` అక్రమాల్లో సేమ్ టు సేమ్
`కేసుల నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వ సొమ్ము
`ఉన్నత విద్యామండలి పరిధిలో 60 మందికి అప్పనంగా పోస్టింగులు
`స్థానిక వర్సిటీలో గత వీసీ వెంకట్రావుదీ అదే దందా
`రబ్బర్‌స్టాంప్ వీసీలను పెట్టుకుని హేమచంద్రారెడ్డి అక్రమాలు
` ముడుపులు స్వీకరించి ప్రైవేట్ వర్సిటీలకు అనుమతులు
స్థానిక వర్సిటీలో అడ్డగోలుగా ఉద్యోగాలు పీకేయడం, అనుయాయులకు పదవులు కట్టబెట్టడం వంటి వ్యవహారాలపై కోర్టుకు వెళితే అక్కడ కౌంటర్ దాఖలు చేయకుండా జాప్యం చేయడానికి, కోర్టులు స్టే ఇచ్చినా ఇక్కడ అమలుచేయకుండా తనకు దన్నుగా నిలిచిన కొందరికి పాత వీసీ నిమ్మ వెంకటరావు వేలకు వేలు గౌరవ వేతనం చెల్లించుకుంటూపోయారు. నిమ్మ వెంకటరావుకు ముందున్న వీసీలు చెల్లించిన దానికి నాలుగు రెట్లు హానరోరియం పెంచేసి కోర్టులో వర్సిటీకి వ్యతిరేకంగా ఉన్న కేసులు మునగకుండా తేలకుండా తన పదవీ కాలం పూర్తి అయ్యేవరకు జాప్యం చేసుకుంటూ వచ్చినవారికి మేలు చేసుకుంటూపోయారు. వర్సిటీపైన, నిమ్మ వెంకటరావు పైన జిల్లా కోర్టు నుంచి హైకోర్టు వరకు అనేక కేసులు ఉన్నాయి. ఇవన్నీ నిమ్మ వెంకటరావు స్వయంకృతం. అయితే స్టూడెంట్లు కట్టిన ఫీజుల నుంచి లక్షలాది రూపాయలు వెచ్చించి పదవి నుంచి దిగిపోయేవరకు కోర్టుకు వెళ్లకుండా నిమ్మ వెంకటరావు తనను తాను రక్షించుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ఎంతమంది ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆప్షే మాజీ చైర్మన్ హేమచంద్రారెడ్డిపై ఆరోపణలు వచ్చిన తర్వాత ఆరా తీస్తే రాష్ట్రస్థాయిలో ఆయనా ఇదే పని చేశారు కాబట్టే నిమ్మ వెంకటరావు అండ్ బ్యాచ్ దాన్ని అనుసరించినట్లు తెలుస్తోంది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి పరిధిలో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో పని చేస్తున్నా ఏనాడూ పట్టించుకోని హేమచంద్రారెడ్డి తనకు నచ్చితే మాత్రం ఎటువంటి నిబంధనలు అడ్డొచ్చినా పక్కన పెట్టేసి లక్షల రూపాయల విద్యార్థుల ఫీజుల సొమ్ములు కట్టబెట్టేశారు. ఈ ఖర్చులకు పాలకమండలి అనుమతులు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. హేమచంద్రారెడ్డి హయాంలో ఉన్నత విద్యామండలికి కన్సల్టెంట్‌గా పని చేసిన ఒక వ్యక్తికి రూ.75వేలు గౌరవ వేతనం ఉండేది. దాన్ని ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి రూ.లక్షకు పెంచేశారు. ఈయన పనేంటంటే.. కోర్టులో ఉన్నత విద్యామండలిపై ఎవరైనా పిటిషన్లు వేస్తే వాటికి కౌంటర్ అఫిడవిట్ల దాఖలు వంటివి చూడాలి. ఆ తర్వాత ఉన్నత విద్యామండలికి హైకోర్టులో ఓ స్టాండిరగ్ కౌన్సెల్ ఉన్నారు. ఆయన మిగతా వ్యవహారాలు చూసుకుంటారు. అయితే ఇప్పటి వరకు ఉన్నత విద్యామండలి పై దాఖలైన కేసులు ఎన్ని, ఏయే కోర్టుల్లో ఉన్నాయి, అవి ఏ స్థాయిలో ఉన్నాయన్న సమగ్రమైన డేటా సంబంధిత కార్యాలయంలో లేదు. అలాగే శ్రీకాకుళంలో వర్సిటీకి సంబంధించి కేసులు చూడటానికి ప్రత్యేకంగా ఒక న్యాయవాదిని పెట్టుకున్నారు. ఈయన ఆప్షే స్టాండిరగ్ కౌన్సెల్‌తో కలిపి పని చేస్తారు. అయితే నిమ్మ వెంకటరావు హయాంలో వర్సిటీని భ్రష్టుపట్టించేయడం వల్ల అనేక కేసులు హైకోర్టుకు వెళ్లాయి. దీంతో వర్సిటీ తరఫున అక్కడ కేసులు చూస్తున్న న్యాయవాది గౌరవ వేతనాన్ని నిమ్మ వెంకటరావు అమాంతం పెంచేశారు. అలాగే ఉన్నత విద్యామండలిలో క్యూఏసీ ప్రాజెక్టు ముసుగులో అక్కడ పనిచేసే నిబద్ధత గల అధికారుల మీద ఎస్సీ, ఎస్టీ కేసులు ఎలా పెట్టాలో సలహాలిచ్చేందుకు ఒక వ్యక్తిని రూ.50వేల గౌరవ వేతనానికి హేమచంద్రారెడ్డి పెట్టుకున్నారు. ఇందులో దేనికీ కౌన్సిల్ అప్రూవల్ ఉండదు. ఒకవేళ ఉందీ అని చూపిస్తే ఏదో ఒక కౌన్సిల్ సమావేశంలో తీర్మానించిన అజెండా కింద సంతకాలు చేసిన పత్రానికి వీటిని అదనంగా కలిపేస్తారు. అప్రూవల్ ఉందని చెప్పుకుంటారు.
విద్యార్థుల ఫీజులు అస్మదీయులకే
రాష్ట్రంలో హేమచంద్రారెడ్డి కుర్చీ వీడి వెళ్తేగాని ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల కాలేదు. ఎట్టకేలకు మంగళవారం విడుదల చేశారు. దీని వెనుక ప్రతి ఏడాది హేమచంద్రారెడ్డి మతలబులు చేసేవారు. మన పక్క రాష్ట్రంలో ఫలితాలు విడుదలై అడ్మిషన్లు పూర్తి అయినా ఇక్కడ మాత్రం సకాలంలో స్పందించిన దాఖలాలు లేవు. పక్క రాష్ట్రంలో కూడా ఈ ఎంట్రన్స్ రాసిన విద్యార్థులు రాష్ట్రంలో ఎప్పుడు ఫలితాలు విడుదలవుతాయో తెలియక అక్కడ ఉన్న ప్రతిష్టాత్మకమైన కాలేజీల్లో చేరిపోయాక తీరిగ్గా ఇక్కడ ఫలితాలు విడుదల చేసేవారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్ రాయడానికి చెల్లించిన ఫీజులను అస్మదీయులకు చెల్లించడానికే ఖర్చుపెట్టేవారు. హేమచంద్రారెడ్డి హయాంలో ఆయన చెంచాబ్యాచ్ దాదాపు 60మంది వరకు అపాయింట్ అయ్యారు. వీరందరి జీతాలు విద్యార్థులు కట్టే ఫీజుల నుంచే వెళ్తున్నాయన్న విషయం మర్చిపోకూడదు. హేమచంద్రారెడ్డికి నచ్చితే అందలం, నచ్చకపోతే పాతాళంలోకి తొక్కేసిన ఘటనలు కోకొల్లలు. విద్యాశాఖ మంత్రిగా ఎవరున్నా వారి పేషీకి హేమచంద్రారెడ్డి నెలకు రూ.8 లక్షలు పంపేవారని, అందుకే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరున్నా హేమచంద్రారెడ్డిపై చర్యలకు ఉపక్రమించేవారు కాదనే ఆరోపణలు ఉన్నాయి.

అక్కడ హేమ.. ఇక్కడ నిమ్మ.. దొందూదొందే
ఇప్పటి వరకు హేమచంద్రారెడ్డి ఈ ఐదేళ్లలో తీసుకున్న వేతనం అక్షరాలా రూ.1.50 కోట్లు. ఇది కాకుండా దొంగబిల్లులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో వాటాలు, ఉద్యోగాలు అమ్ముకోవడం ద్వారా వచ్చిన సొమ్ము లెక్కేస్తే ఆయన దాదాపు రూ.100 కోట్లకు పైగా సంపాదించినట్లు ఆరోపించినవారూ ఉన్నారు. అనంతపురానికి చెందిన హేమచంద్రారెడ్డి ఆ జిల్లాలో వర్సిటీని పూర్తిగా చెరబట్టేశారు. ప్రభుత్వం మారి హేమచంద్రారెడ్డిపై విచారణ జరపాలని డిమాండ్లు ఊపందుకోవడంతో ఆయన కార్యాలయంలో ఫైల్స్ మాయమైనట్టు ప్రధాన మీడియా స్రవంతిలో కథనాలు వచ్చాయి. ఇవి కాకుండా మిగిలిన ఫైల్స్‌ను ముక్కముక్కలుగా చించేసి బయట పడేసినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలకు ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలు వైకాపా నాయకులకు చెందిన కంపెనీలకు హేమచంద్రారెడ్డి కట్టబెట్టడంతో దీనిపై శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉన్న 151 మంది వైకాపా ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా ప్రశ్నించలేకపోయారు. అలాగే జగన్ పాదయాత్రకు మైక్‌సెట్లు బిగించుకునే వ్యక్తిని తీసుకువచ్చి రూ.1.50 లక్షలు జీతమిచ్చి మరీ పార్టీ కార్యక్రమాలు చేయించారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో తన మాట వినే రబ్బర్‌స్టాంప్ వీసీలను పెట్టుకుని పెద్ద ఎత్తున దండుకున్నారు. ఇందులో భాగంగానే అప్పట్లో నిమ్మ వెంకటరావు ఇక్కడకు వచ్చారు. హేమచంద్రారెడ్డికి ప్రతినెలా సొమ్ములు పంపడానికి ఇక్కడ అనేక పాపాలకు ఒడిగట్టారు. ఒకానొక సమయంలో రిక్రూట్‌మెంట్ కోసం రేషనలైజేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించాలని ఆదేశాలిచ్చి ఇక్కడ వర్సిటీలో నిమ్మ వెంకటరావు, ఆయన శిష్యుడి ద్వారా కలెక్షన్లు చేయించి వారికే పోస్టులు వచ్చేలా రేషనలైజేషన్ ప్రక్రియను కానిచ్చేశారు. అలాగే ప్రభుత్వ వర్సిటీలను నిర్వీర్యం చేసి రాష్ట్రంలో ఏడెనిమిది ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చి పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. మైక్రోసాఫ్ట్, ఎడెక్స్ సర్టిఫికెట్ కోర్సుల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారు. ఇవన్నీ ఆప్షేలో పని చేస్తున్న నిజాయితీ గల అధికారులకు తెలిసిపోతాయని భావించి వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి మరీ హేమచంద్రారెడ్డి పైశాచికానందం పొందారు. వాస్తవానికి హేమచంద్రారెడ్డి ప్రొఫెసర్‌గా రావడమే ఓ పెద్ద వింత. దీనికి తోడు ఆప్షే చైర్మన్‌గా కూడా ఆయన్ను గత ప్రభుత్వం నియమించింది. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో పని చేసిన హేమచంద్రారెడ్డిని జేఎన్‌టీయూలో నేరుగా ప్రొఫెసర్‌గా పోస్టు ఇచ్చేశారు. దీనికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత పులివెందుల జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్‌గా ఆయనకు పదోన్నతి ఇచ్చారు. తర్వాత కొద్ది కాలానికే జేఎన్‌టీయూ అనంతపురంలో రిజిస్ట్రార్‌గా నియమించారు. ప్రిన్సిపాల్‌గా ఉన్న కాలంలో రోజూ పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లడం, వారిని కాకా పట్టడంతో ఈ పోస్టు దక్కింది. వాస్తవానికి వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన వైకాపా కోసం పని చేయలేదు. అదే సమయంలో టీడీపీ, బీజేపీతో సఖ్యంగా మెసిలేవారన్న వాదన కూడా ఉంది. 2019లో వైకాపా వచ్చిన తర్వాత ఆయన ఆప్షే చైర్మన్ కాగలిగారు. ఇందుకోసం అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీని మేనేజ్ చేసి చట్టాన్ని కూడా మార్పించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పులివెందుల ఇంటితోనే పరిచయం ఉండటంతో సీఎంవోలో ఈయనకు పలుకుబడి పెరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మరో కథనంలో తెలుసుకుందాం.
Comments