top of page

సోషల్‌ వెల్ఫేర్‌లో ‘రెడ్డి’గారికి నో రూల్‌

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు

  • అన్నింటిలోనూ వాటాలు

  • అడిగితే తోక కత్తిరిస్తాననే హెచ్చరికలు

  • వైకాపా సిఫార్సుతో వచ్చి కూటమి పాలనలో కొనసాగుతున్న డీడీ

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)



కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా ప్రభుత్వ శాఖలో అధికారులకు వైకాపా జాఢ్యం ఇంకా వదలలేదు. ఇది సాంఘిక సంక్షేమశాఖలో మరింత ఎక్కువగా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎంవో ఉన్న ఒక అధికారి సిఫార్సుతో అనంతపురం నుంచి జిల్లాకు సోషల్‌ వెల్ఫేర్‌ డీడీగా వచ్చిన విశ్వమోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వంలో బదిలీల నుంచి తప్పించుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చినా తనను కదపలేదంటే తన కెపాసిటీ ఏంటో తెలుసుకుని మసలాలని, లేదంటే తోక కత్తిరిస్తానని డైలాగ్‌తో సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని తన గుప్పెట్లో పెట్టుకొని ఆటాడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనకు ఎదురుపడాలంటేనే సోషల్‌ వెల్ఫేర్‌లో మహా మహా ముదుర్లే భయపడిపోతున్నారట. దీన్ని తన బలంగా భావించి బదిలీల నుంచి ఇంక్రిమెంట్ల వరకు అన్నింట్లోనూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నగరంలోని అంబేద్కర్‌ ఆడిటోరియం అద్దె డబ్బులను అవసరం మేరకు దళిత విద్యార్థుల ఆర్ధిక ప్రయోజనాలకు వినియోగించాల్సి ఉంటుంది. అయితే విశ్వమోహన్‌రెడ్డి వచ్చిన తర్వాత అంబేద్కర్‌ ఆడిటోరియం అద్దె డబ్బులకు లెక్కలు లేవని దళిత సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అద్దె డబ్బులు ఎవరి ఖాతాలో జమవుతున్నాయో తెలియదన్న విమర్శలు ఉన్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా..

రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్న ఉద్యోగుల జీతభత్యాల కోసం ఏజెన్సీలను కాకుండా ఆప్కాస్‌ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది మాత్రమే నమోదైవుంటారు. కానీ బయటివారిని కూడా చేర్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. గ్రేడ్‌`1 ప్రమోషన్లలో సీనియారిటీ ప్రామాణికంగా తీసుకోకుండా హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులను ఇబ్బందులకు గురి చేసినట్టు తెలుస్తుంది. డిపార్ట్‌మెంట్‌ టెస్టులు రాయకపోయినా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. డిపార్ట్‌మెంట్‌ టెస్టులో ఉత్తీర్ణులై బీఈడీ చేసినవారికి మాత్రమే గ్రేడ్‌`1 వార్డెన్‌ ప్రమోషన్‌ ఇవ్వాలన్న మార్గదర్శకాలను పక్కనపెట్టి టీటీసీ చేసిన వ్యక్తికి ప్రమోషన్‌ ఇచ్చినట్టు వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్లు పైబడి సీనియారిటీ ఉన్న హెచ్‌డబ్ల్యూవోకు కాకుండా 2013లో విధుల్లో చేరిన వ్యక్తికి ప్రమోషన్‌ ఇచ్చేందుకు డైరెక్టరేట్‌కు రికమండ్‌ చేస్తూ ఫైల్‌ సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. వికలాంగుల కోటాలో గ్రేడ్‌`1 ప్రమోషన్‌ విషయంలోనూ ఇదే పంథాను అనుసరించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలుచేసినట్టు వెలుగులోకి వచ్చింది. సీనియారిటీ అంశాన్ని డబ్బులతో ముడిపెట్టి జూనియర్‌కు గ్రేడ్‌`1 ప్రమోషన్‌ ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. క్లాస్‌ ఫోర్‌ ఉద్యోగులకు హెచ్‌డబ్ల్యూవోలుగా ప్రమోషన్లు ఇచ్చే విషయంలోనూ ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించలేదని విమర్శలు ఉన్నాయి. సవరించిన జీవో ప్రకారం 20 శాతానికి మించి ప్రమోషన్లు ఇవ్వకూడదు. అయితే విశ్వమోహన్‌రెడ్డి మొత్తం ఏడు ఖాళీల్లో ఆరుగురు నాలుగో తరగతి ఉద్యోగులకు రోస్టర్‌ను పాటించకుండా వాతర్డెన్లుగా ప్రమోషన్లు ఇచ్చి సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఆరుగురు శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీలో డిగ్రీ చదివినట్టు సర్టిఫికేట్‌లు జత చేశారు. కానీ వాటి జెన్యూనిటీని ఇప్పటికీ ఖరారు చేయలేదు. ఈ ఆరుగురు ప్రమోషన్ల కోసం రెండేళ్ల తేడాతో డిగ్రీలు చదివినట్టు వారి పట్టాలు చెబుతున్నాయి. అందుకే ఈ అనుమానాలు. వీటి జెన్యూనిటీ విషయంలో ఇప్పటికీ గందరగోళం నడుస్తుందని, ఈ వ్యవహారం వెలుగులోకి రాకుండా డీడీ మేనేజ్‌ చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి.

రూ.లక్షల్లో దండుకున్నారు

పదోన్నతుల్లో ఇన్ని పదనిసలు జరగడం ఫేవర్‌తోనో, ప్రేమతోనో, సిఫార్సుతోనో కుదరదు. కచ్చితంగా అక్కడ లక్ష్మీదేవి పనిచేసివుంటుంది. హెచ్‌డబ్ల్యూవోలుగా ప్రమోషన్లు ఇవ్వడానికి ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసినట్టు సాంఘిక సంక్షేమ శాఖలో ప్రచారం సాగుతుంది. విలీనమైన/ మూసేసిన వసతి గృహాల్లో ఖాళీలను చూపించి మరో ఇద్దరు నాలుగో తరగతి ఉద్యోగులకు హెచ్‌డబ్ల్యూవోలుగా ప్రమోషన్‌ ఇవ్వడానికి విశ్వమోహన్‌రెడ్డి డైరెక్టరేట్‌ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీని కోసం ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షలు డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. జిల్లాలో 65 వసతి గృహాలకు గాను విలీనం/ మూసేసినవి పోగా ప్రస్తుతం 30 వసతి గృహాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 మంది గ్రేడ్‌`1 అధికారులు ఉండగా, 20 చోట్ల హెచ్‌డబ్ల్యూవోలు ఉన్నారు. రెండుచోట్ల ఇన్‌ఛార్జిల ఆధీనంలో నడుస్తు న్నాయి. మొత్తం 30 వసతి గృహాల్లో 2,822 మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్న ప్రతి విద్యార్థి నుంచి ప్రతి నెల డైట్‌ బిల్లు కోసం డీడీ విశ్వమోహన్‌రెడ్డికి రూ.35 వార్డెన్లు చెల్లిస్తున్నారు. ఇది సంక్షేమ శాఖల్లో కామన్‌. 2018 జూలైలో కాలేజీ వసతి గృహాల విద్యార్ధులకు రూ.1600, ప్రిమెట్రిక్‌ విద్యార్ధులకు రూ.1400 మెస్‌ఛార్జీలుగా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ఛార్జీల నుంచి తలా రూ.35 డీడీకి వార్డెన్లు మట్టజెప్పిన తర్వాతనే డైట్‌ బిల్లులు జమ చేస్తున్నట్టు తెలిసింది. ఇది గతంలో కంటే పెంచారని వార్డెన్లు చెవులు కొరుక్కుంటున్నారు.

ప్రతి పనికి ఒక రేట్‌

ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌ షిప్‌ (ఫీజు రీయంబర్స్‌మెంట్‌) నోడల్‌ ఏజెన్సీ నోడల్‌ ఆఫీసర్‌గా సాంఘిక సంక్షేమశాఖ డీడీ వ్యవహరిస్తుండంతో కాలేజీ లేదంటే తల్లుల ఖాతాల్లో ఫీజు డబ్బులు జమ అయిన ప్రతిసారీ విశ్వమోహన్‌రెడ్డికి ఇంజినీరింగ్‌, డిగ్రీ, ఇంటర్‌ కాలేజీ యాజమాన్యాలు డబ్బులు ఇస్తుంటాయి. ఈ మొత్తం రూ.లక్షల్లోనే ఉంటుందని శాఖలో ఉద్యోగులు చెబుతున్నారు. డ్రాపౌట్స్‌ తదితర కారణాలతో విద్యార్ధులు కాలేజీకి రాకపోయినా స్కాలర్‌షిప్‌ జమ చేయడంలో నోడల్‌ అధికారి పాత్ర ఉంటుందని అందుకోసమే డీడీకి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెబుతారని తెలిసింది. డిపార్ట్‌మెంట్‌ టెస్టులు పాస్‌కాకపోయినా ఇంక్రిమెంట్లు ఇచ్చేస్తున్నారని తెలిసింది. దీనికోసం సూపరింటెండెంట్‌ రూ.5వేలు, డీడీ రూ.10 వేలు చొప్పున వసూలుచేస్తున్నారని తెలిసింది. ఇటీవల బదిలీల్లో సేమ్‌ ప్లేస్‌లో ఉండడానికి ఒక్కొక్కరి నుంచి రూ.20వేలు వసూలుచేశారని తెలిసింది. సర్దుబాటు పేరుతో పోస్టింగ్‌ ఇచ్చిన వారి నుంచి రూ.15 వేలు తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. డీడీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విశ్వమోహన్‌రెడ్డి వ్యవహారంపై సాంఘిక సంక్షేమశాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై గతంలో కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఆందోళన చేసినా వైకాపాలో పెద్దల సహకారంతో నెట్టుకొచ్చారు. ఇప్పుడూ అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page