీసుకుంటున్నట్టు ప్రచారం ఉంది. ఇటీవల విశాఖలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తూ పోలీసులుకు 10మంది చిక్కారు. ఆ గ్రూపుతో శ్రీకాకుళంలో ఉన్న బెట్టింగ్‌రాయుళ్లకు సంబంధాలు ఉన్నాయని ప్రచారం సాగుతుంది. ఈ బెట్టింగ్‌ ముఠాతో ఎవరెవరితో సంబంధం ఉందో తెలుసుకొనే పనిలో విశాఖ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page