top of page

హిట్‌ 3 నచ్చుతుంది

  • Guest Writer
  • May 2
  • 3 min read


వయలెన్స్‌తో కూడిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ను ఇష్టపడే వారికి హిట్‌ 3 నచ్చుతుంది

నాని ప్రారంభమైన రోజు నుంచి ఈ సినిమాపై అంచనాలు పెంచేలా ప్రమోషన్స్‌ చేసుకుంటూ వచ్చారు. అలాగే రిలీజ్‌ కు ముందు పిల్లల్ని, సున్నిత మనస్కులని ఈ సినిమాకు రావద్దు అని చెప్పాడు. అయితే ఫ్యామిలీ లో ఎంతో క్రేజ్‌ ఉన్న నాని.. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా మోస్ట్‌ వయలెంట్‌ గా కనిపిస్తూ ఇలా ప్రమోట్‌ చేయడం చాలా మందిని ఆశ్చర్యంలో పడేసింది. ఈ క్రమంలో రిలీజైన హిట్‌ 3 ఎలా ఉంది? హింసనే పూర్తిగా నమ్ముకున్న నాని, సక్సెస్‌ అందుకున్నాడా రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

వైజాగ్‌ హిట్‌ టీమ్‌లో ఎస్‌.పి అర్జున్‌ సర్కార్‌ (నాని) దేనికీ లొంగడు.. ఎవరినీ వదలుడు. చాలా రూత్‌లెస్‌గా వెళ్తుంటాడు. సమాజంలో క్రిమినల్‌ అనేవాడు ఉండకూడదు, ఉన్నా వాడు బ్రతకకూడదు అనేది అతని లక్ష్యం. అలా చాలా టఫ్‌గా క్రిమినల్స్‌కు సవాల్‌ విసురుతున్న అర్జున్‌ కి వరస పెట్టి దేశవ్యాప్తంగా జరుగుతున్న హత్యలు గురించి తెలుస్తుంది. అందులో రెండుచోట్ల జరిగిన హత్యలు ఒకేలా ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. అనుమానంలో పడేస్తుంది. తనదైన శైలిలో ఇన్విస్టిగేషన్‌ చేస్తాడు. ఆ క్రమంలో సి.టీ.కే అనే డార్క్‌ వెబ్‌సైట్‌ గురించి తెలుస్తోంది. ఆ సైట్‌ ద్వారా కొన్ని హత్యలు జరుగుతున్నాయని అర్థమవుతుంది. ఆ ఆ సైట్‌ చాలా డేంజర్‌ అని, దాని ద్వారా సైకోకిల్లర్స్‌ వరుసగా హత్యలు చేస్తున్నారని అర్జున్‌ గుర్తిస్తున్నారు. అలా సైకోకిల్లర్స్‌ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారని అర్థం చేసుకుంటారు. దేశవ్యాప్తంగా అప్పటికే 13హత్యలు జరుగుతాయి. అప్పుడు ఆ కేసులోకి అర్జున్‌ సర్కార్‌ ఓ సైకోకిల్లర్‌గా వస్తాడు. అప్పుడు ఏమైంది. ఇంతకీ, ఆ డార్క్‌ వెబ్‌సైట్‌ రన్‌ చేస్తున్న సైకో కిల్లర్‌ ఎవరో ఎలా తెలుసుకున్నాడు?, ఆ సైకో కిల్లర్‌ మోటో ఏంటి?, చివరకు ఆ కిల్లర్స్‌ను అర్జున్‌ సర్కార్‌ ఎలా అంతం చేశాడు? ఈ మధ్యలో అర్జున్‌ జీవితంలోకి ప్రేమ పేరుతో వచ్చిన మృదుల (శ్రీనిధిశెట్టి) ఎవరు?, ఆమె ఎందుకు అర్జున్‌ సర్కార్‌ లైఫ్‌లోకి వస్తుంది ?, అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:

అర్జున్‌ సర్కార్‌ ఓ పోలీస్‌ కాదు, క్రిమినల్‌ అని.. అతనిపై చర్యలు తీసుకోవాలి అంటూ కోర్టు, కేసుల హడావుడితో సినిమా మొదలవుతుంది. జైలులో అడుగుపెట్టిన అర్జున్‌.. అక్కడ తోటి ఖైదీలతో తాను జైలుకి ఎందుకు వచ్చాడో చెప్పుకోవడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అయిన సర్కార్‌.. సైకో కిల్లర్‌ తరహాలో హత్యలు ఎందుకు చేస్తున్నాడు అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది.

ఆ తర్వాత అసలు అర్జున్‌ ఇలా ఎందుకు చేస్తున్నాడో రివీల్‌ అవుతుంది. అలా స్క్రీన్‌ప్లేని కాస్త క్యూరియాసిటీ కలిగేలా డిజైన్‌ చేశారు. సైకోల మధ్యలోకి సైకో లాంటి పోలీస్‌ ఎంటరైతే ఎలా ఉంటుంది? అనేలా సెకండాఫ్‌ నడిపారు. అయితే ఫస్టాఫ్‌ లో హీరో గురించి చెప్పే సీన్స్‌ ,ఆ క్రమంలో వచ్చే కాశ్మీర్‌ బ్యాక్‌ డ్రాప్‌ ఎపిసోడ్‌ లాగుతున్నట్లు అనిపిస్తాయి. ప్రీ ఇంటర్వెల్‌ లో సర్దుకుని ముందుకు వెళ్తారు. అలాగే సెకండాఫ్‌ ఎక్కువశాతం ఒకటే ప్లేస్‌లో జరుగుతుంది.

సాధారణంగా ఇన్విస్టిగేషన్‌ డ్రామాలు ‘ క్రైమ్‌ ఎవరు చేశారు?’ అనే పాయింట్‌ని బేస్‌ చేసుకుని ముందుకు వెళ్తాయి. కానీ ఈ కథ మాత్రం ‘ఆ క్రైమ్‌ని ఇప్పుడు ఎవరు, ఎలా ఆపుతారు?’ అనే యాంగిల్‌లో నడుస్తుంది. నిజానికి ఇది మరింత ఇంటెన్స్‌ కలిగించే ప్యాట్రన్‌. ఈ సినిమాలో స్టైల్‌ ఉంది, సబ్‌స్టెన్స్‌ తక్కువైంది. ఇంతవరకు వచ్చిన హిట్‌ సిరీస్‌లో ‘ఇన్వెస్టిగేషన్‌’కి ప్రాముఖ్యత ఎక్కువగా ఉండేది. ఓ నేరం జరుగుతుంది, ఆ తర్వాత దాన్ని ఛేదించడం లో పోలీసుల పాత్ర కీలకం అవుతుంది. కానీ హిట్‌`3 మాత్రం దానికి భిన్నంగా, బోల్డ్‌గా వెళ్లింది. ఇందులో కేసులు ఛేదించడానికంటే, హీరో క్రైమ్‌ నెట్వర్క్‌లోకి వెళ్లి వారిని మట్టికరిపించడమే ప్రధాన ఎలిమెంట్‌.

దాంతో ఇన్వెస్టిగేటివ్‌ డెప్త్‌ ఈసారి తక్కువైంది. అందుకు బదులుగా మాస్‌ యాక్షన్‌, థ్రిల్స్‌ ఎక్కువ . కథలో ఫ్యామిలీ, రొమాన్స్‌ లాంటి ట్రాక్‌లు కూడా ఉన్నాయి. కానీ అవి స్క్రీన్‌ టైమ్‌ పరంగా చాలా తక్కువ. సముద్రఖని, నానిల మధ్య వచ్చే తండ్రి-కొడుకు సన్నివేశాలు బాగున్నాయి, ఫన్‌ కూడా ఉంది. కానీ అసలైన హైలైట్‌ - నాని మాట్లాడే మాస్‌ డైలాగ్స్‌. గన్ను నుండి బుల్లెట్లు వచ్చినట్లు వస్తాయి. వాటిలో ఉన్న బోల్డ్‌నెస్‌, బూతు పదాలు కొంత ఇబ్బంది అనిపించినా, యూత్‌కు రీచ్‌ అవుతాయనే ఆశ మేకర్స్‌ లో కనపడుతోంది.

సెకండ్‌ హాఫ్‌ లో కథ అసలు డెప్త్‌ గా వెళ్ళింది. అక్కడ సీన్స్‌ స్క్విడ్‌గేమ్‌ను గుర్తు చేస్తాయి. క్లైమాక్స్‌లో అయితే సర్ప్రైజ్‌ ఎంట్రీతో మరో ఇద్దరు హీరోలు రావడం ఫ్రంట్‌ బెంచర్ల పండుగ.

ఇక నెగటివ్‌ విషయానికొస్తే కథలో కొత్తదనం లేదు. రన్‌ టైమ్‌ కూడా కాస్త లెంగ్తీగా అనిపిస్తుంది. అయితే, స్క్విడ్‌గేమ్‌, కిల్‌బిల్‌, జాన్‌ విక్‌ లాంటి సినిమాల నుంచి క్లియర్‌గా ఇన్స్పైర్‌ అయినట్లు అర్థమవుతోంది.

టెక్నికల్‌గా చూసినప్పుడు..

సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్‌ కథ టోన్‌కు తగినట్టే ఉన్నాయి. స్క్విడ్‌గేమ్‌ తరహా ఆర్ట్‌ డిజైన్‌లను బాగా క్యాప్చర్‌ చేశారు. డైరెక్టర్‌ శైలేష్‌ కొలను తన వైద్యవృత్తి నేపథ్యాన్ని ఉపయోగించి, కథలో కొన్ని మెడికల్‌ ఎలిమెంట్స్‌ బాగా కలిపారు. చాలా వరకూ వయలెన్స్‌ తో నింపేసినా దాన్ని ‘న్యాయమైన’ది అనిపించేలా చూపించారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం బాగుంది కానీ. కానీ మెమరబుల్‌ అనిపించదు. నిర్మాణంగా చూసుకుంటే స్వంత బ్యానర్‌ తో కలసొచ్చిన ప్రొడక్షన్‌ వాల్యూస్‌ సినిమాకు గ్రాండ్‌ లుక్‌ ఇచ్చాయి. కానీ మధ్య మధ్యలో కథ పట్టు తప్పినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల డ్రాగ్‌ అయిందన్న ఫీల్‌ వస్తుంది.

నటీనటుల్లో..

నాని పెర్ఫార్మెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పాత్రలో పూర్తిగా లీనమై, ఆ పాత్రే అయిపోయాడు. సినిమా మొత్తం మీద అదే అసలైన డ్రైవింగ్‌ ఫోర్స్‌ నాని నే. శ్రీనిధి శెట్టి పాత్ర తక్కువగానే మిగిలింది. ఆమెకు పెద్దగా చేయడానికి ఏం లేదు.విలన్‌ బిల్డప్‌ బాగుంది, కానీ ఆ క్యారెక్టరైజేషన్‌ మాత్రం పక్కాగా రాలేదు. మిగిలిన సపోర్టింగ్‌ క్యారెక్టర్‌ కూడా అంతగా గుర్తుండిపోయేలా లేరు. మొత్తంగా చూస్తే.. ఇది నాని మోసిన సినిమా.

ఫైనల్‌ థాట్‌ : ఫైనల్‌గా, హిట్‌ థర్డ్‌ కేస్‌ నానిని కొత్తగా, ఫ్యామిలీ ఆడియన్స్‌ అనే కంఫర్ట్‌జోన్‌ నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. నాని చాలా ఈజ్‌తో ఈ సినిమా చేసేసాడు. ఈ చిత్రం స్క్విడ్‌ గేమ్‌ నుండి ఇన్స్పైర్‌ అయినా, కొత్తగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ సోసోగా వెళ్లిపోయినా సెకండాఫ్‌ లో అసలు విషయం అంతా ఉంది. కాకపోతే ఇంకాస్త బాగా చేయాల్సిన సినిమా. హింస ఎక్కువగా ఉందని ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఫ్యామిలీలకు కష్టమే.

జోశ్యుల సూర్యప్రకాశ్‌

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page