top of page

హాస్టల్‌లో ఉండాల్సిన అమ్మాయి.. ఆయువు కోసం ఆసుపత్రిలో..!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • మహిళా బీసీ హాస్టల్‌ విద్యార్థినిపై దాడి

  • హాస్టల్‌ సందులో అచేతనంగా గుర్తించిన సిబ్బంది

  • సీసీ ఫుటేజ్‌లో కనిపించిన అనుమానితుడు

  • బాధితురాలి కాల్‌డేటా మేరకు నిందితుడు ఒక్కడే

  • స్వయంగా విచారించిన కలెక్టర్‌

  • మెరుగైన చికిత్సకు వైజాగ్‌ తరలింపు

  • విద్యార్థిని నోరు విప్పితేనే వాస్తవాలు వెలుగులోకి

  • సీరియస్‌గా తీసుకోమన్న మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు




(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

గురువారం రాత్రి 9.30 గంటల సమయం.. వన్‌టౌన్‌ పోలీస్‌ ఆఫీసర్లు, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు హడావుడిగా రిమ్స్‌కు వెళ్లడం, అక్కడ టెన్షన్‌గా తిరుగుతూ కనిపించడాన్ని ఆసుపత్రి పరిసరాల్లో ఉన్నవారు గమనించారు. ఏదో రోడ్డుప్రమాదం జరిగుంటుందని భావించారు.

శుక్రవారం ఉదయం 5.20 గంటల సమయం.. వివిధ పత్రికల్లో పని చేస్తున్న రిపోర్టర్ల ఫోన్లు మోగాయి. రిమ్స్‌ ఆసుపత్రి ఎమర్జెన్సీలో స్థానిక ఉమెన్స్‌ కాలేజీలో బీఎస్సీ ఫైనలియర్‌ చదువుతున్న ఒకమ్మాయి చికిత్స పొందుతుందని, ఏం జరిగిందని అడిగితే.. అమ్మాయి మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఫిట్స్‌ వచ్చి పడిపోయిందని హాస్టల్‌ సిబ్బంది తమకు తెలిపారని, అంతకు మించి తమకేమీ తెలియదని చెబుతున్నారంటూ ఉప్పందించారు.

సీన్‌ కట్‌ చేస్తే.. హాస్టల్‌ వార్డెన్‌ పోలీసు స్టిక్కరున్న హుండాయ్‌ కారులో శుక్రవారం ఉదయం 7.30 గంటల ప్రాంతానికి రిమ్స్‌కు వచ్చారు. ఫిట్స్‌ రావడంతోనే విద్యార్థిని పడిపోయిందని, ఆ మేరకే దెబ్బలు తగిలాయని తెలిపారు. దీంతో అటు పోలీసులు, ఇటు మీడియా కూడా ఫిట్స్‌ కారణంగానే తల వెనుకభాగంలో బలమైన గాయమైవుంటుందని భావించారు. కానీ.. బాధితురాలిని చూసిన ఎవరికైనా ఇది ఫిట్స్‌ వల్ల తగిలిన దెబ్బలు కావని, బలంగా వంటిపైన గుద్దడం వల్ల కమిలిపోయిందని అర్థమైపోతుంది. ఎందుకంటే.. ఎడమ కన్ను పూర్తిగా కమిలిపోయింది. అలాగే చేతుల్ని పట్టుకొని నులిపేయడం వల్ల వచ్చే నల్లటి మచ్చలు ఆమె వంటిపై కనిపిస్తున్నాయి. బాధితురాలికి వంటిపై చతనం లేదు. ఇక్కడ కచ్చితంగా ఏదో జరిగివుంటుందని పోలీసులకు అర్థమైపోయింది. ఈలోగానే జిల్లా మొత్తం ఉమెన్స్‌ కాలేజీ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగివుంటుందన్న ప్రచారం ఉప్పెనలా వ్యాపించింది. దీంతో ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు. అంతవరకు హాస్టల్‌లో ఉండాల్సిన విద్యార్థిని రాత్రి సమయంలో హాస్టల్‌ బయట గాయాలతో అపస్మారక స్థితిలో పడివుండటం వెనుక హాస్టల్‌ వార్డెన్‌ పూర్ణ నిర్లక్ష్యం ఉందని, ఆమెను కాపాడటం కోసమే ఫిట్స్‌ నాటకం ఆడారని భావించినవారంతా అత్యాచారం జరగలేదని తేలితే చాలు దేవుడా అంటూ మొక్కుకున్నారు. ఎందుకంటే.. ఇది ప్రభుత్వ ప్రతిష్టకు, ప్రభుత్వ హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థినుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. డీజీపీ ద్వారకా తిరుమల పదవీ విరమణ చేస్తుండటంతో ఆ ఫంక్షన్‌కు ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి వెళ్లారు. దీంతో జిల్లాలో ఇద్దరు ఏఎస్పీలు, స్వయంగా జిల్లా కలెక్టర్‌ రిమ్స్‌లో బాధితురాలి వద్దకు వెళ్లారు. అయితే ఆమెకు ఇప్పటికీ తెలివి రాకపోవడంతో ఏం జరిగిందనేది తెలియడంలేదు. అత్యాచారం జరిగిందన్న ఊహాగానాల మేరకు మహిళా గైనకాలజిస్ట్‌లతో కలెక్టర్‌ దినకర్‌ పుండ్కర్‌ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అంతవరకు పైపై దెబ్బలకు మాత్రమే ట్రీట్మెంట్‌ ఇస్తున్న వైద్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు విద్యార్థిని ప్రైవేట్‌ పార్ట్‌లపై ఎటువంటి గాయాలూ ఉన్నట్టు ఆధారాలు కనిపించలేదని తెలుస్తుంది. కానీ రిమ్స్‌ డైరెక్టర్‌, వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యుల బృందం కలిపి పూర్తిస్థాయి నివేదిక వస్తేగాని ఏ విషయమూ తెలియదు. సంఘటన స్థలం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్‌ ఆధారంగా, బాధితురాలి కాల్‌డేటా ఆధారంగా ఒకరిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిందని చెబుతున్న సమయం తర్వాత ఇదే వ్యక్తి ఆటోలో పాతబస్టాండ్‌ వైపు రావడాన్ని పోలీసులు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. అలాగే మహిళా కళాశాల హాస్టల్‌ వద్దకు వెళ్తున్న ఫుటేజ్‌ను కూడా తీసుకున్నారు. ఇప్పుడు బాధితురాలి కాల్‌డేటాలో ఉన్న ఫోన్‌నెంబరులో ఉన్న వ్యక్తి, సీసీ ఫుటేజ్‌లో అనుమానితుడుగా భావిస్తున్న వ్యక్తి ఒక్కడా కాదా అనేది తేలాలంటే బాధితురాలు మాత్రమే సమాధానం చెప్పగలదు. ఫుటేజ్‌లో కనిపిస్తున్న పోలికల మేరకు అనుమానితుడు ఏ ప్రాంతం వాడనేది నిర్ధారణ కాలేదు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ వ్యవహారం జిల్లాలో సంచలనం రేపింది.




మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉన్న బీసీ సంక్షేమశాఖకు చెందిన వసతి గృహం`3లో గురువారం రాత్రి విజయనగరం జిల్లా సంతకవిటి మండలం ఒక గ్రామానికి చెందిన డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థిని శరీరంపై తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడివున్నట్టు సమీపంలోని సాంఘిక సంక్షేమశాఖ సిబ్బంది గుర్తించారు. వసతి గృహం ప్రహరీకి, మరుగుదొడ్లకు వెళ్లే మార్గంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ల మధ్య ఉన్న చెత్తకుప్పలో విద్యార్ధిని అపస్మారక స్థితిలో పడివుందంటూ సమాచారం ఇచ్చిన తర్వాత బీసీ వసతి గృహానికి చెందిన విద్యార్థులు చొరవ చూపించి రాత్రి 7.30 గంటల సమయంలో ఆసుపత్రికి తరలించారు. ఆ సమయానికే వసతి గృహానికి చెందిన వార్డెన్‌ పూర్ణ, ఇతర సిబ్బంది అందుబాటులో లేనట్టు తెలుస్తుంది. అపస్మారక స్థితిలో తీవ్ర గాయాలతో ఉన్న విద్యార్ధినిని ఆసుపత్రిలో చేర్చిన విషయాన్ని వార్డెన్‌కు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించినా ఆమె ఫోన్‌ స్విచాఫ్‌ చేసివున్నట్టు భోగట్టా. సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న వార్డెన్‌ అర్థరాత్రి 12 గంటల తర్వాత ఏబీసీడబ్ల్యూకి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఫోన్‌ స్విచాఫ్‌ చేసిన వార్డెన్‌ రిమ్స్‌కు కలెక్టర్‌ వస్తున్నారని తెలుసుకొని ఉదయం 7.30 గంటలకు తన భర్త విశాఖ ట్రాఫిక్‌ సీఐ అమితి ప్రసాద్‌తో కలిసి కారులో రిమ్స్‌కు చేరుకున్నారు.

సహ విద్యార్ధులు ఇచ్చిన సమాచారంతో విద్యార్థిని తల్లిదండ్రులు రిమ్స్‌కు చేరుకున్నారు. వారు ఆసుపత్రికి చేరుకునే సమయానికి విద్యార్థిని ఫిట్స్‌తో మరుగుదొడ్డికి వెళుతుండగా పడిపోయిందని ఆసుపత్రిలో వైద్యులకు సమాచారం ఇచ్చి వైద్యం చేయించారు. విద్యార్థిని తల్లిదండ్రులు కూతురు శరీరంపై ఉన్న గాయాలను చూసి ఫిట్స్‌ కాదని, ఉద్దేశపూర్వకంగా అఘాయిత్యానికి పాల్పడి ఫిట్స్‌గా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. బాధితురాలికి రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నా ఇప్పటికీ అపస్మారక స్థితి నుంచి బయటకు రాలేదు. బాధితురాలి శరీరంపై ఉన్న తీవ్ర గాయాలు, వసతి గృహం సిబ్బంది ఇస్తున్న పొంతనలేని సమాధానాలు, వార్డెన్‌ పూర్ణ స్పందించకపోవడం ప్రాథమికంగా అనుమానాలకు తావిస్తోంది.

వసతి గృహం వార్డెన్‌తో పాటు సిబ్బంది, విద్యార్ధులు ప్రతి రోజు ఫేస్‌ రికగ్నైజ్డ్‌ యాప్‌ ద్వారా హాజరు వేయాల్సి ఉంటుంది. వార్డెన్‌ ప్రతి రోజు ఉదయం, సాయంత్రం మహిళా డిగ్రీ కాలేజీ ప్రాంగణానికి వెళ్లి ఫేస్‌ రికగ్నైజ్డ్‌ యాప్‌ ద్వారా హాజరు వేసుకొని వెనక్కి వస్తున్నారు. గురువారం సాయంత్రం కూడా వార్డెన్‌ పూర్ణ వసతి గృహానికి రాకుండానే యాప్‌ ద్వారా హాజరు వేసుకొని వెళ్లిపోయారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బాధితురాలు బయటకు వెళ్లినట్టు సిబ్బంది చెబుతున్నారు. అయితే ఎప్పుడు తిరిగి వచ్చిందో మాత్రం చెప్పకుండా మరుగుదొడ్డెకు వెళుతుండగా ఫిట్స్‌ వచ్చి పడిపోయిందంటున్నారు. గురువారం సాయంత్రం ఫేస్‌ రికగ్నైజ్డ్‌ యాప్‌లో హాజరు వేయలేదని సిబ్బంది చెబుతున్నారు. బాధితురాలు బీఎస్సీ ఆరో సెమిస్టర్‌లో భాగంగా ఇంటర్న్‌షిప్‌లో ఉందని సహ విద్యార్థులు తెలిపారు. గురువారం ఆమెకు ఇంటర్న్‌షిప్‌ స్లాట్‌ లేదని, ఈక్రమంలోనే సాయంత్రం బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్టు చెబుతున్నారు. ఇదే విషయాన్ని సాయంత్రం 6.30 సమయంలో బాధితురాలి తల్లిదండ్రులు ఫోన్‌ చేస్తే చెప్పినట్టు తెలిసింది. ఆ తర్వాత ఫోన్‌ చేస్తే ఫోన్‌ రింగ్‌ అవుతున్నా లిఫ్ట్‌ చేయలేదని బాధితురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు.

విద్యార్ధి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం ఇచ్చిన 12 గంటల తర్వాత వార్డెన్‌ పూర్ణ రిమ్స్‌కు చేరుకోవడం పట్ల బాధితురాలి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్డెన్‌ బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం వల్లనే తన కూతురికి ఈ గతి పట్టిందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన కూతురుకి ఫిట్స్‌ సమస్య లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. వార్డెన్‌ భర్త పోలీసు అధికారి కావడం వల్ల ఒత్తిడి తెచ్చి ఫిట్స్‌తోనే ఆసుపత్రిలో చేరిందని స్టేట్‌మెంట్‌ ఇప్పించినట్టు బాధితురాలి తల్లిదండ్రులు మీడియా ముందు వెల్లడిరచారు.

మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌ చివరి రోజు కావడంతో రాత్రి 12 గంటల వరకు సందడి చేశారన్న ఆరోపణలున్నాయి. విద్యార్ధిని కాలేజీ ప్రాంగణానికి వెనుక భాగంలో ఉన్న వసతిగృహానికి వెళ్లే సమయంలో ఎగ్జిబిషన్‌కు వచ్చేవారిలో ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా అన్న సందేహాలు ఉన్నాయి. అయితే విద్యార్థులు మాత్రం బాధితురాలు అపస్మారక స్థితిలో పడి ఉన్నచోట ఆమె బ్యాగ్‌ పూర్తిగా చింపేసి ఉందని, చెప్పులు చిందరవందరగా పడివున్నాయని చెబుతున్నారు. చెవిదిద్దులను శుక్రవారం ఉదయం గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. చెవిదిద్దులను బలవంతంగా లాగిన ఆనవాళ్లు లేవు. ఎందుకంటే ఆమె చెవికుట్లు సరిగానే ఉన్నాయి. అంటే బాధితురాలే చెవిలోనివి తీసివుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

విద్యార్థిని వ్యవహారం రాష్ట్రంలో సంచలనం కావడంతో హోం మంత్రి అనిత స్పందించారు. జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్టు తెలిసింది. దీంతో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ మహిళా డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఉన్న వసతి గృహాన్ని, సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, అనంతరం రిమ్స్‌ ఐసీయూలో చికిత్స పొందుతున్న విద్యార్థిని వద్దకు వెళ్లి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. వైద్యులతో మాట్లాడి విశాఖపట్నం మెడికవర్‌కు మెరుగైన చికిత్సకు తరలించే ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ వివేకానంద సంఘటన జరిగిన హాస్టల్‌ పరిసర ప్రాంతాల్లో క్లూస్‌టీమ్‌తో ఆధారాలు సేకరిస్తుండగా, కలెక్టర్‌ కూడా వెళ్లి స్వయంగా విచారణ చేపట్టారు.

 
 
 

留言


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page