
మాదకద్రవ్యాలు సమాజంపై ఎంత దుష్ప్రభావం చూపుతున్నాయో? యువతను ఎంత నాశనం చేస్తున్నా యో? కొత్తగా చెప్పక్కర్లేదు. మాదకద్రవ్యాల్లో(డ్రగ్స్)లో కీలకమైనది గంజాయి. అనేక డ్రగ్స్ తయారీలో ఇదే ముడిసరుకుగా ఉపయోగపడుతోంది. అదే సమయంలో గంజాయిని సిగరెట్లు, చుట్టలు, బీడీల మాదిరిగా కూడా వాడవచ్చు. సమాజానికి హానికరంగా మారిన గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రంతో పాటు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్నో కఠిన చట్టాలు అమలు చేస్తున్నాయి. మనదేశంలోనే కాకుండా అనేక ప్రపంచ దేశాల్లోనూ గంజాయిని నిషేధిత పదార్థంగానే పరిగణిస్తున్నారు. దాన్ని సాగుచేసినా, రవాణా చేసినా, క్రయ విక్రయాలు జరిపినా, సేవించినా తీవ్ర నేరంగా పరిగణించి అరెస్టుచేసి జైల్లో పెడతారు. గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల రవాణా, అమ్మకాలను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్రాల స్థాయిలో నార్కోటిక్స్ బ్యూరో వంటి అనేక ప్రత్యేక విభాగాలు పని చేస్తున్నాయి. ఎన్నో కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి. సమాజం నుంచి కూకటి వేళ్లతో పెకిలించి వేసేందుకు ప్రభుత్వాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. కానీ చిత్రంగా కొన్ని రాష్ట్రాలు మాత్రం గంజాయి సాగును చట్టబద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో గంజాయి సాగుపై నిషేధం ఎత్తివేసి మిగతా పంటల్లా సాగు చేసుకునే అవకాశం కల్పించాయి. ఇప్పుడు ఆ జాబితాలో హిమాచల్‌ప్రదేశ్ చేరింది. గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ కొద్దిరోజుల క్రితమే ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాంతో ఆ రాష్ట్రంలో గంజాయికి గేట్లు తెరిచినట్లే. అయితే కేవలం ఔషధాల తయారీలో వినియోగానికి, పారిశ్రామిక అవసరాలకే గంజాయి సాగుకు అనుమతి ఇచ్చినట్లు ఆ రాష్ట్ర రెవెన్యూమంత్రి జగ్జీత్‌సింగ్ నేగి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దీనికి అనుమతి ఇచ్చే ముందు పెద్ద కసరత్తే చేశామని ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవానికి 2022లోనే హిమాచల్‌ప్రదేశ్‌లో గంజాయి సాగుకు అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది. అయితే అప్పట్లో తుది నిర్ణయం తీసుకోకుండా దీనిపై అధ్యయనానికి ఒక కమిటీని వేశారు. ఇప్పటికే గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించిన రాష్ట్రాలు అనుసరిస్తున్న విధివిధానాలను పరిశీలించిన అనంతరం ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రూపొందించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందని జగ్జీత్‌సింగ్ వివరించారు. ప్రతిపక్షాలు కూడా దీన్ని అంగీకరించాయని, ఔషధ, పారిశ్రామిక వినియోగానికి మినహా ఇతర రూపాల్లో దుర్వినియోగానికి ఆస్కారం లేకుండా చట్టంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. గంజాయి సాగును చట్టబద్ధం చేయ డంతో రాష్ట్రంలో ఆ పంట సాగు విస్తృతం కానుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనివల్ల రైతులకు మేలు జరగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మంచి ఆదాయం సమకూరుతుంది. దేశవ్యాప్తంగా గంజాయి సాగుపై నిషేధం ఉన్నా.. ఔషధ, పారిశ్రామిక వినియోగం పేరుతో మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్, ఉత్త రాఖండ్ రాష్ట్రాల్లో గంజాయి సాగు ఇప్పటికే చట్టబద్ధంగా జరుగుతోంది. అలాగే ప్రపంచంలో అధికశాతం దేశాలు గంజాయిని నిషేధిత మత్తుపదార్థంగా పరిగణిస్తూ, దాని సాగును చట్టవ్యతిరేకంగా ప్రకటించి నిషేధం అమలు చేస్తున్నా కొన్ని దేశాలు మాత్రం సాగుకు పరిమితంగా అనుమతిస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే జర్మనీ లో గంజాయి సాగును చట్టబద్ధం చేశారు. ఒక్కో ఇంట్లో మూడు మొక్కలకు మించకుండా పెంచుకోవడానికి జర్మనీ ప్రభుత్వం అనుమతించింది. మరోవైపు దీని సాగుకు అనుమతించిన తొలి ఆసియా దేశంగా థాయ్ లాండ్ నిలిచింది. ఆ దేశంలో 2022లోనే గంజాయి సాగు, విక్రయాలకు చట్టబద్ధత కల్పించారు. గంజాయి మత్తు కలిగించే ఉత్ప్రేరకమే అయినప్పటికి దానిలో విశేషమైన ఔషధ గుణాలున్నాయన్నది వాస్తవం. అయితే మొదటి నుంచీ ఇది మత్తుపదార్థంగానే ప్రచారంలో ఉంది. గంజాయి నుంచి మార్జువానా, హషీస్, హెరాయిన్ తదితర పలు రకాల మాదకద్రవ్యాలను తయారు చేస్తుంటారు. ఈ కారణంగానే అధిక శాతం దేశాలు, రాష్ట్రాలు గంజాయితో పాటు ఇతర డ్రగ్స్‌ను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. దీనికోసం ఎన్నో కఠిన చట్టాలను అమలు చేస్తున్నాయి. అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాలు, బృందాలను నియోగిస్తున్నాయి. మరోవైపు గంజాయి సహా మత్తుపదార్థాల రవాణా, విక్రయాలకు ప్రపంచవ్యాప్తంగా మాఫియా ముఠాలు బలమైన నెట్‌వర్క్ ఏర్పరచుకుని పనిచేస్తున్నాయి. దీని ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వస్తుండటమే డ్రగ్స్ మాఫియా వేళ్లూనుకోవడానికి దోహదం చేస్తోంది. మన దేశంలో ఏపీ, తెలం గాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బీహార్ సహా పలు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తూ అక్రమంగా రవాణా చేస్తున్నారు. గిరిజనులు, యువత కాసులకు ఆశపడి ఈ దందాల్లో భాగస్వాములవుతున్నారు. పోలీసు లు ఎన్నిసార్లు పట్టుకుని జైళ్లలో పెట్టినా, బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అదే పని చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకదాని తర్వాత ఒకటిగా రాష్ట్రాలు ఔషధ, పారిశ్రామిక అవసరాల పేరుతో గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తే అది దుర్వినియోగం కావడం తథ్యమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పూర్తిగా నిషేధం ఉండి జైళ్లపాల వుతున్నా గంజాయి అక్రమ రవాణా తగ్గకపోగా నానాటికీ పెరుగుతోందని పోలీసు అధికారులు చెబుతున్నారు. అలాంటిది ఏ పేరుతోనైనా పాక్షికంగా సాగుకు, అమ్మకాలకు అనుమతిస్తే.. అది పూర్తిగా దుర్వినియోగమయ్యే ప్రమాదముందంటున్నారు. ఔషధాలు, పారిశ్రామిక అవసరాల ముసుగులో గంజాయి అక్రమ వ్యాపారం విశృం ఖలంగా పెరిగిపోతే.. సమాజంపై దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందన్నది ఆందోళన కలిగించే అంశం.
Comments