11 ఏళ్లు గడిచాయి.. అచ్చేదిన్ వచ్చాయా?
- DV RAMANA
- Jun 3
- 2 min read

దేశంలో యూపీఏ ప్రభుత్వం దిగిపోయి.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరి పదకొండేళ్లు నిండాయి. అప్పటి యూపీఏ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. తాము అధికారంలోకి వస్తే దేశానికి అచ్చే దిన్ (మంచి రోజులు) తీసుకొస్తామని అప్పట్లో ఎన్డీయే ప్రచారకర్తలు విస్తృత ప్రచారం చేశారు. వారి ప్రచారం ఫలించి మోదీ సర్కారు దేశ పాలనపగ్గాలు చేపట్టింది. ఒకసారి కాదు.. రెండు సార్లు పూర్తి టెర్మ్ పాలన సాగించి. మూడోసారి గత ఏడాది అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాది పూర్తి అయ్యింది. అంటే పదకొండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. మరీ ఈ కాలంలో దేశానికి అచ్చేదిన్ వచ్చాయా? అంటే.. లేదనే చెప్పాలి. వివిధ రంగాల్లో దేశప్రగతిని పరిశీలిస్తే విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువగా కనిపిస్తాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఉగ్రదాడులు, మహిళలపై అకృత్యాలతో సమా జం అల్లాడిపోతుంది. ప్రజాసంక్షేమం మాట అటుంచితే.. నోట్ల రద్దు వంటి పలు నిర్ణయాలతో ప్రజలను అనవసరంగా అవస్థలపాలు చేసిందన్న అపప్రదను మోదీ సర్కారు మూటగట్టుకుంది. ఏన్డీయే హయాం లో నిత్యావసర వస్తువుల ధరలు 200 శాతం వరకు పెరిగాయి. వీటితో పాటు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగ నియామకాలు జరుపుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. ఫలితంగా దేశంలో నిరుద్యోగం రేటు కనీవినీ ఎరుగని స్థాయికి చేరింది. డిగ్రీ పూర్తి చేసుకున్న 42 శాతం మందికి ఉద్యో గాలు లేవని ఇటీవల ఓ నివేదిక వెల్లడిరచింది. ఇచ్చిన మాట ప్రకారం మోదీ సర్కారు ఏడాదికి రెండు కోట్లు చొప్పున 11ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఏడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దేశంలో ఉగ్రవాదుల కదలికలు బాగా పెరిగాయి. 2014 నుంచి ఇప్పటివరకూ ఒక్క జమ్ముకశ్మీర్లోనే 11 ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో 103 మంది సైనికులు, 44 మంది పౌరులు మరణించారు. 2016లో ఉరి, 2019లో పుల్వామా, తాజాగా పహల్గాం ఉగ్రదాడులతో యావత్తు దేశం వణికిపోయింది. విదేశాంగ విధానంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టం గా కనిపిస్తోంది. పొరుగున ఉన్న, మన దాయాదులే అయిన శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు ఇటీవలి కాలంలో భారత్‌కు వ్యతిరేకంగా మారి చైనాకు చేరువ కావడమే దీనికి నిదర్శనం. అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు, భారతీయ విద్యార్థులపై ఆంక్షలను తప్పించడంలోనూ కేంద్ర సర్కారు చేతులెత్తే సింది. ఎన్డీయే అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం మొత్తాన్ని 2014 ఎన్నికల ప్రచా రంలో ప్రగల్భాలు పలికారు. ఆ నగదును ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు చొప్పున జమ చేస్తామ న్నారు. కానీ దానికి విరుద్ధంగా స్విస్ బ్యాంకులో భారతీయుల బ్లాక్‌మనీ పెరిగింది. ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు పలాయనం చిత్తగించారు. దాంతో ఏమీ చేయలేక బ్యాంకులు ఇప్పటివరకూ రూ.16.35 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను మాఫీ చేసినట్టు పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ఒప్పుకుంది. నకిలీ కరెన్సీ, బ్లాక్‌మనీని అరికడతామంటూ కేంద్రం ఒక్క కలంపోటుతో పెద్ద నోట్లు రద్దు చేసి పారేసి కోట్లాది ప్రజలను బ్యాంకులు, ఏటీఎంల ముందు లైన్లలో నిలబెట్టింది. వందలాది మంది ఆ లైన్లలోనే ప్రాణాలు కోల్పోయినా.. సర్కారు చెప్పిన ఫలితం మాత్రం దక్కలేదు. రకరకాల పన్నులతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ దానికి పరిష్కారంగా ‘ఒకే దేశం-ఒకే ట్యాక్స్’ విధానాన్ని ప్రతిపాదించింది. అందులో భాగంగా రాష్ట్రాలను బలవంతంగా ఒప్పించి జీఎస్టీని తీసుకువచ్చింది. హేతుబద్ధత లేని ఈ ట్యాక్స్ స్లాబులతో ఎన్నో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పొరుగుదేశాల్లో మతపరమైన హింస ఎదుర్కొం టున్న వారికి ఆశ్రయం కల్పిస్తామంటూ ఎన్డీయే సర్కారు పౌరసత్వ చట్టాన్ని సవరించి సీఏఏ తీసు కొచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమం ఎగిసిపడిరది. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను అమ్మడమే పనిగా కేంద్రం తీసుకుంటున్న చర్యలు పీఎస్‌యూల మనుగడను, వాటి ఉద్యోగుల భద్రతను ప్రమాదంలో పడేశాయి. ఎల్‌ఎస్‌ఐసీలో కొంత వాటాను ప్రైవేటు పరం చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. రైతులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా సాగు చట్టాలను తీసుకువచ్చింది. ఫలితంగా జరిగిన నిరసనల్లో 700 మందికి పైగా రైతులు చనిపోయారు. ఆందోళనలు నానాటికీ తీవ్రమవుతుండటంతో చివరికి తాపీగా రైతులకు సారీ చెప్పి సాగు చట్టాలను వెనక్కు తీసుకొంటున్నట్టు ప్రకటించింది.
Comments