top of page

హత్యకుట్ర కేసులో ఏడుగురు అరెస్టు

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • రెండు పిస్టల్స్‌, ఒక తపంచా, 45 బుల్లెట్స్‌ స్వాధీనం

  • మరికొందరి పాత్రపై విచారణ

  • మీడియా సమావేశంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి

(సత్యంన్యూస్‌, పలాస)

టీడీపీ పలాస పట్టణ అధ్యక్షులు బడ్డ నాగరాజు హత్యకు కుట్ర చేసిన కేసులో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రకటించారు. శనివారం కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుట్రకు పాల్పడిన ఏడుగురిని మీడియా ముందుకు తీసుకువచ్చి కేసు వివరాలను వెల్లడిరచారు. చిన్నబాడాంకు చెందిన నాగరాజును అంతమొందించాలని బీహార్‌కు చెందిన ముగ్గురు సభ్యుల గ్యాంగ్‌కు రూ.10లక్షలు సుపారీ ఇచ్చినట్టు తెలిపారు. చిన్నబాడాం గ్రామంలో వ్యక్తిగత కక్షలు, ఆధిపత్యం, రాజకీయ విభేదాలు, భూవివాదాలు, ఆర్థిక లావాదేవీల నేపధ్యంలో నాగరాజును అంపోలు శ్రీనివాసరావు, కూర్మాపు ధర్మారావుతో పాటు మరో ఇద్దరు సాక్ష్యాధారాలు దొరక్కుండా హత్య చేయాలని పధకం వేశారని తెలిపారు. దీనికోసం నవంబర్‌ 10న విశాఖలోని ఒక హోటల్‌లో బీహార్‌కు చెందిన ముగ్గురు సభ్యులను కలిసి రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఒప్పందంలో భాగంగా రూ.2లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించారని వివరించారు. అడ్వాన్స్‌ తీసుకున్న బీహార్‌ గ్యాంగ్‌ సభ్యులు ముగ్గురు నవంబర్‌ 20, 30 తేదీల మధ్య చిన్నబాడాంలోని నాగరాజు ఇంటివద్ద రెక్కీ నిర్వహించారని వివరించారు. వీరి అనుమానాస్పద కదలికలను గుర్తించిన కాశీబుగ్గ పోలీసులు ఈ నెల 10న అదుపులోకి తీసుకొని విచారించగా కుట్రకోణం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. వారిచ్చిన సమాచారంతో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వీరి నుంచి రెండు పిస్టల్స్‌, ఒక తపంచా, 45 బుల్లెట్స్‌, మూడు బైక్‌లు, ఒక కారు, 9 మొబైల్‌ఫోన్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. బీహారీ గ్యాంగ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న మూడు బైకుల్లో ఒకటి పూణెలో దొంగలించి ఇక్కడకు తీసుకువచ్చినట్టు గుర్తించామన్నారు. మరో బైక్‌ను కంచిలి నుంచి రెంట్‌కు తీసుకొని వచ్చారని తెలిపారు. మూడో బైక్‌ ఎక్కడ నుంచి దొంగిలించారో తేలాల్సి ఉందన్నారు. హత్యకుట్ర కేసులో మరికొందరి పాత్రపై విచారణ జరుగుతుందని తెలిపారు. ఈ కేసును టెక్కలి, పలాస డీఎస్పీలు, పలాస సీఐ, కాశీబుగ్గ ఎస్‌ఐలు, మరికొంత మంది సిబ్బందితో కలిసి ఛేదించారని తెలిపారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page