కార్పొరేషన్ కార్యాలయమో, పంచాయతీ ఆఫీసో అర్థం కావడంలేదు
రూ.40 కోట్లతో కాలువలన్నీ బాగుచేస్తాం
న్యూకాలనీకి పాత వైభవాన్ని తీసుకొస్తాం
ఎమ్మెల్యే గొండు శంకర్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

స్థానిక రామలక్ష్మణ జంక్షన్ నుంచి డే అండ్ నైట్ వరకు 400 మంది రోడ్డుకు ముందు భాగంలో ఉన్న తమ ఇళ్లు కొట్టేసినా అభ్యంతరం లేదని రాతపూర్వకంగా వచ్చి తనను కలిశారంటే నగరంలో ట్రాఫిక్ సమస్య ఏమేరకు ఉందో అర్థమవుతుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వినతులు స్వీకరించడం, నిలిచిపోయిన పనులను ప్రారంభించడంలో కాలం గడిచిపోయిందని, ఇప్పుడిప్పుడే ప్రాంతాల వారీగా అభివృద్ధి మీద దృష్టి సారిస్తున్నానని, అందులో భాగంగానే న్యూకాలనీవాసుల సంక్షేమ సంఘం ఏర్పాటుచేసిన సమావేశానికి వచ్చానన్నారు. స్థానిక అపెక్స్ బిల్డింగ్‌లో గురువారం న్యూకాలనీవాసులతో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. కాలనీలో ప్రముఖులంతా ఇక్కడి సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని, ఒక్క న్యూకాలనీలో మాత్రమే రోడ్లు, కాలువల సమస్య లేదని, నగరం మొత్తం రూపురేఖలు మార్చాల్సిన పరిస్థితి ఉందన్నారు. అమృత్ నిధులు రూ.40 కోట్లు ఖర్చు పెట్టి నగరంలో మురికి కాల్వలు బాగుచేయడానికి డీపీఆర్ తయారుచేసినట్లు ఆయన పేర్కొన్నారు. అసలు నగర కార్పొరేషన్ కార్యాలయమే పంచాయతీ ఆఫీస్ కంటే దారుణంగా ఉందని, వీటన్నింటినీ మార్చాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రామలక్ష్మణ జంక్షన్ నుంచి డే అండ్ నైట్ వరకు రోడ్డు వెడల్పు చేయడానికి రంగం సిద్ధమైపోయిందని, అదే సమయంలో ఇలిసిపురం నుంచి బొందిలీపురం మీదుగా బలగ మార్గానికి కలిపే రోడ్డును కూడా వెడల్పు చేస్తున్నట్టు ఎమ్మెల్యే వివరించారు. అరసవల్లి సూర్యనారాయణస్వామి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగ చేయడం ఒక సాకుమాత్రమేనని, ఆ పేరిట దేశం మొత్తంలో కదలిక తీసుకువచ్చి నిధులు తెచ్చుకొని నగరాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. రథసప్తమి కోసం నిధులు కావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదని, ఇప్పటి వరకు ఈ పండగ కోసం రూ.2 కోట్లు ప్రభుత్వం మంజూరుచేసిందని, మరో రూ.కోటి విడుదల చేస్తానని రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి నారాయణ మాటిచ్చారని, దీంతో రథసప్తమి సందర్భంగా ప్రారంభించిన పనులు పూర్తి చేస్తామన్నారు. న్యూకాలనీలో రోడ్లు ఆక్రమణలకు గురికావడం, వీధి దీపాలు వెలగకపోవడాన్ని కమిషనర్ దృష్టిలో పెట్టానని, ఆయన తిరుపతి నుంచి రాగానే దీనిపై దృష్టి సారిస్తారన్నారు. రోడ్ ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వీటిని నగర శివార్లలోకి తరలించేందుకు ప్రయత్నిస్తానన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని ఈమధ్యనే అర్థమైందని, ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిరంతరం పోలీస్ బీట్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లో అనేక రోడ్లు, కాలువలు నిర్మించామని, వాటిని ప్రారంభించకపోవడం వల్ల బయటకు తెలియడంలేదని, త్వరలోనే సుందరమైన పార్కులు కూడా నిర్మించి నగరానికి శోభను చేకూరుస్తామన్నారు. టీడీపీ నాయకుడు అంధవరపు సంతోష్ మాట్లాడుతూ నగరాభివృద్ధికి ఎమ్మెల్యే నిరంతరం శ్రమిస్తున్నారని, ఏ సమస్య చెప్పినా గాలికి వదిలేయకుండా దాన్ని నమోదు చేసుకోవడం, వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రమంత్రిగా అచ్చెన్నాయుడు విజయవాడలో ఛాంబర్ ప్రారంభించినప్పుడు ఆ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులు, ఐఏఎస్‌లతో తాను నమోదు చేసుకున్న సమస్యలను ప్రస్తావించి పరిష్కారాన్ని కోరడం కోసం వారిని సతాయించడం స్వయంగా చూశానని, అంతటి చిత్తశుద్ధి ఉందికాబట్టే రథసప్తమి వేడుకలను విజయవంతం చేయగలిగామన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రసాదం ప్రాజెక్టు ద్వారా అరసవల్లి, శ్రీకూర్మం రూ.100 కోట్లతో అభివృద్ధి చేయడానికి రూట్‌మ్యాప్ సిద్ధమైపోయిందని, ఇందుకోసం ఎమ్మెల్యే కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడును నిరంతరం ఫాలో అయ్యారని చెప్పారు. అనంతరం కాలనీవాసులు ఎమ్మెల్యేకు చిరుసత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు ఎం.ఎస్.వినయ్‌భూషణ్, లంక గాంధీ, కొంచాడ సోమేశ్వరరావు, సురంగి మోహనరావు, అట్టాడ రవిబాబ్జీ, బిర్లంగి ఉమామహేశ్వరరావు, క్రెడాయ్ చక్రవర్తి, ఎస్‌ఎస్ శ్రీను, లక్ష్మీ బార్ శ్రీను, కిల్లంశెట్టి సురేష్, ఇప్పిలి తిరుమలరావు, బాబూలాల్ పొద్దర్, డాక్టర్ కొంచాడ రవికుమార్, పట్నాల సూరిబాబు, కిల్లంశెట్టి సత్యనారాయణ, తంగుడు బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments