1540 డిగ్రీల తాపం.. మలమల మాడిపోయారు పాపం!
- DV RAMANA

- Jun 9
- 3 min read
స్టీల్‌ప్లాంట్‌లో ఎన్నడూ ఎరుగని దారుణ ప్రమాదం
మరుగు నీటినే తట్టుకోలేని శరీరాలపై వందల రెట్ల ఉష్ణదాడి
క్షతగాత్రుల పరిస్థితి నిత్య నరకయాతనే
భారీ పేలుడు సంభవించడం వల్లే పెరిగిన ప్రమాద తీవ్రత

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
ఎండలు 40 డిగ్రీలు దాటితేనే ఆ వేడిని తట్టుకోలేక అల్లాడిపోతాం. వేడి నీళ్లు ఒంటి మీద పడితే చాలు.. మంట, బాధతో విలవిల్లాడిపోతాం. అలాంటిది 1500 నుంచి 1600 సెల్సీయస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద సలసలమరుగుతూ.. కరిగిన స్థితిలో ద్రవపు ఉక్కు(లిక్విడ్ స్టీల్) మీద పడితే ఎలా ఉంటుందో? వర్ణించశక్యం కాదు. ఆ శరీరాలు కాలి బొగ్గులా మారిపోతాయి. గుర్తించడం కూడా దాదాపు అసాధ్యం. సోమవారం సాయంత్రం విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన దారుణ ఘటన కూడా అలాంటదే. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాల బాధ ఒకటైతే.. గాయపడి ఆస్పత్రులపాలైన బాధ ఇంకా వర్ణనాతీతం. శరీరాలు కమిలిపోయి, చర్మం ఊడిపోయి.. బెడ్ల మీద కుదురుగా పడుకోలేక వారు పడే నరకయాతన పగోడికి కూడా వద్దనిపిస్తుంది. పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి కనుకనే వాటిలో పనిచేసేవారి భద్రతకు అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చట్టాలు చెబుతున్నాయి. కానీ భద్రతా చర్యల్లో లోపాలు, పని ప్రదేశాల్లో మానవ, సాంకేతిక తప్పిదాలు, అనుకోని ఉపద్రవాల కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ విశాఖ ఉక్కులో నిన్నటి దుర్ఘటన మాత్రం ఊహించనిది.. గతంలో ఏ స్టీల్‌ప్లాంట్‌లోనూ జరగనిదిగా ఉక్కురంగ నిపుణులు చెబుతున్నారు. కన్వర్టర్ నుంచి క్యాస్టింగ్ యూనిట్‌కు ద్రవపు ఉక్కును తరలిస్తున్న లాడిల్‌లో సాంకేతిక సమస్య తలెత్తి భారీ పేలుడు సంభవించడం వల్ల ఈ ఘోర విపత్తు వాటిల్లిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిది నుంచి 11కు పెరిగినట్లు సమాచారం. మరికొంతమంది ఆస్పత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ప్రమాదం తీవ్రతను అర్థం చేసుకోవాలంటే ఉక్కును కరిగించే ప్రక్రియను, లిక్విడ్ స్టీల్ ఉష్ణోగ్రత తీవ్రత గురించి తెలుసుకుంటే ప్రమాద తీవ్రత అర్థమవుతుంది.
వందల రెట్ల ఉష్ణతాపం
సాధారణంగా మనిషి చర్మం 60`70 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలనే తట్టుకోలేక కాలిన గాయాలకు గురవుతుంది. నీరు వంద డిగ్రీల వద్ద మరుగుతుంది. అది పడితేనే కాలిపోయి చర్మం ఊడిపోతుంది. అయితే బంగారం, వెండి వంటి లోహాల కంటే ఎంతో కఠినమైన ఉక్కు 1500 డిగ్రీలపైగా అధిక ఉష్ణోగ్రతల వద్దే కరుగుతుంది. అంటే మనిషి చర్మం తట్టుకునే స్థాయికి కొన్ని వందల రెట్లు అధిక ఉష్ణోగ్రత ఉంటందన్నమాట. అంత తీవ్రమైన ద్రవ ఉక్కు ఈ ప్రమాదంలో అక్కడున్న ఉద్యోగులు, కార్మికులపై పడింది. ఫలితంగా మృతుల శరీరాలకు పూర్తిగా మాడిపోయాయి. గుర్తింపు కూడా కష్టమైందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రమాదం మరోసారి భారీ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల ప్రాముఖ్యతను గుర్తు చేసింది. వేల డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య పనిచేసే కార్మికుల భద్రత కోసం అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు, నిరంతర పర్యవేక్షణ, సమయానుకూల నిర్వహణ ఎంత అవసరమో ఇది గుర్తు చేస్తున్నది. సాధారణంగా ఉక్కు కర్మాగారాల్లో పనిచేసే సిబ్బంది ప్రత్యేక భద్రతా దుస్తులు, హీట్ రెసిస్టెంట్ సూట్లు, హెల్మెట్లు, ఫేస్ షీల్డులు, ప్రత్యేక బూట్లు ధరిస్తారు. అయితే అధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షణ కల్పించడానికి ఇవి కొంతవరకు ఉపకరిస్తాయి. వందలు, వేల డిగ్రీల వేడి కలిగిన కరిగిన ఉక్కు ఒక్కసారిగా మీద పడితే ఇవి ఏమాత్రం రక్షణ కల్పించలేవు.
పేలుడు ఎందుకు జరిగింది?
స్టీల్‌ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాప్(ఎస్ ఎం ఎస్)`1లో బ్లాస్ట్‌ఫర్నెస్ నుంచి టర్బో ల్యాడిల్ ద్వారా ద్రవ ఉక్కును కన్వర్టర్‌కు చేరవేస్తారు. అక్కడ శుద్ధి ప్రక్రియ చేపడతారు. ఆక్సిజన్‌ను అధిక ఒత్తిడితో పంపించడం ద్వారా కార్బన్, సిలికాన్, మాంగనీస్, ఫాస్పరస్ వంటి మూలకాలను వేరు చేస్తారు. ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుతాయి. అందుకే ప్రతి దశలో కఠిన భద్రతా ప్రమాణాలు పాటించడం అత్యంత కీలకం. అనంతరం ల్యాడిల్ ద్వారా కాస్టింగ్ మిషన్లకు చేరుస్తారు. ఇదే క్రమంలో కన్వర్టర్ నుంచి బయల్దేరిన ల్యాడిల్`19 కాస్టింగ్ మెషిన్ వైపు వెళ్తుండగా హఠాత్తుగా పేలిపోయి మంటలు వ్యాపించాయి. పేలుడు ధాటికి అందులో ఉన్న 1540 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణతతో ఉన్న సుమారు 150 టన్నుల ద్రవ ఉక్కు చుట్టుపక్కల విరజిమ్మింది. ఆ సమయంలో ల్యాడర్ కింద 14 మంది శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. లిక్విడ్ స్టీల్ పూర్తిగా పడటంతో ఎనిమిదిమంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అదృష్టవశాత్తు అది టీ విరామ సమయం కావడంతో చాలామంది ఉద్యోగులు, కార్మికులు అక్కడినుంచి వెళ్లిపోయారు. లేనిపక్షంలో పరిస్థితి మరింత భయానకంగా ఉండేదని ప్రమాదం నుంచి బయటపడిన ఉద్యోగులు చెప్పారు. పేలుడు తీవ్రత కారణంగా ద్రవ ఉక్కు 70 నుంచి 80 అడుగుల పరిధిలో ఎగిసిపడిందని చెబుతున్నారు. దాంతో ఆ సమీపంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాద తీవ్రతకు కారణమైన పేలుడు ఎలా సంభవించిందన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఉక్కును కరిగించే క్రమంలో కెమికల్స్ కలపడం సహజ ప్రక్రియ. ఆ కెమికల్స్ నాసిరకానికి చెందినవైతే ఇలాంటి ప్రమాదం జరగవచ్చని.. ప్రస్తుత ప్రమాదానికి కూడా ఇదే కారణమై ఉండవచ్చని ఉద్యోగవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించినందున.. విచారణాంశాల్లో దీన్ని కూడా చేర్చాలని కార్మికవర్గాలు కోరుతున్నాయి.
కేంద్ర మంత్రుల పరామర్శ
మంగళవారం కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామితో కలిసి పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అలాగే ఉక్కు కర్మాగారంలో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు.






Comments