top of page

10వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ కారిడార్‌

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • పలాస, టెక్కలిలో అనుకూలమైన చోట విమానాశ్రయం

  • తప్పుచేసిన వారిని వదిలిపెట్టను

  • రౌడీయిజం, నేరాలు చేస్తే కబడ్ధార్‌

  • ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

మూలపాడు వద్ద 10వేల ఎకరాలతో ఇండస్ట్రియల్‌ కారిడర్‌ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇచ్ఛాపురం మండలం ఈదుపురం గ్రామంలో ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పథకాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎయిర్‌పోర్టు నినిర్మిస్తున్నట్టు ప్రకటించారు. శ్రీకాకుళం, ఇచ్ఛాపురం మధ్యలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ ఉండేలా టెక్కలి, పలాసల్లో అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసి విమానాశ్రయాన్ని నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. తాను సమాజంపై బాధ్యత కలిగిన వ్యక్తినని, నాయకుడంటే ప్రజల మనసుల్లో ఉండాలన్నారు. తన సభలకు బలవంతపు తరలింపులు, చెట్లు తొలగింపు, పరదాలు, ఆడంబరాలు ఉండవన్నారు. మొన్న ఎన్నికల్లో చెడు మీద మంచి గెలిచిందని, 93 శాతం స్ట్రైక్‌ రేట్‌ గెలిచామని, పార్టీ పెట్టిన తర్వాత 40 ఏళ్లకు పెద్ద గెలుపు సాధించామని, రాజీలేని పోరాటం చేసి రాష్ట్రాన్ని కాపాడుకున్నామన్నారు. రాక్షసత్వంతో అరెస్టులు చేశారని, తన అరెస్టుపై 80 దేశాల్లోని తెలుగు ప్రజలు స్పందించారని, కార్యకర్తల బాధ, మనోభావాలను అర్ధం చేసుకుంటున్నానని, తప్పు చేసినవారిని వదిలిపెట్టనని, రాజకీయ కక్షసాధింపులకు పాల్పడనన్నారు. ఇటీవల కొందరు ఇష్టానుసారంగా ఎగిరెగిరిపడుతున్నారని అన్నారు. వారంతా ప్రజాస్వామ్య ముసుగులో రౌడీయిజం, నేరాలు చేస్తానంటే చూస్తూ ఊరుకొనేది లేదని, రాజకీయ ముసుగులో అరాచకాలు సృష్టించే వారికి కబడ్ధార్‌ అని హెచ్చరించారు. రాష్ట్రంలో కుప్పం, హిందూపురం తర్వాత ఇచ్ఛాపురం, టెక్కలి టీడీపీకి కంచుకోటలన్నారు.

మహిళల కోసం

మహిళల ఖర్చులు తగ్గించే దిశగా ఆలోచన చేసి ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితంగా అందించాలని నిర్ణయించానని, మహిళలకు స్వేచ్ఛ రావాలని, ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ప్రపంచానికి డ్వాక్రా సంఘాలను ఆదర్శంగా నిలిచేలా రూపకల్పన చేశానని, డ్వాక్రా సంఘాలు బలోపేతం చేసి ఆయా కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టి కల్పించే చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వంలోని పార్టీలు ఇచ్చిన హమీ మేరకు ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ ప్రారంభించామన్నారు. ఆడబిడ్డల కష్టాలు తీర్చాలని టీడీపీ హయాంలో దీపం పథకం తీసుకువచ్చి పేదలందరికీ ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చినట్టు తెలిపారు. డబ్బులు కట్టే అవసరం లేకుండా ఉచితంగా మూడు సిలిండర్లు ఇచ్చేందుకు చమురు సంస్థలతో మాట్లాడుతున్నామని, జిల్లావ్యాప్తంగా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి రూ.122 కోట్లు కాగా, ఇచ్ఛాపురం మండలంలో రూ.4.65 కోట్లు ఖర్చవుతున్నట్టు తెలిపారు.

ఇంటివద్దకే పింఛను

దేశంలో ఎక్కువ పింఛన్లు ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే పింఛన్లను పెంచి కమిట్‌మెంట్‌తో ఇచ్చామన్నారు. దేశంలో అత్యధికంగా పింఛను డబ్బులు ఇస్తున్నది కూటమి ప్రభుత్వమేనన్నారు. మూడు నెలల వరకు స్వేచ్ఛగా పింఛను తీసుకునే అవకాశం కల్పించినట్టు ప్రకటించారు. లబ్ధిదారులు ఇంటివద్దకు వచ్చి పింఛన్‌ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటానని ఉద్యోగులను హెచ్చరించారు.

నిధులు మళ్లించారు

గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయని, అధికారులు నిర్లప్తతతో పనిచేశారన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు, అప్పులుగా తెచ్చిన డబ్బులు దారి మళ్లించారని తెలిపారు. అధికారంలోకి వచ్చి 143 రోజులు అనునిత్యం ప్రజల కోసం ఆలోచన చేస్తున్నానని, గత ప్రభుత్వం చేసిన అప్పునకు ఏడాదికి రూ.లక్ష కోట్లు చెల్లించాల్సి వస్తుందని, గత ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారని ఆరోపించారు. సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండి, విలువలు, పద్ధతులు పాటించాలన్నారు. ప్రజలకు న్యాయం చేస్తూ కార్యకర్తలను అన్యాయం జరగకుండా చూసుకోవల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.

ఇసుకలో జోక్యం వద్దు

మద్యం, ఇసుక దోపిడీ చేశారని, ఉచితంగా ఇసుక ఇవ్వాలని నిర్ణయించి తమ్ముళ్లు ఎవరూ ఇందులో జోక్యం చేసుకోవద్దని ఆదేశించి స్వేచ్ఛగా ఇసుక తవ్వుకొనే అవకాశం ఇచ్చానన్నారు. నాశిరకం మద్యానికి పుల్‌స్టాప్‌ పెట్టి నాణ్యమైన మద్యం అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. బెల్ట్‌షాపులు తెరిస్తే బెల్ట్‌ తీస్తానని, మద్యం వ్యాపారులు తమాషాలు చేయొద్దని, ఎక్కువ రేట్లకు మద్యం విక్రయిస్తే మొదటిసారి అపరాధ రుసుము, రెండోసారి లైసెన్స్‌ రద్దు చేస్తానని హెచ్చరించారు. అక్రమ ఇసుకను తరలిస్తే పీడీ చట్టం కింద కేసు నమోదు చేస్తామన్నారు.

అమరావతి పూర్తి చేస్తాం

అమరావతి రాజధాని రిఫరండంగా ఎన్నికల్లో గెలిచామని, విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని, శ్రీకాకుళం రుణం తీర్చుకోవాల్సి ఉందన్నారు. అమరావతి నిర్మాణానికి కావాల్సిన వనరుల సమీకరణ పూర్తి చేసామని, జనవరి నుంచి పనులు ప్రారంభమవుతాయని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం నిధులు ఇచ్చి ఉత్పత్తి ప్రారంభించిందని, దీన్ని కాపాడే బాధ్యత తీసుకుంటున్నానని అన్నారు. ల్యాండ్‌టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దుచేసి గత ప్రభుత్వం దోపిడీని అడ్డుకున్నామని, చేతివృత్తిదారుల ఆదాయం పెంచే చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామాల్లో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో 30వేల పనులకు శ్రీకారం చుట్టామని, గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేయడానికి రూ.880 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. విశాఖ రైల్వే జోన్‌కు లైన్‌ క్లియర్‌ చేశామన్నారు. గృహనిర్మాణదారుల బకాయిలను చెల్లిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమి ఇచ్చి ఇళ్లు కట్టి ఇస్తామన్నారు. జిల్లా అంతటా ఐదేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ఇస్తామన్నారు.

ఈదుపురానికి హమీలు జల్లు

ఈదుపురం గ్రామానికి సీఎం చంద్రబాబు హమీల జల్లు కురిపించారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆయన దృష్టికి తీసుకువచ్చిన అన్ని సమస్యలకు పరిష్కారిస్తామన్నారు. వీటికి రూ.30 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. కొబ్బరి పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామంలో ప్రతి ఇంటి మీద 200 నుంచి 300 యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి చేసుకొనే సామర్ధ్యం కలిగిన సోలార్‌ ప్యానల్‌ అమర్చుకునేలా సాయం చేస్తామన్నారు. వీటి ఏర్పాటుకు గ్రామ ప్రజలంతా ముందుకు రావాలని ఈదుపురం గ్రామప్రజలకు పిలుపునిచ్చారు. తన పర్యటనకు గుర్తుగా దీన్ని అందరూ ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

గ్యాస్‌ వెలిగించి.. టీ చేసి

ఇచ్ఛాపురం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా హెలిప్యాడ్‌ నుంచి ఈదుపురంలో మహిళా లబ్ధిదారు అంబటి శాంతమ్మ ఇంటికి వెళ్లి ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ అందజేశారు. అనంతరం స్వయంగా గ్యాస్‌ను బిగించి స్టవ్‌ వెలిగించి టీ చేసి మంత్రులతో కలిసి తాగారు. ఆ తర్వాత శాంతమ్మ కుటుంబ సభ్యులతో కొన్ని నిమిషాల పాటు ముచ్చటించారు. అనంతరం ఒంటరి మహిళ బడేపల్లి జానకి ఇంటికి వెళ్లి ఒంటరి మహిళ పింఛను అందజేశారు. ఆ కుటుంబానికి రూ.2లక్షలు ఆర్థిక సాయం ప్రకటించి, ప్రభుత్వం ద్వారా ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంటిని తక్షణమే మంజూరుచేసి వెంటనే పనులు ప్రారంభించాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గ్గొన్నారు.

సమావేశంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కింజరాపు అచ్చెన్నాయుడు, ఇన్‌ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు బెందాళం ఆశోక్‌, గొండు శంకర్‌, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గౌతు శిరీష, నడికుదిది ఈశ్వరరావు, రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 
 
 

תגובות


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page