top of page

‘హనుమంతు’ బుర్రలో బూతు పురుగు

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jul 9, 2024
  • 3 min read
  • ఆన్‌లైన్‌ రోస్ట్‌ పేరుతో అనారోగ్య కామెడీ

  • కుటుంబం పరువు తీసిన ప్రణీత్‌

  • సాయిధరమ్‌తేజ్‌ ట్వీట్‌తో అలర్ట్‌ అయిన టి`ప్రభుత్వం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

హాస్యం ఆరోగ్యానికి ఔషధంలాంటిదంటారు. కానీ అది శృతిమించకూడదు. అపహాస్యం కాకూడదు. ఇతరులను కించపరచకూడదు. కానీ దురదృష్టవశాత్తు అదే జరుగుతోంది. సినిమాలు , టీవీ సీరియళ్లలో హాస్యం పేరుతో డబుల్‌ మీనింగ్‌ పదాలు విచ్చలవిడిగా వాడుతూ అదే హాస్యం అన్నట్లు బిల్డప్పులు ఇస్తున్నారు. ఇక సోషల్‌ మీడియాలో అన్ని సామాజిక హద్దులను చెరపేసి యూట్యూబర్ల ముసుగులో ఉన్న కొందరు మానసిక రోగులు బూతు వీడియోలతో రెచ్చిపోతున్నారు. కామంతో కుళ్లిపోయిన తమ ఆలోచనలను, భావాలను సమాజంపైకి వదులుతూ మరికొందరు సైకోలు తయారయ్యేలా పురిగొల్పుతున్నారు. చివరికి తండ్రీకూతుళ్ల అపురూప బంధాన్ని కూడా బూతు కళ్లతోనే చూస్తూ రోత కామెంట్లు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు కొందరు సైకోలు. ఆ కోవకు చెందినవాడే హనుమంతు ప్రణీత్‌, అతని మిత్రులనే సైకో గుంపు. పైగా ఇటువంటి వెగటు వీడియోలకు వారు పెట్టుకున్న పేరు డార్క్‌ కామెడీ, ఆన్‌లైన్‌ రోస్టింగ్‌ అట! అలాంటి డార్క్‌ కామెడీ పేరుతో ఒక రొచ్చు.. రోత వీడియోను యూట్యూబ్‌ ద్వారా జనాల మీదికి వదిలిన ఘనుడు హనుమంతు ప్రణీత్‌. ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన ఇతగాడు మన శ్రీకాకుళం జిల్లావాసే కావడం మన దౌర్భాగ్యం, దురుదృష్టం.

అసలు విషయం ఏంటంటే..

ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న హనుమంతు ప్రణీత్‌ యూట్యూబర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. డార్క్‌ కామెడీ, అన్‌లైన్‌ రోస్టింగ్‌ పేరుతో ప్రముఖులతోపాటు సామాన్య జనాలు చేసే రీల్స్‌ను తెరపై పెట్టుకుని వాటిపై సెటైర్లు, కామెడీ కామెంట్లు చేస్తూ వీడియోలు రూపొందించడమే ఇతగాడి పని. వీడియోలు సొంతంగా తయారు చేయడం.. సొంతంగా ఆరోగ్యకరమైన కామెడీ సృష్టించడం యూట్యూబర్ల బాధ్యత. కానీ దాన్ని విస్మరించి ఇతరుల వీడియోలను తీసుకుని వాటిని తమ కావలసిన రీతిలో ఎడిట్‌ చేసి.. దానికి చర్చ పేరుతో జుగుప్సాకరమైన కామెంట్లు చేస్తూ శునకానందం పొందుతూ వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెడుతున్నారు. ఆ క్రమంలో మూడు రోజుల క్రితం ప్రణీత్‌ వదిలిన ఒక రొచ్చు వీడియో ఇప్పుడు రచ్చ సృష్టిస్తోంది. ఒక తండ్రి తన ఐదేళ్ల కుమార్తెతో చేసిన ఒక చిన్న ఫన్నీ వీడియోను ఆధారంగా చేసుకుని ప్రణీత్‌ ఆయన మిత్రబృందం అశ్లీల అరాచకం సృష్టించారు. అసలు వీడియోలో ఒక తండ్రి తన చిన్నారి కుమార్తెను దండిరచడానికి ఫ్యాంటు బెల్ట్‌ తీస్తాడు. కానీ చివరికి కూతురిని దండిరచలేక ఆ బెల్టునే ఉయ్యాలగా చేసి ఊగిస్తాడు. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ప్రతిబింబించే ఈ వీడియోను ప్రణీత్‌ బృందం తమ వికారపు కామెంట్లతో వికృతంగా మార్చేశారు. ఎవరో రూపొందించిన వీడియోలో అశ్లీల దృశ్యాలేమీ లేవు. కానీ దాన్ని డౌన్‌లోడ్‌ చేసి ఆన్‌లైన్‌లో రోస్టింగ్‌ పేరిట ప్రణీత్‌ మిత్రబృందం వాడిన పదజాలం, చూపిన హావభావాలు, చేసిన వెకిలిచేష్టలు అశ్లీల దృశ్యాలకు మించి అనేట్లు ఉన్నాయి. తండ్రీకూతుళ్ల మధ్య వేరే సంబంధం అంటగడుతూ రెచ్చిపోయారు. అశ్లీల దృశ్యాలను చూపించడం ఎంత నేరమో అసభ్యపదజాలంతో రెచ్చగొట్టడం కూడా అంతే నేరం. పైగా చిన్నపిల్లలను ఈ రొచ్చులోకి లాగడం చైల్డ్‌ అబ్యూజ్‌ కిందకు వస్తుంది.

పోక్సో కేసు నమోదుకు చర్యలు

ప్రణీత్‌ బృందం చేసిన ఈ వీడియో యూట్యూబ్‌లోకి వచ్చినప్పటినుంచీ తీవ్ర కలకలం రేపుతోంది. మొదట సినీనటుడు సాయిధరవమ్‌తేజ్‌ ఈ వీడియోకు వ్యతిరేకంగా స్పందించాడు. ఇంత రోత వీడియో సృష్టించిన సైకోలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ సీఎం, డీజీపీలకు ట్యాగ్‌ చేస్తూ ఎక్స్‌లో ట్వీట్‌ చేయడంతో ఈ దారుణ వీడియోపై రచ్చ మొదలైంది. సినీనటులు మంచు మనోజ్‌, మంచు లక్ష్మి, సుధీర్‌బాబు సహా అనేకమంది ఈ ట్వీట్‌పై స్పందిస్తూ ప్రణీత్‌ బృందంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సైతం వెంటనే స్పందించి నిందితులపై చర్యలకు ఆదేశించారు. అలాగే తెలంగాణ డీజీపీ దీనిపై స్పందిస్తూ పోక్సో కేసు నమోదు చేస్తామని వెల్లడిరచారు. ఆ రొచ్చు వీడియోలో ప్రణీత్‌పాటు ఉన్న వారిని ఆది, డీఎన్‌ఆర్‌ అనే వ్యక్తులుగా ప్రాథమికంగా గుర్తించారు.

ప్రముఖ కుటుంబం నుంచి వచ్చి..

డార్క్‌ కామెడీ పేరుతో అరాచకం సృష్టించిన ప్రణీత్‌ది గౌరవనీయమైన కుటుంబం కావడం విశేషం. వీరిది శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ కుటుంబంగా గుర్తింపు ఉంది. ఇతగాడి తండ్రి హనుమంతు అరుణ్‌కుమార్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి. ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఉన్నత పదవులు నిర్వహించి మంచి అధికారిగా పేరొందారు. ఇక తల్లి శ్రీదేవి ఎంఏ సైకాలజీ చేసిన ఉన్నత విద్యావంతురాలు. ఐక్యరాజ్యసమితికి చెందిన యూనెస్కోలో చిన్నపిల్లలు, మహిళల వ్యవహారాలు చూసినట్లు గూగుల్‌ చెబుతుంది. ప్రణీత్‌ తాత హనుమంతు కృష్ణారావు జిల్లా ప్రముఖుల్లో ఒకరు. పోనీ తిండికి లేక యూట్యూబ్‌ మీద బతికే కుటుంబమా? అంటే అదీ కాదు. హనుమంతు కృష్ణారావుకు ఎంత ఆస్తి ఉందో లెక్కపెట్టాలంటే నెలలు పడుతుందనేవారు కూడా ఉన్నారు. కొన్నాళ్లుగా అమెరికాలో ఉన్న ప్రణీత్‌ ప్రముఖ యూట్యూబర్‌గా కొనసాగుతున్నాడు. అనేకమంది సినీతారలు, సెలబ్రిటీలను తన యూట్యూబ్‌ ఛానల్‌ కోసం ఇంటర్వ్యూలు చేశాడు. అదే సమయంలో రెండు మూడు సినిమాల్లోనూ నటించిన చరిత్ర ఉంది. ఇటీవల విడుదలైన హరోంహర అనే సినిమాలో సుధీర్‌బాబుతో కలిసి నటించాడు. ప్రణీత్‌ సోదరుడు కూడా ప్రముఖ యూట్యూబరే. అయితే ఆయన కంటెంట్‌ ఇటువంటిది కాదు. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన ప్రణీత్‌ ఒక్క డార్క్‌ కామెడీ వీడియోతో తన తల్లిదండ్రుల గౌరవమర్యాదలను, కుటంబ ప్రతిష్టను మసకబార్చి చీకటిమయం చేశాడు.

댓글


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page