top of page

సివిల్‌ సర్వెంట్‌నవుతా!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jun 5
  • 3 min read

నాన్న ప్రేరణతోనే ఐఐటీ అడ్వాన్స్‌లో ఫస్ట్‌ర్యాంక్‌

అమ్మ సెలవు పెట్టి మరీ అన్నం పెట్టేది

ఆరో తరగతి నుంచీ ఐఐటీ వైపు అడుగులు వేయాలి

‘సత్యం’తో మనోభావాలు పంచుకున్న ధర్మాన రుత్విక్‌ సాయి



(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

అప్పుడెప్పుడో 2018లో ఉమ్మడి జిల్లా పాలకొండకు చెందిన ఓ విద్యార్థికి జేఈఈ మంచి ర్యాంకు వచ్చింది. అది దేశం గర్వించదగ్గ ర్యాంకే. మళ్లీ ఇన్నాళ్లకు నరసన్నపేట మండలం దేవాదికి చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్‌ సాయికి ఓబీసీ కేటగిరీలో ఫస్ట్‌ ర్యాంకు వచ్చింది. ఓపెన్‌ కేటగిరీలో 18వ ర్యాంకు వచ్చింది. 2018కి, ఇప్పటికి మధ్య సాంకేతికంగా మార్పులు వచ్చివుండొచ్చు. కానీ విద్యార్థుల మెదళ్లలో మాత్రం అప్పటికీ, ఇప్పటికీ జ్ఞానం స్థాయిలో విషం నిండిపోయిన మాట ఒప్పుకొనితీరాలి. ఒక చేతిలో మొబైల్‌, అందులో అన్‌లిమిటెడ్‌ డేటా, ఎదురుగా టీవీ, అందులో యూట్యూబ్‌ లేదా ఓటీటీ పెట్టుకొని ఒకేసారి డిజిటల్‌గా బిజీ అయిపోయిన ఈ తరంలో సెల్‌ఫోన్‌ ముఖం చూడకుండా ఆమధ్య సివిల్స్‌ సాధించిన ఒక వనిత కోసం చదివాం. ఇప్పుడు తాను కూడా సివిల్స్‌ వైపే వెళ్తానని, అందుకోసం ఇదే మార్గాన్ని ఎన్నుకున్నానని చెబుతున్న రిత్విక్‌ సాయి మంగళవారం ‘సత్యం’ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా జరిపిన ఇంటర్వ్యూ సారాంశమిది.


సత్యం: మీరు ఐఐటీ, జేఈఈలో జాతీయ స్థాయిలో 18వ ర్యాంకు సాధించారు. ఈ అద్భుతమైన విజయంపై మీ భావనలు ఏంటి?

రుత్విక్‌ సాయి: వాస్తవానికి ఆలిండియా లెవెల్‌లో 10లోపు ర్యాంకు వస్తుందని భావించాను. కానీ ఇంగ్లీష్‌లో ఉన్న ప్రశ్నపత్రాన్ని అర్థం చేసుకోడానికి నాకు పట్టిన సమయం ఎక్కువ కావడం వల్ల 18వ ర్యాంకుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే నా ముందున్న 17 మందీ నార్త్‌ ఇండియన్లే. వీరికి ఇంగ్లీష్‌ దాదాపు మాతృభాష లాంటిది. కానీ మన దగ్గర అలా ఉండదు. కాబట్టి ఫిజిక్స్‌లో 100 శాతం స్కోర్‌ చేసినా, మ్యాథ్స్‌ సాల్వ్‌ చేసే సమయం తక్కువ తీసుకున్నా, అర్థం చేసుకోడానికి ఆలోచించాల్సిన పరిస్థితి. అందుకే 10 లోపు ర్యాంకు రాలేదు. అయినా సంతోషంగానే ఉంది.


సత్యం: ఇంతటి సవాల్‌ నిండిన పరీక్షకు సన్నద్ధం కావడానికి మీరు ఎలాంటి అధ్యయన వ్యూహాలు, లేదంటే షెడ్యూల్‌ను అనుసరించారు?

రుత్విక్‌ సాయి: ఇది ఒక్కరోజులో సాధించేది కాదు. మొదట్నుంచీ జేఈఈయే లక్ష్యంగా చదివితేనే టార్గెట్‌ను ఛేదించగలం. విజయవాడలో మహానాడు రోడ్డులో కేవలం నాతో పాటు విజయనగరానికి చెందిన మరో విద్యార్థి కోసం ప్రత్యేకంగా పెద్ద ప్లాట్‌ను తీసి అక్కడే ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు జేఈఈ పరీక్ష పైన సాధనే. మధ్యలో కేవలం మూడు బ్రేక్‌లే ఉంటాయి. ఒకటి బ్రేక్‌ఫాస్ట్‌, రెండు లంచ్‌, డిన్నర్లు మాత్రమే. వేగము, కచ్చితత్వం ఉంటేనే దీన్ని ఛేదించగలం. ఆరు నెలల పాటు మా అమ్మ ఉద్యోగానికి సెలవు పెట్టి నాతోనే ఉండిపోయారు. జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష డిస్క్రిప్టివ్‌ అంటారు కానీ, ఆబ్జెక్టివే. ఆరు మార్కుల ప్రశ్నకు సమాధానం రాబట్టాలంటే మామూలుగా అరగంట పడుతుంది. కానీ జేఈఈ అడ్వాన్స్‌లో రెండు నిమిషాల్లో చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు షార్ట్‌కట్‌ మెథడ్స్‌ నేర్చుకోవడమే నైపుణ్యం.


సత్యం: మీ సన్నాహక ప్రక్రియలో మీకెదురైన అతి పెద్ద సవాల్‌ ఏది? దాన్ని ఎలా అధిగమించారు?

రుత్విక్‌ సాయి: ప్రిపరేషన్‌లో మోడల్‌ పేపర్‌ సాల్వ్‌ చేయడానికి ఏరోజూ సమయం సరిపోయేది కాదు. మొదట్లో ఇబ్బంది పడేవాడ్ని. కొన్నింటికి సమాధానం తెలిసినా కూడా సమయాభావం వల్ల పూర్తయ్యేది కాదు. ముఖ్యంగా మ్యాథ్స్‌లో ఈ ఇబ్బంది ఉండేది. ఫిజిక్స్‌ పూర్తిగా స్కోర్‌ చేస్తున్నా మ్యాథ్స్‌లో మాత్రం సరిపోయేది కాదు. మెయిన్స్‌కు ఇది ప్రాబ్లం కాకపోయినా జేఈఈ అడ్వాన్స్‌కు మాత్రం ఇదే పెద్ద అవరోధంగా ఉండేది. ఇక మెయిన్‌ పరీక్షకు సమయం దగ్గరవుతున్నకొద్దీ కేవలం మ్యాథ్స్‌ మీద దృష్టి సారించి సాల్వ్‌ చేయడం నేర్పించారు. దీంతో రోజుకు 14 గంటలకు పైబడి సాధన జరిగేది. అప్పటికి కాని సమయం మీద, కచ్చితత్వం మీద పట్టు దొరకలేదు.


సత్యం: మీ విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రేరణ లేదా స్ఫూర్తి ఏంటి?

రుత్విక్‌ సాయి: మా నాన్న పడుతున్న కష్టాన్ని చూసే దేశంలో గర్వంగా చెప్పుకునే ఐఐటీలో సీటు సాధించాలని భావించాను. మూడో తరగతి చదువుతుండగానే అంతర్జాతీయ మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌ టైటిల్‌ గెలుచుకున్నాను. అది చూసిన తర్వాత నాకు టెక్నికల్‌ అంశం మీద పట్టుందని నాన్న గ్రహించారు. అప్పట్నుంచే ఐఐటీ వైపు నన్ను నడిపారు. అందుకోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఉద్యోగానికి సెలవు పెట్టి అమ్మ, నాన్న లాస్‌ ఆఫ్‌ పే అయినా నాతోనే ఉన్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోను 10 లోపు ర్యాంకు తెచ్చుకోవాలని కష్టపడ్డాను.


సత్యం: మీలాగే ఈ వెనుకబడిన జిల్లాలో ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులు ఐఐటీకి వెళ్లాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి?

రుత్విక్‌ సాయి: ఇక్కడ ఆ దిశగా నడిపించే ఫ్యాకల్టీ లేదు. ఉన్నవారు వేరే జిల్లాల్లో వేర్వేరు క్యాంపస్‌లలో పాఠాలు చెబుతున్నారు. అక్కడ మన జిల్లా విద్యార్థులు చదువుతున్నారు కూడా. కానీ ఐఐటీ మెయిన్స్‌ను ఎవరు బ్రేక్‌ చేస్తారన్న విషయం సంబంధిత విద్యాసంస్థలు ముందే పసిగడతాయి. అటువంటివారిని ఫిల్టర్‌ చేసి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తాయి. పొరపాటును ర్యాంకు మిస్సవుతుందేమో గానీ, 99 శాతం టార్గెట్‌ రీచవుతారు. మరీ ముఖ్యంగా జేఈఈకి ప్రిపేర్‌ కావాల్సిన ఎన్‌సీఆర్‌టీ పుస్తకాలు ఇంగ్లీష్‌లో ఉంటాయి. దీని మీద పట్టు సాధించాలంటే ముందు ఇంగ్లీష్‌ మీద పట్టు రావాలి. విద్యార్థి కంటే ముందు అధ్యాపకుడికి దీని మీద పట్టు దొరకాలి. నార్త్‌ ఇండియాలో ఫ్యాకల్టీకి ఈ నాలెడ్జ్‌ ఎక్కువ కాబట్టి వారిని తీసుకువచ్చి ఐఐటీ పిల్లలకు శిక్షణ ఇప్పిస్తుంటారు. అటువంటి చోట చదివితే జేఈఈ సాధించడం సులభమవుతుంది. ఐఐటీలో సీటు రావాలంటే ఆరో క్లాసు నుంచే ఒక ప్రణాళిక అవసరం. ఆ మేరకు ప్రాక్టీస్‌ అవసరం. కేవలం ఇంటర్మీడియట్‌ తర్వాత జేఈఈకి వెళ్తామంటే కష్టమవుతుంది.


సత్యం: ఒకపక్క అకడమిక్‌, మరోపక్క జేఈఈ పరీక్షలకు ప్రిపరేషన్‌ అంటే ఒత్తిడి అనిపించలేదా?

రుత్విక్‌ సాయి: మొదట్నుంచి నన్ను జేఈఈ అడ్వాన్స్‌కే ప్రిపేర్‌ చేశారు. ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలకు ఐదు రోజుల ముందు పుస్తకాలిచ్చారు. సెకండియర్‌కైతే నాలుగు రోజుల ముందు ఇచ్చి చదవమన్నారు. ఒకసారి జేఈఈ టార్గెట్‌ అయితే, అకడమిక్‌ లెక్కలోకే రాదు. ఏపీ ఎంసెట్‌కైతే పేపరు ఏ మోడల్‌లో ఉంటుందో ఒకసారి చూసుకోమన్నారు. అలాగే పరీక్షకు వెళ్లాను. అది కూడా చాలా చిన్న ర్యాంకు వస్తుందని భావిస్తున్నాను. తెలంగాణ ఎంసెట్‌కు కూడా ప్రిపేర్‌ కాలేదు. ఆ ముందురోజే కాలికి గాయం కావడంతో కోదాడ వెళ్లి పరీక్ష రాశాను. 45వ ర్యాంకు వచ్చింది. జేఈఈయే టార్గెట్‌ అయితే, మీగతావేవీ ఒత్తిడే కాదు.


సత్యం: మీ దీర్ఘకాలిక లక్ష్యాలేమిటి? ఈ ర్యాంకు మీ కెరీర్‌ ఆకాంక్షలకు ఎలా ఉపయోగపడుతుంది?

రుత్విక్‌ సాయి: ముందుగా ఐఐటీ ముంబయిలో సీఎస్‌ఈలో చేరుదామనుకుంటున్నాను. రెండు నెలల్లో అది పూర్తవుతుంది. ఐఐటీ క్యాంపస్‌కు వెళ్లిన తర్వాత సివిల్‌ సర్వీసెస్‌కు ప్రిపేర్‌ అవుతాను. సివిల్‌ సర్వెంట్‌ కావడమే నా దీర్ఘకాల లక్ష్యం. ఇప్పుడు వచ్చిన ర్యాంక్‌ అంటారా.. ముంబయి లాంటి సుప్రసిద్ధ ఇన్‌స్టిట్యూట్‌లో చేరడానికి నాకు ఉపకరిస్తుంది. అక్కడి నుంచి మరింత ఫోకస్డ్‌గా సివిల్స్‌ వైపు వెళ్లడానికి ఆ వాతావరణం పనికొస్తుందని భావిస్తున్నాను.

תגובות


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page