పోలీసులకు సినిమా చూపించిన బాయ్‌ఫ్రెండ్
దాడి ఎందుకు చేశాడన్నదానిపై కొనసాగుతున్న దర్యాప్తు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

స్థానిక ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతూ ఆవరణలోనే హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినిపై దాడి చేసిన కేసులో నిందితుడ్ని పోలీసులు 48 గంటలు తిరిగేలోగా అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. బాధితురాలి కాల్‌డేటా, ఎక్కడో దూరంగా ఉన్న సీసీ ఫుటేజీలో కనిపించిన నీడ మేరకు అనుమానితుడిగా భావించిన పోలీసులు శుక్రవారం నుంచి అనుమానితుడి కోసం వెతకడం ప్రారంభించారు. సెల్‌ఫోన్ లొకేషన్ టవర్ ప్రకారం నిందితుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వేగంగా కదులుతున్నాడని ఎక్కడెక్కడికో ప్రయాణించారు. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో ఒక తెలుగు సినిమాలో సన్నివేశాన్ని ఊహించుకొని బహుశా నిందితుడు తన సెల్‌ఫోన్‌ను ఏ వాహనంలోనో పెట్టి తమను ఏమారుస్తున్నాడనే ఆలోచన వచ్చింది. ఆ మేరకే ఓ బస్సులో సెల్‌ఫోన్‌ను కనుగొన్నారు. అయితే నిందితుడు ఎక్కడున్నాడో మాత్రం కనిపెట్టలేకపోయారు. మొబైల్ లభించిన తర్వాత మరిన్ని ఆధారాలు దొరికాయి. దీంతో నిందితుడు సారవకోట మండలం గోవర్ధనపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అక్కడికి పోలీసులను పంపి నిందితుడి తండ్రి నుంచి మరిన్ని వివరాలు సేకరించడంతో అప్పటి వరకు అనుమానితుడిగా ఉన్నవాడు, తాము వెతుకుతున్న నిందితుడు ఒకడేనని పోలీసులు నిర్ధారించుకొని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి కాల్‌డేటాలో ఉన్న నెంబరు, హాస్టల్‌కు వచ్చినట్టు చూపిస్తున్న వీడియో ఫుటేజ్, బస్సులో దొరికిన మొబైల్ ఫోన్, గోవర్ధనపురానికి చెందిన వ్యక్తి ఒకడేనని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. బాధితురాలి సమ్మతి మేరకే నిందితుడు హాస్టల్‌కు వచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తుంది. వీరిద్దరి మొబైల్ డేటా ఆధారంగా ఎప్పట్నుంచో వీరికి పరిచయం ఉందని, బహుశా బాధితురాలికి బాయ్‌ఫ్రెండ్ అయివుంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే దాడి ఎందుకు చేశాడన్న దానిపై మాత్రం పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులున్నారు.
Comments