top of page

బాలు....

  • Guest Writer
  • Jun 6
  • 3 min read

నలభీముల్ని తలపించే ఘంటసాల తిరుగాడే వంటశాలలోకి కుడికాలు ముందుపెట్టి ప్రవేశించాడు. తనమీద అంత నమ్మకముంచిన కోదండపాణికోదండం! ‘దేవుని కోవెలలో దివ్వెగా పేదల గంజినీళ్ల ముంతగా.. పాలకు దాకగా..మధువుకు పాత్రగా.. రూపం ఏదైనా మన్నొకటేరా...!’ అని అతగాడితో పాడించుకున్నాడు. కానీ అనతికాలంలోనే తెరమీద రూపం ఎవరిదైనా ఆ పాటలన్నిటికీ రూపమిచ్చేది బాలు ఒకడేరా అనిపించేశాడు. ఆరోజే తెలిసింది... ఏనాటికొ ఈ గరీబు కాకపోడు నవాబని!

ఇదిగో..నీకో ఉత్తరం:

ఎంత తేనె తాగుతావో తెలీదుగానీ మాంచి గంగాజలం కొబ్బరిబొండమొకటి కొట్టించుకు తాగేసి కాయవతల పడెయ్యకుండా లోపలుండే కొబ్బరంతా తీయించుకుని, కాస్త బెల్లంపొడేసుకుని తింటాం చూడూ...అలావుంటుంది నీ గొంతు! ‘ఇంత లేటు వయసులో అంత లేత గొంతుతో చేస్తున్నావెంత వింత గారడీ..రోజూ వింటున్నా కొత్తగానె ఉన్నదీ...’ అని పాడుకోవాలనిపిస్తుంది ఎవరికైనా! ఏదో జలుబు చేసి తగ్గిన గొంతేసుకుని ‘నవమినాటి వెన్నెల నీవు దశమినాటి జాబిలి నేను’ అంటూ పాడావు గుర్తుందా? ఇందాక కార్లో వెడుతూ వింటోంటే నాక్కూడా కాస్త జలుబు చేస్తే బావుండుననిపించింది... నీ అంత మత్తుగా పాడేసుకోడానికి! అంత మార్దవంగా ప్రియురాలితో మాట్లాడితే జీవితాంతమూ వదలగలదా? ఆపరేషన్లకి మత్తివ్వడానికి బయల్దేరినవాణ్ణి అలా మత్తులో పడిపోతే ప్రమాదమనో ఏమో నా కర్తవ్యం గుర్తుచేద్దామని

‘వ్యాధులు బాధలు ముసిరే వేళ.. మృత్యువు కోరలు చాచే వేళ గుండెకు బదులుగ గుండెను పొదిగీ.. కొన ఊపిరులకు ఊపిరిలూదీ జీవన దాతలై వెలిగిన మూర్తుల...అణువూ అణువున వెలసిన దేవా!’ అని పాడి నా దృష్టిమరలించే ప్రయత్నం చేశావు. అంతటి వైవిధ్యమైన స్వరసంపదకీ ఒక్కడివే అధిపతివి! పదిలంగా అల్లుకున్న మా తెలుగింటి పొదరిళ్లలో నిత్యం కొలువున్న కోయిలవి.

తెల్లారే కాఫీ తాగుతూ పేపరిలా చేతిలోకి తీసుకుంటానో లేదో... ‘ఏవండీ, బాలు శివస్తుతులు పెట్టి, ఆనక పేపరు చదువుకోండి. అవి వింటూ వంట చేసుకుంటాను!’ అంటూ తనొస్తుంది.

నీ వంట రోజూ తినేదేగా అని తననైనా అంటానేమోగానీ

నీపాట రోజూ వినేదేగా అని నిన్ననాలనిపించదు.

పెడతాను. అంతటితో అయ్యిందా? వెంటనే నాలోంచి ఓ పదిహేడేళ్ల కుర్రాడొకడు బయటికొస్తాడు.

‘ఓ చిన్నదాన నన్ను విడిచి పోతావటే

పక్కనున్న వాడి మీద దయరాదటే’ అంటూ నీతోపాటు పాడేస్తూ వుంటాడు. తనకి నవ్వొస్తుంది. ‘నీ వయసెంతా? ఆ గంతులేంటి? అంటుంది. ‘బాలు వయసెంత? ఆ గొంతేంటి?’ అని సర్దిచెప్పేసి, అక్కణ్ణుంచి సర్దుకుంటాను. ఇదంతా నిత్యకృత్యాల్లో భాగం. విధాయకంగా నీ పాటలతోనే మాకు నిద్రా, మళ్ళీ మేలుకొలుపూ కూడా!

‘అడుగుల్ల సవ్వళ్లు కావమ్మా.. అవి ఎడదల్ల సందళ్లు లేవమ్మా’ అంటూ నువ్వు పాడిన ఆ వరసలన్నీ తలగడని తమకంతో కౌగలించుకుని పాడావేమోనన్న పాడు ఆలోచనొకటి వచ్చింది నాకీ మధ్య! ఎవరితోనూ ఇంతదాకా చెప్పలేదు. అంత పెద్దమనిషిని పట్టుకుని అలా అనేశానని ముక్కచివాట్లు పెడతారన్న భయంతో! నీ ఎదురుగా వెన్నెల్లో అవతలి డాబామీద ఆ సులక్షణేం లేదుగా? మరి నీకెందుకంత గారం? అంతలేసి మంద్రాలు పాడుకుంటూ చంద్రవంకతో చలి పంచుకుంటోంటే ఏ మాదక ద్రవ్యాలూ ఇవ్వనంత మత్తిస్తాయి! అవన్నీ తెలియకే మా కుర్రాళ్లంతా ఇలా హీరోయిన్లకి బదులు హెరాయిన్లని నమ్ముకున్నారు.

సరే, ఇలాంటివన్నీ పాడేసి నాలాంటి బలహీనుల గుండెలతో బంతాట ఆడేసుకున్నావు. మా చదువుల్ని కూడా నీ పాటల తోటలో ఉన్న అన్ని చెట్లనీ ఎక్కింది ఎక్కకుండా ఎక్కించేశావు. ఆ తరవాతెప్పుడో మళ్లీ నువ్వే విప్లవశంఖాన్ని పూరిస్తూ తిట్టిపోస్తోంటే పరీక్షల్లో మేం పూరించాల్సిన ఖాళీలు గుర్తొచ్చి ఏదో ఇలా గట్టెక్కాం.

అన్నట్టు నీకో విషయం చెప్పాలి:

మా చిన్నతనంలో నాన్నగారు అస్తమానూ హైదరాబాద్ వెళ్లొస్తూ వుండేవారు. పిన్ని, పెద్దమ్మ, అత్తయ్యలు అక్కడే వుండేవార్లే! మమ్మల్ని మాత్రం చాలాకాలం దాకా తీసుకెళ్లలేదు. కానీ మాకు మాత్రం రిక్షాలో కూర్చుని హైదరాబాదంతా చూసేసినట్టే అనిపించేది నీ పాట వింటే...ముఖ్యంగా ఆ లైనేదీ... బన్నీ, నీకు గుర్తుందిగా.. అదే..

తళతళమెరిసే హుసేన్‌సాగర్.. దాటితె సికింద్రబాదూ....

ఆ పాటంటే ఎంత పిచ్చంటే, నువ్వు ఊరిని వర్ణిస్తూనే ఒక చరణంలో ఉన్నవాడికి, లేనివాడికీ తేడాల్ని చెబుతావు చూడూ.. ఆ దయా జాలీ విని కంట నీరొచ్చేసేది మాకు. అదీ పాటని ప్రాణంగా చూసుకోడమంటే! నీ పాటే ఊపిరిగా బతికాం. ఊపిరి తీసుకోకుండా నువ్వు పాడిన పాటని మేంకూడా ఊపిరాపే విన్నాం. అంతలా మా ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కలిసిపోయింది నీపాట! నీచేత ఎన్నో వందల పాటలు పాడించిన ఆ కొమ్మినేనాయన కొత్తల్లో కొన్ని కలకండల్లాంటి పాటలు సృష్టించాడు. ఆరు రుతువుల్నీ వర్ణిస్తూ మన తెల్ల కోకిలతో నువ్వు పాడిన దేవులపల్లి గీతం గుర్తుందిగా? అది వింటూవుంటే మాకు చేమంతి తోటలో విహరిస్తున్నట్టు, మల్లెల్ని అరచేత వుంచుకుని మాటిమాటికీ వాసన చూస్తున్నట్టూ వుంటుంది. కాసేపటికి గలగలల సెలయేళ్లూ, సన్నగా వాన చినుకులూ కూడా మమ్మల్ని ఆహ్లాదంలో ముంచెత్తుతాయి. మీరిద్దరూ ఆ పాటను వర్ణశోభితం చేసేశారు

రాగరంజితం కావించారు. రసమయమైన కావ్యంగా మలిచారు.

ఇక నావల్ల కాదు. మళ్లీ కాసేపట్లో ఎలాగూ వింటానది! కురిసేదాకా అనుకోలేదూ..శ్రావణ మేఘమనీ అంటూ మరొకసారి సంగీతామృత వర్షధారల్లో మీ గళాల్ని ముంచి తేల్చారు నవతా వారు. వాళ్లొకళ్లూ.. ఆ రాజన్ నాగేంద్రలు! నాగేంద్రుడి పగలా మమ్మల్ని ఇన్నినాళ్లయినా వదలనంటోంది ఆపాట! ఇన్ని వేల పాటల్లోంచి కొన్ని ఏరుకోమనడమంటే ‘పళ్లెంలోంచి బాగా రుచిగా వున్న లడ్డూ ఒకటి తీసుకోరా!’ అన్నట్టుంటుంది. మధుమాసం వచ్చేదాకా మావిడిగున్నకూ తెలియదు.. ఏమనీ... తానొక వధువుగా ముస్తాబైనానని.... అని మనుషులు మట్టిబొమ్మలు సినిమా కోసం పాడావు. గుర్తుందిగా? అలానే నీ పుట్టినరోజంటే చాలు. మా కలాలూ, గళాలూ మాకు తెలియకుండానే కొత్తగా తయారైపోతాయి.

నీ తీయని పాటలు పాడకపోతే నిదరే రాదయ్యా

నీ కమ్మని గొంతే వినబడకుంటే కలలే రావయ్యా!

అపరాత్రవుతోంది.

ఇప్పటికైనా చెప్పూ అంటోంది మాయావిడ!

జన్మదిన నివాళులు బాలూ!

- కొచ్చెర్లకోట జగదీశ్

1 Comment


prasadnimishakavi2
Jun 08

Very nice Sir

Like

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page