top of page

9 నెలలుగా ఫైలే బందీ..!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jun 26
  • 2 min read
  • రిమ్స్‌లో 41 పోస్టుల భర్తీకి రాజకీయ బ్రేక్?

  • మెరిట్ లిస్ట్ సిద్ధం... తుది జాబితా మాత్రం మాయం

  • కలెక్టర్ సంతకం ఆగిందా... ఆపించారా?

  • ‘సిఫార్సులు’ లేనివారే మెరిట్‌లో రావడంతో ఎంపికలు నిలిచిపోయాయా?

(సత్యం న్యూస్,శ్రీకాకుళం)

శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో అత్యవసరంగా భర్తీ చేయాల్సిన 41 అవుట్‌సోర్సింగ్ పోస్టుల నియామక ప్రక్రియ తొమ్మిది నెలలుగా అర్థాంతరంగా నిలిచిపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 15 రోజుల్లో పూర్తి కావాల్సిన ప్రక్రియ ఇప్పటికీ కొలిక్కి రాకపోవడంతో, దీని వెనుక రాజకీయ జోక్యమే ప్రధాన కారణమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నోటిఫికేషన్ విడుదల నుంచి ప్రొవిజనల్ మెరిట్ జాబితా వరకు అన్ని దశలను అధికారులు పూర్తి చేసినప్పటికీ, తుది ఎంపిక జాబితా మాత్రం బయటకు రాకపోవడం దరఖాస్తుదారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

అన్ని పూర్తయ్యాయి... ఆఖరి సంతకమే మిగిలింది

వైద్య విద్యాశాఖ నోటిఫికేషన్ నెం.02/2025 ద్వారా గత ఏడాది అక్టోబర్ 22న 41 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, మెడికల్ కాలేజీ డైరెక్టర్ కన్వీనర్‌గా, రిమ్స్ సూపరింటెండెంట్, జిల్లా ఆసుపత్రుల కోఆర్డినేటర్ సభ్యులుగా ఎంపిక కమిటీని ఏర్పాటు చేశారు.

దాదాపు 1,950 దరఖాస్తులు అందగా, స్క్రూటినీ నిర్వహించి రోస్టర్, మెరిట్ ఆధారంగా ప్రొవిజనల్ జాబితాను ప్రకటించారు. అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, ఆ జాబితా విడుదల మాత్రం ఇప్పటికీ జరగలేదు.

కలెక్టర్ సంతకమే అడ్డంకా?

జిల్లా ఎంపిక కమిటీలోని ముగ్గురు సభ్యులు ఇప్పటికే ఫైలుకు ఆమోదం తెలిపారని, చైర్మన్ హోదాలో ఉన్న కలెక్టర్ సంతకం మాత్రమే మిగిలి ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ సంతకం ఎందుకు ఆలస్యమవుతోందన్న దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. దరఖాస్తుదారులు పలుమార్లు అధికారులను సంప్రదిస్తే “కలెక్టర్ ఆమోదం వచ్చిన వెంటనే జాబితా విడుదల చేస్తాం” అనే ఒకే సమాధానం వినిపిస్తోందని వారు చెబుతున్నారు.

మెరిట్‌లో ‘సిఫార్సు’ అభ్యర్థులు లేకపోవడమే కారణమా?

ప్రొవిజనల్ మెరిట్ జాబితాలో కొందరు ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన అభ్యర్థుల పేర్లు లేకపోవడంతోనే తుది జాబితాకు బ్రేక్ పడిందన్న ప్రచారం రిమ్స్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీంతో నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్తగా నియామక ప్రక్రియ చేపట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలను దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు.

ఉద్యోగాల కోసం ఎదురుచూపులు... సేవలకు తీవ్ర అంతరాయం

ప్రభుత్వ వైద్య కళాశాలలో 37, రిమ్స్ ఆసుపత్రిలో 4 పోస్టులు కలిపి మొత్తం 41 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఎంఎన్‌వోలు, ఎఫఎన్‌వోలు, నర్సింగ్ ఆర్డర్లీలు, డ్రైవర్లు, థియేటర్ అసిస్టెంట్లు, ఆఫీస్ అటెండెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఈసీజీ టెక్నీషియన్లు వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో రోగులకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్య వర్గాలే చెబుతున్నాయి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాల్లో ప్రతి సారి ఈ సమస్య ప్రస్తావనకు వస్తున్నప్పటికీ, నియామకాలపై మాత్రం ముందడుగు పడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రమంతా పూర్తయ్యాయి... శ్రీకాకుళంలోనే ఎందుకు నిలిచిపోయాయి?

ఇతర జిల్లాల్లో ఇదే తరహా అవుట్‌సోర్సింగ్ నియామకాలు పూర్తయ్యాయని, శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే తుది జాబితా నిలిపివేయడం వెనుక అసలు కారణాలేమిటన్న ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. గ్రీవెన్స్ కార్యక్రమాల్లో వినతులు ఇచ్చినా ఫలితం లేకపోయిందని అభ్యర్థులు చెబుతున్నారు. కొందరికి “నోటిఫికేషన్ రద్దయింది” అని మౌఖికంగా చెప్పినట్లు కూడా సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ఉత్తర్వులు విడుదల కాలేదు.

సమాధానం చెప్పాల్సింది ఎవరు?

తుది మెరిట్ జాబితా సిద్ధమైందా? లేదా?

సిద్ధమైతే తొమ్మిది నెలలుగా ఎందుకు విడుదల చేయలేదు?

కలెక్టర్ వద్ద ఫైల్ పెండింగ్‌లో ఉందా?

రాజకీయ జోక్యం ఉందన్న ప్రచారంలో వాస్తవమెంత?

నోటిఫికేషన్ రద్దు చేయాలనే ఆలోచన నిజమేనా?

సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?

ఈ ప్రశ్నలకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని దరఖాస్తుదారులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page