`21 సెగ్మెంట్లలోనే అధికంగా ఉన్న పురుష ఓటర్లు
`20 చోట్ల పదివేలకుపైగా ఎక్కువగా స్త్రీలు
`మరో 50 ప్రాంతాల్లో ఐదువేలకుపైగా సంఖ్యాధిక్యత
`మహిళలందరూ ఓట్లు వేస్తారా అన్నదే సందేహం
`వారి నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయిలో మగాళ్లు
(డి.వి.రమణ - రచ్చబండ)
రాష్ట్రంలో ఎన్నికల పర్వం కీలకదశకు చేరుకుంది. పోలింగ్‌కు తొమ్మిది రోజులు, ప్రచారానికి వారం రోజుల సమయమే ఉన్న తరుణంలో బరిలో ఉన్న పార్టీలు, అభ్యర్థులు మేనిఫెస్టోలు రిలీజ్ చేసి ప్రచారాన్ని పతాకస్థాయికి తీసుకెళ్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా ప్రకటించిన రాష్ట్ర ఓటర్ల వివరాలు కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెరపైకి తెచ్చాయి. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే సంఖ్యే అధికంగా ఉంది. దాదాపు ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొత్త విషయం ఏమిటంటే రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఏకంగా 154 చోట్ల మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారట. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 4.10 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషు ఓటర్ల సంఖ్య 2,03,39,851 కాగా మహిళలు 2,10,58,615గా ఉంది. ట్రాన్స్‌జెండర్లు 3421 మంది ఉన్నారు. ఇక సర్వీస్ ఓటర్ల సంఖ్య 68,185కు పెరిగింది. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఏడులక్షలకుపైగా ఎక్కువగా ఉన్నారని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. ఈ ఏడాది జనవరిలో ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లోనే మహిళల కంటే పురుష ఓటర్లు ఎక్కువగా ఉండగా మిగిలిన జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అయితే తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం మొత్తం అన్ని జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు స్పష్టమైంది.
నియోజకవర్గాలవారీగా తేడాలు ఇలా..
ఎన్నికల సంఘం ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం చూస్తే 154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉంటే.. మిగిలిన 21 సెగ్మెంట్లలోనే పురుష ఓటర్ల సంఖ్యాధిక్యత ఉంది. టెక్కలి, పాతపట్నం, ఆమదాలవలస, ఎచ్చెర్ల, నరసన్నపేట, రాజాం, చీపురుపల్లి, గాజువాక, పిఠాపురం, పి.గన్నవరం, ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, పత్తికొండ, కోడుమూరు, ఆలూరు, మడకశిర, దర్శి, హిందూపురం, పెనుగొండ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లే అధికంగా ఉన్నారు. మహిళాధిక్యత ఉన్న నియోజకవర్గాలను పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా పురుష ఓటర్ల కంటే పదివేలు అంతకుమించి మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలు 20 వరకు ఉన్నాయి. కొవ్వూరు, ఏలూరు, మంగళగిరి, పెనమలూరు వంటి సెగ్మెంట్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఐదువేల కంటే ఎక్కువ మహిళా ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు 50 వరకు ఉన్నాయి. వీటిలో ఇచ్ఛాపురం, కురుపాం, పార్వతీపురం, శృంగవరపుకోట, భీమిలి, విశాఖపట్నం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, పాడేరు, అనకాపల్లి, పాయకారావుపేట, తుని, రామచంద్రాపురం, రాజమండ్రి రూరల్, రాజానగరం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పోలవరం, గన్నవరం, గుడివాడ, పెనమలూరు, ఎన్టీఆర్ జిల్లాలోని మూడు సెగ్మెంట్లు, నందిగామ, జగ్గయ్యపేట, తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరుపేట, గురజాల, పర్చూరు, ఒంగోలు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, రాజంపేట, కడప, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, నందికొట్కూరు, కర్నూలు, పాణ్యం, నంద్యాల, అనంతపురం అర్బన్, మదనపల్లె, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, చిత్తూరు నియోజకవర్గాలున్నాయి. మిగిలిన సెగ్మెంట్లలో ఐదువేల లోపు సంఖ్యాధిక్యతలో మహిళా ఓటర్లు ఉన్నారు.
మహిళా ఓటర్లు అధికంగా ఉండటానికి కారణాలు
మహిళల ఓటర్లు అధికంగా ఉండటానికి అనేక కారణాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పురుషుల కంటే మహిళల ఆయుర్థాయం అధికం కావడం, గతం కంటే మహిళల్లో రాజకీయ అవగాహన పెరగడం వీటికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. మన రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల సగటు ఆయుర్థాయం నాలుగేళ్లు ఎక్కువ. అందువల్ల సహజంగానే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం 2021 నుంచి 2025 మధ్యలో పురుషుల సగటు ఆయుర్ధాయం 69.5 శాతం ఉంటే మహిళల సగటు ఆయుర్ధాయం 73.6 శాతంగా ఉంది. మహిళల్లో రాజకీయ అవగాహన పెరగడం, మొదటిసారి ఓటుహక్కు నమోదు చేసుకున్నవారిలో పెరగడం దీనికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు.
మహిళా ఓటర్లు ఎవరివైపు?
అత్యధిక నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారే కొత్త ప్రభుత్వాన్ని డిసైడ్ చేయనున్నారన్నది సుస్పష్టం. దీన్ని గుర్తించిన పార్టీలు సైతం తమ మేనిఫెస్టోల్లో మహిళలను ఆకట్టుకొనే పథకాలనే ఎక్కువగా చొప్పించాయి. వైకాపా అధినేత జగన్ తొలి నుంచి మహిళా ఓటుబ్యాంకునే నమ్ముకుని పని చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ప్రకటించిన నవరత్నాలు పథకాల్లో దాదాపు అన్నీ మహిళలకు లబ్ధి చేకూర్చేవే. ఈ ఎన్నికల్లోనూ ఆ లబ్ధిని మరింత పెంచుతూ మేనిఫెస్టో ప్రకటించారు. అదే విధంగా టీడీపీ కూటమి కూడా ఈసారి మహిళా ఓటర్లనే టార్గెట్ చేస్తూ సూపర్ సిక్స్, ఇతర కార్యక్రమాలను తమ మేనిఫెస్టోలో చేర్చింది. కాంగ్రెస్ సైతం అదే బాటలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో మహిళల మద్దతు ఏపార్టీకి లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. నిన్నమొన్నటి వరకు మహిళలు గంపగుత్తగా వైకాపా వైపు ఉంటారన్న అంచనాలు ఉండేవి. కానీ ఇప్పుడు కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అందరూ ఓట్లు వేస్తారా?
మహిళా ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ అందరూ ఓట్లు వేస్తారా? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే అర్బన్ ప్రాంతాల్లో మహిళా ఓటింగ్ తక్కువగా నమోదవుతోందని గత ఎన్నికల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఓటుహక్కు వినియోగించుకోవడంలో అర్బన్ మహిళల్లో నిర్లిప్తత కనిపిస్తోందన్న అభిప్రాయం ఉంది. ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న మహిళలు తమ సొంతూళ్లకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడంలో నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. ‘నా ఒక్క ఓటు పడకపోతే సమాజానికి వచ్చే నష్టమేం లేదు’ అనే భావన కూడా చాలామంది మహిళల్లో కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి మొత్తం 74 శాతం పోలింగ్ నమోదు కాగా ఓటు హక్కు వినియోగించుకోనివారిలో 83 లక్షల మందికిపైగా మహిళలేనని తేలింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో 78 శాతం ఓట్లు పోల్ కాగా 40 లక్షలకుపైగా మహిళలు, 39 లక్షలకుపైగా పురుషులు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదని తేలింది. ఇక గ్రామీణ, అర్బన్ ప్రాంతాలన్న తేడా లేకుండా చాలా కుటుంబాల్లో మహిళలు ఎవరికి ఓటు వేయాలన్నది మగాళ్లే నిర్దేశించే పరిస్థితి కూడా ఉంది. ఓటు వేసేందుకు వెళ్లడం, వెళ్లకపోవడం కూడా మగాళ్ల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందంటున్నారు.
Comments