హెచ్‌ఎంలపై సస్పెన్షన్ తొలగింపు
- NVS PRASAD
- Mar 28
- 2 min read
ఉత్తర్వులు జారీ చేసిన ఆర్‌జేడీ
ఉపాధ్యాయ సంఘాల విజయం
డీఈవోను మార్చి విద్యార్థుల డిబార్ ఎత్తేసేవరకు కొనసాగనున్న పోరాటం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇన్విజిలేటర్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్‌లు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని 14మందిని సస్పెండ్ చేసిన కేసులో గురువారం రాత్రి ఏడుగురు ఉపాధ్యాయులకు రీఇన్‌స్టెంట్‌మెంట్ ప్రొసీడిరగ్స్ ఇవ్వగా, తాజాగా విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ మరో ముగ్గురిపై సస్పెన్షన్ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఈఓ ఉపాధ్యాయుల కేడర్‌లో సస్పెండ్ అయిన వారికి రీఇన్‌స్టెంట్‌మెంట్ చేయగా, ప్రధానోపాధ్యాయునిగా ఉంటూ సస్పెండైన లావేరు మండలం కేశవరాయునిపాలెం జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు దుర్గాప్రసాద్, కొత్తపేట జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు మొదలవలస లక్ష్మణరావులపై విధించిన సస్పెన్షన్‌ను నివేదిక వచ్చేవరకూ తొలగిస్తున్నట్లు శుక్రవారం తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ కేసులలో సస్పెండైన 14 మంది విద్యాశాఖ ఉద్యోగుల్లో తొమ్మిదిమందిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నట్లయింది. అయితే ఆర్‌జేడీ రీ ఇన్‌స్టెంట్‌మెంట్ మరో ప్రధానోపాధ్యాయురాలు కుప్పిలి జెడ్పీ హైస్కూల్‌లో పని చేస్తున్న పద్మకుమారిపై సస్పెన్షన్ ఎత్తేశారా, లేదా ఇంకా తేలలేదు. ఎందుకంటే ఈమెతో పాటు ఆరుగురిపై డీఈఓ తిరుమల చైతన్య క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇందులో పద్మకుమారి కూడా ఉన్నారు. దీంతో ఈమె నుంచి ఆర్‌జేడీ కార్యాలయం ఇంతవరకు వివరణ కోరకపోవడంతో ఈమెను రీ ఇన్‌స్టెంట్‌మెంట్ చేశారా లేదా అన్నది ఇంతవరకు తేలలేదు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి జిల్లా కలెక్టర్‌ను కలిసిన వివిధ ఉపాధ్యాయ సంఘ నేతలు తిరుమలచైతన్యను రిలీవ్ చేసేవరకూ తమ ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. డీఈఓను తొలగించే అధికారం లేదని కలెక్టర్ చెప్పడంతో ఆయనను కనీసం సరెండర్ అయినా చేయాలని ఉపాధ్యాయ వర్గాలు కలెక్టర్‌ను కోరాయి. ఆయనంత నిజాయితీపరుడు లేడని జిల్లాలో కలెక్టర్లకు తప్పుదోవ పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నాడని, ఆయన వలన జిల్లాకు చెడ్డపేరు వచ్చిందని, ఆయనను తప్పించి విచారణ జరిపించాలని కలెక్టర్‌ను కోరారు. దీంతో డీఈఓ పరిధిలో ఉన్న ఉపాధ్యాయుల సస్పెన్షన్లు ఎత్తివేయాలని కలెక్టర్ ఆదేశించడంతో ఏడుగురికి సంబంధించిన ప్రొసీడిరగ్స్‌ను గురువారం రాత్రే విడుదల చేశారు. మిగిలినవారిలో ముగ్గురు ప్రధానోపాధ్యాయులు ఆర్‌జేడీ పరిధిలో ఉండడంతో ఆయనతో కూడా కలెక్టర్ మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికి విముక్తి లభించింది. పద్మకుమారికి కూడా సస్పెన్షన్ ఎత్తివేస్తారని భోగట్టా. కుప్పిలి జెడ్పీ హైస్కూల్‌లో ఇన్విజిలేషన్ విధుల్లో లేని ఒక ఇంగ్లీష్ ఉపాధ్యాయుని చేతిలో ఆన్సర్‌షీట్స్ ఉన్నాయన్న కారణంతో పద్మకుమారిని సస్పెండ్ చేయాలంటే డీఈఓ తిరుమలచైతన్య ఆర్‌జేడీకి సిఫార్సు చేశారు. అయితే ఇప్పుడు ఆమెతో పాటు డిబార్ అయిన ఐదుగురు విద్యార్థులను కూడా మళ్లీ పరీక్షలు రాసేందుకు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పరీక్షాపత్రాల రెండవ సెట్‌ను అయినా తీసి ఈ ఐదుగురికి విద్యార్థులకు అవకాశం కల్పించాలని కోరారు. లేదంటే ముందుగా ప్రకటించిన మేరకు తమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు.
Comments