తేలని పరిహారం.. తెగని విస్త‘రణం’
- NVS PRASAD

- May 15
- 3 min read
మళ్లీ తెరపైకి బలగ`డే అండ్ నైట్ విస్తరణ వ్యవహారం
నిర్మాణాలు తొలగించేస్తామని వెళ్లిన కమిషనర్
ఆ ప్రాంత టీడీపీ వర్గాల్లో కలవరం.. పెద్ద చర్చ
ప్రత్యామ్నాయం చూపకుండానే కూల్చేస్తే స్థానికులకు నష్టం
స్పష్టమైన హామీ ఇవ్వాలని కమిషనర్‌కు వినతిపత్రం

‘సొంత పార్టీలో ఉంటూనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్డెక్కామన్న అపవాదు రానీయకండి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న పనుల వల్ల నష్టపోతున్న వారిని ఎలా ఆదుకుంటారు? ఇళ్లు కోల్పోతున్నవారికి ఏమిస్తారు? సర్వం కోల్పోయేవారిని ఏం పరిహారం ఇస్తారు? అనే క్లారిటీ లేకుండా ఆదరాబాదరాగా పనులు చేపడితే బాధితులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు తప్పదు. బాధితుల పక్షాన నిలబడకపోతే స్థానికంగా పార్టీని నిలబెట్టడం ఎలా? వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పనులు ప్రారంభించండి’.. ఇదీ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, నగరపాలక సంస్థ కమిషనర్ దుర్గాప్రసాద్, ఆర్ అండ్ బి ఈఈలకు బలగవాసులు.. మరీ ముఖ్యంగా తెలుగుదేశం సీనియర్ నేతలు చేస్తున్న విన్నపం. ఒకవిధంగా హెచ్చరించే ధోరణిలో ఇలాంటి విన్నపం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే..(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
చాన్నాళ్లుగా కొనసాగుతున్న ఆమదాలవలస-శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్ రోడ్డును 80 అడుగులకు విస్తరించే పనులు దాదాపు పూర్తికావచ్చాయి. కొత్తరోడ్డు దాటిన తర్వాత రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్న రెండు పాత కల్వర్టులను రెండు రోజుల క్రితం కూల్చేసి రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించారు. ఇక మిగిలింది బలగ ఆదివారంపేట నుంచి డే అండ్ నైట్ జంక్షన్ వరకు ఉన్న మార్గమే. అయితే ఈ ప్రాంతంలో 80 అడుగుల రోడ్డు నిర్మిస్తే పెద్ద ఎత్తున ఆస్తులు పోయి తాము నష్టపోతామని స్థానికుల నుంచి విన్నపాలు రావడం, ఆ మేరకు వారికి నష్టపరిహారం చెల్లించేంత బడ్జెట్ కూడా లేనందున గత ప్రభుత్వం ఆదివారంపేట నుంచి డే అండ్ నైట్ జంక్షన్ వరకు 80 అడుగులు కాకుండా 70 అడుగుల వరకే రోడ్డు విస్తరించాలని నిర్ణయించింది. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఈ నిర్ణయానికే కట్టుబడిరది. కాగా వైకాపా హయాంలో ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడు బలగ శివప్రియ ఫంక్షన్ హాల్‌లో స్థానికులతో సమావేశం నిర్వహించి, ఇళ్లు కోల్పోయినవారికి వేరేచోట ఇళ్లు ఇవ్వడానికి, కొంతమేరకు బిల్డింగులు కొట్టాల్సి వస్తే వాటి యజమానులకు నష్టపరిహారం లేదా టీడీఆర్ బాండ్లు ఇస్తామని ఒప్పుకున్నారు. ఆ మేరకు పదిమంది పెద్దలు మెయిన్ రోడ్డు మీద ఫేసింగ్‌లో ఉన్న స్థలాలే ఇవ్వడానికి ముందుకొచ్చారు. పనిలో పనిగా అగ్రిమెంట్ కూడా ఇచ్చేశారు. ఇక బీద, బిక్కీ జనాలు ఏమేరకు ఇళ్లు కోల్పోతున్నారో లెక్కలు వేసి, వారికి వేరేచోట ఆశ్రయం కల్పించడానికి ఒప్పుకున్నారు.
హామీలు తప్ప ఏమీ ఇవ్వలేదు

అయితే ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున ఎటువంటి ముందడుగు పడలేదు. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి చింతాడ నుంచి రాగోలు వరకు రోడ్డు విస్తరణ పూర్తి కావడంతో బలగ ప్రాంతంలో భవనాలు తొలగిస్తే ఒకేసారి రోడ్డు నిర్మాణం పూర్తి చేయొచ్చని ఎమ్మెల్యే శంకర్ భావించారు. దానికి అనుగుణంగా ఆదివారంపేట ఫంక్షన్ హాల్‌లో కొన్నాళ్ల క్రితం అదే బలగ పెద్దలతో సమావేశం నిర్వహించగా మళ్లీ పాత డిమాండ్లే ప్రస్తావనకు వచ్చాయి. వాటిని అంగీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే మాటిచ్చారు. కానీ ఇంతవరకు తమ స్థలాలు, భవనాలు తీసుకొని రోడ్డు వెడల్పు చేసుకోవచ్చని అగ్రిమెంట్ రాసిచ్చినవారికి టీడీఆర్ బాండ్లు ఇవ్వడానికి గానీ, నష్టపరిహారం చెల్లించడానికి గానీ అటు నగరపాలక సంస్థ.. ఇటు రోడ్లు భవనాల శాఖ ఇప్పటి వరకు ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఆకస్మికంగా మున్సిపల్ కమిషనర్ దుర్గాప్రసాద్ టౌన్‌ప్లానింగ్ సిబ్బందితో ఆ ప్రాంతానికి గతంలో మార్కింగ్ ఇచ్చిన మేరకు నిర్మాణాలు తొలగించే కార్యక్రమం చేపడుతున్నామని ప్రకటించడం తెలుగుదేశం పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది.
తేల్చిన తర్వాతే తొలగించండి

స్వచ్ఛందంగా స్థలాలిస్తామని ముందుకొచ్చినవారికే ఇంతవరకు ఏ లెక్కా తేల్చలేదని, ఇప్పుడు రోడ్డు వెడల్పు ద్వారా పూర్తిగా రోడ్డున పడిపోయేవారికి ఏమిస్తారో చెప్పకుండానే కూల్చేస్తామంటే మొత్తం పనులు ఆగిపోయే ప్రమాదముందని ఆ ప్రాంత టీడీపీ నేతలు గురువారం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ ఛాంబర్‌లో వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రాంతంలో రోడ్డు వెడల్పు చేయడానికి ప్రజల సహకారం అవసరం కాబట్టి భవనాలను కొట్టే ముందు స్థానికులతో సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని టీడీపీ సీనియర్ నేత రెడ్డి చిరంజీవులు ‘సత్యం’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అలాగే టీడీఆర్ బాండ్లిస్తారా? నష్టపరిహారం చెల్లిస్తారా? అన్నది తేల్చిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని కమిషనర్‌కు సూచించారు. దీనికి స్పందిస్తూ టీడీఆర్ బాండ్ల కోసం ప్రభుత్వానికి రాస్తామని, అనుమతి వచ్చాక ఇస్తామని కమిషనర్ చెప్పగా.. దాన్నే రాతపూర్వకంగా ఇవ్వాలని వారు కోరారు. అలాగే 70 అడుగుల మేరకు రోడ్డు వెడల్పు చేస్తామని ఆర్ అండ్ బి చెబుతుంటే.. 60 అడుగులకే విస్తరిస్తామని మున్సిపల్ కార్పొరేషన్ చెబుతోందని.. దీనిపై కూడా క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఆదివారంపేట, బలగ, ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతాల్లో కమర్షియల్ భవనాలు చాలావరకు పోతాయని, బలగ ప్రాంతంలో అయితే కొన్ని ఇళ్లే రోడ్డులో కలిసిపోతున్నాయని, వీరికి ప్రత్యామ్నాయం చూపకుండా తొలగింపులకు పూనుకోవడం సరికాదంటున్నారు. రోడ్డు విస్తరణకు స్థానికులు, అక్కడి టీడీపీ నేతలు అడ్డం కాకపోయినా దీనిపై సమగ్రమైన సమాచారం లేకపోవడం, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండటంతోపాటు ఆర్ అండ్ బి, మున్సిపల్ శాఖల సమన్వయం కుదరడంలేదు. నష్టపరిహారం చెల్లించాలంటే ఆర్ అండ్ బి నుంచి డబ్బులివ్వాలి. దానికి బదులు టీడీఆర్‌లు ఇవ్వాలంటే మున్సిపల్ శాఖ ఇవ్వాలి. కానీ ఇప్పటికీ ఎవరూ దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వడంలేదు. ఎమ్మెల్యే స్థాయిలో సమావేశం జరిగితే గాని ఈ సమస్యకు ముగింపు లభించదు.
ఇప్పుడెందుకీ గొడవ?
సుడా నుంచి మరోసారి శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్‌గా వచ్చిన ఓబులేసు సమయంలో బలగ ప్రాంతంలో స్థలాలు, ఇళ్లు కోల్పోతున్నవారికి టీడీఎస్ బాండ్లు ఇస్తామన్న హామీ ఇవ్వడంతో అక్కడున్న రెడ్డి చిరంజీవులు, డాక్టర్ పొడుగు కల్యాణ్ చక్రవర్తి లాంటి కొందరు ప్రభుత్వానికి గిఫ్ట్‌డీడ్ కింద స్థలాన్ని రాసిచ్చేశారు. టీడీఆర్ బాండ్లు అంటే.. కోల్పోతున్న ఆస్తికి నాలుగింతలు ఎక్కువ విలువ చేసే పత్రాలు ఇవ్వడం. అంటే.. రూపాయి కోల్పోతే నాలుగు రూపాయలు బాండ్ల రూపంలో ఇస్తామని, వీటిని అదనపు అంతస్తులు నిర్మించుకున్నప్పుడు విక్రయిస్తే, ఈ సొమ్ము రికవరీ అవుతుంది. అందుకే బలగ ప్రాంతంలో విలువైన భూమి ఇవ్వడానికి స్థానికులు ఒప్పుకున్నారు. రెండుసార్లు సమావేశం జరిగినప్పుడు స్థానికులంతా ఈమేరకే అంగీకార పత్రాన్ని అప్పుడు మున్సిపల్ కార్యాలయానికి అందించారు. ఈ ప్రాంతంలో ఇళ్లు పోతున్నవారికి నాలుగు రెట్లు టీడీఆర్ బాండ్లు ఇవ్వాలి. ఇవేమీ ఇవ్వకుండానే కమిషనర్ ఇళ్లు తొలగిస్తామని చెప్పడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.










Comments