సర్వే డీపీఆర్‌ను ఆమోదించినట్లు కేంద్రం ప్రకటన
కొద్దిరోజుల కిందటే ఈ అంశాన్ని ప్రస్తావించిన ఎంపీ కలిశెట్టి
దశాబ్దాలుగా పెండిరగులో ఉన్న విజయనగరం`పలాస లైను
అదే చేత్తో నిధులు కూడా కేటాయిస్తే పనులు ప్రారంభం
రాజాం పరిశ్రమలకు, ఏజెన్సీ ఉత్పత్తులకు ఎంతో ఉపయోగం
రైలు కనెక్టివిటీ పెరిగి సామాన్యులకు తప్పనున్న ప్రయాణ ఛార్జీల భారం

ఆ ప్రాంతాలకు ఇంతవరకు రైలు యోగం కలగలేదు. ఇంకా చెప్పాలంటే రైలు కూతే వినిపించని ప్రాంతాలవి. రైల్వేలైన్ వేయాలన్న ప్రతిపాదనలు ఉన్నా.. కేంద్రం కనికరించడంలేదు. దశాబ్దాలుగా వాటికి మోక్షం లభించడం లేదు. దీన్నే ప్రస్తావిస్తూ విజయనగర ఎంపీగా ఎన్నికైన కలిశెట్టి అప్పలనాయుడు లోక్‌సభలో చేసిన తన మొదటి ప్రసంగం వినిపించారు. ఒకప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో.. ప్రస్తుతం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భాగంగా ఉన్న పారిశ్రామిక ప్రాంతమైన రాజాం, ఏజెన్సీ ప్రాంతాలైన పాలకొండ, కొత్తూరు ప్రాంతాలను కలుపుతూ పలాస వరకు రైల్వే లైను వేయాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉందని ఆయన గుర్తుచేశారు. ఆ ప్రతిపాదనను పట్టాలపైకి ఎక్కించాలని లోక్‌సభలో విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తినే మన్నించిందో.. దానికిముందే ఆ ఫైలుకు పట్టిన బూజును దులిపిందోగానీ ఎంపీ అప్పలనాయుడు ప్రస్తావించిన రెండురోజులకే ప్రతిపాదిత రైల్వే లైను సర్వే డీపీఆర్‌కు ఆమోదం ముద్ర వేసినట్లు రైల్వేశాఖ వర్గాలు ప్రకటించాయి. దాంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలవాసుల్లో ఆశలు చిగురించాయి.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
వెనుకబడిన ఉత్తరాంధ్రకు కేంద్రం నుంచి కాస్త ఉపశమనం కలిగించే తీపి కబురు అందింది. చాన్నాళ్లుగా పెండిరగులో ఉన్న ఒక రైల్వే ప్రతిపాదన సర్వేకు సంబంధించిన డీపీఆర్‌కు ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. రాజాం మీదుగా విజయనగరం`పలాస మధ్య కొత్త రైల్వేలైను నిర్మాణానికి సంబంధించి సర్వే పనులకు రైల్వేశాఖ ఆరేళ్ల క్రితమే 2018లో అనుమతినిచ్చింది. అప్పటినుంచీ కేంద్ర బడ్జెట్లలో దాని ఊసు లేకుండాపోయింది. సర్వే నిర్వహణకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్) రైల్వేబోర్డు కార్యాలయంలోనే మగ్గిపోయింది. ఎట్టకేలకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం ఈ కొత్త లైన్ సర్వే డీపీఆర్‌ను ఆమోదించినట్లు రైల్వేశాఖ సమాచారం ఇచ్చింది. దానికి ముందే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ అంశాన్ని మొన్న సోమవారం లోక్‌సభలో ప్రస్తావించారు. రాజాం ప్రాంతంలో పారిశ్రామిక ఉత్పత్తులు, ఏజెన్సీ ప్రాంతాల్లోని పండ్ల ఉత్పత్తుల రవాణాతోపాటు ఆయా ప్రాంతాలకు ఇంతవరకు అందుబాటులో లేని రైలు ప్రయాణం సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అప్పలనాయుడు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. దశాబ్దాల క్రితం దివంగత కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు హయాంలో తెరపైకి వచ్చిన ఈ ప్రతిపాదనను తక్షణమే ఆమోదించి త్వరితగతిన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన ప్రస్తావించిన రెండు రోజుల్లోనే ప్రతిపాదిత రైల్వేలైన్ సర్వే డీపీఆర్‌ను ఆమోదించినట్లు రైల్వేశాఖ ప్రకటించడం విశేషం.
అసలేమిటి ఈ ప్రతిపాదన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కింజరాపు ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో.. అంటే దాదాపు రెండు దశాబ్దాల క్రితం విజయనగరం`పలాస మధ్య శ్రీకాకుళం జిల్లాతోపాటు ఒడిశా ప్రాంతాలను కలుపుతూ కొత్త రైల్వేలైను వేయాలన్న ప్రతిపాదనను రైల్వేశాఖ ముందు ఉంచారు. దానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తూ అప్పట్లోనే కేంద్ర బడ్జెట్‌లో పొందుపర్చారు. విజయనగరం నుంచి అప్పటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భాగంగా ఉన్న రాజాం, పాలకొండ, కొత్తూరుతోపాటు ఒడిశాలోని పర్లాకిమిడి మీదుగా మళ్లీ శ్రీకాకుళం జిల్లాలోని పలాస వరకు ఈ కొత్త లైనును ప్రతిపాదించారు. 142 కిలోమీటర్ల పొడవుండే ఈ లైను అందుబాటులోకి వస్తే రైలు కూతే వినిపించని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఏర్పడి తక్కువ ఖర్చుతోనే రవాణా సౌకర్యాలు మెరగవుతాయని ఈ ప్రాంత ప్రజలు ఆశపడ్డారు. దాంతోపాటు పారిశ్రామిక ప్రాంతమైన రాజాం మరింత అభివృద్ధి చెందే అవకాశముంటని భావించారు. కానీ తర్వాత కాలంలో ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వాలు బూజు పట్టించేశాయి.
ఆరేళ్ల క్రితం సర్వేకు అనుమతించినా..
ఏళ్ల తరబడి పెండిరగులో ఉండిపోయిన ఈ ప్రాజెక్టు విషయంలో ఆరేళ్ల క్రితం మళ్లీ కేంద్రం కదిలింది. 2018 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రతిపాదిత విజయనగరం`పలాస వయా రాజాం రైల్వేలైను నిర్మాణానికి అవసరమైన సర్వే పనులు చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మామూలే. ప్రతిపాదిత రైల్వేలైన్ వేసే మార్గాల్లో ఎంత భూమి సేకరించాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ కొండలు, నదులు, లోయలు వంటివి ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో టన్నల్స్, బ్రిడ్జిలు ఎన్ని నిర్మించాల్సి ఉంటుంది. వాటికి ఎంత ఖర్చు అవుతుందన్నది సర్వే చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మేరకు డీపీఆర్‌ను అధికారులు సిద్ధం చేసినా ఇంతకాలం కేంద్రం దాన్ని పట్టించుకోలేదు. మరోవైపు బడ్జెట్లలో ఈ లైనుకు ఎటువంటి నిధులు కేటాయించకపోవడంతో రైల్వేలైన్ నిర్మాణంలో ఎటువంటి ప్రగతి లేకుండాపోయింది. ఎట్టకేలకు డీపీఆర్‌కు ఆమోదముద్ర పడటంతో ఇకనైనా ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని ఆశిస్తున్నారు.
బహుళ ప్రయోజనాలు
కొత్త రైల్వేలైను వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. రాజాం, పాలకొండ, సీతంపేట, కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి ప్రాంతాల్లోనే వేలాది ప్రజలకు రైలు సౌకర్యం సుదూర స్వప్నంగానే ఉంది. ఈ ప్రాంతాల ప్రజలు రైలు ఎక్కాలన్నా.. దూరప్రాంత ప్రయాణాలు చేయాలన్నా అటు చీపురుపల్లి, ఇటు ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్డు) స్టేషన్లకు వెళ్లి రైలు ఎక్కాల్సి వస్తోంది. ఇది దూరాభారంతోపాటు వ్యయప్రయాసలతో కూడినది. అలాగే ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్న రాజాం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నప్పటి నుంచే పారిశ్రామికంగా ఎదుగుతోంది. ఇక్కడ జ్యూట్, సిమెంట్, ప్లాస్టిక్, సింథటిక్, విద్యుత్ కేబుల్స్, పైపులు వంటి చాలా పరిశ్రమలు ఉన్నాయి. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమల ఉత్పత్తుల రవాణా పెద్ద సమస్యగా మారింది. వీటి రవాణాకు ప్రస్తుతం విజయనగరం, చీపురుపల్లి రైల్వేస్టేషన్ల వరకు రోడ్డుమార్గంలో తీసుకెళ్లి అక్కడి నుంచి రైళ్ల ద్వారా రవాణా చేయాల్సి వస్తోంది. ఫలితంగా రవాణా ఛార్జీలు తడిసిమోపెడవుతున్నాయి. కొత్త రైల్వేలైన్ నిర్మాణం పూర్తి అయ్యి రాజాం రైల్వేస్టేషన్ అందుబాటులోకి వస్తే రవాణా ఛార్జీలు చాలావరకు కలిసివస్తాయి. కొత్త పరిశ్రమలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మరోవైపు సీతంపేట ఏజెన్సీ లో అత్యధికంగా పైనాపిల్‌తోపాటు ఇతర ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. వీటి ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించడం ప్రస్తుతం పెద్ద సమస్యగా ఉంది. అదే పాలకొండలో స్టేషన్ ఏర్పాటైతే ఆ ఇబ్బందులన్నీ సమసిపోయి ఎగుమతులు ఊపందుకుంటాయి. ఇక మరో ప్రయోజనం ఏమిటంటే.. మన రాష్ట్రంలోని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాతోపాటు పక్కనే ఉన్న పర్లాకిమిడి జిల్లాకు రైలు సౌకర్యం మెరుగుపడుతుంది. ఎక్కువ సంబంధ బాంధవ్యాలున్న ఉత్తరాంధ్రతో రైలు కనెక్టివిటి ఏర్పడుతుంది. ఇన్ని ప్రయోజనాలు కల్పించే విజయనగరం`పలాస రైల్వేలైను ప్రాజెక్టును ఇకనుంచైనా యుద్ధప్రాతిపదికన చేపట్టాలని శ్రీకాకుళం జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments