top of page

స్వపక్షమే విపక్షంలా..!

Writer: ADMINADMIN
  • `ఇప్పటికీ టికెట్‌పై ఆశతోనే గుండ వర్గం

  • `నేడూ రేపూ నిర్ణయం వస్తుందంటూ కాలక్షేపం

  • `నియోజకవర్గంలో పార్టీ ప్రచారానికీ దూరం

  • `శంకర్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ప్రచారం

  • `ఎటూ తేల్చుకోలేక టీడీపీ క్యాడర్‌ సతమతం


‘నా నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని విమర్శించే అవకాశం కూడా నాకు ఇవ్వడంలేదు. టీడీపీ పార్టీలోని ప్రత్యర్థులే ఆ పని చేసేస్తున్నారు. టికెట్‌ ఎవరిదో తెలియక ఆ పార్టీ నేతలు గందరగోళంలో ఉన్నారు. నేను మళ్లీ ఇక్కడి నుంచి గెలుస్తున్నాను.’

.. ఇవీ శుక్రవారం ఆనందమయి కల్యాణ మండపంలో జరిగిన వైకాపా విస్తృతస్థాయి సమావేశంలో రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు.

గెలుపోటముల విషయం పక్కన పెడితే.. శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్‌కు ప్రత్యర్థి వైకాపా కంటే సొంత పార్టీ నుంచే ఎక్కువ కీడు జరిగేలా కనిపిస్తోంది. తనకు టికెట్‌ ప్రకటించక ముందు నుంచే ప్రచారంలో దూసుకుపోతున్న గొండు శంకర్‌కు బ్రేకులంటూ పడితే అది అధికారపక్షం నుంచి కాకుండా సొంత పార్టీ నుంచి కావడం గమనార్హం.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఇప్పటికీ శ్రీకాకుళం టిక్కెట్‌ తమకు వస్తుందన్న భావనతో గుండ దంపతులు ఉన్నారు. ఇది దాదాపు అసాధ్యం అని తేలుతున్న ప్రతిసారీ ఆ పార్టీ అధిష్టానం నుంచి ఏదో ఒక రూపంలో వారికి సంకేతాలు అందడం, మరో రెండు రోజులు వేచిచూద్దామని తమతో ఉన్న క్యాడర్‌కు చెప్పి కాలక్షేపం చేస్తున్నారు. అదే సాకుతో శంకర్‌ ప్రచారానికి గుండ లక్ష్మీదేవి వర్గం ఇప్పటికీ దూరంగానే ఉంది. అయితే అటు పార్టీ టికెట్‌ ఇచ్చిన అభ్యర్థితో వెళ్లలేక.. ఇటు టికెట్‌ వస్తుందో, రాదో తెలియని లక్ష్మీదేవితో కొనసాగలేక నియోజకవర్గ టీడీపీ క్యాడర్‌ మాత్రం నలిగిపోతోంది. ఎవరు వచ్చినా, రాకపోయినా తన ప్రచారం ఆగదంటూ దూసుకుపోతున్న శంకర్‌ వద్ద తాము వెనుకబడిపోతున్నామన్న భావన చాలామంది పార్టీ నేతల్లో ఉంది. కానీ ఇంకా లక్ష్మీదేవికి టికెటొస్తుందనే ఆశ వారిని అటువైపు వెళ్లకుండా కట్టడి చేస్తోంది. గొండు శంకర్‌కు టికెట్‌ ఇచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తల్లో తీవ్ర భావోద్వేగాలు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో గుండ కుటుంబం మీద ఉవ్వెత్తున సానుభూతి వెల్లువెత్తింది. ఆ తర్వాతే చంద్రబాబునాయుడుతో గుండ దంపతులు భేటీ అయ్యారు. నాలుగు రోజుల్లో కబురొస్తుందని చెప్పుకొచ్చారు. నాలుగు రోజులు కాదు.. పది రోజులు దాటిపోయినా ఎటువంటి కబురూ రాలేదు. ఈలోగా శంకర్‌ మరిన్ని పర్యటనలు, పార్టీలో చేరికలు చేపడుతూ ముందుకు పోయారు. ఏది ఏమైనా ఎంపీ రామ్మోహన్‌నాయుడు నగరంలో ప్రచారం చేసే సమయానికి నియోజకవర్గ అభ్యర్థి ఎవరనే విషయం తేలిపోతుందని క్యాడరంతా ఆశాభావంతో ఎదురుచూశారు.

సానుభూతి పోగొట్టుకుంటున్నారు

చివరికి రామ్మోహన్‌నాయుడుతో గొండు శంకరే ప్రచారంలో పాల్గొన్నారు. స్వయంగా రామునే అందరికీ ఫోన్‌ చేసి నగరంలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నానని, దీనిలో పాల్గొనాలంటూ కోరారు. అంతవరకు వస్తామన్న చాలామంది నగర నాయకులు చివరి నిమిషంలో ముఖం చాటేశారు. అయినా మార్కెట్‌లో గొండు శంకర్‌, రామ్మోహన్‌ నాయుడుల ప్రచారానికి స్థానికుల నుంచి పెద్ద ఎత్తునే మద్దతు లభించింది. నగరంలో లక్ష్మీదేవితో ఉన్న డివిజన్‌ ఇన్‌ఛార్జీలు ఈ ప్రచారంలో పాల్గొనని మాట ఎంత వాస్తవమో మార్కెట్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారి నుంచి అపూర్వ స్పందన వచ్చిందనేది కూడా అంతే వాస్తవం. చంద్రబాబును కలిసి వచ్చిన దగ్గర్నుంచి రెండేసి రోజులు వాయిదా వేసుకుంటూ తమ క్యాడర్‌ను కాపాడుకుంటున్న గుండ కుటుంబం.. అదే సమయంలో నెమ్మది నెమ్మదిగా తమ మీద వచ్చిన సానుభూతిని నిర్వీర్యం చేసుకుంటోంది. గుండ లక్ష్మీదేవికి టికెట్‌ దక్కనందుకు ఉవ్వెత్తున ఎగసిపడిన ఆగ్రహ జ్వాలలు ఇప్పుడు లేవు. నేరుగా చెప్పలేకపోతున్నా క్యాడర్‌ కోరుతున్నది ఒక్కటే. పార్టీకి పని చేయడానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే ఇండిపెండెంట్‌గా బరిలో నిలవాలి. ఈ రెండిరటిలో ఏ ఒక్కదానికి సిద్ధమైనా తామంతా గుండ కుటుంబంతోనే ఉంటామని వారు చెబుతున్నారు. అయితే ఈ రెండు నిర్ణయాల్లో ఏ ఒక్కదానికీ లక్ష్మీదేవి దంపతులు సిద్ధపడటంలేదు.

చంద్రబాబు వస్తారంటూ మరో సాకు

ఉదయం అరసవల్లిలోని అప్పలసూర్యనారాయణ ఇంట్లో కనిపిస్తున్న క్యాడర్‌లో 90 శాతం మంది పరోక్షంగా శంకర్‌తో టచ్‌లో ఉంటున్నారు. అయినా ఇంకా సోమవారం చంద్రబాబు వచ్చేవరకు వేచిచూడాలని తాజాగా అప్పలసూర్యనారాయణ తన అనుచరవర్గానికి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీకి కేటాయించిన అనపర్తిని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోసం టీడీపీ తిరిగి తీసుకునేలా మంతనాలు జరుగుతుండటం వంటి పరిణామాలు గుండ కుటుంబంలో టికెట్‌ ఆశలను ఇంకా సజీవంగా ఉంచాయి. కానీ జిల్లాలో మార్పులు కోరుతున్న రెండు స్థానాల్లో అది కుదరదన్న విషయం పార్టీ నేతలు ఇంతవరకు అప్పలసూర్యనారాయణకు చెప్పలేదో లేక చెప్పినా ఆయన పట్టించుకోలేదో తెలియదు గానీ సోమవారం చంద్రబాబు వచ్చినా జిల్లాలో సీట్ల మార్పు ఉండదు. శంకర్‌ బలహీనమైన అభ్యర్థి అని నిరూపించగలిగితే, ప్రచారంలో ఆయనతో ఎవరూ కలిసి రావడంలేదని ఆధారాలు చూపగలిగితే ఆయన్ను తప్పించే అవకాశం ఉంటుందన్న భావనతో గుండ వర్గంలో కొందరున్నారు. అందుకే అధికార వైకాపా కంటే సొంత పార్టీ నేతలే తమ అభ్యర్థిని డేమేజ్‌ చేస్తూ ఆడియోలు ట్రోల్‌ చేస్తున్నారు. గొండు శంకర్‌ వస్తే రౌడీయిజం చేస్తాడని మొదట్లో వైకాపా చేసిన ప్రచారం బూమరాంగ్‌ కావడంతో ఇప్పుడు శంకర్‌ తండ్రి ఒక కులాన్ని దూషించినట్లు ఉన్న ఒక ఆడియోను స్వయంగా టీడీపీ నాయకులే సోషల్‌ మీడియాలో తిప్పుతున్నారు. వాస్తవానికి శంకర్‌ తండ్రి జగపతి దూషించారని చెబుతున్న వ్యక్తి ఆ కులానికి చెందినవాడే కాదు. బి`ఫారం చేతికొచ్చేవరకు ఈ సస్పెన్స్‌ కొనసాగించినా, వచ్చిన తర్వాతైనా గుండ దంపతులు ఏం చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page