top of page

కూల్‌!

  • Guest Writer
  • Aug 15
  • 3 min read

రజినీకాంత్‌ సినిమాల్లో ‘‘కబాలి’’ తర్వాత ఆ రేంజ్‌ హైప్‌ ని సంతరించుకున్న చిత్రమిది. ప్రతి సినీ రంగం నుంచి ఒక ప్రముఖ నటుడితో అత్యంత భారీగా కనిపించిన ట్రైలర్‌, సూపర్‌ హిట్టైన ‘‘మోనిక..’’ పాట, వెరసి అంచనాలను బాగా పెంచిన చిత్రమిది. నాగార్జున ప్రీ రిలీజులో మాట్లాడుతూ ‘‘బాషా’’ కంటే ఎన్నో రెట్లు గొప్పగా ఉండబోయే చిత్రమని చెప్పడం, రజినీ మాట్లాడుతూ బాషాలో యాంటోనీ పాత్ర మాదిరిగా ఇందులో నాగార్జున పోషించిన సైమన్‌ పాత్ర గుర్తుండిపోతుందని చెప్పడం అంచనాలని ఇంకా పెంచాయి. ఇంతకీ ఆ అంచనాల స్థాయిలో ఈ సినిమా ఉందా? చూద్దాం.

ree

కథలోకి వెళితే రాజశేఖర్‌ (సత్యరాజ్‌) జంతుకళేబరాల్ని అత్యంత వేగవంతంగా బూడిద చేయగలిగే యంత్రాన్ని కనిపెడతాడు. దాని అవసరం సైమన్‌ (నాగర్జున) అనే క్రిమినల్‌ కి ఏర్పడుతుంది. ఈ సైమన్‌ దగ్గర పని చేసే మరొక క్రిమినల్‌ దయాళ్‌ (షౌబిన్‌ సాహిర్‌). ఇంతకీ రాజశేఖర్‌ స్నేహితుడు దేవా (రజనీకాంత్‌). ముప్పై ఏళ్లుగా ఇద్దరి మధ్యనా గ్యాప్‌ వస్తుంది. ఒకరోజు రాజశేఖర్‌ చనిపోతాడు. అది తెలుసుకుని దేవా శవయాత్రకు వస్తాడు. రాజశేఖర్‌ కూతురు (శ్రుతి హాసన్‌) దేవాని అవమానించి వెళ్లిపోమంటుంది. ఆమె ఎందుకు అలా చేస్తుంది? దేవాకి రాజశేఖర్‌ తో ముప్పై ఏళ్ల గ్యాప్‌ కి కారణమేంటి? రాజశేఖర్‌ ని ఎవరు ఎందుకు హత్య చేసారు? అనే ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో తండ్రిలేని శ్రుతిహాసన్‌ ని, ఆమె ఇద్దరి చెల్లెళ్లని దేవా కంటికి రెప్పగా కాపాడుకుంటూ ఉంటాడు. చివరికి సైమన్‌ ని దేవా ఎలా తుదముట్టిస్తాడు అనేది తెరపై చూడాలి.

స్నేహం, ప్రతీకారం, బాధ్యత లాంటి అంశాలతో రజినీకాంత్‌ కేరక్టర్‌ డిజైన్‌ చేయబడిరది. కథ ఉందా అంటే ఉంది.. చాలా పెద్ద కథ. రకరకాల కేరెక్టర్స్‌ వస్తూ ఉంటాయి. అయితే ఈ సినిమా చూడాల్సింది టిపికల్‌ రజినీకాంత్‌ మార్క్‌ స్టైలిష్‌ పర్ఫార్మెన్స్‌ ని చూడడానికే.

ప్రధమార్ధం చాలా స్పీడ్‌ గా పరుగెట్టినట్టు అనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం రజనీ స్టైల్‌, షౌబిన్‌ సాహిర్‌, నాగార్జునల గతంలో చూడని అభినయం, డైలాగ్స్‌. ఇంటర్వల్‌ బ్లాక్‌ కూడా ఆకట్టుకుంటుంది.

ద్వితీయార్ధం కూడా కథలో పట్టుంది కానీ, కొంత డ్రాగ్‌ అయిన ఫీలిగొస్తుంది. ఎక్కడో అక్కడ కత్తెర వేసి కనీసం 10 నిమిషాలు తగ్గించినా బాగుండేది. డ్రాగ్‌ అయినట్టు అనిపించినా మరీ భరించలేనంత బోరేమీ కొట్టదు. కాసేపు హాలు బయటికెళ్లొస్తే ఏదైనా లింక్‌ మిస్సౌతామేమో అనిపించే విధంగా అయితే నడిచింది. కాసేపు కనిపించే 1980ల నాటి వింటేజ్‌ రజనీకాంత్‌ గెటప్‌ చాలా కన్విన్సింగ్‌ గా ఉంది.

హాలీవుడ్‌ చిత్రం ‘‘ఎక్స్పెండబుల్స్‌’’ లో లాగ ఉపేంద్ర ఒక ఫైట్‌ సీక్వెన్స్‌ తో ఎంట్రీ ఇచ్చి చివరి వరకూ ఉండడం, క్లైమాక్స్‌ లో వచ్చే అమీర్‌ ఖాన్‌ కి తన రేంజ్‌ కేరెక్టర్‌ ఇవ్వకపోవడంతో ఆ రెండు పాత్రలూ తేలిపోయాయి. నాగార్జునకి, షౌబిన్‌ కి ఇచ్చినంత కేరెక్టర్‌ ఈ ఇద్దరికీ ఇవ్వలేదు.

రజనీ కాంత్‌ ఇమేజ్‌ కి తగిన కథ, కథనం, యాక్షన్‌, సెంటిమెంటల్‌ సీన్లు పక్కా కమర్షియల్‌ ఫార్మేట్‌ లో ప్రెజెంట్‌ చేయడం బాగుంది. తన ఏజ్‌ తెలియనీయకుండా విగ్‌, మేకప్‌ కంటే ఆయన బాడీ లాంగ్వేజ్‌, డ్యాన్సుల్లో వేసే స్టెప్స్‌ గ్రేస్ఫుల్‌ గా ఉండి ఆయన సహజమైన వయసుకంటే కనీసం 20 ఏళ్లు తక్కువగా కనిపించారు. పైన చెప్పినట్టు వింటేజ్‌ లుక్‌ లో మరింత అలరించారు.

నాగార్జున సైమన్‌ పాత్రలో జీవించారు. అయితే రెఫెరెన్స్‌ పాయింట్‌ గా ‘‘ఏనిమల్‌’’ లో బాబీ డియోల్‌ పాత్రని తీసుకున్నట్టు ఉంది. ఇంచుమించు ఆ కేరెక్టర్‌ స్టైల్‌ ని ఇమిటేట్‌ చేసినట్టు అనిపించింది. ఈ తరహా స్టైలిష్‌ విలన్‌ పాత్రలకి నాగార్జున ట్రాన్స్ఫాం కావొచ్చు.

ఈ సినిమా ద్వారా నటులలో బాగా లాభపడిన వ్యక్తి షౌబిన్‌ సాహిర్‌. మంజుమల్‌ బాయ్స్‌ లో అమాయకంగా కనిపించిన ఇతను ఇందులో విలన్‌ గా చెలరేగిపోయాడు. మోనికా డ్యాన్సులో స్టెప్స్‌ కూడా వేసాడు. ఫహద్‌ ఫాజిల్‌ కి గట్టి పోటీని ఇవ్వగలిగే నటుడిగా కనిపిస్తున్నాడు.

సత్యరాజ్‌ కెరెక్టర్‌ నటుడిగా ఓకే. శ్రుతి హాసన్‌ దాదాపు డల్‌, సారో మొమెంట్స్‌ తోనే కనిపించింది. ఉపేంద్ర, అమీర్‌ ఖాన్‌ సీన్స్‌ వీక్‌ గా ఉన్నాయి.

టెక్నికల్‌ గా చూస్తే ఈ సినిమాకి ప్రధానమైన ఎసెట్‌ అనిరుధ్‌ సమకూర్చిన నేపథ్య సంగీతం. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న ఈ చిత్రం బోర్‌ కొట్టకుండా కూర్చోబెట్టడానికి కారణం ఎలివేషన్స్‌ తో కూడిన బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌. కెమెరా పనితనం, ఇతర నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్‌ ఇంకాస్త పదునుగా ఉండాల్సింది.

నిజానికి 2 గంటల 50 నిమిషాల వ్యవధిలో ముగిసిన ఈ చిత్రంలో కొంత కథని (సత్యరాజ్‌ పాత్రతో తనకు వచ్చిన 30 ఏళ్ల గ్యాప్‌ గురించి) రజనీకాంత్‌ పాత్ర డైలాగ్‌ రూపంలో చెప్పేయడం వల్లనే సాధ్యపడిరది. ఆ చెప్పిన ఫ్లాష్‌ బ్యాక్‌ ట్రాక్‌ మొత్తం షూట్‌ చేసి పెట్టుంటే కనీసం ఇంకో 10 నిమిషాలు పెరిగేది.

చివరిగా చెప్పాలంటే.. భారీ తారాగణం, భారీతనం తెర మీద చూడాలనుకునే వారిని ఈ చిత్రం నిరాశపరచదు. నాగార్జునని ఇలాంటి విలన్‌ గా చూడడం ఇష్టంలేని తెలుగు ప్రేక్షకులకి నచ్చకపోవచ్చు. యాక్షన్‌ సీన్స్‌ లో అక్కడక్కడ సాంబారుతనం ఉన్నా సదరు డబ్బింగ్‌ చిత్రాలు చూసే అలవాటున్నవాళ్లకి పెద్దగా ఇబ్బంది అనిపించదు. నాగార్జున ఈ చిత్రం గురించి చెబుతూ బాషా కంటే గొప్పగా ఉంటుందన్నాడు. అంత రేంజైతే లేదు. ఆ స్థాయి అనుభూతినైతే కలిగించదు. ఒక తరం నాటి హీరోలున్నారని ఆ తరం ఆడియన్స్‌ హాలుకెళ్లి చూస్తే వాళ్లకెలా ఉంటుందో చెప్పడం కష్టం కానీ, నేటి తరం యంగ్‌ ఆడియన్స్‌ కి తగ్గట్టుగా మాత్రం తీసే ప్రయత్నం జరిగింది. మరీ అంచనాలు పెంచేసుకుని కాకుండా, హైప్‌ ని చూసి ఏదేదో ఊహించేసుకోకుండా చూస్తే పైసావసూల్‌ అనిపించవచ్చు. అయితే ఇంకా సరైన పాటలు ఉండుంటే పూర్తిస్థాయి రజనీ మార్క్‌ చిత్రమయ్యి, నటుడిగా ఆయన 50వ సంవత్సరానికి నిండైన ట్రీట్‌ అయ్యుండేది.

- గ్రేటాంధ్ర సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page