top of page

హమ్మయ్యా.. ఒడిశా నుంచి విముక్తి

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 hours ago
  • 2 min read
  • జిల్లాలో ఆ 7 స్టేషన్లు దక్షిణకోస్తాలోకే

  • ఉత్తర్వులు జారీ చేసిన రైల్వేబోర్డు

  • ‘సత్యం’ కథనానికి స్పందన

  • ఫలించిన మంత్రి రాము కృషి

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

పోరాటం ఫలించింది. శ్రీకాకుళం జిల్లావాసుల మొరను ఎట్టకేలకు రైల్వేబోర్డు ఆలకించింది. విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా(సౌత్ కోస్టల్) రైల్వే జోన్ పరిధిలోకే మొత్తం శ్రీకాకుళం జిల్లాను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు మార్పులు చేయాలని ఆదేశిస్తూ రైల్వేశాఖ నుంచి దక్షిణ కోస్తా, తూర్పుకోస్తా రైల్వే జోన్లకు ఉత్తర్వులు అందాయి. జిల్లాలో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న రైల్వేస్టేషన్లు, లైన్లను తూర్పుకోస్తా జోన్‌లోనే కొనసాగించాలని ఇంతకుముందు నిర్ణయించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీకాకుళం జిల్లా మళ్లీ పరాయి జోన్‌లోనే ఉండిపోతున్నదని, దీనివల్ల అభివద్ధిలో వెనుకబడిపోతుందని ఎత్తిచూపుతూ ‘సత్యం’ పత్రిక నెలరోజుల క్రితమే మార్చి నాలుగో తేదీనాటి సంచికలో ‘కల నెరవేరింది.. కలత మిగిలింది’ అనే శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ కథనంతో అప్రమత్తమైన కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్రం స్థాయిలో ప్రయత్నించి జిల్లాకు అన్యాయం జరగకుండా అడ్డుకున్నారు. రైల్వేబోర్టు ఉన్నతాధికారులతోపాటు రైల్వేశాఖ మంత్రి ఆశ్వినీ వైష్ణవ్‌తోనూ సంప్రదింపులు జరిపి వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను ముక్కలు చేసి రెండు రైల్వేజోన్లలో చేర్చడం వల్ల మరింత వెనుకబడిపోతుందని, రాష్ట్రంలో రైల్వేపరంగా అభివద్ధిలో అసమానతలు చోటుచేసుకుంటాయని వివరించారు. ఆయన కషికి వెంటనే ఫలితం లభించింది. శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న ఏడు రైల్వేస్టేషన్లను కొత్తగా ఏర్పాటవుతున్న దక్షిణా కోస్తా రైల్వేజోన్‌లో చేర్చాలని రెండు జోన్ల అధికారులను ఆదేశించింది.

ఏం జరిగిందంటే..

ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం 2019లో విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా పేరుతో కొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు దక్షిణ మధ్య రైల్వే, తూర్పుకోస్తా రైల్వే జోన్ల పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రైల్వేస్టేషన్లు, లైన్లను ఒక రాష్ట్రం`ఒక జోన్ ప్రాతిపదికన ఏపీకి ప్రత్యేకించిన కొత్త జోన్‌లోనే చేర్చాలని స్థూలంగా నిర్ణయించారు. ఆ మేరకు ఫిబ్రవరి చివరి వారంలో రైల్వేమార్గాలను విభజించి జోన్‌ల హద్దులను ఖరారు చేశారు. అయితే ప్రస్తుతం తూర్పుకోస్తా జోన్‌లో వాల్తేర్, ఖుర్దా డివిజన్లుగా ఉన్న ప్రాంతాల వర్గీకరణలో రైల్వేబోర్డు ఒడిశా ఒత్తిళ్లకు లొంగిపోయి వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందన్న ఆరోపణలు వచ్చాయి. వాటికి తగినట్లే వాల్తేర్ డివిజన్ పరిధిలో అరుకు తదితర పర్యాటక ప్రాంతాలు, సరుకు రవాణా మార్గాలు కలిగిన కేకే లైన్‌ను తూర్పుకోస్తా పరిధిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాయగడ డివిజన్‌లో విలీనం చేయడం, తూర్పుకోస్తా జోన్ పరిధిలోని ఖుర్దా డివిజన్‌లో గతం నుంచీ కొనసాగుతున్న పలాస`ఇచ్ఛాపురం మధ్య స్టేషన్లను కొత్త జోన్‌లో చేర్చకుండా అలాగే కొనసాగించడం జిల్లావాసుల్లో అసంతప్తి రేపింది.

మంత్రి రామ్మోహన్ హర్షం

ఈ అంశాలను ప్రస్తావిస్తూ ‘సత్యం’ ప్రచురించిన కథనం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రిని కార్యోన్ముఖుడిని చేసింది. ఆయన ప్రయత్నాలు ఫలించి శ్రీకాకుళం జిల్లాలోని ప్రాంతాలు ఒడిశా నుంచి విముక్తి పొంది విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న దక్షిణకోస్తా జోన్‌లో చేరనన్నాయి. గతంలో పలాస ముందు వరకు దక్షిణ కోస్తాలో చేర్చిన అధికారులు తాజా ఉత్తర్వుల ప్రకారం పలాస స్టేషన్ మొదలుకొని సుమ్మాదేవి, మందస రోడ్డు, బారువ, సోంపేట, జాడుపూడి, ఇచ్ఛాపురం కలుపుకొని మొత్తం ఏడు రైల్వేస్టేషన్లను కొత్త జోన్‌లో చేర్చడానికి మార్గం సుగమమైంది. రైల్వేబోర్డు నిర్ణయంపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయిన విశాఖ రైల్వేజోన్ కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 2019లో తమ ఎన్డీయే ప్రభుత్వమే ఈ జోన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ కొత్త జోన్‌లో చేరిక విషయంలో శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరగకుండా కూడా నివారించగలిగామని ఇందుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌లకు మంత్రి రామ్మోహన్ కతజ్ఞతలు తెలిపారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page