హమ్మయ్యా.. సునీత రిటర్న్స్!
- DV RAMANA

- Mar 19
- 2 min read
అనూహ్యంగా అంతరిక్షంలో 286 రోజులు
కొత్త రికార్డు నమోదు చేసిన ఇద్దరు ఆస్ట్రోనాట్లు
భూవాతావరణానికి అలవాటు పడటానికి కొన్ని రోజులు
అంతవరకు వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలోనే..

(డి.వి.రమణ, సీనియర్ జర్నలిస్ట్)
వ్యోమనౌక డ్రాగన్ క్రూ 9ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) నుంచి అన్‌డాకింగ్ చేసే ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది.
అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించిన క్రూ 9 సుమారు 17 గంటల ప్రయాణించి భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2.41 గంటలకు భూ వాతావరణంలోకి ప్రవేశించింది.
కొద్దిసేపటికే అంటే తెల్లవారుజామున 3.27 గంటలకు వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలో సముద్రంలో ల్యాండ్ అయ్యింది.
దాంతో తొమ్మిది నెలలుగా నాసాతో సహా ప్రపంచ అంతరిక్ష పరిశోధకులను కలవరపెట్టిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ల ఉదంతం సుఖాంతమైనట్లే. అయితే అక్కడితో కథ ముగిసిపోలేదు. ఒక కీలక ఘట్టం ముగిసిందంతే!. మరో కీలక ఘట్టానికి తెరలేచింది. ఎందుకంటే నిర్ణీత కాలానికి మించి తొమ్మిది నెలల(286 రోజులు)పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన అస్ట్రోనాట్లు ఇద్దరు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భూ వాతావరణానికి తిరిగి అలవాటు పడటం అంత సులభం కాదు. అందుకే భూమికి చేరిన వెంటనే వారిద్దరినీ నేరుగా నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌లోని వైద్యకేంద్రానికి తరలించారు. సుమారు 45 రోజులపాటు వారిని వైద్యులు, శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉంచి తగిన చికిత్స అందిస్తారు.
8 రోజులనుకుంటే 9 నెలలు
అంతరిక్ష పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా)కు చెందిన వ్యోమగాములైనా భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు గత ఏడాది జూన్ ఐదో తేదీన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వారు అక్కడ ఎనిమిది రోజులు ఉండి పరిశోధనల అనంతరం తిరిగి వచ్చేలా నాసా ప్రణాళిక రూపొందించింది. కానీ స్టార్‌లైనర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలు ఈ ప్రణాళికకు గండి కొట్టాయి. ఫలితంగా సునీత, విల్మోర్‌లో లేకుండానే స్టార్‌లైనర్ ఖాళీగానే భూమిపైకి వచ్చేసింది. అప్పటినుంచి వారిద్దరిని భూమికి తీసుకొచ్చేందుకు నాసా శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరికి ఎలన్ మస్క్‌కు చెందిన డ్రాగన్ క్రూ 9 స్పేస్ క్యాప్సూల్‌ను అంతరిక్షంలోకి పంపించి ఎట్టకేలకు ఇద్దరు అస్ట్రోనాట్లను భూమిపైకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో అంతరిక్ష కేంద్రంలో ఎక్కువ రోజులు గడిన రికార్డును సునీత, విల్మోర్‌లు నమోదు చేశారు. గతంలో ఫ్రాంట్ రూబియో 371 రోజులు అంతరిక్ష కేంద్రంలో గడిపిన రికార్డు సృష్టించగా.. తాజా ఆ రికార్డును ఛేదించి సునీత, విల్మోర్‌లు 386 రోజులు గడిపి కొత్త రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో వారు భూమి చుట్టూ 4576 సార్లు పరిభ్రమించి, 195 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించడం విశేషం.
ఉద్విగ్న వాతావరణం
ఫ్లోరిడా తీరంలో డ్రాగన్ క్యాప్సూల్ నేరుగా సముద్రంలో దిగింది. ఆ సమయంలో సర్వత్రా ఉద్విగ్న వాతావారణం అలుముకుంది. భూ వాతావరణంలోకి ప్రవేశించిన కొద్ది నిమిషాలకే డ్రాగన్ సురక్షితంగా సముద్రపు నీటిలో దిగింది. ఆ వెంటనే నాసా కంట్రోల్ రూమ్‌లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌తో పాటు నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ వ్యోమనౌక భూ కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో కొద్దిసేపు కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ ఏర్పడిరది. అయితే నాసా శాస్త్రవేత్తలు దాన్ని క్షణాల్లోనే పునరుద్ధరించారు. వ్యోమనౌక సముద్ర జలాల్లో దిగిన వెంటనే నాసాకు చెందిన రికవరీ టీమ్ రంగంలోకి దిగింది. అందులో నుంచి వ్యోమగాములను ప్రత్యేక పరికరాల సాయంతో సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది. వారిని అక్కడి నుంచి స్పేస్ సూట్లలోనే ప్రత్యేక వాహనంలో నేరుగా హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు.
ప్రత్యేక చికిత్స
అనుకోని పరిస్థితుల్లో సుదీర్ఘకాలంపాటు అంతరిక్షంలో ఉండిపోయిన వ్యోమగాములు ఒక్కసారిగా భూ వాతావరణానికి అలవాటు పడలేరు. అదేవిధంగా ఆరోగ్యపరంగా పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే వారిద్దరిని 45 రోజులపాటు నాసా ఆరోగ్య కేంద్రంలో ఉంచి ప్రత్యేక చికిత్సలు అందిస్తారు. భూమి మీద ఉన్నట్లు అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. అందుకే అక్కడ ఉన్నన్నాళ్లు ఆస్ట్రోనాట్లు గాలిలో తేలుతున్నట్లే ఉన్నారు. అందువల్ల భూమి అడుగుపెట్టిన వెంటనే వ్యోమగాములు నడవలేరు. గురుత్వాకర్షణ శక్తికి శరీరం అలవాటు పడటంతోపాటు కాళ్లు నేలకు ఆనేలా నెలల తరబడి ఎక్సర్‌సైజ్‌లు చేయాల్సి ఉంటుంది. వారు సొంతంగా నడిచేంత వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు. కండరాల క్షీణతతోపాటు, ఎముకల సాంద్రత తగ్గడం, తల తిరగడం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అంతరిక్షంలో ఉన్నప్పుడు బాడీలోని ద్రవపదార్థాలు పైకి కదులుతాయి. దీనివల్ల రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. లో బీపీ, ఎముకల కదలికల్లో నొప్పి ఉండొచ్చు. కంటి చూపుతో పాటు గుండె సంబంధిత సమస్యలూ ఎదురవుతాయి. మరోవైపు ఎక్కువ రోజులు స్పేస్‌లో ఉండటం వల్ల బుచ్ విల్మోర్ కంటే సునీతా విలియమ్స్ మానసికంగా, శారీరకంగా చాలా ఒత్తిడికి గురయ్యారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రోనాట్లిద్దరికి ప్రత్యేక చికిత్స అందించాల్సి ఉంటుంది. అందువల్ల కొన్ని నెలల తర్వాతే వారిద్దరూ మళ్లీ సాధారణ జీవన స్రవంతిలోకి రాగలరు.










Comments