48 గంటల్లో 20 ఎన్‌కౌంటర్లు!
- DV RAMANA

- Oct 18
- 3 min read
ఎన్‌కౌంటర్ల డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొత్త రికార్డు
ఎనిమిదేళ్లలో యూపీలో 15,726 ఎదురుకాల్పులు
వాటిలో 256 మంది కరడుగట్టిన నేరగాళ్లు హతం
రెండు రోజుల వ్యవధిలోనే 11 మంది క్రిమినల్స్, ఇద్దరు అధికారులు మృతి
గూండారాజ్‌ను తుదముట్టించడమే లక్ష్యమంటున్న యోగి సర్కారు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధిని రెట్టింపు వేగంతో పరుగులు తీయిస్తున్నామని అక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తరచూ చెప్పుకొంటూ వస్తోంది. కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉంటే ప్రగతి ద్విగుణీకృతం అవుతుందన్నదే వారి ప్రచారంలోని పరమార్థం. యూపీలో బీజేపీ ప్రభుత్వం ఉండగా.. ఇటు కేంద్రంలోనూ ఆ పార్టీ సారధ్యంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం ఉన్నందునే ఉభయతారకంగా ఈ విధంగా ప్రమోట్ చేసుకుంటున్నారు. దీన్నే ఇతర రాష్ట్రాల్లోనూ ఉదాహరణగా చూపిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. యూపీలో డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల జరుగుతున్న అభివృద్దిని కాసేపు పక్కన పెడితే.. ఆ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్లు మాత్రం లెక్కలేనన్ని రెట్లు పెరిగి నేరగాళ్లకు భూమిపై నూకలు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రాష్ట్రంలో నేరగాళ్ల ఆటలు సాగడంలేదు. అప్రకటిత ‘కనిపిస్తే కాల్చివేత’ పరిస్థితి నెలకొంది. అయితే ఇది నేరగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ రాష్ట్రంలో ఎనిమిదేళ్లలో 15726 ఎదురుకాల్పుల ఘటనలు జరిగాయంటే విస్మయం కలగకమానదు. ఇంకే రాష్ట్రంలోనూ ఈస్థాయిలో ఎన్‌కౌంటర్లు జరిగిన దాఖలాలు లేదు. ఇక దీనికి పరాకాష్ట అని చెప్పడానికి వారం క్రితం కేవలం 48 గంటల వ్యవధిలోనే 20 ఎన్‌కౌంటర్లు జరిగాయి. గూండారాజ్యం అన్న చెడ్డపేరును మూటగట్టుకున్న ఉత్తరప్రదేశ్‌ను ఆ అప్రతిష్ట నుంచి బయటపడేసేందుకు యోగి ప్రభుత్వం కంకణం కట్టుకుని పనిచేస్తోంది. శాంతిభద్రతలను మెరుగుపర్చి ప్రజలకు భద్రత కల్పించడమే ధ్యేయంగా నేరగాళ్ల ఏరివేత చర్యలను ఏళ్ల తరబడి అప్రతిహతంగా కొనసాగిస్తోంది.
రెండు ప్రత్యేక ఆపరేషన్లు
క్రిమినల్స్ ఏరివేతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారం క్రితం లాంగ్డా, ఖల్లాస్ పేరుతో రెండు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించింది. వీటి ద్వారా కేవలం 48 గంటల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 20 ఎన్‌కౌంటర్లు జరిపారు. ఆపరేషన్ లాంగ్డా అంటే నేరస్తులను కాళ్లపై కాల్చడం ద్వారా పారిపోకుండా చేసి అరెస్టు చేయడం. ఇక ఆపరేషన్ ఖల్లాస్ అంటే తీవ్రమైన నేరాలకు పాల్పడిన కరడుగట్టిన నేరస్తులను విచారణలు లేకుండా కనిపించిన వెంటనే ఎన్‌కౌంటర్ చేసి నేరుగా యమపురికి పంపడం. ఇటువంటి వారికి అదే సరైన శిక్ష అని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆపరేషన్లలో భాగంగా రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ ఎన్‌కౌంటర్లు జరిగాయి. మీరట్, ముజఫర్‌నగర్, ఫరూఖాబాద్, ఫిరోజాబాద్, మొరాదాబాద్, మధుర, హర్దోయ్, ఉన్నావ్, రaాన్సీ, బులంద్‌షహర్, బాగ్‌పత్, బల్లియా, లక్నో, ఘజియాబాద్, షామ్లీ నగరాలు ఎదురుకాల్పుల ఘటనలతో దద్దరిల్లాయి. మొదటి ఎన్‌కౌంటర్ ఫిరోజాబాద్‌లో జరిగింది. రూ. 2 కోట్లు దోచుకున్న కేసులో అరెస్టయిన పేరుమోసిన నేరగాడు నరేష్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. పరారీలో ఉన్న అతగాడిని పట్టుకోవడానికి ఏఎస్‌పీ అనుజ్ చౌదరి నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. మఖన్‌పూర్ ప్రాంతంలో నరేష్, పోలీసులు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆపరేషన్ ఖల్లాస్‌ను అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో రామ్‌గఢ్ ఎస్‌వో సంజీవ్ దూబే నేరస్తుల కాల్పుల్లో మరణించగా, గ్రామీణ ఏఎస్‌పీ అనుజ్ చౌదరికి బుల్లెట్ తగిలినా అదృష్టవశాత్తు అది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌లో చిక్కుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో నేరస్తుడు నరేష్ హతమయ్యాడు. అలాగే సహరాన్‌పూర్‌లో పోలీసులు ఇమ్రాన్ అనే నేరస్తుడిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఇమ్రాన్ తలపై ఇప్పటికే లక్ష రూపాయల రివార్డు ఉంది. 13 దోపిడీ కేసుల్లో అతను నిందితుడు. ముజఫర్‌నగర్‌లో వరుసగా రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. మొదట లక్ష రూపాయల రివార్డు ఉన్న నేరస్తుడు మెహతాబ్‌ను టార్గెట్ చేసి పైకి పంపేశారు. మెహతాబ్ 18కి పైగా దోపిడీ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. లక్ష రూపాయల రివార్డు ఉన్న మరో నేరస్తుడు నయీమ్ ఖురేషిని కూడా పోలీసులు అంతం చేశారు. ఖురేషి ఆరు హత్యలు, 20 దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నా తప్పించుకుని తిరుగుతున్నాడు. మరోవైపు లక్నోలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అత్యాచార నిందితుడు హతమయ్యాడు. ఘజియాబాద్‌లో హత్య కేసు నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపారు. షామ్లీలో ఒక ఆవు స్మగ్లర్‌ను కాల్చి చంపగా, రaాన్సీలో వాంటెడ్ క్రిమినల్‌ను కాల్చారు. బులంద్‌షహర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అత్యాచార నిందితుడు మృతి చెందగా, బాగ్‌పత్‌లో దోపిడీ నిందితుడిని అరెస్టు చేశారు. జైలు నుంచి తప్పించుకున్న మరో నేరస్తుడిని బల్లియాలో, దొంగతనం కేసులో నిందితుడిని ఆగ్రాలో, దోపిడీ కేసు నిందితుడిని జలౌన్‌లో ఎన్‌కౌంటర్ చేశారు. ఆపరేషన్ లాంగ్డా కింద.. మీరట్‌లో వస్త్ర వ్యాపారి ఆదిల్‌ను కాల్చి చంపి ఆ వీడియోను వైరల్ చేసిన నిందితుడు జుల్కమర్‌ను కూడా ఎన్‌కౌంటర్ చేశారు.
మీరట్ జోన్ టాప్
యోగి ఆదిత్యనాథ్ 2017 మార్చిలో యూపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి శాంతిభద్రతల నిర్వహణ, నేరగాళ్ల విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో 15,726 ఎన్‌కౌంటర్లు జరిగినట్లు యూపీ పోలీసు శాఖ ఈ నెల 14న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వీటిలో మొత్తం 256 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ హతమయ్యారు. సుమారు పదివేల మంది నేరస్తులు గాయపడ్డారు. ఈ ఘటనల్లో పోలీసుల వైపు నుంచి 461 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఎన్‌కౌంటర్ల సందర్భాల్లోనే 31,960 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో మీరట్ జోన్‌లో అత్యధిక సంఖ్యలో ఎన్‌కౌంటర్లు జరిగినట్లు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ జోన్‌లో 4,453 ఎదురుకాల్పులు జరగ్గా 85 మంది నేరస్తులు మరణించారు. 8,312 మంది అరెస్టయ్యారు. దాని తర్వాత ఆగ్రా జోన్‌లో అధికంగా 2,374 ఎన్‌కౌంటర్లు జరిగి 22 మంది చనిపోగా 5,631 మంది అరెస్టయ్యారు. వారణాసి జోన్‌లో 1108 ఎన్‌కౌంటర్లలో 27 మంది మృతి చెందగా, 2,128 మంది అరెస్టయ్యారు. లక్నో జోన్‌లో 846 ఎన్‌కౌంటర్లలో 17 మంది హతమయ్యారు. ప్రయాగ్‌రాజ్ జోన్‌లో 572 ఎన్‌కౌంటర్లు జరగ్గా పది మంది చనిపోయారు. రాష్ట్రంలో క్రిమినల్ గ్యాంగ్‌లను నామరూపాల్లేకుండా చేసి పూర్తి శాంతి నెలకొల్పడమే తమ ప్రత్యేక ఆపరేషన్ల లక్ష్యమని పోలీసు శాఖ పేర్కొంది.










Comments