స్వరూపానంద పోయె.. రాందేవ్ బాబా వచ్చె!
- DV RAMANA

- Jul 1
- 2 min read

రాష్ట్రంలో వైకాపా స్థానంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది. అధికార మార్పిడికి అనుగుణంగా ఉన్నతాధికార వ్యవస్థ, సలహాదారుల కూటమిలోనూ భారీ మార్పులు చోటు చేసుకుంటు న్నాయి. నాటి జగన్ ప్రభుత్వంలో సలహాదారుల రాజ్యం నడుస్తోందని, పనీపాటా లేనివారిని, ఆయా రంగాలతో సంబంధం లేనివారిని సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వాన్ని పునరావాస కేంద్రంగా మార్చేశారని తెలుగుదేశం, జనసేన పార్టీలు దుమ్మెత్తిపోశాయి. కానీ ప్రస్తుతం అవే పార్టీల భాగ స్వామ్యంతో నడుస్తున్న సర్కారులోనూ అదే జరుగుతోంది. పలు శాఖలకు, రంగాలకు భారీ జీతభత్యా లతో సలహాదారులను నియమిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిపిన ఒక నియామకం మాత్రం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. పర్యాటక శాఖ సలహాదారుగా వివాదాస్పద యోగా గురువు బాబా రాందేవ్‌ను నియమించారు. ఇటీవల జరిగిన కంటెయినర్ టూరిజం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎంతో చంద్రబాబుతో కలిసి రాందేవ్ కూడా పాల్గొన్నారు. కూటమి సర్కారు నియమించిన మిగతా సలహాదారుల స్థాయి మాటెలా ఉన్నా.. శాస్త్ర సాంకేతిక సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్‌రెడ్డిని నియమించడం మాత్రం ప్రశంసలు అందుకుంది. కానీ అంతలోనే బాబా రాందేవ్‌ను సలహాదారుగా నియమించడం ఆ గుడ్‌విల్‌ను వాష్ అవుట్ చేసేసింది. వైకాపా హయాంలో ఉన్న రాజగురువు పోయి.. కొత్త రాజగురువు వచ్చారన్న వ్యంగ్యాస్త్రాలు కూడా వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖ శారదాపీఠానికి చెందిన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి రాజగురువు గా ఉండేవారు. అప్పట్లో శారదా పీఠం రాజకీయ కేంద్రంగా మారిందన్న విమర్శలు చెలరేగాయి. తిరుమలలో కూడా ఆ స్వామికి ఎనలేని ప్రాధాన్యం దక్కేది. తిరుమలలో కొంత భూమి కేటాయిం చడంతో పాటు కొన్ని భవనాలను కూడా ఆయన కోసం రిజర్వ్ చేశారు. వేద విశ్వవిద్యాలయం ఏర్పాటుకు భీమిలిలో శారదా పీఠానికి భూములు కూడా కేటాయించారు. అయితే కూటమి అధికారం లోకి వచ్చిన తర్వాత ఆ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. తిరుమలలో కూడా ప్రాధాన్యత తగ్గింది. కట్ చేస్తే.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు బాబా రాందేవ్‌ను ప్రభుత్వ సలహాదారుగా ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన పర్యాటక రంగాన్ని తన సలహాలతో ఉద్ధరించడానికి కృషి చేస్తారని ప్రభుత్వం ప్రకటించింది. రాందేవ్ యోగా గురువు మాత్రమే. అంతకు మించి పర్యాటక రంగంతో ఏమాత్రం సంబంధం లేదు. ఆ రంగంలో ఆయన నిష్ణాతుడు కూడా కాదు. మరి ఏ ప్రాతిపదికన రాందేవ్‌ను పర్యాటక రంగ సలహాదారుగా నియమిం చారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు స్వరూపానందేంద్ర మాదిరిగానే రాందేవ్‌ది కూడా వివాదా స్పద చరిత్రే. విశాఖ నగర శివారులోని చినముషిడివాడలో స్వరూపానందేంద్ర నడుపుతున్న శారదా పీఠం భూముల్లో కొన్ని ఆక్రమించినవేనన్న ఆరోపణలు చాలా ఏళ్ల నుంచీ ఉన్నాయి. అవి చాలవన్నట్లు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శారదా పీఠానికి భారీగా భూములను నామమాత్రపు ధరకు కేటాయించింది. ఇక జగన్ సర్కారు భీమిలి సమీపంలో అత్యంత ఖరీదైన ఎనిమిది ఎకరాలు కేటాయించింది. దీనిపై అప్పట్లో టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు స్వరూపానందేంద్ర స్థానాన్ని రాందేవ్ భర్తీ చేస్తున్నారు. పతంజలి ఆయుర్వేద మందుల సంస్థ వ్యవ స్థాపకుడిగా ఉన్న రాందేవ్‌కు కూటమి సర్కారు విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో ఆయుర్వేద కంపెనీ ఏర్పాటుకు 120 ఎకరాలు కేటాయించినట్లు తెలుస్తోంది. అలాగే శారదా పీఠం నుంచి వెనక్కి తీసుకున్న ఎనిమిది ఎకరాలను కూడా బాబా రాందేవ్‌కు కేటాయిస్తారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో మహిళలు, మైనారిటీలపైనా, ఆధునిక వైద్యం గురించి రాందేవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై విమర్శలకు దారితీశాయి. అలాగే ఆయనకు చెందిన పతంజలి ఆయుర్వేద ఔషధ సంస్థ తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలు ఇవ్వడంపై కేరళ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మందలింపులు ఎదుర్కొంది. రాందేవ్‌పై అరెస్టు వారెంట్ కూడా జారీ అయ్యింది. ఇలాంటి నేపథ్యం ఉన్న ఆయన్ను సలహాదారుగా నియమించడానికి కారణం చంద్రబాబుతో తొలి నుంచి ఆయన కు సాన్నిహిత్యం ఉండటంతో పాటు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ పెద్దలతోనూ సన్నిహిత సంబంధాలు ఉండటమే. హిందూత్వ భావజాలం ఉన్న ఆయన నియామకం వివాదాస్పదమవుతోంది.










Comments