హెల్త్ ఆఫీసర్ లేరా.. ఆయనకు బాధ్యత లేదా?!
- NVS PRASAD

- Feb 28
- 3 min read
అవినీతి తప్ప.. ఆరోగ్యం పట్టదా?
మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ తీరుపై విమర్శలు
డయేరియాతో నగరం వణుకుతున్నా జాడలేని అధికారి
కమిషన్లు దండుకోవడంలోనే తలమునకలని ఆరోపణలు
ఈయనగారి పర్యవేక్షణ లోపమే శ్రీకాకుళానికి శాపం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
తాగునీరు కలుషితం కావడం వల్లే శ్రీకాకుళం నగర పరిధిలో డయేరియా వ్యాధి ప్రబలింది. ఇది పరోక్షంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ప్రకటన. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ శుక్రవారం సాయంత్రం దమ్మలవీధిలో పర్యటించినప్పుడు ఈ`కోలీ అనే బ్యాక్టీరియా వల్లే డయేరియా వచ్చిందని స్పష్టం చేశారు. ఈ బ్యాక్టీరియా సాధారణంగా కలుషిత నీటిలోను, ఆహార పదార్థాల్లోనూ ఉంటుంది. ఒక కుటుంబానికి డయేరియా వస్తే అది కలుషిత ఆహారం వల్ల. అదే ఒక ప్రాంతానికి వస్తే.. ఆ ప్రాంతానికి సరఫరా అయిన నీటి వల్ల అనేది సాధారణ కారణం. గోల్కొండరేవు రోడ్డు, దమ్మలవీధి, మొండేటివీధి వంటి ప్రాంతాల్లో డయేరియా ప్రబలిందంటే.. ఆ ప్రాంతాలకు నీరు సరఫరా అయ్యే విధానం మీదే అనుమానం ఉందనేది వీరపాండ్యన్ స్టేట్‌మెంట్ సారాంశం. వాస్తవానికి ఇదే జరిగింది. స్థానిక పెద్దబజారు చేపలమార్కెట్ వద్ద రోడ్డు పునర్నిర్మిస్తున్న సందర్భంగా ఏర్పడిన గోతిలో పైప్‌లైన్‌కు కన్నం పడింది. దీన్ని కప్పిపుచ్చి ఇన్ని రోజులూ మున్సిపల్ యంత్రాంగం నాటకాలాడింది. వాటర్ శాంపిల్స్ తీయడం, ల్యాబ్‌కు పంపడం, ఇవన్నీ డైవర్షన్ ప్రక్రియలో భాగం. సమస్య ఎక్కడ ఏర్పడిందో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులకు తెలుసు. కొత్త కమిషనర్ కూర్మారావును మభ్యపెట్టి డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగారు.
ఆ పనుల్లోనే అయ్యవారు బిజీ
ఈ`కోలీ బ్యాక్టీరియా నీటిలో కలవడానికి కారణం పైప్‌లైన్‌కు కన్నం పడటమే. ఇందుకు ఇంజినీరింగ్ విభాగానిదే బాధ్యత. కాదనలేం.. కానీ అసలు కాలువ నీటిలో ఈ`కోలీ బ్యాక్టీరియా వద్ధి చెందేంత గొప్పగా నగరంలో శానిటేషన్ పనులు జరుగుతున్నాయంటే.. దానికి ప్రధాన కారణం కార్పొరేషన్ హెల్త్ విభాగానిది.. దానికి బాధ్యత వహిస్తున్న మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ (ఎంహెచ్‌వో)దే. సాధారణంగా ఈ`కోలీ బ్యాక్టీరియా కొంత మోతాదులో మన కడుపులోను, మురుగు కాల్వల్లోను ఉంటుంది. ఆ స్థాయికి మించి పెరగకుండా చూడటమే శానిటేషన్ విభాగం ప్రధాన కర్తవ్యం. అలా కాకుండా ఈ`కోలీ విజంభించేంతగా కాలువలు విడిచిపెట్టారంటే.. దానికి ఎంహెచ్‌వోను ఎందుకు బాధ్యుడిని చేయకూడదు? ఎందుకు చర్యలు తీసుకోకూడదు?? కాలువల్లో పూడిక తీయడం ఒక ఎత్తయితే, నిత్యం మలాథియాన్ స్ప్రే చేయించడం, నీటివనరుల వద్ద బ్లీచింగ్ కార్యక్రమాలు చేయించాల్సింది హెల్త్ విభాగమే కదా. మరి అలాంటి పనులు చేయించకుండా ఎంహెచ్‌వో సుధీర్ ఏం చేస్తున్నట్టు? బంగారు గుడ్లు పెట్టే హెల్త్ విభాగం పర్యవేక్షకుడిగా ఆ గుడ్డుతోనే సరిపెట్టుకోకుండా.. వాటిని పెట్టే బాతును కూడా గుటుక్కుమనిపించాలని ప్రయత్నించడం వల్లే ఇప్ప్పుడీ ముప్ప్పు వాటిల్లింది. స్థానిక గోల్కొండరేవు రోడ్డు.. అంటే మేదరవీధి దగ్గర్నుంచి ఆ రోడ్డు చివర స్మశానవాటిక వరకు అన్ని ఇళ్లూ చిన్న సందుల్లో ఉంటాయి. మనుషులు ఉండటానికే తక్కువ అవకాశం ఉన్న ఈ కొంపలకు సెప్టిక్ ట్యాంకు తవ్వుకునేంత స్థలాలు లేవు. దీంతో చాలామంది మరుగుదొడ్డి కనెక్షన్‌ను నేరుగా కాలువల్లోకే ఇచ్చేశారు. శ్రీకాకుళం మొత్తం మీద మురుగు కాలువల్లో ప్రవహించే నీటి రంగుకు.. గోల్కొండరేవు, దమ్మలవీధి ప్రాంతాల్లోని కాలువల నీటి రంగుకు చాలా తేడా ఉంటుంది. ముదురు గోధుమ రంగులో ఇక్కడి కాలువల్లో నీరు, పూడిక కనిపిస్తుంది. నిత్యం వార్డుల్లో శానిటేషన్ పనులు చేసేవారికి ఈ విషయం తెలుసు. హెల్త్ ఆఫీసర్ అనేవాడు ఇటువంటి చోట్ల పర్యటించి, అసలు ఎందుకు అలా ఉందనేది తెలుసుకుంటే ఈ ఉపద్రవం, ప్రభుత్వానికి అపఖ్యాతి వచ్చి ఉండేవి కావు. ఇటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం అవసరం కాబట్టే మున్సిపల్ హెల్త్ అధికారిగా కనీసం ఎంబీబీఎస్ చదివిన డాక్టర్‌ను నియమిస్తారు. మన ఎంహెచ్‌వో సుధీర్ కూడా డాక్టరే. కానీ ఏరోజూ ఈ కోణంలో ఆలోచించినట్లు, పరిశీలించినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే.. లెక్కాపత్రం లేని కొనుగోలు వ్యవహారాల్లో తలమునకలైపోయి, అటు కేంద్రమంత్రి పేషీకి, ఇటు ఎమ్మెల్యే కార్యాలయ పేషీకి తలవంపులు తెచ్చేలా అమ్మకాలు, కొనుగోళ్లలో బిజీగా ఉంటున్న సుధీర్ శానిటేషన్ మీద దష్టి పెడుతున్న దాఖలాల్లేవు.
సందుగొందుల్లోకి ఎప్పుడైనా వచ్చారా?
కాలువల్లో పూడిక తీస్తున్నాం, తడిచెత్త, పొడిచెత్త సేకరిస్తున్నాం అని చెప్ప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో ఇటువంటివి పరిశీలించలేదు. ఇప్ప్పుడు మనుషుల మలమూత్రాలు, పశువుల వ్యర్థాలు కాలువల్లో కలవడం, అదీ ఒకేచోట నిల్వ ఉండటం, దానికి తోడు పైప్‌లైన్‌కు కన్నం పడటం వల్ల మొత్తం నగరం కొంప ముంచేసింది. ఈ ఎపిసోడ్‌లో ఇంజినీరింగ్ విభాగం తప్ప్పు ఎంతుందో, అంతకు మించి హెల్త్ విభాగం తప్ప్పు ఉంది. కానీ ఇక్కడ రాజకీయ నాయకులెవరూ ఈ అంశాన్ని ఆ కోణంలో చూడటంలేదు. ఎంతసేపూ పైప్‌లైన్ ద్వారా ట్యాంకుకు సప్లై చేసే లైన్‌ను, ట్యాంకు నుంచి డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్లను మాత్రమే పరిశీలిస్తున్నారు. అసలు గోల్కొండరేవు రోడ్డు, దమ్మలవీధి ప్రాంతాల్లో ఎంహెచ్‌వో ఏరోజైనా కాలువలు చూశారా? ఎంతసేపూ మినీ పొక్లెయిన్ బకెట్ పట్టే కాలువల్లోనే పూడికలు తీయడం తప్ప, సందుగొందుల్లోని కాలువలు ఎలా ఉన్నాయో ఎంహెచ్‌వోకు తెలుసా? ఈ చిన్న కాలువల్లో పూడికలు ఎందుకు తీయరంటే.. ఈ పనులకు ప్రత్యేకంగా బిల్లులు పెట్టే సౌలభ్యం ఉండదు. డబ్బులు రావు. అదే పెద్ద కాలువల్లో పూడికలు తీస్తే ఇష్టారాజ్యంగా బిల్లులు పెట్టుకోవచ్చు. దానికి ఎవరైనా అడ్డు చెబితే కేంద్రమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం పేర్లు చెప్పవచ్చు. ఈ పూడిక పనులు ఎవరో ఒక తెలుగు తమ్ముడికి అప్పజెప్పి ‘చూశారా.. ఈ సొమ్ములన్నీ అక్కడికే వెళ్తాయని ప్రచారం చేయవచ్చు. ఎంహెచ్‌వో తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని పత్రికల్లో రాస్తే, తనను ఎవరూ ఏమీ పీకలేరని మీసాలు మెలేయవచ్చు. ఇంత జరిగినా కూడా ఎంహెచ్‌వో వైపు కలెక్టర్ గానీ, రాజకీయ నాయకులు గానీ చూడటం లేదంటే బహుశా ఎంహెచ్‌వో సుధీర్ చేస్తున్న ప్రచారం నిజమేనేమో?!






Comments