top of page

91వ సవరణ.. దీదీకి రక్షణ!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 10
  • 3 min read

ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో అధికార, ప్రధాన పార్టీలను అతలాకుతలం చేస్తున్నాయి. ఆ పార్టీల్లో చీలికలు ఆయా పార్టీల ఉనికిని దెబ్బతీస్తాయని ఒకవైపు ఆందోళన వ్యక్తమవుతుంటే.. మరోవైపు చీలక గ్రూపులకు రాజ్యాంగపరమైన రక్షణ ఉందా? అన్న చర్చ కూడా విస్తృతంగా జరుగుతున్నది. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం గతంలో చీలక గ్రూపులకు కొన్ని షరతులతో గుర్తించే అవకాశం ఉండేది. కానీ ఆ చట్టాన్ని సవరించిన తర్వాత ఆ వెసులుబాటు లేకుండాపోయిందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకునే తమిళనాడులో మొదట అధికార టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన ఏఐఏడీఎంకేకు చెందిన సుమారు 27 మంది ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు సీన్ పశ్చిమ బెంగాల్‌కు మారింది. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమల్ కాంగ్రెస్ అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయింది. పార్టీ నాయకత్వంపై ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగురవేసి వేరు కుంపట్లు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారం పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మంది ఎమ్మెల్యేలు తమను అసెంబ్లీలో తృణమల్ కాంగ్రెస్ సభ్యులుగా కాకుండా వేరే గ్రూపుగా గుర్తించాలని కోరడం, స్పీకర్ తిరుగుబాటు గ్రూపును ప్రధాన ప్రతిపక్ష హదా కల్పించడం జరిగిపోయాయి. దీని తర్వాత సీను పార్లమెంటుకు మారింది. లోక్‌సభలో టీఎంసీకి ఉన్న 28 మంది ఎంపీల్లో 20 మంది మమత నాయకత్వంపై తిరుగుబాటు చేసి తమను వేరే గ్రూపుగా గుర్తించాలంటూ స్పీకర్ ఓంబిర్లాకు సంతకాలతో కూడిన లేఖ అందజేశారు. దాంతో మొత్తం సభ్యుల్లో మÖడింట రెండొంతుల మంది లేఖపై సంతకాల చేయడం దీదీకి భారీ దెబ్బలా కనిపిస్తున్నా.. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని నిశితంగా పరిశీలిస్తే ఆమెకు కాకుండా రెబల్స్‌కే షాక్ తగిలే పరిస్థితి ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. 28 మంది ఎంపీల్లో మÖడింట రెండొంతులకంటే ఎక్కువగా 20 మంది తమవైపే ఉన్నందున చట్టప్రకారం అనర్హత వేటు నుంచి తమకు రక్షణ లభిస్తుందని రెబల్ ఎంపీలు భావిస్తుండగా న్యాయ, రాజ్యాంగ నిపుణులు వారి అభిప్రాయాలతో విభేదిస్తున్నారు. 1985లో తీసుకొచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఆ తర్వాత చేసిన సవరణలను వారు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. 1985 నాటి చట్టంలోని పదో షెడ్యూల్ ప్రకారం చట్టసభల్లో ఒక పార్టీకి ఉన్న సభ్యుల్లో మÖడింట ఒకవంతు సభ్యులు నాయకత్వంతో విభేదించి బయటకు వస్తే దాన్ని ఫిరాయింపుగా కాకుండా చీలికగా గుర్తించాల్సి ఉండేది. అంతకంటే తక్కువమంది పార్టీకి రాజీనామా చేసినా, బహిష్కరణకు గురైనా, పార్టీ మారినా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాలన్న నిబంధన ఉండేది. కానీ రాజకీయ చీలికలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన 91వ రాజ్యాంగ సవరణ ఇప్పుడు మమతాబెనర్జీ వర్గానికే అనుకూలంగా మారవచ్చని విశ్లేషిస్తున్నారు. 2003లో పార్లమెంటు ఆమోదించిన 91వ రాజ్యాంగ సవరణతో మÖడోవంతు సభ్యులుంటే రక్షణ, స్ల్పిట్ అంటే చీలిక వర్గానికి గుర్తింపు అవకాశం లేకుండా పోయింది. పార్టీపై తిరుగుబాటు చేసినవారు పదవులు పోకుండా రక్షణ పొందాలంటే ఇప్పుడున్న ఏకైన మార్గం విలీనం మాత్రమే. అంటే తమ గ్రూపును తీసుకెళ్లి వేరే పార్టీలో విలీనం చేయాలన్నమాట. సరిగ్గా ఇక్కడే టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు చిక్కులు తప్పవంటున్నారు. ఎందుకంటే ఎంపీలు తమ పార్టీ నుంచి విడిపోయి కొత్త గ్రూపుగా ఏర్పడినంత మాత్రాన దాన్ని విలీనంగా పరిగణించరు. చీలికవర్గం మొత్తం మరో పార్టీలో విలీనం కావడం.. దానికి కనీసం రెండొంతుల మంది ప్రజాప్రతినిధులు అంగీకరించడం వంటి షరతులు నెరవేరినప్పుడే అనర్హత నుంచి రక్షణ లభిస్తుంది. లేదంటే పార్టీని స్వచ్ఛందంగా వీడినట్లు పరిగణించి ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే అనుసరించిన వ్యూహాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. శివసేన సంక్షోభంలో షిండే వర్గం ఎమ్మెల్యేలను కూడగట్టుకోవడమే కాకుండా తమదే అసలైన శివసేన అని ప్రకటించి పార్టీపై పూర్తి హక్కు కోసం పోరాటం చేసింది. ఎన్నికల సంఘం ముందు తమ వాదనలను బలంగా వినిపించి పార్టీ పేరు, గుర్తును దక్కించుకోగలిగింది. ఈ నేపథ్యంలో టీఎంసీ తిరుగుబాటు వర్గం కూడా గుర్తింపు పొందాలంటే ఎంపీల సంఖ్యాబలం సరిపోదు. పార్టీలో అన్ని స్థాయిలు, విభాగాల్లో తమకే మెజారిటీ మద్దతు ఉందని నిరూపించాల్సి ఉంటుంది. అప్పుడే అసలైన టీఎంసీ మాదే అనే వాదనకు బలం చేకూరుతుంది. అలాకాకుండా ప్రత్యేక గ్రూపుగానే మిగిలిపోతే అనర్హత ముప్పు తప్పకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రకారం తిరుగుబాటు ఎంపీల ముందు రెండు మార్గాలే ఉన్నాయి. చట్టబద్ధమైన విలీనం దిశగా అడుగులు వేయడం లేదా తమదే అసలైన టీఎంసీ పార్టీ అని ప్రకటించి హక్కు, అధికారాల కోసం పోరాడటం. రాజకీయ చీలికలను ప్రోత్సహించకుండా గతంలో తీసుకొచ్చిన 91వ రాజ్యాంగ సవరణే ఇప్పుడు టీఎంసీ తిరుగుబాటుదారులకు అతిపెద్ద అడ్డంకిగా, మమతకు రక్షణ కవచంగా మారిందని చెప్పవచ్చు. అయితే టీఎంసీలో జరుగుతున్నది కేవలం ఎంపీల తిరుగుబాటు మాత్రమే కాదు. ఇది పార్టీపై హక్కు కోసం సాగబోయే పెద్ద రాజకీయ, న్యాయపోరాటానికి నాంది కావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మమత కూడా ఈ పరిణామాలను చూస్తూ కూర్చోరన్నది వాస్తవం. ఇటువంటి పోరాటాలు ఆమెకు కొత్తకాదు. చట్టాన్ని ఉపయోగించుకుని తిరుగుబాటును అణిచివేసేందుకు ఆమె ప్రయత్నించక మానరు. ఈ పరిస్థితుల్లో అసలైన టీఎంసీ ఎవరిది? అనే ప్రశ్నకు సమాధానం దొరికే వరకు ఈ పోరాటం కొనసాగనుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page