top of page

‘హీరో’ మెటీరియల్‌ అంటే ఏంటి?

  • Guest Writer
  • Oct 22
  • 3 min read
ree

హీరో ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానమే ఆ సినిమాను థియేటర్‌లో చూడాలా? లేక ఓటీటీలోనా ? అనే నిర్ణయంలో కీలకపాత్ర పోషిస్తుంది.

అయితే.. కథ, స్క్రీన్‌ప్లే వంటి ఇంకా ఇతర అంశాల కారణంగా భారీ విజయాలు సాధించిన సినిమాలు ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన ఒక సంఘటన సినిమాకు ‘హీరో’నే ముఖ్యమనే ఒక మూస అభిప్రాయాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.

ప్రదీప్‌ రంగనాథన్‌, మమితా బైజు జంటగా కీర్తీశ్వరన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘డ్యూడ్‌’ సినిమా అక్టోబర్‌ 17న విడుదలైంది. కొద్దిరోజుల కిందట ఈ సినిమా తెలుగు ప్రమోషన్‌ ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు, ఒక జర్నలిస్ట్‌ ప్రదీప్‌ రంగనాథన్‌ను ‘‘ ‘మీరు హీరో మెటీరియల్‌’ కాదు. కానీ రెండు హిట్‌ సినిమాలు ఇచ్చారు. ఇది అదృష్టమా? లేక మీ కష్టమా? ’’ అని అడిగారు.

వెంటనే నటుడు శరత్‌ కుమార్‌ ఆ జర్నలిస్టును ఉద్దేశించి, ‘‘నేను 170 సినిమాలు చేశాను ఎవరు ‘హీరో మెటీరియల్‌’ అని మీరు నిర్ణయించలేరు. హీరో అంటే ఇలాగే ఉండాలన్న నియమాలేమీ లేవు’’ అని అన్నారు.

ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ప్రదీప్‌ రంగనాథన్‌ ఈ విషయంపై మాట్లాడుతూ, ‘‘సన్నగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు వంటి ఎగతాళి మాటలు చాలానే విన్నాను. వాటికి అలవాటుపడిపోయాను. లవ్‌ టుడే సినిమా ఈవెంట్లలో కూడా ఇలాంటివి ఎదురయ్యాయి. ప్రజలు నన్ను వాళ్లలో ఒకడిగా భావించడం వల్లే నన్ను హీరోగా యాక్సెప్ట్‌ చేశారని అనుకుంటున్నా’’ అన్నారు.

అసలు, ఒక సినిమాకు నిజంగా హీరో మెటీరియల్‌ లేదంటే హీరోయిన్‌ హీరోయిన్‌ మెటీరియల్‌ అవసరమా? ఈ అంశాన్ని భారతీయ చిత్ర పరిశ్రమలు ఎలా చూస్తున్నాయి?

ఎంజీఆర్‌, రజినీకాంత్‌ టైంలో..

‘‘తమిళ సినిమా తొలి సూపర్‌ స్టార్‌గా అభివర్ణించే త్యాగరాజ భాగవతార్‌, ప్రముఖ నటుడు ప్యూ చిన్నప్ప, ఇద్దరూ తమ గాత్రంతో ప్రఖ్యాతిగాంచారు. అప్పట్లో ‘హీరో మెటీరియల్‌’ అనేదే లేదు’’ అని రచయిత, తమిళ సినిమా చరిత్రకారుడు థియోడర్‌ భాస్కరన్‌ అన్నారు.

ఆయన తమిళ సినిమాపై ‘స్నేక్స్‌ ఐ - యాన్‌ ఇంట్రడక్షన్‌ టు తమిళ్‌ సినిమా’, ‘సొసైటీ ఎక్స్‌పాండిరగ్‌ ఆన్‌ ది స్క్రీన్‌’ వంటి పుస్తకాలు రాశారు.

‘‘మొదటి నుంచీ.. హిందీ, హాలీవుడ్‌లో హీరో అంటే ఇలాగే ఉండాలనే ఇమేజ్‌ ఉండేది. కాలక్రమేణా అది తమిళ సినిమాకు కూడా వ్యాపించింది. ముఖ్యంగా ఎంజీఆర్‌ కాలంలో. హీరో అందంగా, బలంగా ఉండాలి. సినిమా చివరి వరకూ చచ్చిపోకూడదు. ఆయన అమ్మాయిల వెంట పడకూడదు, అమ్మాయిలే ఆయన వెంటపడాలి వంటి ధోరణులు ఉండేవి. నేటికీ ఎంజీఆర్‌ని గుర్తుచేసుకునేవారు ఆయన అందం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు’’ అని భాస్కరన్‌ అన్నారు.

రచయిత్ర దీప్తి రaా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు, ‘‘ఎంజీఆర్‌ తర్వాత, హీరో అంటే అందగాడు.. ముఖ్యంగా తెల్లటి చర్మంతో ఉండాలనే ధోరణి తమిళ సినిమాలోనూ కనిపించింది. అయితే, శివాజీ ఆ మూససిద్ధాంతాన్ని బద్దలుకొడుతూ విభిన్నపాత్రలతో మెప్పించారు. ఆ తర్వాత, రజినీ రాక మార్పుకు దారితీసింది’’ అని ఆమె అన్నారు.

శివాజీలా కాకుండా హీరో కాకముందే కొన్ని సినిమాల్లో సహాయ నటుడిగా లేదా విలన్‌ పాత్రలు పోషించి రజినీకాంత్‌ అందరి దృష్టిని ఆకర్షించారని దీప అన్నారు. ‘‘కొన్ని పాత్రలలో కనిపించడానికి ముందే, తన ప్రతిభను నిరూపించుకోవడం ద్వారా రజనీ ఆ అవహేళనలను అధిగమించగలిగారు’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

అయితే, తమిళ్‌లో హీరోగా పేరుతెచ్చుకున్న తర్వాత కూడా 1980లలో తాను హిందీలో అరంగేట్రం చేసినప్పుడు, అవహేళనలను ఎదుర్కొన్నట్లు రజినీకాంత్‌ ఒకసారి చెప్పారు.

‘‘1984లో వచ్చిన హిందీ సినిమా గంగ్వా (తమిళ సినిమా మలయూర్‌ మాంపట్టియాన్‌ 1983 రీమేక్‌) సెట్స్‌లో నన్నెవరూ గుర్తుపట్టలేదు. వాళ్లు నన్ను ‘బ్లాక్‌ హీరో’ అని పిలిచేవాళ్లు. ‘అంధా కానూన్‌’ సినిమా విజయం తర్వాతే బాలీవుడ్‌లో నన్ను హీరోగా పరిగణించడం మొదలుపెట్టారు’’ అని రజినీకాంత్‌ అన్నట్లుగా చెబుతుంటారు.

బాలీవుడ్‌లో రజినీ ఎదుర్కొన్న పరిస్థితినే తెలుగు సినిమా ఈవెంట్‌లో ప్రదీప్‌ ఎదుర్కొన్నారని భాస్కరన్‌ అన్నారు. ‘‘అందంగా లేడంటూ సినీ అభిమానులు ఎప్పుడూ, ఏ నటుడినీ తిరస్కరించలేదు. ఈ ‘హీరో మెటీరియల్‌’ అనే దానికి సినిమా ఇండస్ట్రీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా, క్లోజప్‌ షాట్స్‌లో హీరో అందంగా, ఎర్రగాబుర్రగా ఉంటేనే ప్రజలు అంగీకరిస్తారనే మూసను సృష్టించారు’’ అని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లో జరిగిన డ్యూడ్‌ సినిమా తెలుగు ప్రమోషన్‌ ఈవెంట్‌లో జరిగిన దాని గురించి తెలుగు సీనియర్‌ జర్నలిస్ట్‌, సినీ విమర్శకులు జీఆర్‌ మహర్షి బీబీసీతో మాట్లాడుతూ, ‘‘ఆ ఈవెంట్‌లో అడిగిన ప్రశ్నను కచ్చితంగా ఖండిరచాల్సిందే. తెలుగు వారు మాత్రమే కాదు, ఏ భాష వారైనా ఒక నటుడిని అతని లుక్స్‌ ఆధారంగా చూడరు, సినిమా బావుంటే, ఆదరిస్తారు’’ అని ఆయన అన్నారు.

విశాఖపట్నంలో కారులో కూర్చుని ఏడ్చానన్న ధనుష్‌..

నటుడు ధనుష్‌ తాను ఎదుర్కొన్న అవహేళనల గురించి అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు.

‘‘సినిమాల్లోకి వచ్చిన కొత్తలో... ఇతను హీరోనా? అని నన్ను ముఖమ్మీదే అడిగారు. ఒకసారి విశాఖపట్నంలో షూటింగ్‌ చేస్తున్నప్పుడు, చుట్టూ ఉన్నవారు అంటున్న మాటలు విని, కారులో కూర్చుని కొద్దిసేపు ఏడ్చేశాను. ఇప్పటికీ అది నన్ను వెంటాడుతూనే ఉంది’’ అని ధనుష్‌ ఒకసారి అన్నారు.

2021లో వచ్చిన హిందీ వెబ్‌సిరీస్‌ లిటిల్‌ థింగ్స్‌లో, ఒక క్యారెక్టర్‌ తన స్నేహితుడిని ‘‘నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావా? అచ్చం ధనుష్‌లా ఉన్నావు’’ అంటూ ఆటపట్టిస్తుంది. ఈ సీన్‌పై చాలా వ్యతిరేకత వచ్చింది. చాలామంది ఖండి0చారు కూడా.

‘‘బాలీవుడ్‌లో హీరో అంటే తెల్లటి రంగు, కండలు తిరిగిన బాడీ ఉండాలనే అంచనా ఉందన్నది నిజమే. కానీ, ప్రేక్షకులు కూడా అలాగే కోరుకుంటారని చెప్పలేం. సినిమా ఇండస్ట్రీ అలా చిత్రీకరిస్తుంది’’ అని దిల్లీకి చెందిన జర్నలిస్ట్‌ సత్యం సింగ్‌ అన్నారు.

‘‘ధనుష్‌ ఒక ప్రముఖ నటుడు. కానీ, ఆయన నటించిన చాలా బాలీవుడ్‌ సినిమాల్లో ఆయన్ను దక్షిణాది వ్యక్తిగానే చూపించారు. అలాగే, రజినీకి లుంగీకి సంబంధమేంటి? షారుఖ్‌ ఖాన్‌ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో తమిళ అమ్మాయిగా నటించిన దీపిక పదుకొణె బంధువుల పాత్రల చిత్రీకరణను పరిశీలిస్తే, నేనేమంటున్నానో అర్థమవుతుంది. ఈ విషయంలో బాలీవుడ్‌ చాలా ముందుకెళ్లాల్సి ఉంది’’ అని సత్యం సింగ్‌ చెప్పారు.

మలయాళ సినిమాలో పరిస్థితేంటి?

కేవలం మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ ప్రజాదరణ పొందిన ఫహాద్‌ ఫాజిల్‌, సౌబిన్‌ షాహిర్‌ వంటి నటులు ‘హీరో మెటీరియల్‌’ ఇమేజ్‌ను బద్దలుకొట్టిన వారే.

‘‘మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చి గొప్పగా రాణించిన భరత్‌ గోపి, తిలగన్‌, మురళి, శ్రీధరన్‌ నాయర్‌, కళాభవన్‌ మణి, సూరజ్‌ వెంజరమూడు సహా చాలామంది నటీనటులు ఈ హీరో మెటీరియల్‌ కిందకు రారు. కళాభవన్‌ మణి ఇతర భాషల్లో విలన్‌గా పేరుతెచ్చుకున్నారు. కానీ మలయాళంలో ఆయన హీరో, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, సపోర్టింగ్‌ యాక్టర్‌’’ అన్నారు భాస్కరన్‌.

‘‘ఈ హీరో మెటీరియల్‌ అనే ఇమేజ్‌ను కచ్చితంగా బద్దలుకొట్టాల్సిందే. సినిమాల్లో హీరోను ‘అసమాన శూరుడు’గా చూపించడం వల్లే అభిమానులు, అభిమాన సంఘాలు పుట్టుకొస్తాయి, గుడ్డిగా వాళ్లని అనుసరిస్తారు. మనం నటులను వారి పాత్రలుగా మాత్రమే చూడడం మొదలుపెడితే, ప్రతిఒక్కటీ మారిపోతుంది’’ అని అభిప్రాయపడ్డారు భాస్కరన్‌.

- బీబీసీ న్యూస్‌ సౌజన్యంతో..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page