top of page

14 ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • ఆందోళనకు దిగిన యజమానులు

  • బాబే తవ్వుకోమని చెప్పారని నిలదీత

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఉచిత ఇసుక విధానం అమలైన తర్వాత ఇసుకను గ్రామ సమీపంలోని నాగావళి నుంచి తరలించి స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేసి లారీలకు లోడ్‌ చేస్తున్న తమ్మినాయుడుపేట ట్రాక్టర్‌ యజమానులకు పోలీసు, రెవెన్యూ అధికారులు రaలక్‌ ఇచ్చారు. తమ్మినాయుడుపేట నుంచి ఇసుకను తలిస్తున్న 14 ట్రాక్టర్లను నగరం సమీపంలో జాతీయ రహదారిపై ఎచ్చెర్ల పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గురువారం సీజ్‌ చేశారు. నాగావళి నుంచి ట్రాక్టర్లతో ఇసుకను తరలించి హైవే సమీపంలో డంప్‌ చేస్తూ విశాఖకు లారీల్లో అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు. గత రెండు నెలలుగా ఇసుకను తోడేస్త్తూ సమీప ప్రాంతాల ప్రజల అవసరాలకు ఇసుక ఇవ్వకుండా అడ్డుకంటున్న తమ్మినాయుడుపేట ఇసుక మాఫియాపై సీఎం కార్యాలయానికి స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కదిలింది. ట్రాక్టర్లతో ఇసుక తరలించుకోవచ్చంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారని రెవిన్యూ అధికారులు, పోలీసులతో ట్రాక్టర్ల యజమానులు వాగ్వాదానికి దిగారు. ట్రాక్టర్లను అడ్డుకొని ప్రభుత్వ సూచనలను పోలీసులు, రెవెన్యూ అధికారులు ధిక్కరించారని అక్రమంగా ఇసుకను తరలిస్తున్నవారు ఆందోళనకు దిగారు. పోలీసు, రెవెన్యూ సిబ్బంది చర్యలకు అడ్డ్డుతగులుతూ ఆందోళన చేస్తామని జాతీయ రహదారిపై నిలదీశారు.

ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట వద్ద ఉచిత ఇసుక అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇసుకను అక్రమంగా స్టాక్‌ వేసి అక్కడి నుంచి లారీలకు యంత్రాలతో లోడ్‌ చేసి విశాఖకు తరలించడం నిరంతర ప్రక్రియగా మారిపోయింది. ఇక్కడ ఇసుక ర్యాంపు లేదని మైన్స్‌ అధికారులు చెబుతున్నారు. ఉచిత ఇసుక అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామంలో కొత్తగా 40 ట్రాక్టర్లను స్థానికులు కొనుగోలు చేశారని తెలిసింది. నదిలో ఇసుకను ట్రాక్టర్లకు లోడ్‌ చేయడానికి ఒక జేసీబీని కొనుగోలు చేశారు. వీరంతా కలిసి గ్రామ సమీపంలో నాగావళి నదిలో తమ్మినాయుడుపేట వద్ద ఇసుక ర్యాంపును తెరిచి సింగూరు తోటల్లో స్టాక్‌పాయింట్‌ ఏర్పాటు చేసి జేసీబీలతో లారీల్లో లోడ్‌ చేసి విశాఖకు ట్రాన్స్‌పోర్టు చేస్తున్నారు. తమ్మినాయుడుపేటకు చెందిన ట్రాక్టర్ల యజమానులంతా కలిసి సమీప గ్రామాల నుంచి వచ్చే ట్రాక్టర్లలో ఇసుక లోడ్‌ చేసేందుకు నిరాకరిస్తూ అడ్డుకుంటున్నారని ట్రాక్టర్ల యజమానులు ఆందోళన చేశారు. వారి ట్రాక్టర్లను తమ్మినాయుడుపేట నుంచి నగరం మీదుగా వచ్చే క్రమంలో అడ్డుకోవడానికి ఫరీద్‌పేట, ఇబ్రహీంబాద్‌, కుశాలపురం గ్రామాలకు చెందినవారంతా సిద్ధమయ్యారు. తమ్మినాయుడుపేట గ్రామానికి చెందిన ట్రాక్టర్ల యజమానులంతా ఒక జట్టుగా ఏర్పడి స్టాక్‌పాయింట్‌ ఏర్పాటుచేసి రేయింబవళ్లు విశాఖకు లారీల్లో తరలిస్తున్నారు. దీనిపై రెవెన్యూ, పోలీసు అధికారులు చర్యలు తీసుకోపోవడంతో సీఎంవోకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు, రెవెన్యూ అధికారులు స్పందించి గురువారం మధ్యాహ్నం ఇసుక లోడ్‌ చేసుకొని నది నుంచి జాతీయ రహదారిపైకి వచ్చిన సమయంలో అడ్డుకొని సీజ్‌ చేశారు. నదిలో ఇసుకను లోడ్‌ చేయడానికి ఏర్పాటుచేసిన జేసీబీని సీజ్‌ చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఉచితంగా ఇసుక తరలించుకోవాలని ప్రభుత్వం చెబుతుంటే మీరెందుకు అడ్డుకుంటారని అధికారులను ట్రాక్టర్ల యజమానులు నిలదీస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక ర్యాంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ఇసుకను ఎలా తరలిస్తారని మైన్స్‌ అధికారులు ట్రాక్టర్ల యజమానులను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నందున ట్రాక్టర్లను సీజ్‌ చేస్తున్నట్టు ఎచ్చెర్ల తహసీల్దారు చెబుతున్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page