స్థాయి, వసతులు పెరిగినా సేవలు మృగ్యం
అడగడుగునా నిర్లక్ష్యంతో రోగులకు నరకం
చాలా పోస్టులు ఖాళీ.. ఉన్నవారిలో అలసత్వం
ఫేస్ యాప్‌ను మేనేజ్ చేసి విధులకు డుమ్మా
జిల్లా సర్వజన ఆస్పత్రి వైపు చూడని కలెక్టర్లు, మంత్రులు

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత నెల 17న మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వ సర్వజన అస్పత్రి (రిమ్స్)లో సమీక్ష నిర్వహించి మెరుగైన వైద్య సేవలతో మిగతా ఆస్పత్రులకు ఆదర్శంగా నిలవాలని వైద్యాధికారులకు హితవు పలికారు. ఈయనొక్కరే కాదు.. 2010 నుంచి మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ప్రజాప్రతినిధులంతా పలుమార్లు రిమ్స్‌ను సందర్శించి సమీక్షలు నిర్వహించడం, వైద్యసేవలు మెరుగుపడాలని హెచ్చరించి వెళ్లిపోవడం జరుగుతోంది. కానీ పరిస్థితి మాత్రం మారడంలేదు. కోవిడ్ పుణ్యమా అని రిమ్స్‌లో వసతులు పెరిగాయి. ఆధునిక వైద్య పరికరాలు సమకూరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 22న కార్డియాలిజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, సీటీ సర్జరీ, యూరాలజీ, మెడికల్ ఆంకాలజీ వంటి ఆరు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పూర్తి స్థాయిలో భవనాలు అందుబాటులోకి వచ్చాయి. అయినా రోగులకు అరకొర సేవలే అందుతున్నాయి. వైద్యులు పూర్తిస్థాయిలో లేకపోవడం, ఉన్నవారు స్థానికంగా నివాసం ఉండకపోవడం, సిబ్బంది సమయపాలన పాటించకపోవడం వంటి అనేకానేక సమస్యలతో రిమ్స్‌కు వచ్చే రోగులకు సక్రమంగా సేవలు అందడంలేదు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సర్వజన ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు, ఇతర ఉద్యోగుల హాజరును, పనివేళలను పర్యవేక్షణ కొరవడుతోంది. దీనికోసం తొలుత ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ డివైజ్‌లు పూర్తి స్థాయిలో పని చేయకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఫేస్ రికగ్నిషన్ యాప్ హాజరు ప్రవేశపెట్టారు. దీన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. పనిచేసే ప్రాంతానికి వంద మీటర్ల పరిధిలో ఎక్కడినుంచైనా హాజరు వేసుకునే వెసులుబాటు ఇందులో ఉండటమే అధికారులకు, సిబ్బంది అనుకూలంగా మారింది. రిమ్స్ గేట్‌లోకి అడుగు పెట్టకుండానే ఫోన్‌లో హాజరు వేసేసుకుని వెనక్కి వెళ్లిపోవడం నిత్యకృత్యమైంది. డాక్టర్లు రాకపోవడంతో గంటల తరబడి నిరీక్షణ తర్వాత రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. రూ.లక్షల్లో వేతనాలు తీసుకుంటున్న వైద్యులు కొన్ని గంటలు కూడా పనిచేయరు. ఇలా వస్తారు.. అలా వెళ్లిపోతారు. ఏళ్ల తరబడి ఇదే తంతు. అయినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలేదు. ఆస్పత్రిలో ప్రముఖ వైద్య నిపుణులు, సీనియర్ వైద్యులు ఉన్నారు. బోధనాస్పత్రి కావడంతో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ డాక్టర్లు, సివిల్ సర్జన్లు అందుబాటులో ఉన్నారని చెబుతున్నా రోగులకు మాత్రం సరైన సేవలు అందడం లేదు. దీనికి మంగళవారం సాయంత్రం జరిగిన ఘటనే నిదర్శనం. రోడ్డు ప్రమాదంలో గాయపడి తీవ్ర రక్తస్రావమైన క్షతగాత్రుడిని చికిత్స కోసం సాయంత్రం 4.30 సమయంలో రిమ్స్‌కు తీసుకెళ్తే గంటన్నరకు పైగా అంబులెన్స్‌లోనే ఉంచేశారు. వైద్యులు, సిబ్బంది స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులే స్ట్రెచర్ తీసుకువచ్చి అంబులెన్స్ నుంచి బాధితుడిని దించి క్యాజువాలిటీకి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు స్పందించకపోవడంతో బాధితుడి కుటుంబ సభ్యులు కేకలు వేశారన్న వార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేయడంతో కొందరు జూనియర్ డాక్టర్లు, సిబ్బంది వచ్చి బాధితుడి వివరాలు రాసుకొని ప్రథమ చికిత్స చేసి విశాఖకు రిఫర్ చేసి చేతులు దులిపేసుకున్నారు. రిమ్స్‌లో ట్రామాకేర్ యూనిట్, న్యూరాలజీ నిపుణులు ఉన్నా విశాఖకు రిఫర్ చేయడం ఇక్కడి వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెబుతున్నారు. నెల రోజల క్రితం కూడా ఒక విద్యార్ధి బస్సు ఎక్కుతున్న క్రమంలో టైర్ కింద కాలుపడి తీవ్ర గాయమైంది. దీంతో బాధితుడిని రిమ్స్‌కు తీసుకెళ్లారు. కానీ వైద్యులు తీరిగ్గా రెండు గంటల తర్వాత వచ్చి పరీక్షించి బ్యాండేజీ కట్టి న్యూరాలజీ నిపుణులు లేరని చెప్పి విశాఖకు రిఫర్ చేసేశారు. వైద్య పరీక్షలు చేయించాలన్నా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి.
ఓపీ వేళల్లో పాఠాలా?
సిబ్బంది బాధ్యతారాహిత్యం వల్ల కూడా రిమ్స్‌కు వచ్చే రోగులు ఇబ్బందుల పాలవుతున్నారన్న ఆరోపణలున్నాయి. సకాలంలో స్పందించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి. రిమ్స్‌లో వైద్యులతో పాటు సిబ్బంది కొరత ఎప్పటి నుంచో ఉంది. సుమారు 231 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. బోధనాస్పత్రి కావడంతో సరిగ్గా ఓపీ సమయంలోనే వైద్య విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి వైద్యులు వెళ్లిపోతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వైద్య విద్యార్థులకు ఉదయం పూట ట్యూటర్లు పాఠ్యాంశాలు బోధించాలి. ప్రాక్టికల్స్‌ను మాత్రం స్వయంగా ఓపీతో పాటు వార్డుల్లోనే రోగులకు చికిత్స చేస్తూనే విద్యార్థులకు నేర్పించాల్సి ఉంటుంది. దీన్ని విస్మరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కేసుల విషయంలో మిగతా కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు రిమ్స్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతుందని విమర్శలు ఉన్నాయి. మిగతా ఆస్పత్రులతో పోలిస్తే రిమ్స్‌లో పది శాతమే ఆరోగ్యశ్రీ చికిత్సలు జరుగుతున్నాయి.
స్థాయి పెరిగినా.. పెరగని రోగులు
రిమ్స్‌లో వైద్య సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి రోజూ సుమారు 800 వరకు రోగులు ఓపీలో నమోదవుతుండగా 200 మంది వరకు ఇన్‌పేషెంట్లుగా చేరుతుండేవారు. ఇప్పటికీ ఇవే గణాంకాలు నమోదవుతున్నాయి. 500 నుంచి 950 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయినా రిమ్స్‌లో వైద్యసేవలు అందుకుంటున్నవారి సంఖ్య పెరగలేదు. మధ్యాహ్నం 12 గంటలకే ఓపీ ముగించేసి వెళ్లిపోతున్నారు. తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు రిమ్స్ ప్రాంగణంలోకి వచ్చి ఫేస్ రికగ్నిషన్ యాప్‌లో హాజరు వేసుకొని వెళ్లిపోతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు తప్పనిసరిగా ఆస్పత్రిలో ఉండాలని నిబంధనలు ఉన్నా ఎవరూ ఖాతరు చేయడం లేదు. వైద్యసేవలు అందించాల్సిన సీనియర్లు విధులకు డుమ్మా కొడుతుంటే వారి స్థానంలో జూనియర్ డాక్టర్లు దర్శనమిస్తున్నారు. గైనిక్ విభాగంలో వైద్యులు ఉన్నా నర్సింగ్ సిబ్బందే చికిత్స అందిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం వల్ల ఇన్‌పేషెంట్లుగా చేరిన పలువురు అక్కడి నుంచి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిపోతున్న ఉదంతాలు ఉన్నాయి.
తనిఖీలు, పర్యవేక్షణ నిల్
గతంలో కలెక్టర్‌గా పనిచేసిన నివాస్ సర్వజన ఆస్పత్రిలో తరచూ తనిఖీలు చేస్తూ వైద్యులతో సమీక్షలు నిర్వహింస్తుండేవారు. ఆతర్వాత వచ్చిన కలెక్టర్లు రిమ్స్ వైపు కన్నెత్తి చూడడం మానేశారు. నివాస్ కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడే వైద్యపరీక్షలు నిర్వహించేవారు. విధులకు డుమ్మా కొట్టినవారిపై తక్షణ చర్యలు తీసుకునేవారు. పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సిబ్బందిని హడలెత్తించేవారు. ఆయన తర్వాత ఆ స్థాయిలో ఉన్నతాధికారులు ఎవరూ తనిఖీలు చేపట్టలేదు. వైకాపా హయాంలో మంత్రి సీదిరి ఒకసారి, ధర్మాన మరోసారి సందర్శించారు. రిమ్స్ ఉన్నతాధికారులు తమ ఛాంబర్లలోనే సమావేశాలు నిర్వహించడం, పుస్తకాలు చదువుకోవడం తప్ప రోగులకు వైద్యసేవలు అందుతున్న తీరుపై దృష్టి పెట్టే ఆలోచన చేయడం లేదు. అనుకోని ఘటనలు చోటుచేసుకొని రోగుల బంధువులు ఆందోళనకు దిగితే మధ్యవర్తుల ద్వారా రాజీలు చేసి పంపించేస్తున్నారు. వైద్యసేవలు అందుతున్న తీరుపై, వైద్యులపై ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ వైద్యులంతా సమావేశమై రిమ్స్ ప్రతిష్టను దిగజార్చుతున్నారంటూ ఆరోపణలును ఖండిరచి చేతులు దులుపుకొంటున్నారు. దీంతో రిమ్స్‌ను ఆశ్రయించేవారి సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది.
Comments