రూ.కోటి తీసుకొని రికార్డులు మార్చేసిన తహసీల్దార్
సొంత దాయాదికే సున్నం రాసిన బాబాయ్ అబ్బాయ్‌లు
ఒకే భూమిపై ఇద్దరికి హక్కులిచ్చిన రెవెన్యూ కార్యాలయం
తప్పుడు పత్రాలతో రిజిస్ట్రార్ ఆఫీసులో సవరణ
తవ్వేకొద్దీ బయటపడుతున్న కస్పాభూముల్లో ఆక్రమాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఒకే భూమి.. ఒకే సర్వే నెంబరు.. హక్కు కోసం ఇద్దరు దాయాదుల పోరు. ఇందులో ఈ భూమి మీద సర్వహక్కులు ఉన్నాయని ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్ ఒకరికిచ్చారు. అదే భూమికి 1బి అడంగల్‌తో పాటు అవసరమైన అన్ని కాగితాలపై సంతకాలు చేసి ఒకే రోజు అందించేశారు. ఇదీ శ్రీకాకుళంలో తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ మాయాజాలం. దీని మీద ఎవరు ఎవరి తరఫున ప్రశ్నించినా ఒక పత్రం రెడీగా పెట్టుకోవడం తహసీల్దార్ కార్యాలయంలో పరిపాటి. ఫలానా భూమిని వేరే వారికి ఎంజాయ్ చేయమని సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారని ఎవరైనా ప్రశ్నిస్తే, లేదు లేదు వేరేవారికి అడంగల్ ఇచ్చామని చెబుతారు. వారికెందుకు అడంగల్ ఇచ్చారని ప్రశ్నిస్తే, లేదు లేదు ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్ అసలైనవారికే ఇచ్చామని దాటవేస్తారు. చేతికి మట్టి అంటకుండా నగరంలో ఉన్న భూమి ధరలను ఆసరాగా చేసుకొని కోట్లాది రూపాయలు కొట్టేశారు. ఇందులో భూమిపై హక్కు కోసం పోరాడుతున్నవారి జుట్లకు ముడేసి వారిలో వారు కొట్టుకుంటే ఎంచక్కా ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయిన తహసీల్దార్ కోట్ల రూపాయలు పోగెట్టుకున్నారు.
స్థానిక దండివీధిలో కస్పా కుటుంబ వారసులు పంపకాలు చేసుకున్న తర్వాత కూడా భూదాహంతో కనిపించిన ఖాళీ స్థలాలను కస్పా రమాప్రభు, కస్పా శివశరణ్ ఆక్రమించి రికార్డులు మార్పులు చేసి విక్రయించేస్తున్నారని గతంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు ‘సత్యం’లో కథనం ప్రచురించిన విషయం విదితమే. పిత్రార్జితంగా వచ్చిన భూములుగా రికార్డులు సృష్టించి పంపకాల్లో దఖలుపడిన భూమికంటే ఎక్కువ విక్రయించేశారని ఈ కథనంలో పేర్కొన్నాం. కస్పా బాబాయ్ అబ్బాయ్‌ల బాధితులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. బెదిరించి దౌర్జన్యం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా సివిల్ మేటర్ అంటూ బాధితులను నెట్టేస్తున్నారు. దీనిపై నాలుగుసార్లు ఒక బాధిత కుటుంబం సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కావాలని కోరినా ఇవ్వడం లేదు. కోరుతున్న సమాచారం కాకుండా వేరే సమాచారం ఇచ్చి రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా మండల రెవెన్యూ అధికారుల్లో చలనం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అప్పటి రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు అండదండలతో పనిచేసిన వీఆర్‌వో గజపతి ద్వారా రికార్డులు మార్పులు చేశారని బాధితులు చెబుతున్నారు.
స్వయంగా బాధితులు అందించిన వివరాల మేరకు చిత్తరంజన్ వీధికి చెందిన కస్పా రమాప్రభుకు పూర్వీకుల నుంచి డాక్యుమెంట్ 1161/1901 ప్రకారం వచ్చిన భూమిని విక్రయించేసిన తదనంతర కాలంలో పిత్రార్జితంగా దఖలుపడినట్టు చూపించినా లింకు డాక్యుమెంట్లు లేని 2448/1965లో ఒక రిజిస్టర్ పంపకం దస్తావేజు చూపిస్తున్నారు. ఇందులో సర్వే నెం.248/2లో 2.50 ఎకరాలు, సర్వే నెంబర్‌లో 248/1లో 95 సెంట్ల భూమి కస్పా రమాప్రభు కుటుంబానికి దఖలుపడినట్లు ఉంది. కస్పా రమాప్రభు పూర్వీకులు లక్ష్మీపట్నాయక్ రాసిన రిజిస్టర్డ్ వీలునామాలో దాయాదుల పంపకం ద్వారా వచ్చిన ఆస్తిని కొంత విక్రయించగా, మిగిలిన భూమి 248/1లో 60 సెంట్లు, 248/2లో ఎకరాతో కలిపి మొత్తం 1.60 ఎకరాల భూమి ఉన్నట్టు పేర్కొన్నారు. ఇందులో కస్పా రమాప్రభు తల్లి, ఐదుగురు అక్క చెల్లిళ్లకు 34 సెంట్ల భూమిని పంచి మిగతా 1.25 ఎకరాల భూమి రమాప్రభుకు వాటాగా ఇచ్చారని చూపించారు. రమాప్రభు తండ్రి 2000 మే 28న మృతి చెందారు. ఆయన మృతి చెందిన ఐదు నెలల్లో కస్పా రమాప్రభు సర్వే నెంబర్ 248/1,2లో మొత్తం 1.92 ఎకరాల భూమిని 49 మందికి విక్రయించేశాడు. పిత్రార్జితంగా దఖలు పడిన భూమి కంటే 32 సెంట్లు ఎక్కువ భూమి నకిలీ డాక్యుమెంట్లతో విక్రయించినట్లు డాక్యుమెంట్ లెక్క ప్రకారం అర్థమవుతుంది. 2010లో సర్వే నెంబర్ 248/1లో 1.39 ఎకరాల భూమి, 248/2లో 2.50 ఎకరాలు ఉన్నట్టు రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ జరిగిందనేది బలమైన ఆరోపణ. దీనికి అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు భూ వ్యవహారాలన్నీ చూసిన వీఆర్వో గజపతే సూత్రధారి అన్న ఆరోపణ కూడా అంతే బలంగా ఉంది. ట్యాంపరైన భూమికి సంబంధించి పట్టా నెం.72 ద్వారా నకిలీ పాస్‌పుస్తకం సృష్టించారు. ఇక్కడి వరకు ఒకలెక్క. కానీ కస్పా రమాప్రభు స్వయంగా తన దాయాదుల భూమినే ఆక్రమించేశారన్న ఫిర్యాదు కూడా ఉంది.
కస్పా కుటుంబ వారసుల్లో ఒకరైన కస్పా కామేశ్వరరావుకు చెందిన భూమిని రమాప్రభు ఆక్రమించి 2003 నవంబర్ 11న రెవెన్యూ అధికారులు ఇచ్చినట్టు ఒక ఫేక్ పొజిషన్ సర్టిఫికేట్‌ను సృష్టించినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కస్పా కామేశ్వరరావుకు ఐదుగురు కుమారులు. ఇందులో ముగ్గురు దండివీధిలో సర్వే నెం.248/2లో 3 ఎకరాల భూమిలో 2.15 ఎకరాలు 2003 ఆగస్టు 20న అమ్మేశారు. కొనుగోలుదారులు రెవెన్యూ రికార్డులో మార్పు చేసుకొని అంతర్గత రోడ్లు వేసి సుమారు 44 ప్లాట్స్‌గా వేసి విక్రయించుకున్నారు. సర్వే నెం.248/2లో 3 ఎకరాల భూమిలో 2.15 ఎకరాలు విక్రయించగా మిగిలిన 85 సెంట్లు వీరి స్వాధీనంలోనే ఇప్పటికీ ఉంది. అయితే కస్పా కామేశ్వరరావుతో పాటు, ఆయన కుమారుల్లో ముగ్గురు మృతి చెందడం, మరొకరు మంచానికే పరిమితం కావడంతో వారి భూములను కస్పా రమాప్రభు తన పేరుతో రికార్డుల్లోకి ఎక్కించి విక్రయించేస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. స్వాధీన హక్కులు, 1901, 1965 నాటి రికార్డులు, డాక్యుమెంట్లు ఉన్నా రెవెన్యూ అధికారులు మేనేజ్ చేసి రమాప్రభు వాటిని సొంతం చేసుకుంటున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సర్వే నెం.248/2లో మిగిలిన 85 సెంట్లకు 1బి, అడంగల్, మ్యుటేషన్ కోసం కస్పా కామేశ్వరరావు కుటుంబ వారసులు గత ఏడాది జూన్ 5న దరఖాస్తు చేశారు. సర్వే చేసిన రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్ 248/1లో 85 సెంట్ల భూమి కస్పా కామేశ్వరరావు కుటుంబ సభ్యుల పేరిట ఎంజాయ్‌మెంట్ సర్వే రిపోర్టు ఇచ్చారు. మరోవైపు కస్పా రమాప్రభుకు అదే భూమిపై పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఒకే రోజు తహసీల్దారు సంతకంతో 12 అడంగల్ కాపీలను ఇచ్చేశారు. ఇదేమిటని ప్రశ్నించినందుకు తమపై తహసీల్ధారు బైండోవర్ కేసు పెట్టించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు బదిలీపై వెళ్లిన సమయంలో వీఆర్వో గజపతి ద్వారా పెద్ద మొత్తంలో నగదు ముట్టజెప్పి కస్పా రమాప్రభు పేరున రికార్డులు మార్పు చేసి భూమిపై హక్కులను దఖలుపరిచారని బాధితులు ఆరోపిస్తున్నారు.
అక్కడితో ఆగకుండా కస్పా కామేశ్వరరావుకు పిత్రార్జితంగా దఖలు పడిన టీపీఎం స్కూల్‌కు దగ్గరలో ఉన్న సర్వే నెంబర్ 248/3లోని 1.37 ఎకరాల భూమిని జిల్లాపరిషత్ దగ్గరలో ఉన్న సర్వే నెంబర్ 248/1లో ఉన్నట్టు చూపిస్తూ రమాప్రభు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి సుమారు 20 సెంట్ల భూమిని ఒక్కొక్కరికి నాలుగు సెంట్లు చొప్పున ఐదుగురికి విక్రయించేశారు. ఇందులో ఇద్దరు పోలీసులు ఉన్నారు. ఈ ఇద్దరిలో హైదరాబాద్‌లో సర్వీస్ చేస్తున్నట్టు చెబుతున్న తర్రా సన్యాసిరావు భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేశారని తెలిసింది. దీనిపై సన్యాసిరావును అడ్డుకొని సర్వే చేయించాలని రమాప్రభు బాధితులు కోరినా కుదరలేదు. సన్యాసిరావుపై ఈ ఏడాది ఫివ్రబరి 28న పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఒకటో పట్టణ పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దౌర్జన్యం చేస్తున్న సమయంలో బాధిత మహిళలు డయిల్ 100కు సమాచారం ఇస్తే, తమ వాహనం పోయిందని ఫిర్యాదు చేసినట్టు కంప్లయింట్‌లో రాసి, ఆ తర్వాత దాన్ని డిశ్చార్జ్ చేశారని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. మరోవైపు సర్వే నెంబర్ 248/3లో స్థలం కొనుగోలు చేసినవారు ప్లాన్ అప్రూవల్ కోసం నగరపాలక సంస్థ అధికారులను ఆశ్రయించగా తప్పుడు సర్వే నెంబర్ నమోదు చేశారంటూ తిరస్కరించారు. దీంతో రమాప్రభు తప్పుడు పత్రాలు చూపించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సవరణ చేయించినట్టు అర్థమవుతుంది. లేదంటే రిజిస్ట్రార్ ఆఫీసును కూడా వీఆర్వో గజపతి మేనేజ్ చేసివుండొచ్చన్న అనుమానాలు కూడా ఉన్నాయి. గతంలో శ్రీకూర్మం గ్రామానికి చెందిన దాసుమహంతి మాధవేశ్వరరావుకు చెందిన భూమిని ఆక్రమించుకున్నట్టు రమాప్రభుపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. రమాప్రభు ఆక్రమించిన భూమిని ఆమదాలవలసకు చెందిన ఒక టీడీపీ నాయకుడికి విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులను, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులను ఆశ్రయించి వ్యవహారం నడుపుతున్నట్టు రమాప్రభు బాధితులు ఆరోపిస్తున్నారు.
Comments