హాల్‌టిక్కెట్ల గందరగోళం.. అభ్యర్థుల్లో అయోమయం
- NVS PRASAD
- Jun 5
- 2 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
చంద్రబాబునాయుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరి మరికొద్ది రోజుల్లో ఏడాది పూర్తవుతుంది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మొదటి సంతకం అయిన 100 రోజుల్లో మెగా డీఎస్సీకి కూడా దాదాపు ఏడాదే. 100 రోజుల్లో నోటిఫికేషన్ రాకపోయినా 16,347 పోస్టుల భర్తీకి అభ్యర్థులను ఒకింత మానసిక ఒత్తిడికి గురి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. జారీ చేసిన నాటి నుంచి కేవలం 45 రోజుల్లోనే పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయడం ఒక ఎత్తయితే, ఆ పరీక్ష నిర్వహణకు కావాల్సిన హాల్‌టిక్కెట్ల జారీలో గందరగోళం అభ్యర్థులకు మరింత ఆందోళన కలిగించే విషయం.
రాష్ట్రవ్యాప్తంగా 3,35,401 మంది అభ్యర్థులు వివిధ పోస్టులకు వారి వారి అర్హతలను బట్టి నాలుగు లేదా ఐదు పోస్టులకు దరఖాస్తులు చేశారు. దీనివలన 5,77,417 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులకు ఐదు ప్రాధాన్యాలలో పరీక్ష కేంద్రాలు ఎంపిక చేసుకోమని అవకాశం కల్పించారు. ఇందులో ఒక పరీక్ష ఒక పట్టణంలోను, ఇంకో పరీక్ష వేరే పట్టణంలోను రాసేవిధంగా హాల్‌టిక్కెట్లు జారీ చేశారు.
ఇందులో ఇంకా విచిత్రమైన అంశం ఏమిటంటే.. ఒక అభ్యర్థికి ఒకేరోజు ఉదయం ఎస్‌జీటీ పరీక్ష విజయవాడలో, అదే రోజు మధ్యాహ్నం పాఠశాల సహాయకులు పరీక్ష హైదరాబాద్‌లో కేటాయించారు. ఒకేరోజు రెండు వేర్వేరు పట్టణాలలో పరీక్షా కేంద్రాలు కేటాయించడం ఎంతవరకు సమంజసం. కేవలం 2.30 గంటల వ్యవధిలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఎలా చేరుకుంటారో విజ్ఞులైన విద్యాశాఖాధికారులే ఆలోచించాలి.
ఒక మహిళా అభ్యర్థికి ఒకరోజు శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలో టిజిటి ` తెలుగు పరీక్ష, మరుసటి రోజు ఉదయాన్నే హైదరాబాద్‌లో పి.జి.టి. పరీక్ష ఉంది. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ చేరుకోడానికి రైలు ప్రయాణమే కనీసం 14 గంటలు పడుతుంది. అటువంటిది అభ్యర్థి హైదరాబాద్ చేరి, అక్కడి నుంచి ఎంతో దూరంలో ఉన్న ఆ పరీక్షా కేంద్రానికి సమయానికి ఏ విధంగా చేరుకుంటారో ప్రశ్నార్థకమైన అంశం.
ఏడాది వయసున్న చంటిపిల్లాడితో గల మహిళా అభ్యర్థి అన్ని సెంటర్లు హైదరాబాద్‌లో కేటాయించాలని అధికారులను ప్రాధేయపడుతున్నా ఈ నెల 6న టీజీటీ గణితం, ఒక రోజు వ్యవధితో పీజీటీ పరీక్షను విశాఖపట్నంలో, మరలా మూడు రోజుల వ్యవధిలో పాఠశాల సహాయకులు గణితం పరీక్షకు 12న హైదరాబాద్‌లో ఒక సెంటర్ కేటాయించారు. ఒక్కరోజు వ్యవధిలో చంటిపిల్లాడితో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు రెండుసార్లు ప్రయాణం చేయడం దుర్లభం. ఒక పరీక్ష రాయడానికి ఇన్ని ప్రాంతాలు తిరగడం అభ్యర్థులకు ఎంతో ఆర్ధిక, వ్యయప్రయాసలతో కూడిన అంశం. ఇటువంటివి కోకొల్లలుగా హాల్‌టికెట్ల జారీలో లోపాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖాధికారులకు అభ్యర్థులు వారి అన్ని పరీక్షలు ఒకే పట్టణంలో కేటాయించాలని కోరుకుంటున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అందుబాటులో ఉన్న రోజుల్లో కూడా రొటీన్‌గా అభ్యర్థుల దరఖాస్తులను బట్టి పరీక్షా కేంద్రాలు నిర్ణయించడం సరికాదు. టెక్నాలజీని కనిపెట్టిన బాబు జమానాలో ఆయన కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి టెక్నికల్ తప్పిదాలు జరగడం ఏమాత్రం వాంఛనీయం కాదు. అన్నిటికీ మించి డీఎస్సీలో ఎదురైన ఇబ్బందులన్నింటినీ సరిచేసి ఉద్యోగాలు ఇవ్వాలని చూసినప్పుడు ఇటువంటి చిన్న లోపాలను కూడా సరిదిద్దితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. హాల్‌టిక్కెట్లు జారీ చేసిన తర్వాత ఈ కేసులో జోక్యం చేసుకోలేమంటూ సాక్ష్యాత్తు రాష్ట్ర హైకోర్టే వ్యాఖ్యానించిన నేపథ్యంలో హాల్‌టిక్కెట్ల జారీయే ప్రధాన సమస్య అవడం గమనార్హం.
Comments