top of page

స్వదేశంలో చదవకపోవడం దేశద్రోహమే!

Writer: ADMINADMIN
  • ఏటికేడాది పెరిగిపోతున్న విదేశీ విద్య ఖర్చులు

  • తీసుకున్న రుణాల చెల్లించలేక విలవిల్లాడుతున్న విద్యార్థులు

  • ఆ మేరకు మనకు జరుగుతోన్న ఆర్థిక నష్టం ఎక్కువే

` దుప్పల రవికుమార్‌

మామూలుగా అయితే విదేశాల్లో, నిర్దిష్టంగా మాట్లాడితే అమెరికా, ఇంగ్లండు దేశాల్లో చదువుకోవడానికి మన దేశ విద్యార్థులు ఎక్కువ మంది చేరుతున్నట్టు రాయబార కార్యాలయాల గణాంకాలు చెప్తున్నాయి. ఒకవైపు ఆ దేశాల్లో చదువు ధర ఏటికేడాది పెరిగిపోతుండడంతో భారత విద్యార్థులు ఆ చదువులకు బ్యాంకుల నుంచి, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఆ దేశాల్లో పెరిగిపోతున్న గ్రాడ్యుయేట్ల వలన ఎవరికీ సరైన ఉద్యోగావకాశాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. 2022`23 విద్యా సంవత్సరానికి కేవలం అమెరికాలో చదువుకోవడానికి భారతదేశం నుంచి సుమారు 1,98,000 మంది విద్యార్థులు బయల్దేరి వెళ్లారు. ఆ దేశంలో ఇప్పటిదాకా స్టూడెంట్‌ వర్క్‌ వీసాలు పొంది ఉన్న మొత్తం విద్యార్థులకు ఇది మూడు రెట్లు. ఇక్కడి నుంచి అమెరికా చదువుకోవడానికి వెళ్తున్న భారతీయులకు నలుగురిలో ఒకరికి ఉద్యోగం దొరకడం కష్టమని తెలుస్తోంది. అమెరికాలో గొప్ప విశ్వవిద్యాలయాలలో మంచి పేరు సంపాదించిన స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, లెక్కలు) కోర్సులలో డిగ్రీలు చదివిన వారి పరిస్థితి కూడా ఇలానే ఉంది.

ఈ విద్యాసంవత్సరం నుంచి అమెరికాలో చదివి, అక్కడే ఉద్యోగం సంపాదించాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు గడ్డు పరిస్థితులు ఎదురవబోతున్నాయని విద్యారంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు కుదేలయి దిగజారిపోతుండడం, మరోవైపు విదేశీ విద్యార్థులు తమ కలల ప్రపంచమైన అమెరికా చేరుకుని ఉన్నత విద్య పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎగబడడం అమాంతం పెరిగిపోవడం దీనికి ముఖ్య కారణాలుగా కనిపిస్తున్నాయి. చాలా అమెరికన్‌ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు, ఐవీ లీగ్‌ పాఠశాలలు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయి. వాటి బడ్జెట్‌లో భారీ కోతలు పడడంతో ఖర్చులు తగ్గించుకోవలసి వస్తోంది. దానితో అధ్యాపకులను, ఇతర సిబ్బందిని తొలగిస్తున్నారు. మరోవైపు వారికి ఏకైక ఆదాయ వనరుగా విద్యార్థుల ఫీజులే కనిపిస్తున్నాయి. దాంతో విదేశీ విద్యార్థుల ఫీజులను ఏటికేడాది భారీగా పెంచుకుంటూ పోతున్నారు. దీంతోపాటు ఆయా సంస్థలు కొత్త పేర్లతో వినూత్నమైన కోర్సులను డిజైన్‌ చేసి విద్యార్థులను ఒక విధంగా దగా చేస్తున్నాయి. ముఖ్యంగా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో వారందిస్తున్న చాలా నూతన కోర్సులకు ఉపాధి అవకాశాలు పూర్తిగా కనిపించడం లేదు. వాటి నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉందన్న ఫిర్యాదులు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.

కుడి ఎడమల దగా! చదువుల దగా!

విద్యాసంస్థలు తమ ప్రమాణాలు తగ్గించుకుని, మాస్టర్స్‌ డిగ్రీ కోర్సుల్లో ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్స్‌, డేటా అనలిటిక్స్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, స్టెమ్‌ కోర్సులలో మునుపెన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. కొన్ని పేరున్న విశ్వవిద్యాలయాలు సైతం తమ సాధారణ ఇన్‌టేక్‌ కంటే నాల్గింతలు ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను నమోదు చేస్తున్నాయి. విదేశీ విద్యార్థులకు స్టెమ్‌ కోర్సులైతే మూడేళ్ల పరిమితితో ఉంటాయి కాబట్టి. తమ ప్రాక్టికల్‌ శిక్షణ వర్క్‌ వీసాకు సరిగా సరిపోతుందని భావించి ఆ కోర్సుల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇలాంటి కోర్సుల్లో చేరడానికి పెరిగిన ఫీజుల దృష్ట్యా విద్యార్థులు బ్యాంకుల నుంచి ఎడాపెడా రుణాలు వాడేస్తున్నారు. బ్యాంకులు విదేశీ విద్య అనగానే తగిన గ్యారంటీలు తీసుకుని ఎంత కావాలంటే అంత డబ్బులు అప్పుగా ఇచ్చేస్తోంది. విద్యార్థులకు ఉద్యోగం వస్తే కథ సాఫీగానే సాగుతుంది, లేదంటే వారికి తిప్పలు తప్పడం లేదు. వారి విద్యారుణం బ్యాంకులకు తీర్చడానికి చిన్నా చితకా ఉద్యోగాలు చేసి, వచ్చే బొటాబొటి డబ్బులతో వారి మనుగడకే ఇబ్బందిగా ఉన్నప్పుడు, ప్రతి నెలా నెలసరి రుణ వాయిదాలు చెల్లించలేరు. తప్పనిసరిగా మంచి జీతం ఉన్న ఉద్యోగాలు వెతుక్కోవలసిందే. ఇలా తీసుకున్న రుణాలకు సాధారణంగా స్వదేశంలో తల్లిదండ్రులు నివశిస్తున్న ఇళ్లను గ్యారంటీగా చూపిస్తారు. ఉద్యోగం రావడం ఆలస్యమైతే, బ్యాంకులు ఆ ఇంటిమీద పడుతున్నాయి. మరికొన్ని విశ్వవిద్యాలయాలు విద్యార్థులను ఆకట్టుకోవడానికి 10 నుంచి 20 శాతం ఫీజు రాయితీలు ప్రకటిస్తాయి. ఆ ఉపకార వేతనం పోను మిగిలిన ఫీజుకు బ్యాంకు రుణాలు తీసుకున్న విద్యార్థులదీ అదే కథ.

వచ్చిన ఉద్యోగం కూడా ఎన్నాళ్లుంటుందో చెప్పడం కష్టతరమే. 2022, 2023 సంవత్సరాల్లో తాత్కాలిక వర్క్‌ వీసాల మీద పని చేస్తూ శాశ్వత నివాస కార్డులు లేదా గ్రీన్‌ కార్డుల కోసం నిరీక్షిస్తున్న వారిలో సుమారు లక్షన్నర మందిని సరైన కారణం చూపకుండానే ఉద్యోగాల నుంచి తొలగించి ఇంటికి పంపేసాయి చాలా అమెరికన్‌ టెక్‌ కంపెనీలు. ఇలా ఒకటి రెండేళ్లకే మళ్లీ నిరుద్యోగులుగా మారిపోతున్న వారి సంఖ్య ఇప్పుడు భారీగా పెరిగిపోతోంది. వీరెవ్వరికీ హెచ్‌ వన్‌బి వీసాలు లభించడం లేదు. హెచ్‌ వన్‌బి వీసాలు ఉన్నవారిలో కొన్ని వేలమందికి ఇంకా గ్రీన్‌ కార్డులు ఇవ్వడం లేదు. వర్క్‌ వీసా పోతే అమెరికాలో ఉండడానికి కుదరదు. వెంటనే వారు తిరుగు ప్రయాణం కట్టేయాల్సిందే. ఈ సంఖ్యను అమెరికా ప్రభుత్వం తన నిరుద్యోగ ఖాతాలో చూపించదు. కొన్ని టెక్‌ కంపెనీలు ప్రతిఏటా ప్రభుత్వాన్ని గ్రీన్‌ కార్డులను, వర్క్‌ వీసాలను పెంచమని అభ్యర్థిస్తూనే ఉంటాయి. కాని, అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, ఆర్థిక పరిస్థితుల వల్ల వీసాల జారీకి తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ విధంగా అమెరికన్‌ టెక్‌ కంపెనీలు భారతీయ ఇంజనీర్లకు ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలిచ్చి, వర్క్‌ వీసా ముగిసిందని ఇంటికి పంపించేసి, వారి జీవితాలతో ఆడుకుంటున్నాయని అనుమానించాల్సి వస్తోంది. ఈ పరిస్థితులు ఇంగ్లండులో ఇంకా దారుణంగా ఉన్నాయి. ఇకానమిక్‌ పోలసీ సంస్థ అందించిన ఒక నివేదికను చూస్తే మన అనుమానం నిజమేనని తేలుతుంది. ప్రముఖ హెచ్‌ వన్‌బి 30 కంపెనీలు 2022లో 34 వేల మందికి ఉద్యోగాలు కల్పించాయి. వీసా ముగిసిందన్న నెపంతో 2023లో అవే కంపెనీలు 85వేల మంది ఉద్యోగులను పక్కన పెట్టేశాయి.

అగ్ర రాజ్యాల కంటే ఇతర చిన్న దేశాలు నయం

విదేశీ విద్యార్థులకు ఉద్యోగ కల్పన విషయంలో ఈ రెండు అగ్ర రాజ్యాలలోనూ పరిస్థితి ఒకే విధంగా ఉన్నప్పటికీ, ఇంగ్లండులో విద్య పూర్తి చేసుకున్నాక రెండేళ్లు అక్కడ పనిచేయవచ్చన్న నిబంధన గుడ్డిలో మెల్లగా ఆదుకుంటోంది. ఇక విశ్వవిద్యాలయాల ఆర్థిక పరిస్థితులు మాత్రం రెండు దేశాల్లోనూ ఒకే మాదిరిగా ఉన్నాయి. విదేశాలలో చదువుకుంటే ప్రపంచంలో ఏ మూలైనా ఉపాధి దొరుకుతుందన్న విద్యార్థుల ఆశలతో దాదాపు ఈ రెండు అగ్రరాజ్యాలు ఆటలాడుకుంటున్నట్టే కనిపిస్తోంది. ఈ రెండు దేశాలతో పోల్చుకుంటే కిందటేడాది వరకూ కెనడాలో పరిస్థితులు కొంత మెరుగ్గా ఉండేవి. ఫీజులు కాస్త తక్కువగా ఉండడం, వారానికి 20 గంటలు వర్క్‌ పర్మిట్‌తో సంబంధం లేకుండా పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకునే అవకాశం, తొందరగా వర్క్‌ వీసా దొరకడం, ఐదేళ్లకే శాశ్వత నివాస కార్డు లభించడం కెనడాకు ప్రత్యేకం. ఈ కారణం వల్లనే 2023 నాటికి సుమారుగా 3.20 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసించడానికి ఈ దేశానికి చేరారు. అయితే ఇప్పుడు కెనడాలోనూ ఇదే గడ్డు పరిస్థితి. దీనికి కారణం గత ఏడాది మన దేశంలోని కెనడా రాయబార కార్యాలయం నుంచి 41 మంది కెనడియన్‌ అధికారులు మాతృదేశానికి చేరుకోవడమే. వీరు మొత్తం ఉద్యోగులలో మూడిరట రెండో వంతు. చాలా ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నవారే. గత జూన్‌లో హరదీప్‌ సింగ్‌ నిజ్జార్‌ అనే కెనడా పౌరుడిని భారత అధికారులు బ్రిటిష్‌ కొలంబియాలో హత్య చేశారని కెనడా ఆరోపించింది. దీంతో భారత్‌, కెనడా సంబంధాలు ఒక్కసారిగా బెడిసికొట్టాయి.

దీనికి విరుగుడు ఒక్కటే. ఐఐటి, ఎన్‌ఐటి, ట్రిపుల్‌ ఐటి లాంటి అగ్రగామి విద్యాసంస్థల్లో చేరిన భారతీయ విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా టెక్‌ కంపెనీలు నీరాజనాలు పడుతున్నాయి. మన విద్యార్థులకు అనేక దేశాలలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. వారు ఇక్కడ కొన్నాళ్లు పనిచేసి, అనుభవం సంపాదించాక విదేశాలకు వెళ్లినపుడు ఉద్యోగాలు పోతాయన్న బెంగ అంతగా ఉండదు. దీనివల్ల లక్షలాది రూపాయలు బ్యాంకు రుణాలు తీసుకుని విదేశాలకు చెల్లించి, ఉద్యోగాలు వస్తాయో లేదోనన్న బెంగతో బతకనవసరం లేదు. వాషింగ్టన్‌ డిసికి చెందిన కాటో సంస్థ చెప్పిన అంచనా ప్రకారం అమెరికాలో ప్రస్తుతం చదువుతున్న, చదువులు పూర్తి చేసిన నాలుగు మిలియన్ల భారతీయులకు వారు చనిపోయే లోపు గ్రీన్‌ కార్డు వచ్చే అవకాశం లేనట్టేనట. తస్మాత్‌ జాగ్రత్త!

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page