IITల్లో సీట్లు దక్కుతున్నాయి కానీ.. అధ్యాపకులు ఎక్కడ?
- NVS PRASAD

- Jun 10
- 2 min read


దేశంలో ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును మలిచే లక్ష్యంతో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)కు హాజరవుతుంటారు. ఈ పరీక్షలో విజయం సాధించి భారతీయ సాంకేతిక విద్యాసంస్థలు (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ ఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎంలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీలు) వంటి దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో చేరుతున్నారు. కానీ, ఈ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో వేల సంఖ్యలో అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. దేశ నిర్మాణం ఐఐటీ, ఐఐఎంలలో జరుగుతుందని గొప్పగా చెప్ప్పుకునే మనం ఇప్ప్పుడు అక్కడే అధ్యాపకులు లేకపోతే ఎవరికి చెప్ప్పుకుంటాం? ఐఐటీలో సీటు కోసం ఒకటో తరగతి నుంచే కారాగారం లాంటి కార్పొరేట్ స్కూళ్లలో పడేసి, కనీసం వేసవి సెలవులెలా ఉంటాయో తెలియకుండా మన పిల్లల్ని పెంచుతున్నాం. ఐఐటీలో సీటు వస్తే.. దేశాన్ని జయించినంత డోపమైన్ మనలో రిలీజ్ అవుతుంది. కానీ ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎంలలో అధ్యాపకులు లేరు. ఇటీవల ఐఐటీలు పూర్తిచేసినవారికి కూడా ఉద్యోగాలు లేవని, కార్పొరేట్ కంపెనీలు ఆశించిన స్థాయిలో వారి స్టాండర్డ్స్ లేవని అనేక కథనాలు వెలువడ్డాయి. అందుకు కారణం.. అధ్యాపకులు లేకపోవడమే. దేశంలో ఈ సంస్థలను టాప్ టెన్ ర్యాంకింగ్లో ఎంపిక చేసుకొని పిల్లల్ని తల్లిదండ్రులు చేర్పిస్తున్నారు. కానీ అధ్యాపకులే ఆ స్థాయిలో రావడంలేదు. దేశంలో 20 ఐఐటీలు, 19 ఎనఐటీలు, 18 ఐఐటీలు, 17 ట్రిపుల్ ఐటీలు, ఐదు ఐఐఎసఈఆర్లు ఉన్నాయి. ఈ 79 సంస్థల్లో మొత్తం 20,279 అధ్యాపక పోస్టులు ఉండాలి. కానీ 7,132 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే సుమారు 35.2 శాతం పోస్టులు భర్తీ కాలేదు. సూటిగా చెప్పాలంటే ప్రతి మూడు పోస్టుల్లో ఒకటి ఖాళీగా ఉంది. 16 సంస్థల్లో సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉండగా, మరో 14 సంస్థల్లో 40 శాతానికి మించిన ఖాళీలు ఉన్నాయి. 20 ఐఐటీల్లో తొమ్మిది సంస్థల్లో 35 శాతానికి మించిన ఖాళీలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఐఐటీ ఖరగ్పూర్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఈ సంస్థలో 1,600 ఆమోదిత బోధనా పోస్టుల్లో 824 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే సగానికి పైగా పోస్టులు భర్తీ కాలేదు. మొత్తం 20 ఐఐటీల్లో ఉన్న 11,019 పోస్టుల్లో 35 శాతం ఖాళీగా ఉన్నాయి.
ఎనఐటీలలో కూడా పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. 19 ఎనఐటీల్లో నాలుగు సంస్థల్లో 40 శాతానికి మించిన ఖాళీలు ఉన్నాయి. మొత్తం 5,432 పోస్టుల్లో 27.9 శాతం భర్తీ కాలేదు. వీటిలో ఆంధ్రప్రదేశ్ ఎనఐటీ అత్యధిక ఖాళీలతో ముందుంది. అక్కడ 187 పోస్టుల్లో 129 పోస్టులు ఖాళీగా ఉండటంతో ఖాళీల శాతం 68కు చేరుకుంది. ఎనఐటీ శ్రీనగర్, ఎనఐటీ సిక్కిం, ఎనఐటీ తిరుచిరాపల్లి సంస్థల్లో కూడా 40 శాతానికి మించిన ఖాళీలు నమోదయ్యాయి.
మేనేజ్మెంట్ విద్య అందించే ఐఐటీల్లో కూడా అధ్యాపకుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. సమాచారం అందించిన 18 ఐఐటీల్లో మొత్తం 1,741 పోస్టుల్లో 32.3 శాతం ఖాళీగా ఉన్నాయి. నాలుగు ఐఐటీల్లో సగానికి మించిన పోస్టులు ఖాళీగా ఉండగా, ఐఐటీ ముంబైలో 59 శాతం పోస్టులు భర్తీ కాలేదు.
ట్రిపుల్ ఐటీల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 17 ట్రిపుల్ ఐటీల్లో మొత్తం 1,225 పోస్టుల్లో 665 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది 53.5 శాతం. ఎనిమిది ట్రిపుల్ ఐటీల్లో సగానికి మించిన పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. అలాగే ఐఐఎసఈఆర్ల్లో కూడా అధ్యాపకుల కొరత కనిపిస్తోంది. ఐదు ఐఐఎసఈఆర్ల్లో 862 పోస్టులకు గాను 276 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఐటీల్లో 10 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు, ఎనఐటీల్లో 12 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండాలి. ప్రవేశాల కోసం విద్యార్థులు అసాధారణ పోటీని ఎదుర్కొంటున్న తరుణంలో, వారికి ప్రపంచ స్థాయి విద్య అందించాలంటే అధ్యాపకుల నియామకాన్ని అత్యవసర ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ ఏడాది 15 లక్షలకుపైగా విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరయ్యారు. ముఖ్యంగా ఐఐటీల్లో ప్రవేశం కోసం పోటీ అత్యంత తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రతి అండర్గ్రాడ్యుయేట్ సీటుకు సగటున 80 మంది విద్యార్థులు పోటీపడుతున్నారు. ఇంత కఠినమైన పోటీని అధిగమించి ప్రవేశం పొందిన విద్యార్థులకు అవసరమైన స్థాయిలో బోధన అందుతున్నదా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.
- ఎడిటర్ ఛాయిస్






Comments