టీడీపీ అధ్యక్షుడిగా మామిడి?
- SATYAM DAILY
- Aug 26, 2025
- 1 min read
కాళింగ వర్సెస్ కాపు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

శ్రీకాకుళం టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నియామకం వైపు పార్టీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన అధ్యక్ష ఎంపిక ప్రక్రియకు పరిశీలకురాలిగా హోంమంత్రి అనిత వచ్చారు. జిల్లాలో సీనియర్ టీడీపీ నేతలతో ఈమేరకు ఆమె చర్చించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న సమీకరణాల రీత్యా పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావుకు ఈ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తుంది. పార్టీ అధ్యక్షుడు పదవి కోసం జిల్లా నుంచి కాళింగ సామాజికవర్గానికి చెందిన చౌదరి బాబ్జీ, మొదలవలస రమేష్‌లు పోటీ పడగా, కాపు సామాజికవర్గం నుంచి మామిడి గోవిందరావు, ఆనెపు రామకృష్ణ తమకు కూడా కావాలని కోరారు. అయితే ప్రస్తుతం ఉన్న పార్టీ అధ్యక్షుడు కాపు సామాజికవర్గమే కాబట్టి మళ్లీ అదే కులానికి పార్టీ అధ్యక్షుడ్ని చేయాలనే యోచనతో పార్టీ ఉన్నట్టు భోగట్టా. కాదు, కూడదు అని కూన రవికుమార్ పట్టుపడితే మొదలవలస రమేష్‌కు ఛాన్స్ ఉంటుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చౌదరి బాబ్జీ అధ్యక్ష బాధ్యతలు మోశారు కాబట్టి ఆయన పేరు కూడా పరిశీలించాలని కోరుతున్నా పార్లమెంటరీ స్థానం పరిధిలో ఎచ్చెర్ల లేకపోవడం వల్ల ఆయన వెనుకబడినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన తనయుడికి డీసీఎంఎస్ చైర్మన్ పదవి ఇవ్వడం వల్ల కూడా బాబ్జీ తగ్గాల్సిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుత సమావేశానికి మామిడి గోవిందరావు అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయినా ఆయన్నే ఎంపిక చేస్తారని తెలుస్తుంది. మిగిలిన సీనియర్ కార్యకర్తలతో అనిత మాట్లాడినా, పార్టీ అధ్యక్షుడిగా ఎవరుండాలన్న అభిప్రాయం కంటే భవిష్యత్తులో ఏ పోస్టులను కోరుకుంటున్నారన్నదానికే ఆమె ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం సమావేశం జరిగినా, ఇది కేవలం తంతు మాత్రమేనని, మామిడి గోవిందరావు ఎంపిక ఇంతకు ముందే పూర్తయిపోయిందని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి.







Comments