రెండు తెలుగు రాష్ట్రాల్లో 54 సీట్లు పెరిగే అవకాశం

దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగాల్సి ఉంది. ఈ భారీ ప్రక్రియ తర్వాత రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ సీట్లలో పెను మార్పులు రాబోతున్నాయి. ఇందులో అత్యధికంగా ఉత్తరాది రాష్ట్రాలు లబ్ధి పొందడం ఖాయంగా తెలుస్తోంది. జనాభా ఆధారంగా జరిగే పునర్విభజన కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు భారీ నష్టం తప్పదన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే ఆ మేరకు భయాలు మొదలయ్యాయి. అయితే కేంద్రం అంచనాల ప్రకారం వివిధ రాష్ట్రాల్లో పెరిగే సీట్ల సంఖ్య ఇలా ఉంది.
భారతదేశ పటంలో పైన ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో ఎంపీల సంఖ్య 9కి పెరగబోతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో 4, పంజాబ్‌లో 18, ఉత్తరాఖండ్‌లో 7, హర్యానాలో 18, ఢల్లీిలో 13, యూపీలో 143, రాజస్తాన్‌లో 50, గుజరాత్‌లో 43, మధ్యప్రదేశ్‌లో 52, జార్ఖండ్‌లో 24, బీహార్‌లో 79, ఛత్తీస్‌ఘడ్‌లో 19, పశ్చిమబెంగాల్లో 60, సిక్కింలో 1, అరుణాచల్‌ప్రదేశ్‌లో 2, అస్సోంలో 21, నాగాలాండ్‌లో 1, మణిపూర్‌లో 2, మిజోరంలో 1, త్రిపురలో 2, మేఘాలయలో 2, ఒడిశాలో 28, మహారాష్ట్రలో 70, ఏపీ, తెలంగాణలో కలిపి 54, కర్నాటకలో 41, తమిళనాడులో 49, పుదుచ్చేరిలో 1, కేరళలో 20, లక్షద్వీప్ 1, గోవా 2, అండమాన్‌లో 1, దాద్రానగర్ హవేలీలో 2 కాబోతున్నాయి.
ఇలా చూస్తే మొత్తం సీట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 543 నుంచి 848కి పెరగబోతోంది. ఇందులో ఒక్క యూపీ-బీహార్ వాటాయే 222 సీట్లు కానుంది. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు 165, ఇతర రాష్ట్రాల్లో సీట్లు 461 కాబోతున్నాయి. దీంతో దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం ఏంటో ఇట్టే అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాదికి అన్యాయం జరగదంటూ కేంద్రం సన్నాయినొక్కులు నొక్కుతోంది. అయితే దీనికి విరుగుడుగా జనాభా ఆధారంగా కాకుండా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం ప్రాతిపదికగా ఈ విభజన చేయాలని దక్షిణాది రాష్ట్రాలు కోరుతున్నాయి. దీనిపై కేంద్రం స్పందించడం లేదు.
సత్యంన్యూస్, శ్రీకాకుళం
コメント