top of page

E20 పెట్రోల్‌కు సిద్ధం కండి!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Mar 28
  • 3 min read

వాహన చోదకులకు మరో పెద్ద అలర్ట్.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బంకుల్లో సాధారణ పెట్రోల్ లభించదు. ఏంటీ.. ఏప్రిల్ ఒకటి అన్నామని ముందుగానే ఏప్రిల్ ఫూల్ చేయడానికి ప్రయత్నిస్తున్నామనుకోకండి. ఎందుకంటే.. సాధారణ పెట్రోల్.. ఇక లభించదన్నది ముమ్మాటికీ వాస్తవం. అందే దానర్థం పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పెట్రోల్‌కు కొరత ఏర్పడిందేమో.. అందుకే లభించదని చెబుతున్నామని అనుకోవడం కూడా పొరపాటే. ఆ ప్రమాదం ప్రస్తుతానికి లేకపోయినా.. వచ్చే నెల నుంచి సాధారణ పెట్రోల్ బదులు ఇథనాల్ కలిపిన పెట్రోల్ విక్రయాలు దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. యుద్ధం భీకరంగా సాగుతున్న పరిస్థితుల్లో గల్ఫ్ దేశాల నుంచి పెట్రోలియం ఉత్పత్తుల రవాణా కనాకష్టంగా సాగుతుండటంతో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను సాధ్యమైనంత పొదుపుగా వాడుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చాన్నాళ్ల క్రితమే తీసుకున్న కీలక నిర్ణయం ఈ కష్టకాలంలో అక్కరకు వస్తుంది. దేశంలో చమురు వినియోగం భారీగా పెరిగిపోతుండటం వల్ల విదేశీమారక ద్రవ్యం భారీగా వెచ్చించాల్సి వస్తోంది. దీనికితోడు కాలుష్యంతో పర్యావరణం దెబ్బతింటున్నది. ఈ రెండింటి నుంచి కొంతవరకైనా తప్పించుకునేందుకు పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి విక్రయించాలని ప్రభుత్వం గతంలోనే తీసుకున్న నిర్ణయం వచ్చే ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం గణనీయకంగా తోడ్పడుతుందని భావిస్తున్నారు. లీటరు పెట్రోలులో 20 శాతం ఇథనాల్ కలపడం అంటే దాదాపు ఐదోవంతు పెట్రో వినియోగాన్ని తగ్గించినట్లే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తన ఇంధన పాలసీని సవరించడంతో ఒకటో తేదీ నుంచి దేశంలోని అన్ని పెట్రోల్ పంపుల్లో ఈ`20 పెట్రోల్ అంటే 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాలుష్యాన్ని తగ్గించడం, చమురు దిగుమతి బిల్లు భారాన్ని గణనీయంగా తగ్గించుకోగలగడంతోపాటు రైతులకు అదనపు ఆదాయం కల్పించేందుకు కూడా ఈ చర్య దోహదపడుతుంది. ఎందుకంటే ఇథనాల్ అనేది బయో ఇంథనం. మొక్కజొన్న, చెరుకు, వరి, గోధుమ, బంగాళదుంప వంటి వ్యవసాయ ఉత్పత్తుల వ్యర్థాల నుంచి ఈ ఇంథనాన్ని తయారు చేస్తారు. పంచదార, మొలాసిస్ వంటి వాటి నుంచి కూడా దీన్ని తయారు చేస్తుంటారు. ఇది పూర్తిగా బయో ప్రక్రియ కనుక పర్యావరణ హితంగా ఉంటుంది. ఆహారధాన్యాలు పండించే రైతులకు అదనపు ఆదాయం అందించే వనరుగానూ ఉపయోగపడుతుంది. భారత్ తన ఇథనాల మిశ్రమ ఇంధన వినియోగ ప్రక్రియను అనుకున్న లక్ష్యానికి ముందే 2025 నాటికే 20 శాతం మేరకు పూర్తి చేసింది. ఇప్పుడు దాని కొనసాగింపు చర్యలకు సిద్ధమవుతున్నది. మనదేశం తన ఇంధన అవసరాలకు 80 శాతానికిపైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అయితే అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఇంధన దిగుమతి బిల్లు తడిసిమోపెడవుతుండటం, యుద్ధాలు వంటి సంక్షోభ సమయాల్లో కొరత ఏర్పడటం వల్ల ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించింది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనరంగాన్ని బాగా ప్రోత్సహిస్తున్నది. మరోవైపు పెట్రోలులో ఇథనాల్ బ్లెండ్ చేయడం ద్వారా పెట్రోలును ఆదా చేయడం, తద్వారా కాలుష్యాన్ని నియంత్రించడాన్ని ఒక ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టింది. ఈ తరహా చర్యల ద్వారా గత దశాబ్దకాలంలోనే రూ.1.44 లక్షల కోట్లకుపైగా విదేశీమారక ద్రవ్యాన్ని ఆదా చేసుకుంది. కాగా చెరుకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి ఇథనాల ఉత్పత్తి చేయడం ద్వారా రూ.1.18 లక్షల కోట్ల చెల్లింపులు జరిపారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం చేపట్టింది. అంటే ఇక నుంచి మనం వాహనంలో ఆయిల్ కొట్టించుకుంటే అందులో 80 శాతం పెట్రోల్, మిగతా 20 శాతం ఇథనాల్ ఉంటుంది. ఇది మన ఎదురుగా జరిగే ప్రక్రియ కాదు. రిఫైనరీల్లోనే పెట్రోలులో ఇథనాల్‌ను కలిపి రిటైల్ బంకులకు పంపిస్తారు. కొత్త ఇంధన పాలసీ నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఈ`20 పెట్రోల్ పేరుతో విక్రయిస్తారు. ఈ`20 పెట్రోల్‌కు కనీసం 95 రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ (ఆర్‌వోఎన్) ఉంటుంది. దానికంటే తక్కువ ఆక్టేన్ ఉన్న సాధారణ పెట్రోల్ విక్రయాలను క్రమంగా దశలవారీగా నిలిపివేస్తారు. ఇథనాల్ స్వచ్ఛంగా మండే ఇంధనం. ఇది కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. కాగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల వాహనాలు దెబ్బతింటాయని, ఇప్పుడున్న వాహనాలకు ఇది పనికిరాదని, ఇంజన్లలో మార్పులు చేయించుకోవాల్సి ఉంటుందని వాహనదారుల్లో అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి. ఇందులో కొంత వాస్తవమున్నా మరీ పెద్ద ప్రమాదమేమీ లేదు. స్వల్పమార్పులతో ఈ 20 పెట్రోల్ వినియోగానికి వాహనాలను సిద్ధం చేయవచ్చని ఆటోమొబైల్‌రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇథనాల్ బ్లెండ్ చేసిన పెట్రోల్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించినప్పుడు ఇంజిన్ నాకింగ్ తగ్గినట్లు గుర్తించారు. ఆర్‌వోఎన్ 95 నిబంధనలకు సరిపోతుందంటున్నారు. ఈ విషయమై గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆటో కంపెనీలను అలర్ట్ చేసింది. ఆ మేరకు ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల తయారీ కంపెనీలు అప్రమత్తమై తమ వాహనాల ఇంజిన్లలో తగిన మార్పులు చేశాయి. ఫలితంగా 2023 తర్వాత విడుదలైన చాలా కార్లు ఈ20 పెట్రోల్ వినియోగానికి అనుకూలంగానే ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బీఎస్ 3, బీఎస్ 4 ప్రమాణాలతో లేక 2020కి ముందు తయారైన పలు కార్ల మోడళ్లకు ఇబ్బంది ఏర్పడుతుంది. మైలేజీలో మూడు నుంచి ఏడు శాతం వరకు తగ్గుదల కనిపించవచ్చు. వాహనంలో ఈ20 ఇంధనాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం మంచిది కాదు. పాత మోడళ్లు వాడుతున్న యజమానులు ఈ మేరకు తగిన మార్పులు చేసుకుని ఇంధన వ్యవస్థలో అతిపెద్ద మార్పునకు సిద్ధం కావాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page