1800 కిలోమీటర్లు.. 50 రోజులు
- NVS PRASAD
- Nov 15, 2024
- 1 min read
‘బాబు’ మొక్కును తీర్చుకుంటున్న కొత్తూరువాసి
వైకాపా అరాచకాలు చూడలేక అయ్యప్పకు ముడుపు
(సత్యంన్యూస్, కొత్తూరు)

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 1800 కిలోమీటర్లు. వారం కాదు, పక్షం కాదు.. ఏకంగా 50 రోజులు. శక్తిని, సొమ్మును వెచ్చించి శబరిమలకు కాలినడకన వెళ్తున్నాడు కొత్తూరు మండలం బమ్మిడికి చెందిన గండెం సూర్యనారాయణ (42). చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అయ్యప్ప దీక్ష తీసుకొని తన గ్రామం బమ్మిడి నుంచి శబరిమల వరకు కాలినడకన వెళ్తానని మొక్కుకున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో సూర్యనారాయణ తన మొక్కును చెల్లించడానికి సోమవారం కాలినడకన శబరిమలకు బయల్దేరుతున్నారు. ఇది అక్షరాలా 1800 కిలోమీటర్లు వస్తున్నట్టు గుర్తించారు. ఇందుకోసం 50 రోజులు పడుతుంది. దారిలో హిందూ దేవాలయాల్లో ఎవరైనా భిక్ష పెడితే తినడం, లేదూ అంటే ఉపవాసాలు ఉండటం మినహా ఇన్ని వందల కిలోమీటర్లు వంటసామగ్రితో నడవలేమని గండెం సూర్యనారాయణ ‘సత్యం’కు తెలిపారు. 2014లో జన్మభూమి కమిటీ సభ్యుడిగా ఉన్న గండెం సూర్యనారాయణకు చెందిన కళ్లాలను 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మాణాల కోసం తీసుకోవాలని ప్రయత్నించింది. తనలాంటి కళ్లాలే గ్రామంలో చాలామందికి ఉన్నాయని, అందరి వద్ద ఒకే నిష్పత్తిలో భూములు సేకరించాలని గండెం సూర్యనారాయణ కోరినా వైకాపా నేతలు, అప్పటి రెవెన్యూ అధికారులు వినిపించుకోలేదు. దీంతో కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకోవడంతో సూర్యనారాయణ భూములు మిగిలాయి. అప్పుడే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తప్ప తమకు ఈ కక్షసాధింపులు ఆగవని, చంద్రబాబు గెలిస్తే కాలినడకన శబరిమల వస్తానని ఆయన మొక్కుకున్నారు. జనవరి 10లోగా శబరిమల చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే 30 రోజుల దీక్ష పూర్తిచేసిన ఆయన సోమవారం బమ్మిడి నుంచి బయల్దేరి, ముందుగా తిరుపతి చేరుకొని, అక్కడ ఇరుముడి వేసుకొని కాట్పాడి మీదుగా కేరళలో అడుగుపెడతారు. అక్కడ మళ్లీ వనయాత్ర ద్వారా అయ్యప్పను దర్శించుకొని మొక్కు తీర్చుకోనున్నారు. ఈయన వెనుక మరో ముగ్గురు భక్తులు అయ్యప్ప మాలధారణతో వెళ్తున్నారు.
Comentários